లేఖనములు
ఆల్మా 61


61వ అధ్యాయము

ప్రభుత్వమునకు వ్యతిరేకముగా జరుగుచున్న తిరుగుబాటు మరియు విప్లవమును గూర్చి పహోరన్‌ మొరోనైకి చెప్పును—రాజు-మనుష్యులు జరహేమ్లను తీసుకొని లేమనీయులతో కలిసియుందురు—తిరుగుబాటుదారులకు వ్యతిరేకముగా పహోరన్‌ సైనిక సహాయము కోరును. సుమారు క్రీ. పూ. 62 సం.

1 ఇదిగో మొరోనై ప్రధాన పరిపాలకునికి తన లేఖ పంపిన తరువాత, వెంటనే అతడు ప్రధాన పరిపాలకుడైన పహోరన్‌ నుండి ఒక లేఖ అందుకొనెను మరియు అతడు అందుకొన్న మాటలు ఇవే:

2 ఈ దేశము యొక్క ప్రధాన పరిపాలకుడనైన పహోరన్‌ అను నేను సైన్యముపై ప్రధాన అధికారియైన మొరోనైకి ఈ సందేశమును పంపుచున్నాను. ఇదిగో మొరోనై, మీ అధిక బాధలయందు నేను సంతోషించను, అది నా ఆత్మను దుఃఖపెట్టుచున్నదని నేను నీతో చెప్పుచున్నాను.

3 కానీ, మీ బాధలయందు సంతోషించువారున్నారు, ఎంతగాననగా వారు నాకు, నా జనులలో స్వతంత్ర మనుష్యులైన వారికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసిరి మరియు తిరుగుబాటు చేసినవారు బహుసంఖ్యాకులు.

4 న్యాయపీఠమును నా నుండి తీసివేయుటకు ప్రయత్నించిన వారే ఈ గొప్ప దుర్నీతికి కారణమైయున్నారు; ఏలయనగా వారు అధిక పొగడ్తను ఉపయోగించి అనేకమంది జనుల హృదయాలను దూరముగా నడిపించి వేసియున్నారు, అది మన మధ్య భయంకరమైన శ్రమకు కారణమగును; వారు మన ఆహారసామాగ్రులను ఉపసంహరించియున్నారు మరియు వారు మీ యొద్దకు రాకుండునట్లు మన స్వతంత్ర మనుష్యులను బెదిరించియున్నారు.

5 నన్ను వారి యెదటనుండి బయటకు తరిమివేయగా, వీలైనంతమంది మనుష్యులను తీసుకొని నేను గిడియన్‌ దేశమునకు పారిపోతిని.

6 ఇదిగో దేశము యొక్క ఈ భాగమంతటా నేను ఒక ప్రకటన పంపితిని; వారి దేశమును, వారి స్వాతంత్ర్యమును రక్షించుకొనుటకు మరియు మాకు జరిగిన అన్యాయములకు ప్రతీకారము తీర్చుకొనుటకు వారి ఆయుధములతో వారు ప్రతిదినము మా యొద్దకు చేరుచుండిరి.

7 మరియు వారు మా యొద్దకు వచ్చినప్పుడు మాకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసినవారు వమ్ముచేయబడిరి, ఎంతగాననగా వారు మా గురించి భయపడుచూ మాకు వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు ధైర్యము చేయుటలేదు.

8 వారు జరహేమ్ల దేశము లేదా పట్టణము యొక్క స్వాధీనమును పొంది, తమపై ఒక రాజును నియమించుకొనిరి మరియు అతడు లేమనీయుల రాజుకు వ్రాసిన దానియందు ఒక కూటమిలో అతనితో చేరెను; ఆ కూటమినందు అతడు జరహేమ్ల పట్టణమును కాపాడుటకు అంగీకరించియుండెను, ఆ కాపుదల దేశము యొక్క శేషమును జయించుటకు లేమనీయులకు శక్తినిచ్చునని మరియు వారు జయింపబడి లేమనీయుల క్రింద ఉన్నప్పుడు, అతడు ఈ జనులపై రాజుగా చేయబడునని అతడు తలంచెను.

9 ఇప్పుడు నీ లేఖ యందు నీవు నన్ను మందలించితివి, కానీ అది అంత ముఖ్యము కాదు; నేను కోపముగా లేను, కానీ నీ హృదయము యొక్క గొప్పతనమందు ఆనందించుచున్నాను. పహోరన్‌ అను నేను నా జనుల యొక్క హక్కులు మరియు స్వాతంత్ర్యమును కాపాడునట్లు నా న్యాయపీఠమును నిలుపుకొనుటకు మాత్రమే తప్ప, అధికారమును కోరను. దేవుడు మనలను విడిపించిన ఈ స్వేచ్ఛయందు నా ఆత్మ స్థిరముగా నిలిచియున్నది.

10 ఇప్పుడు రక్తము చిందించునంతగా కూడా మేము దుష్టత్వమును ఎదిరించెదము. వారి స్వంత దేశములో వారు నిలిచిన యెడల, లేమనీయుల రక్తమును మేము చిందించము.

11 తిరుగుబాటునందు మాకు వ్యతిరేకముగా ఖడ్గమెత్తని యెడల, మా సహోదరుల యొక్క రక్తమును మేము చిందించము.

12 దేవుని న్యాయమునకు అవసరమైన యెడల లేదా అట్లు చేయమని ఆయన మమ్ములను ఆజ్ఞాపించిన యెడల, మమ్ములను మేము దాస్యపు కాడికి లోబరచుకొందుము.

13 కానీ మమ్ములను మేము మా శత్రువులకు లోబరచుకొనవలెనని ఆయన ఆజ్ఞాపించలేదు, మేము ఆయనయందు నమ్మికయుంచవలెనని మరియు ఆయన మమ్ములను విడిపించునని చెప్పెను.

14 కావున నా ప్రియమైన సహోదరుడవైన మొరోనై, మనము చెడును ఎదిరించెదము మరియు మనము మాటలతో ఎదిరించలేని చెడును, ముఖ్యముగా తిరుగుబాటులు మరియు అసమ్మతుల వంటి వాటిని మన ఖడ్గములతో ఎదిరించెదము, ఆ విధముగా మన స్వేచ్ఛను మనము నిలుపుకొనెదము, మన సంఘము యొక్క విశేషాధికారమందు మరియు మన విమోచకుడు, మన దేవుని యొక్క ఉద్దేశ్యమందు మనము ఆనందించెదము.

15 కావున నీ మనుష్యులలో కొద్దిమందితో వేగముగా నా యొద్దకు రమ్ము, మిగిలిన వారిని లీహై మరియు టియాంకమ్ యొక్క ఆధీనమందు విడిచిపెట్టుము; వారియందున్న స్వాతంత్ర్యపు ఆత్మ అయిన దేవుని ఆత్మను బట్టి, దేశము యొక్క ఆ భాగమందు యుద్ధము జరిగించుటకు వారికి అధికారమునిమ్ము.

16 ఇదిగో మీరు నా యొద్దకు వచ్చువరకు వారు నశించకుండునట్లు నేను వారికి కొంత ఆహారసామాగ్రిని పంపితిని.

17 ఇక్కడకు మీ ప్రయాణమందు మీకు సాధ్యమైనంత సైన్యమును సమకూర్చుము మరియు మనయందున్న విశ్వాసమును బట్టి, మన దేవుని శక్తియందు మనము వేగముగా ఆ అసమ్మతీయులకు వ్యతిరేకముగా వెళ్ళెదము.

18 లీహై మరియు టియాంకమ్ వద్దకు పంపుటకు అధిక ఆహారమును మనము సంపాదించునట్లు జరహేమ్ల పట్టణమును స్వాధీనపరచుకొనెదము; ప్రభువు యొక్క బలమందు వారికి వ్యతిరేకముగా వెళ్ళి, ఈ గొప్ప దుర్నీతికి మనము ముగింపు పలికెదము.

19 ఇప్పుడు మొరోనై, నేను నీ లేఖను అందుకొనుటయందు సంతోషించుచున్నాను, ఏలయనగా మేము ఏమి చేయవలెను? మేము మా సహోదరులకు వ్యతిరేకముగా వెళ్ళుట న్యాయమేనా? అని నేను కొద్దిగా ఆందోళనపడితిని.

20 కానీ వారు పశ్చాత్తాపపడని యెడల, నీవు వారికి వ్యతిరేకముగా వెళ్ళవలెనని ప్రభువు నిన్ను ఆజ్ఞాపించియున్నాడని నీవు చెప్పితివి.

21 లీహై మరియు టియాంకమ్‌లను ప్రభువునందు నీవు బలపరచునట్లు చూచుకొనుము; భయపడవద్దని, దేవుడు వారిని విడిపించునని వారితో చెప్పుము, ముఖ్యముగా దేవుడు వారిని విడిపించిన ఆ స్వేచ్ఛయందు నిలకడగానున్న వారందరినీ కూడా ఆయన విడిపించునని చెప్పుము. ఇంతటితో నేను, నా ప్రియమైన సహోదరుడు మొరోనైకి నా లేఖను ముగించుచున్నాను.

ముద్రించు