లేఖనములు
ఆల్మా 54


54వ అధ్యాయము

అమ్మోరోన్‌ మరియు మొరోనై బందీల మార్పిడి కొరకు సంప్రదించెదరు—లేమనీయులు తమ సైన్యమును ఉపసంహరించుకొని, వారి హత్యాపూర్వకమైన దాడులను ఆపవలెనని మొరోనై కోరును—నీఫైయులు వారి ఆయుధములను పడవేసి, లేమనీయులకు లోబడవలెనని అమ్మోరోన్‌ కోరును. సుమారు క్రీ. పూ. 63 సం.

1 ఇప్పుడు న్యాయాధిపతుల యొక్క ఇరువది తొమ్మిదవ సంవత్సరము యొక్క ప్రారంభమందు, అమ్మోరోన్‌ బందీలను మార్పిడి చేసుకొనవలెనని కోరుచూ మొరోనై యొద్దకు సమాచారము పంపెను.

2 ఈ అభ్యర్థనను బట్టి మొరోనై అధికముగా ఆనందించెను, ఏలయనగా లేమనీయ బందీల జీవనాధారమునకు ఇవ్వబడిన సామగ్రిని తన స్వంత జనుల జీవనాధారము కొరకు అతడు కోరెను; మరియు అతని సైన్యమును బలపరచుటకు అతని జనులను కూడా అతడు కోరెను.

3 లేమనీయులు అనేకమంది స్త్రీలను, పిల్లలను పట్టుకుపోయిరి; మరియు మొరోనై బందీలు లేదా మొరోనై పట్టుకొనిన బందీలందరి మధ్య ఒక స్త్రీ కాని, ఒక పిల్లవాడు కాని లేకయుండెను; కావున బందీలైన నీఫైయులను సాధ్యమైనంత ఎక్కువగా లేమనీయుల నుండి సంపాదించుటకు మొరోనై యుక్తి పన్నెను.

4 కావున అతడు ఒక లేఖ వ్రాసి, మొరోనైకి లేఖను తెచ్చిన అమ్మోరోన్‌ యొక్క అదే సేవకుని ద్వారా దానిని పంపెను. ఇప్పుడు అమ్మోరోన్‌కు అతడు వ్రాసిన మాటలు ఇవియే:

5 ఇదిగో అమ్మోరోన్‌, నీవు లేదా నీ సహోదరుడు నా జనులకు వ్యతిరేకముగా పోరాడినది మరియు నీ సహోదరుని మరణము తరువాత నీవు ఇంకా కొనసాగించుటకు నిశ్చయించుకొనిన ఈ యుద్ధమును గూర్చి నేను నీకు కొంత వ్రాసియున్నాను.

6 ఇదిగో నీవు పశ్చాత్తాపపడి, నీ సైన్యములను ఉపసంహరించుకొని నీ దేశమునకు లేదా నీవు స్వాధీనపరచుకున్న దేశమునకు అనగా నీఫై దేశమునకు తీసుకువెళ్ళని యెడల, దేవుని న్యాయము మరియు మీపై వ్రేలాడు సర్వశక్తివంతమైన ఆయన ఉగ్రత యొక్క ఖడ్గము గూర్చి నేను నీకు కొంత చెప్పెదను.

7 నీవు వాటిని ఆలకించగలిగిన యెడల, ఈ సంగతులను నేను నీకు చెప్పెదను; మీరు పశ్చాత్తాపపడి, మీ హత్యాపూర్వక ఉద్దేశ్యములను విడిచిపెట్టి, మీ స్వదేశములకు మీ సైన్యములతో తిరిగి వెళ్ళని యెడల, నీవు మరియు నీ సహోదరుని వంటి హంతకులను చేర్చుకొనుటకు వేచియున్న ఆ భయంకరమైన నరకమును గూర్చి నేను నీతో చెప్పుదును.

8 కానీ మీరు ఒకసారి ఈ సంగతులను తిరస్కరించి ప్రభువు యొక్క జనులకు వ్యతిరేకముగా పోరాడినందున మరలా మీరు అట్లే చేయుదురని నేను భావిస్తున్నాను.

9 ఇప్పుడు మేము, మిమ్ములను ఎదుర్కొనుటకు సిద్ధముగానున్నాము; మీరు మీ ఉద్దేశ్యములను విరమించుకొనని యెడల, ఇదిగో మీరు పూర్తిగా నాశనమగునట్లు మీరు తిరస్కరించిన ఆ దేవుని ఉగ్రతను మీపైకి తెచ్చుకొనెదరు.

10 కానీ మీరు విరమించుకొనని యెడల, ప్రభువు జీవముతోడు మా సైన్యములు మీపై దాడిచేయును; మరియు మీరు త్వరలో మరణముతో దర్శింపబడుదురు, ఏలయనగా మేము మా పట్టణములను, మా దేశములను నిలుపుకొందుము; ముఖ్యముగా మేము మా మతమును, మా దేవుని ఉద్దేశ్యమును కాపాడుకొందుము.

11 కానీ ఇదిగో నేను నీతో ఈ సంగతులను గూర్చి వ్యర్థముగా మాట్లాడుచున్నానని లేదా నీవు నరకము యొక్క పుత్రుడవని నాకు అనిపించుచున్నది; కావున, ఒక బందీకి బదులుగా ఒక మనిషిని, అతని భార్యాపిల్లలను నీవు అప్పగించవలెనను షరతులపై తప్ప, నేను బందీలను మార్పిడి చేయనని నీకు చెప్పుచూ నా లేఖను ముగించుచున్నాను; నీవు దీనిని చేసిన యెడల, నేను మార్పిడి చేయుదును.

12 ఇదిగో నీవు దీనిని చేయని యెడల, నేను నా సైన్యములతో నీపై దాడిచేయుదును; నేను, నా స్త్రీలు మరియు నా పిల్లలకు కూడా ఆయుధములు ధరింపజేసి నీకు వ్యతిరేకముగా వచ్చెదను; మరియు మా మొదటి స్వాస్థ్యమైన మీ స్వదేశములోనికి నేను మిమ్ములను వెంబడించెదను; రక్తమునకు రక్తము, ప్రాణమునకు ప్రాణమువలె మీరు భూముఖము పైనుండి నాశనము చేయబడు వరకు నేను మీతో యుద్ధము చేసెదను.

13 ఇదిగో నేను మరియు నా జనులు కోపముతోనున్నాము; మీరు మమ్ములను హత్య చేయుటకు కోరియున్నారు, కానీ మమ్ములను కాపాడుకొనుటకు మాత్రమే మేము కోరియుంటిమి; మీరు ఇంకను మమ్ములను నాశనము చేయుటకు కోరిన యెడల, మేము మిమ్ములను నాశనము చేయుటకు కోరెదము; మరియు మేము మా దేశమును, అనగా మా మొదటి స్వాస్థ్యమును కోరెదము.

14 ఇంతటితో నేను నా లేఖను ముగించుచున్నాను; నేను మొరోనైని, నీఫై జనుల యొక్క నాయకుడను.

15 ఇప్పుడు అమ్మోరోన్ ఈ లేఖను అందుకొన్నప్పుడు కోపముతో మొరోనైకి మరియొక లేఖ వ్రాసెను; మరియు అతడు వ్రాసిన మాటలివి:

16 నేను అమ్మోరోన్‌ను, లేమనీయుల రాజును; మీరు హత్యచేసిన అమలిక్యా యొక్క సహోదరుడను. అతని రక్తము నిమిత్తము నేను మీపై పగ తీర్చుకొనెదను మరియు నేను నా సైన్యములతో మీపై దాడిచేసెదను, ఏలయనగా నేను నీ బెదరింపులకు భయపడను.

17 మీ పితరులు వారి సహోదరులకు అన్యాయము చేసిరి, ఎంతగాననగా న్యాయముగా వారికి చెందిన పరిపాలనాహక్కును వారి నుండి దొంగిలించిరి.

18 ఇదిగో మీరు మీ ఆయుధములను పడవేసి, ప్రభుత్వము న్యాయముగా ఎవరికి చెందునో వారి చేత పరిపాలింపబడుటకు మిమ్ములను లోబరచుకున్న యెడల, అప్పుడు నా జనులు తమ ఆయుధములు పడవేసి ఇకపై యుద్ధము చేయకుండునట్లు నేను చేయుదును.

19 ఇదిగో నీవు నాకు, నా జనులకు వ్యతిరేకముగా అనేక బెదిరింపులు చేసియున్నావు; కానీ, మేము నీ బెదరింపులకు భయపడము.

20 అయినప్పటికీ, నేను నా సైనికుల కొరకు ఆహారమును భద్రపరచునట్లు నీ కోరిక ప్రకారము నేను బందీల మార్పిడికి సంతోషముగా అంగీకరించెదను; మరియు మా అధికారమునకు నీఫైయులను లోబరచుటకో లేదా వారి నిత్యనాశనమునకో ఒక నిత్య యుద్ధమును మేము పోరాడుదుము.

21 మేము తిరస్కరించియున్నామని నీవు చెప్పే ఆ దేవుని గూర్చి లేదా అట్టి ఒక జీవిని గూర్చి మేమెరుగము; మీరు కూడా ఎరుగరు; కానీ అట్టి ఒక జీవి ఉన్న యెడల, అతడు మీతో పాటు మమ్ములను చేసియున్నాడని మేమెరిగియుండేవారము.

22 ఒక అపవాది మరియు ఒక నరకము ఉన్న యెడల, మీరు హత్యచేసి, అతడు అట్టి స్థలమునకు వెళ్ళియుండెనని మీరు సూచించిన నా సహోదరునితో నివసించుటకు మిమ్ములను అతడు అక్కడకు పంపడా? కానీ ఇదిగో, ఈ సంగతులు ముఖ్యమైనవి కావు.

23 నేను అమ్మోరోన్‌ను, మీ పితరులు బలవంతముగా యోరూషలేము నుండి బయటకు తెచ్చిన ఆ జోరమ్ యొక్క వంశస్థుడను.

24 నేను ధైర్యముగల లేమనీయుడను; ఇదిగో వారి అన్యాయములకు పగతీర్చుకొనుటకు, వారి పరిపాలనాహక్కులను సంపాదించుటకు మరియు నిలుపుటకు ఈ యుద్ధము చేసియున్నాను; ఇంతటితో మొరోనైకి నా లేఖను ముగించుచున్నాను.

ముద్రించు