లేఖనములు
ఆల్మా 2


2వ అధ్యాయము

అమ్లిసై రాజుగా ఉండగోరును మరియు జనుల స్వరము చేత తిరస్కరించబడును—అతని అనుచరులు అతడిని రాజుగా చేయుదురు—అమ్లిసైయులు, నీఫైయులతో యుద్ధము చేయుదురు మరియు ఓడించబడుదురు—లేమనీయులు, అమ్లిసైయులు సేనలను కలుపుకొందురు మరియు ఓడించబడుదురు—ఆల్మా, అమ్లిసైని సంహరించును. సుమారు క్రీ. పూ. 87 సం.

1 వారి పరిపాలన యొక్క ఐదవ సంవత్సరము ప్రారంభమందు జనుల మధ్య ఒక వివాదము మొదలాయెను; ఏలయనగా అమ్లిసై అను పేరుగల మోసగాడు, లోకజ్ఞానమును బట్టి తెలివైనవాడు, ఖడ్గము చేత గిడియన్‌ను సంహరించి చట్టప్రకారము మరణశిక్ష పొందిన మనుష్యుని క్రమమునకు చెందిన వాడొకడు అక్కడుండెను—

2 ఇప్పుడు ఈ అమ్లిసై తన కుయుక్తి చేత అనేకమంది జనులను తనవైపు ఆకర్షించెను; వారు మిక్కిలి శక్తిమంతులగుట మొదలుపెట్టిరి; జనులపై రాజుగా ఉండుటకు వారు అమ్లిసైని నియమించుటకు ప్రయత్నించసాగిరి.

3 ఇప్పుడిది సంఘ జనులకు, అమ్లిసై బోధనలను బట్టి ఆకర్షింపబడని వారందరికి కూడా భయము కలిగించెను; ఏలయనగా వారి చట్టప్రకారము అట్టి విషయములు జనుల స్వరము చేత నిర్ణయించబడవలెనని వారెరుగుదురు.

4 కావున జనుల సహకారమును పొందుట అమ్లిసైకు సాధ్యమైన యెడల, దుర్మార్గుడైన అతడు వారికి సంఘములో హక్కులు, అధికారములు లేకుండా చేయును; ఏలయనగా దేవుని సంఘమును నాశనము చేయుట అతని ఉద్దేశ్యమైయుండెను.

5 మరియు ఒకనితోనొకరు అధిక కలహము, వితండవాదములు కలిగియుండి, ప్రతివాడు తన చిత్తమును బట్టి అమ్లిసై వైపుగాని, వ్యతిరేకముగా గాని ఉండి, దేశమంతటా జనులు వేర్వేరు సమూహములుగా తమనుతాము సమావేశపరచుకొనిరి.

6 ఆ విధముగా వారు ఆ విషయమును గూర్చి తమ సమ్మతిని తెలియజేయుటకు తమనుతాము సమావేశపరచుకొనిరి మరియు వారి అభిప్రాయములు న్యాయాధిపతుల యెదుట ఉంచబడెను.

7 జనుల స్వరము అమ్లిసైకి వ్యతిరేకముగా వచ్చినందున, అతడు జనులపై రాజుగా నియమింపబడలేదు.

8 ఇది అతనికి వ్యతిరేకముగానున్న వారి హృదయములలో అధిక సంతోషమును కలుగజేసెను; కానీ అమ్లిసై అతని పక్షమున ఉన్న వారిని, అతని పక్షమున లేని వారికి వ్యతిరేకముగా కోపమునకు పురిగొల్పెను.

9 వారందరు కలిసి సమకూడి, తమ రాజుగా ఉండుటకు అమ్లిసైని ప్రతిష్ఠించిరి.

10 ఇప్పుడు అమ్లిసై వారిపై రాజుగా చేయబడినప్పుడు, వారి సహోదరులకు వ్యతిరేకముగా వారు ఆయుధములు తీసుకొనవలెనని అతడు వారిని ఆజ్ఞాపించెను; వారిని తనకు లోబరచుకొనునట్లు అతడు దీనిని చేసెను.

11 అమ్లిసై యొక్క జనులు, అమ్లిసై పేరు చేత గుర్తింపబడి, అమ్లిసైయులు అని పిలువబడిరి; మిగిలిన వారు నీఫైయులని లేదా దేవుని జనులని పిలువబడిరి.

12 కావున నీఫై జనులు అమ్లిసైయుల ఉద్దేశ్యము ఎరిగియుండి, వారిని ఎదుర్కొనుటకు సిద్ధపడిరి; వారు ఖడ్గములు, వంపు కత్తులు, విల్లులు, బాణములు, రాళ్ళు, వడిసెలు మరియు ప్రతి విధమైన యుద్ధ ఆయుధములతో తమనుతాము సాయుధులను చేసుకొనిరి.

13 ఆ విధముగా వారు దాడిచేయు సమయమున వారు అమ్లిసైయులను ఎదుర్కొనుటకు సిద్ధముగానుండిరి. వారి సంఖ్యలను బట్టి వారిపై అధికారులు, ఉన్నతాధికారులు, ప్రధాన అధికారులు నియమించబడిరి.

14 అమ్లిసై తన మనుష్యులను అన్నివిధములైన యుద్ధ ఆయుధములతో సాయుధులను చేసెను; వారి సహోదరులకు వ్యతిరేకముగా యుద్ధమునందు నడిపించుటకు తన జనులపై అధిపతులను, నాయకులను కూడా నియమించెను.

15 అమ్లిసైయులు జరహేమ్ల దేశము ప్రక్కగా పారుచుండిన సీదోను నదికి తూర్పున ఉన్న అమ్నిహు కొండ పైకి వచ్చి, అక్కడ నీఫైయులతో యుద్ధము చేయనారంభించిరి.

16 ఇప్పుడు ప్రధాన న్యాయాధిపతియైన ఆల్మా, నీఫై జనుల యొక్క పరిపాలకుడైనందున అతడు అమ్లిసైయులకు వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు తన జనులతో, ముఖ్యముగా తన అధికారులు మరియు ప్రధాన అధికారులతో కలిసి తన సైన్యములకు ముందు నడిచెను.

17 వారు అమ్లిసైయులను సీదోనుకు తూర్పున ఉన్న కొండపై సంహరించుట ప్రారంభించిరి. నీఫైయులలో అనేకులు అమ్లిసైయుల యెదుట కూలునంతగా అమ్లిసైయులు, నీఫైయులతో గొప్ప బలముతో పోరాడిరి.

18 అయినప్పటికీ ప్రభువు నీఫైయులను బలపరచగా, అమ్లిసైయులు వారి యెదుట నుండి పారిపోవునంతగా వారు అమ్లిసైయులను గొప్ప సంహారముతో సంహరించిరి.

19 నీఫైయులు దినమంతా అమ్లిసైయులను తరుముచూ అధిక సంహారముతో వారిని సంహరించిరి, ఎంతగాననగా అమ్లిసైయులలో పన్నెండు వేల ఐదువందల ముప్పది రెండు ఆత్మలు సంహరింపబడెను మరియు నీఫైయులలో ఆరు వేల ఐదు వందల అరువది రెండు ఆత్మలు సంహరింపబడెను.

20 ఆల్మా, అమ్లిసైయులను ఇక తరుమలేకపోయినప్పుడు, తన జనులు గిడియన్‌ లోయలో తమ గుడారములు వేసుకొనునట్లు చేసెను, ఆ లోయ నీహోర్‌ ద్వారా ఖడ్గముచేత సంహరించబడిన ఆ గిడియన్‌ను బట్టి పిలువబడెను; ఆ లోయ యందు నీఫైయులు ఆ రాత్రి కొరకు తమ గుడారములు వేసుకొనిరి.

21 ఆల్మా వారి పన్నాగములను, వారి దురాలోచనలను తెలుసుకొనగలుగునట్లు, అందునుబట్టి వారికి వ్యతిరేకముగా తనను కాచుకొనునట్లు, తన జనులు నాశనము చేయబడకుండా కాపాడుకొనగలుగునట్లు అమ్లిసైయుల శేషమును వెంబడించుటకు వేగులను పంపెను.

22 ఇప్పుడు అమ్లిసైయుల దండును కనిపెట్టుటకు అతడు పంపిన వారు జెరామ్, అమ్నోర్‌, మాంటై మరియు లింహెర్‌ అని పిలువబడిరి; అమ్లిసైయుల దండును కనిపెట్టుటకు తమ మనుష్యులతో వెళ్ళిన వారు వీరే.

23 మరుసటి దినమున వారు గొప్ప వేగిరముతో, బహు ఆశ్చర్యముతో, అధిక భయభ్రాంతులై ఇట్లు చెప్పుచూ నీఫైయుల దండులోనికి తిరిగి వచ్చిరి:

24 ఇదిగో, మేము అమ్లిసైయుల దండును వెంబడించగా మా గొప్ప ఆశ్చర్యమునకు మినోన్‌ దేశమందు జరహేమ్ల దేశము పైన నీఫై దేశము యొక్క దారిలో లేమనీయుల యొక్క గొప్ప సైన్యమును మేము చూచితిమి మరియు అమ్లిసైయులు వారితో చేరిరి.

25 వారు ఆ దేశమందున్న మన సహోదరులపై పడిరి; వారు, వారి యెదుట తమ మందలతో, తమ భార్యాపిల్లలతో మన పట్టణము వైపుకు పారిపోవుచున్నారు; మనము వేగిరపడని యెడల, వారు మన పట్టణమును స్వాధీనపరచుకొందురు మరియు మన తండ్రులు, మన భార్యాపిల్లలు సంహరింపబడుదురు.

26 అప్పుడు నీఫై జనులు తమ గుడారములను తీసివేసి, గిడియన్‌ లోయలో నుండి బయటకు తమ పట్టణమైన జరహేమ్ల వైపుకు వెడలిపోయిరి.

27 వారు సీదోను నదిని దాటుచుండగా సముద్రపు ఇసుక రేణువులంత అధిక సంఖ్యలో ఉన్న లేమనీయులు మరియు అమ్లిసైయులు వారిని నాశనము చేయుటకు వారిపై దాడిచేసిరి.

28 అయినప్పటికీ ప్రభువు వారిని, వారి శత్రువుల చేతులలో నుండి విడిపించవలెనని ఆయనకు బలముగా ప్రార్థన చేసిన నీఫైయులు ప్రభువు చేత బలపరచబడిరి. కావున, ప్రభువు వారి మొరలను విని వారిని బలపరచగా లేమనీయులు, అమ్లిసైయులు వారి యెదుట కూలిరి.

29 ఇప్పుడు ఆల్మా, అమ్లిసైతో ముఖాముఖిగా ఖడ్గముతో పోరాడెను; వారు ఒకరితోనొకరు బలముగా పోరాడిరి.

30 ఆల్మా ఒక దైవజనుడైయుండి, అధిక విశ్వాసముచే ప్రభావితుడై ఇట్లు చెప్పుచూ మొరపెట్టెను: ఓ ప్రభువా! ఈ జనులను రక్షించి, కాపాడుటకు నేను నీ చేతులలో ఒక సాధనముగా ఉండునట్లు కనికరించి నా ప్రాణమును విడిపించుము.

31 ఆల్మా ఈ మాటలు చెప్పిన తర్వాత అమ్లిసైతో మరలా పోరాడెను; అతడు అమ్లిసైని ఖడ్గముతో సంహరించునంతగా బలపరచబడెను.

32 అతడు లేమనీయుల రాజుతో కూడా పోరాడెను; కానీ లేమనీయుల రాజు ఆల్మా యెదుట నుండి పారిపోయి, ఆల్మాతో పోరాడుటకు తన భటులను పంపెను.

33 అయితే ఆల్మా తన భటులతో కలిసి వారిని సంహరించి, వెనుకకు తరుము వరకు లేమనీయుల రాజు యొక్క భటులతో పోరాడెను.

34 ఆ విధముగా అతని జనులు దాటుటకు చోటు కలిగియుండి, సీదోను నదికి పశ్చిమమున లేమనీయులు మరియు అమ్లిసైయులతో పోరాడునట్లు, సంహరించబడిన లేమనీయుల శరీరములను సీదోను జలములలోనికి విసురుచూ నేలను లేదా వాస్తవమునకు సీదోను నదికి పశ్చిమమునున్న ఒడ్డును అతడు ఖాళీ చేసెను.

35 వారందరు సీదోను నదిని దాటినప్పుడు, లెక్కింపబడలేనంత అధికసంఖ్యలో ఉన్నప్పటికీ లేమనీయులు మరియు అమ్లిసైయులు వారి యెదుట నుండి పారిపోవుట మొదలుపెట్టిరి.

36 నీఫైయుల యెదుట వారు దేశ సరిహద్దులకు అవతల దూరముగా పశ్చిమమున ఉత్తరమున ఉన్న అరణ్యము వైపుకు పారిపోయిరి; నీఫైయులు తమ శక్తిమేరకు వారిని తరుముచూ సంహరించిరి.

37 వారు పశ్చిమమునకు, ఉత్తరమునకు చెదిరిపోయి హెర్మౌంటులు అని పిలువబడిన అరణ్యమును చేరు వరకు ప్రతి వైపు నుండి ఎదుర్కొనబడి, సంహరించబడి, తరిమివేయబడిరి; అది ఆకలిగొన్న అడవి మృగముల చేత నిండియున్న అరణ్య భాగమైయుండెను.

38 ఇప్పుడు అరణ్యమందు వారి గాయములను బట్టి అనేకులు మరణించిరి, ఆ మృగములు మరియు రాబందుల చేత కూడా తినివేయబడిరి; వారి ఎముకలు కనుగొనబడి, భూమిపై కుప్పగా పోయబడెను.

ముద్రించు