12వ అధ్యాయము
ఆల్మా జీజ్రోమ్‌తో మాట్లాడును—దేవుని మర్మములు విశ్వాసులకు మాత్రమే ఇవ్వబడును—మనుష్యులు వారి ఆలోచనలు, నమ్మకములు, మాటలు మరియు క్రియల ద్వారా తీర్పు తీర్చబడుదురు—దుష్టులు ఆత్మీయ మరణమును అనుభవించుదురు—ఈ మర్త్య జీవితము ఒక పరిశీలనా స్థితియైయున్నది—విమోచన ప్రణాళిక, పునరుత్థానమును మరియు విశ్వాసము ద్వారా పాప క్షమాపణను తెచ్చును—పశ్చాత్తాపపడిన వారు అద్వితీయ కుమారుని ద్వారా కనికరమునకు అర్హత పొందుదురు. సుమారు క్రీ. పూ. 82 సం.
1 ఇప్పుడు అమ్యులెక్ మాటలు జీజ్రొమ్‌ను మాట్లాడకుండా చేసెనని, అమ్యులెక్‌ను నాశనము చేయుటకు అతని అబద్ధము, మోసములందు అమ్యులెక్ అతడిని పట్టుకొనెనని ఆల్మా చూచెను మరియు తన దోషమునెరిగి అతడు వణుకుట మొదలుపెట్టెనని చూచి అతనితో మాట్లాడుటకు, అమ్యులెక్ మాటలను స్థిరపరచుటకు, అమ్యులెక్ చెప్పిన వాటిని మించి అనేక విషయములను లేదా అనేక లేఖనములను వివరించుటకు ఆల్మా నోరు తెరిచి మాట్లాడనారంభించెను.
2 ఆల్మా, జీజ్రొమ్ తో పలికిన మాటలను చుట్టూ ఉన్న జనులు వినిరి; గొప్ప జనసమూహము ఉన్నందున అతడు ఈ విధముగా మాట్లాడెను:
3 జీజ్రొమ్, నీవిప్పుడు నీ అబద్ధము, కుయుక్తులందు పట్టుకొనబడియున్నావని చూచుచున్నావు, ఏలయనగా నీవు మనుష్యులతో మాత్రమే కాక దేవునితో కూడా అబద్ధమాడియున్నావు; ఇదిగో, ఆయన నీ తలంపులన్నిటినీ ఎరిగియున్నాడు మరియు నీ తలంపులు ఆయన ఆత్మ ద్వారా మాకు తెలియజేయబడినవని నీవు చూచుచున్నావు.
4 నీవు అబద్ధమాడి వారిని మాకు వ్యతిరేకముగా పురిగొల్పుటకు, మమ్ములను దూషించి బయటకు త్రోసివేయునట్లు ఈ జనులను మోసగించుటకు నీ ప్రణాళిక, అపవాది యొక్క కపటమును బట్టి మిక్కిలి కపటమైన ప్రణాళికైయున్నదని మేము ఎరిగియున్నామని నీవు చూచుచున్నావు.
5 ఇది నీ శత్రువు యొక్క ప్రణాళికయైయున్నది మరియు అతడు నీలో తన శక్తిని ఉపయోగించియున్నాడు. ఇప్పుడు నేను నీతో చెప్పుచున్నది అందరితో చెప్పుచున్నానని నీవు జ్ఞాపకముంచుకొనవలెనని నేను కోరుచున్నాను.
6 అతని చెర యొక్క శక్తిని బట్టి అతడు తన సంకెళ్ళతో మిమ్ములను చుట్టివేయునట్లు, శాశ్వత నాశనమునకు మీకు సంకెళ్ళు వేయునట్లు, మిమ్ములను తన ఆధీనములోకి తెచ్చుకొనుట్లు ఈ జనులను పట్టుకొనుటకు ఇది అపవాది వేసిన ఉచ్చు అని నేను మీ అందరితో చెప్పుచున్నాను.
7 ఇప్పుడు ఆల్మా ఈ మాటలను పలికినప్పుడు జీజ్రొమ్ అత్యధికముగా వణుకుట మొదలుపెట్టెను, ఏలయనగా అతడు దేవుని శక్తిని గూర్చి మరి ఎక్కువగా ఒప్పించబడెను; ఆల్మా, అమ్యులెక్‌లు అతడిని గూర్చి ఎరిగియున్నారని కూడా అతడు ఒప్పించబడెను, అతని హృదయ తలంపులను ఉద్దేశ్యములను వారు ఎరిగియున్నారని అతడు నమ్మెను; ఏలయనగా ప్రవచనాత్మను బట్టి వారు ఈ విషయములను ఎరుగునట్లు వారికి శక్తి అనుగ్రహించబడెను.
8 మరియు జీజ్రొమ్ దేవుని రాజ్యమును గూర్చి ఎక్కువగా తెలుసుకొనునట్లు వారి నుండి శ్రద్ధగా అడిగి తెలుసుకొనుట ప్రారంభించెను. అతడు ఆల్మాతో ఇట్లనెను: నీతిమంతులు మరియు దుష్టులు అందరు మృతులలో నుండి లేచెదరని, వారి క్రియలను బట్టి తీర్పుతీర్చబడుటకు దేవుని యెదుట నిలుచుటకు తేబడుదురని మృతుల పునరుత్థానమును గూర్చి అమ్యులెక్ చెప్పిన దానికి అర్థమేమి?
9 ఇప్పుడు ఆల్మా ఈ విషయములను అతనికి వివరించుట మొదలుపెట్టి ఇట్లు చెప్పెను: దేవుని మర్మములు తెలుసుకొనుటకు అనేకులకు అనుగ్రహించబడినది; అయినప్పటికీ, వారు ఆయన పట్ల చూపిన శ్రద్ధను లక్ష్యమును బట్టి నరుల సంతానమునకు ఆయన అనుగ్రహించిన ఆయన వాక్య భాగమును మాత్రమే వారు తెలియజేయవలెనను ఖచ్చితమైన ఆజ్ఞానుసారము అవి ఇవ్వబడినవి.
10 కావున తన హృదయమును కఠినపరచుకొను వాడు వాక్యము యొక్క తక్కువ భాగమును పొందును; తన హృదయమును కఠినపరచుకొనని వానికి దేవుని మర్మములు పూర్తిగా తెలుసుకొను వరకు వాక్యము యొక్క అధిక భాగము ఇవ్వబడును.
11 మరియు తమ హృదయములను కఠినపరచుకొను వారికి ఆయన మర్మములను గూర్చి వారు ఏమియు ఎరుగకయుండునంత తక్కువగా వాక్యము ఇవ్వబడును; అప్పుడు వారు అపవాది చేత చెరపట్టబడి, అతని చిత్తము ద్వారా నాశనమునకు నడిపించబడుదురు. ఇప్పుడు, నరకపు సంకెళ్ళనగా అర్థమిదే.
12 మరణము, మర్త్యత్వము నుండి అమర్త్యమైన స్థితికి లేపబడుట మరియు మన క్రియలను బట్టి తీర్పుతీర్చబడుటకు దేవుని న్యాయపీఠము ఎదుటికి తేబడుటను గూర్చి అమ్యులెక్ స్పష్టముగా మాట్లాడియున్నాడు.
13 అయినప్పటికీ మన హృదయములు కఠినపరచబడియున్న యెడల, అనగా వాక్యము మనలో కనబడకుండా పోవునంతగా మన హృదయములను దానికి వ్యతిరేకముగా కఠినపరచుకొనిన యెడల మన స్థితి భయంకరమగును, ఏలయనగా అప్పుడు మనము శిక్షింపబడుదుము.
14 మన మాటలు మనలను ఖండించును, మన సమస్త క్రియలు మనలను ఖండించును; మనము మచ్చలేనివారిగా కనుగొనబడము; మన తలంపులు కూడా మనలను ఖండించును; ఈ భయంకరమైన స్థితిలో మనము మన దేవుని వైపు చూచుటకు ధైర్యము చేయలేము; మీరు మా మీద పడి ఆయన సన్నిధి నుండి మమ్ములను మరుగుచేయమని బండలను, పర్వతములను మనము ఆజ్ఞాపించగలిగిన యెడల మనము సంతోషించెదము.
15 కానీ ఇది జరుగదు; మనము ముందుకు వచ్చి ఆయన మహిమయందు, ఆయన శక్తియందు, ఆయన బలము, ప్రభావము, ఆధిపత్యమందు ఆయన యెదుట నిలువవలెను మరియు ఆయన తీర్పులన్నియు న్యాయమైనవని, తన క్రియలన్నిటి యందు ఆయన నీతిమంతుడని, నరుల సంతానము యెడల ఆయన కనికరము కలిగియున్నాడని, ఆయన నామముపై విశ్వసించి పశ్చాత్తాపమునకు తగిన ఫలమును ఫలించు ప్రతి మనుష్యుని రక్షించుటకు ఆయన సమస్త శక్తి కలిగియున్నాడని ఒప్పుకొనుట దుష్టులకు నిత్య అవమానమును కలిగించును.
16 ఇదిగో అప్పుడొక మరణము అనగా రెండవ మరణము వచ్చునని నేను మీతో చెప్పుచున్నాను, అది ఆత్మీయ మరణము; అప్పుడు భౌతిక మరణమును బట్టి, తన పాపములందు మరణించువాడు ఆత్మీయముగా కూడా మరణించు సమయమది; అనగా, నీతికి సంబధించినంత వరకు అతడు మరణించును.
17 వారి వేదనలు అగ్ని, గంధకములు గల గుండము వలే ఉండు సమయమది, దాని జ్వాల నిరంతరము ఆరోహణమగుచుండును; మరియు తన చిత్తమును బట్టి వారిని లోబరచుకొనిన సాతాను యొక్క శక్తిని, చెరను బట్టి వారు ఒక నిత్య నాశనమునకు సంకెళ్ళలో బంధించబడు సమయమది.
18 అప్పుడు వారు ఏ విమోచన చేయబడనట్లే ఉందురని నేను మీతో చెప్పుచున్నాను; ఏలయనగా వారు దేవుని న్యాయమును బట్టి విమోచింపబడలేరు; క్షయత లేకపోవుటను బట్టి వారిక మరణించలేరు.
19 ఇప్పుడు ఆల్మా ఈ మాటలను చెప్పుట ముగించినప్పుడు జనులు మిక్కిలి ఆశ్చర్యపడసాగిరి;
20 కానీ, ముఖ్యాధికారి అయిన ఆంత్యోనా అను వాడొకడు వారి మధ్య నుండెను; అతడు ముందుకు వచ్చి అతనితో ఇట్లనెను: ఆత్మ ఎన్నడూ మరణించకుండునట్లు మనుష్యుడు మృతులలోనుండి లేచి, మర్త్యమైన దాని నుండి అమర్త్యమైన స్థితికి మారవలెనని నీవు చెప్పినదేమిటి?
21 మన మొదటి తల్లిదండ్రులు అక్కడ ప్రవేశించి జీవ వృక్షఫలమును తిని నిత్యము జీవించకుండా ఏదేను వనమునకు తూర్పున దేవుడు కెరూబులను, మండుచున్న ఖడ్గమును ఉంచియున్నాడని చెప్పిన లేఖనము యొక్క అర్థమేమి? మరియు ఆ విధముగా వారు నిత్యము జీవించుటకు ఎట్టి అవకాశము లేదని మనము చూచుచున్నాము.
22 ఇప్పుడు ఆల్మా అతనితో ఇట్లనెను: నేను వివరించబోవు విషయము ఇదియే. దేవుని వాక్యమును బట్టి, నిషేధింపబడిన ఫలమును తినుట ద్వారా ఆదాము పతనమాయెనని మనము చూచుచున్నాము; ఆ విధముగా అతని పతనము ద్వారా సమస్త మానవజాతి తప్పిపోయిన, పతనమైన జనులైరని మనము చూచుచున్నాము.
23 ఇప్పుడు నేను మీతో చెప్పుచున్నాను, ఆ సమయమున జీవ వృక్షఫలమును తినుట ఆదామునకు సాధ్యమైయుండిన యెడల మరణము ఉండేది కాదు. మరియు దేవుడిని ఒక అబద్ధకునిగా చేయుచూ వాక్యము నిరర్థకమైయుండేది, ఏలయనగా నీవు తినిన యెడల నిశ్చయముగా నీవు చనిపోయెదవని ఆయన చెప్పెను.
24 మానవజాతికి మరణము వచ్చునని, ముఖ్యముగా అమ్యులెక్ చేత చెప్పబడిన భౌతిక మరణము వచ్చునని మనము చూచుచున్నాము; అయినప్పటికీ పశ్చాత్తాపపడునట్లు మనుష్యునికి ఒక సమయము అనుగ్రహించబడెను; కావున, ఈ జీవితము ఒక పరిశీలనా స్థితి ఆయెను; దేవుడిని కలుసుకొనుటకు సిద్ధపడు సమయమాయెను; మృతుల పునరుత్థానము తర్వాత వచ్చునని మా ద్వారా చెప్పబడిన ఆ అంతము లేని స్థితి కొరకు సిద్ధపడు సమయమాయెను.
25 ఇప్పుడు, లోకము పునాది వేయబడినప్పటి నుండి సిద్ధము చేయబడిన విమోచన ప్రణాళిక లేని యెడల మృతుల పునరుత్థానము ఉండేది కాదు; కానీ చెప్పబడిన ఆ మృతుల పునరుత్థానమును తెచ్చు ఒక విమోచన ప్రణాళిక చేయబడినది.
26 మన మొదటి తల్లిదండ్రులు వెళ్ళి జీవవృక్ష ఫలమును తినుట సాధ్యమైన యెడల, సిద్ధపాటు స్థితి ఏదియూ లేకుండా వారు నిత్యము దౌర్భాగ్యులైయుండేవారు; ఆ విధముగా విమోచన ప్రణాళిక వ్యర్థమైయుండేది మరియు దేవుని వాక్యము ఫలితము లేకుండా నిరర్థకమైయుండేది.
27 కానీ, అది అట్లు లేదు; వారు తప్పక మరణించవలెనని మనుష్యులకు నియమించబడినది; మరణము తర్వాత వారు తీర్పునకు—అంతమని మేము చెప్పిన ఆ తీర్పునకు తప్పక రావలెను.
28 ఈ సంగతులు మనుష్యులకు జరుగవలెనని దేవుడు నియమించిన తరువాత, ఆయన వారికి నియమించిన సంగతులను గూర్చి మనుష్యుడు తెలుసుకొనుట అవసరమైయుండెనని ఆయన చూచెను;
29 కావున, వారితో మాట్లాడుటకు ఆయన దేవదూతలను పంపెను, వారు ఆయన మహిమను మనుష్యులు చూచునట్లు చేసిరి.
30 ఆ సమయము నుండి వారు ఆయన నామమున ప్రార్థన చేయుట మొదలుపెట్టిరి; కావున దేవుడు మనుష్యులతో మాట్లాడెను మరియు లోకము పునాది వేయబడినప్పటి నుండి సిద్ధము చేయబడిన విమోచన ప్రణాళికను వారికి తెలియజేసెను; వారి విశ్వాసము, పశ్చాత్తాపము, పరిశుద్ధ క్రియలను బట్టి ఆయన దీనిని వారికి తెలియజేసెను.
31 అందువల్ల భౌతికమైన విషయములను గూర్చిన మొదటి ఆజ్ఞలను ముందుగా వారు అతిక్రమించి, దేవుళ్ళ వలే అయి మంచి చెడులు ఎరిగి, నిర్వహించుకొను స్థితిలో ఉండి, చెడు చేయుటకేగాని లేదా మంచి చేయుటకేగాని వారి చిత్తములు, కోరికలను బట్టి తమనుతాము నిర్వహించుకొను స్థితి యందు ఉంచబడియుండగా, ఆయన మనుష్యులకు ఆజ్ఞలు ఇచ్చెను.
32 కావున వారు చెడు చేయరాదని, దానికి శిక్ష రెండవ మరణమని, నీతికి సంబంధించినంత వరకు అది ఒక శాశ్వత మరణమైయున్నదని వారికి విమోచన ప్రణాళికను తెలియజేసిన తరువాత దేవుడు వారికి ఆజ్ఞలనిచ్చెను; ఏలయనగా దేవుని యొక్క సర్వోత్తమమైన మంచితనమును బట్టి న్యాయము యొక్క క్రియలు నాశనము చేయబడవు, గనుక అట్టివారి మీద విమోచన ప్రణాళిక ఎట్టి అధికారమును కలిగియుండలేదు.
33 కానీ దేవుడు తన కుమారుని నామమందు మనుష్యులను పిలిచి (ఇది సిద్ధము చేయబడిన విమోచన ప్రణాళిక అయ్యుండి) ఇట్లు చెప్పెను: మీరు పశ్చాత్తాపపడి, మీ హృదయములను కఠిన పరచుకొనని యెడల, నేను నా అద్వితీయ కుమారుని ద్వారా మీపై కనికరము కలిగియుందును;
34 కావున పశ్చాత్తాపపడి తన హృదయమును కఠినపరచుకొనని వాడు నా అద్వితీయ కుమారుని ద్వారా తన పాప క్షమాపణ నిమిత్తము నా కనికరము కొరకు హక్కు కలిగియుండును; మరియు వీరు నా విశ్రాంతిలోనికి ప్రవేశించెదరు.
35 తన హృదయమును కఠినపరచుకొని, దుర్నీతిని జరిగించువాడు నా విశ్రాంతిలోనికి ప్రవేశించడని నా ఉగ్రతలో నేను ఒట్టు పెట్టుకొనుచున్నాను.
36 ఇప్పుడు నా సహోదరులారా, మీరు మీ హృదయములను కఠినపరచుకొనిన యెడల మీరు ప్రభువు యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించరని నేను మీతో చెప్పుచున్నాను; కావున మీ దుర్నీతి ఆయనను కోపమునకు పురిగొల్పును, దానిని బట్టి మొదటిసారి కోపమునకు పురిగొల్పబడినప్పుడు, అనగా ఆయన వాక్యమును బట్టి మీ ఆత్మల యొక్క శాశ్వత నాశనమునకు మొదటిసారి వలే చివరిసారి కోపమునకు పురిగొల్పబడినప్పుడు, ఆయన వాక్యమును బట్టి మొదటి మరణము వలె చివరి మరణమునకు ఆయన తన ఉగ్రతను మీ పైకి పంపును.
37 ఇప్పుడు నా సహోదరులారా, ఈ విషయములు సత్యమైనవని మనము ఎరుగుదుము గనుక ఆయన మనకిచ్చిన ఆయన యొక్క ఈ రెండవ ఆజ్ఞల యందు ఆయన ఉగ్రతను మనపై దింపుటకు మన దేవుడైన ప్రభువును కోపమునకు పురిగొల్పకుండునట్లు మనము పశ్చాత్తాపపడి, మన హృదయములను కఠినపరచుకొనకుండా ఆయన వాక్యమును బట్టి సిద్ధము చేయబడిన దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించెదము.