59వ అధ్యాయము
హీలమన్ యొక్క సైన్యములను బలపరచమని మొరోనై పహోరన్‌ను అడుగును—లేమనీయులు నెఫిహా పట్టణమును స్వాధీనపరచుకొందురు—మొరోనై ప్రభుత్వముపై కోపముగా ఉండును. సుమారు క్రీ. పూ. 62 సం.
1 ఇప్పుడు నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క ముప్పైయవ సంవత్సరమందు మొరోనై, హీలమన్ యొక్క లేఖను అందుకొని చదివిన తరువాత, హీలమన్ యొక్క క్షేమమును బట్టి మరియు కోల్పోయిన ఆ దేశములను సంపాదించుట యందు అతడు కలిగియున్న అధికమైన విజయమును బట్టి మిక్కిలిగా ఆనందించెను.
2 వారు కూడా ఆనందించునట్లు అతడు ఉన్న ఆ భాగమందు, చుట్టూ ఉన్న దేశమంతటిలో అతని జనులందరికి దానిని తెలియజేసెను.
3 మరియు అంత ఆశ్చర్యకరముగా తిరిగి సంపాదించిన దేశము యొక్క ఆ భాగమును అతడు సులువుగా నిలుపుకొనునట్లు హీలమన్‌ను లేదా హీలమన్ యొక్క సైన్యములను బలపరచుటకు మనుష్యులు సమకూర్చబడునట్లు చేయవలెనని కోరుచూ అతడు వెంటనే పహోరన్‌కు ఒక లేఖ పంపెను.
4 మొరోనై ఈ లేఖను జరహేమ్ల దేశమునకు పంపిన తరువాత, లేమనీయులు వారి నుండి తీసుకొనిన వారి స్వాధీనములు మరియు పట్టణముల యొక్క శేషమును అతడు సంపాదించగలుగునట్లు మరలా ఒక ప్రణాళిక వేయసాగెను.
5 లేమనీయులతో యుద్ధము చేయుటకు మొరోనై ఆ విధముగా ఏర్పాట్లు చేయుచుండగా, మొరోనై పట్టణము, లీహై పట్టణము మరియు మోరియాంటన్ పట్టణము నుండి సమకూడిన నెఫిహా యొక్క జనులు లేమనీయుల చేత దాడి చేయబడిరి.
6 ముఖ్యముగా మాంటై దేశము నుండి మరియు చుట్టూ ఉన్న దేశము నుండి పారిపోవుటకు బలవంతము చేయబడిన వారు కూడా వచ్చి, దేశము యొక్క ఈ భాగమందు లేమనీయులతో చేరిరి.
7 ఆ విధముగా బహుసంఖ్యాకులైయుండి, అనుదినము బలము పొందుచూ అమ్మోరోన్ యొక్క సైన్యాధిపత్యము క్రింద వారు నెఫిహా యొక్క జనులకు వ్యతిరేకముగా వచ్చి, గొప్ప సంహారముతో వారిని సంహరించుట మొదలుపెట్టిరి.
8 వారి సైన్యములు ఎంత అధిక సంఖ్యలో ఉండెననగా నెఫిహా జనుల యొక్క శేషము వారి యెదుట నుండి పారిపోవుటకు బలవంతము చేయబడిరి; మరియు వారు కూడివచ్చి మొరోనై సైన్యముతో చేరిరి.
9 ఇప్పుడు లేమనీయుల నుండి పట్టణమును తిరిగి తీసుకొనుటకంటే దానిని వారి చేతులలో పడకుండా ఉంచుట సులభమని ఎరిగి, ఆ పట్టణమును నిలుపుకొనుటకు జనుల సహాయార్థము నెఫిహా యొక్క పట్టణమునకు మనుష్యులు పంపబడవలెనని మరియు ఆ పట్టణమును వారు సులభముగా నిలుపుకొనవచ్చునని కూడా మొరోనై తలంచెను.
10 కావున అతడు తిరిగి సంపాదించిన ఆ స్థలములన్నిటినీ కాపాడుకొనుటకు అతని సైన్యమునంతటినీ అతడు నిలుపుకొనెను.
11 నెఫిహా పట్టణము చేజారినదని మొరోనై చూచినప్పుడు అతడు మిక్కిలిగా దుఃఖించెను మరియు జనుల యొక్క దుష్టత్వమును బట్టి, వారు తమ సహోదరుల చేతులలో పడకుండా ఉండెదరా అని సందేహించసాగెను.
12 ఇప్పుడు అతని ప్రధాన అధికారులందరి పరిస్థితి కూడా ఇదియే. జనుల యొక్క దుష్టత్వమును బట్టి వారు కూడా సందేహించి ఆశ్చర్యపడిరి, ఇదంతయు వారిపై లేమనీయుల యొక్క విజయమును బట్టియైయుండెను.
13 మరియు తమ దేశ స్వాతంత్ర్యము పట్ల వారి ఉదాసీనతను బట్టి, మొరోనై ప్రభుత్వముపై కోపముగానుండెను.