20వ అధ్యాయము
చెరసాలలో ఉన్న అతని సహోదరులను విడిపించుటకు ప్రభువు అమ్మోన్‌ను మిద్దొనైకి పంపును—అమ్మోన్ మరియు లమోనై దేశమంతటిపై రాజైన లమోనై తండ్రిని కలుసుకొందురు—తన సహోదరుల విడుదలకు అంగీకరించునట్లు వృద్ధుడైన రాజును అమ్మోన్ బలవంతము చేయును. సుమారు క్రీ. పూ. 90 సం.
1 వారు దేశమందు ఒక సంఘమును స్థాపించిన తరువాత, తన తండ్రికి అతడిని చూపగలుగునట్లు అతడు తనతో నీఫై దేశమునకు రావలెనని రాజైన లమోనై, అమ్మోన్‌ను కోరెను.
2 మరియు ప్రభువు యొక్క స్వరము అమ్మోన్‌తో ఇట్లు చెప్పెను: నీవు నీఫై దేశమునకు వెళ్ళరాదు, ఏలయనగా రాజు నీ ప్రాణమును కోరును; బదులుగా నీవు మిద్దొనై దేశమునకు వెళ్ళవలెను; ఏలయనగా నీ సహోదరుడు అహరోను, ములొకి మరియు ఆమ్మా చెరసాలలో ఉన్నారు.
3 అమ్మోన్ దీనిని వినినప్పుడు అతడు లమోనైతో ఇట్లనెను: ఇదిగో, నా సహోదరుడు మరియు సహోదరులు మిద్దొనైయందు చెరసాలలో ఉన్నారు, నేను వారిని విడిపించుటకు వెళ్ళెదను.
4 ఇప్పుడు లమోనై అమ్మోన్‌తో ఇట్లనెను: ప్రభువు యొక్క బలమందు నీవు అన్ని కార్యములను చేయగలవని నేనెరుగుదును. కానీ, నేను నీతో మిద్దొనై దేశమునకు వచ్చెదను; ఏలయనగా మిద్దొనై దేశపు రాజు నాకు స్నేహితుడు, అతని పేరు అంతియొమ్నో; కావున, ఆ దేశపు రాజును పొగుడునట్లు నేను మిద్దొనై దేశమునకు వచ్చెదను మరియు అతడు నీ సహోదరులను చెరసాలనుండి విడుదలచేయును. అయితే, నీ సహోదరులు చెరసాలలో ఉన్నారని నీతో ఎవరు చెప్పిరి? అని లమోనై అతడిని అడిగెను.
5 అప్పుడు అమ్మోన్ అతనితో ఇట్లు చెప్పెను: దేవుడు తప్ప మరి ఎవరును నాకు చెప్పియుండలేదు మరియు ఆయన నాతో—వెళ్ళి నీ సహోదరులను విడిపించుము, ఏలయనగా వారు మిద్దొనై దేశమందు చెరసాలలో ఉన్నారని చెప్పెను.
6 లమోనై దీనిని వినినప్పుడు, అతని సేవకులు అతని గుర్రములను, రథములను సిద్ధము చేయునట్లు చేసెను.
7 అతడు, అమ్మోన్‌తో ఇట్లు చెప్పెను: రమ్ము, నేను నీతో మిద్దొనై దేశమునకు వచ్చెదను; అక్కడ నీ సహోదరులను చెరసాలలో నుండి విడుదల చేయమని నేను రాజును బ్రతిమాలుకొనెదను.
8 అంతట అమ్మోన్ మరియు లమోనై ప్రయాణము చేయుచుండగా, దేశమంతటిపై రాజైన లమోనై తండ్రిని వారు కలుసుకొనిరి.
9 మరియు లమోనై తండ్రి అతనితో ఇట్లనెను: నేను నా కుమారులకు, నా జనులకు విందు చేసిన ఆ గొప్పదినమున నీవెందుకు ఆ విందుకు రాలేదు?
10 అబద్ధికుని సంతానములో ఒకడైన ఈ నీఫైయునితో నీవెక్కడికి వెళ్ళుచున్నావు? అని కూడా అనెను.
11 అప్పుడు, అతడిని నొప్పించుటకు భయపడి తానెక్కడకు వెళ్ళుచున్నదీ లమోనై అతనికి తెలియజేసెను.
12 అతని తండ్రి సిద్ధపరచిన విందుకు వెళ్ళకుండా తన స్వంత రాజ్యములోనే అతడు నిలిచియుండుటకు గల కారణమును కూడా అతనికి చెప్పెను.
13 లమోనై అతనికి ఈ విషయములన్నిటినీ చెప్పినప్పుడు, అతని తండ్రి కోపముతో ఇట్లనుచూ అతడిని కలవరపెట్టెను: లమోనై, ఒక అబద్ధికుని కుమారులైన ఈ నీఫైయులను నీవు విడిపించబోవుచున్నావు. అతడు మన తండ్రులను దోచుకొనెను; ఇప్పుడు అతని సంతానము కూడా తమ మోసము, అబద్ధముల చేత మనలను మోసగించి, తిరిగి మన ఆస్థిని మననుండి దోచుకొనుటకు మన మధ్యకు వచ్చియున్నారు.
14 ఇప్పుడు అతడు అమ్మోన్‌ను తన ఖడ్గముతో సంహరించవలెనని లమోనై తండ్రి అతడిని ఆజ్ఞాపించెను. అతడు మిద్దొనై దేశమునకు వెళ్ళరాదని, తనతోపాటు ఇష్మాయెల్ దేశమునకు తిరిగి వెళ్ళవలెనని కూడా అతడు ఆజ్ఞాపించెను.
15 కానీ లమోనై అతనితో ఇట్లనెను: నేను అమ్మోన్‌ను సంహరించను లేదా ఇష్మాయెల్ దేశమునకు తిరిగిరాను, కానీ అమ్మోన్ యొక్క సహోదరులను విడిపించుటకు నేను మిద్దొనై దేశమునకు వెళ్ళెదను, ఏలయనగా వారు న్యాయవంతులని, నిజమైన దేవుని యొక్క పరిశుద్ధ ప్రవక్తలని నేనెరుగుదును.
16 అతని తండ్రి ఈ మాటలు వినినప్పుడు అతనిపట్ల కోపము తెచ్చుకొని, అతడిని నేలకూల్చునట్లు తన ఖడ్గము దూసెను.
17 కానీ అమ్మోన్ ముందుకు వచ్చి అతనితో ఇట్లనెను: ఇదిగో, నీవు నీ కుమారుడిని సంహరించరాదు; అయినప్పటికీ నీ కంటే అతడు మరణించుట మేలు, ఏలయనగా అతడు తన పాపముల విషయమై పశ్చాత్తాపపడియున్నాడు; కానీ నీవు ఈ సమయమున నీ కోపమందు మరణించిన యెడల నీ ఆత్మ రక్షింపబడలేదు.
18 మరలా, నీవు ఈ పనిని మానుకొనవలెను; ఏలయనగా నీవు నీ కుమారుడిని సంహరించిన యెడల, నిర్దోషియైన అతని రక్తము నీపై ప్రతీకారము తీర్చుకొనుటకు తన దేవుడైన ప్రభువుకు నేలనుండి మొరపెట్టును; అప్పుడు బహుశా నీవు నీ ఆత్మను కోల్పోదువు.
19 ఇప్పుడు అమ్మోన్ అతనితో ఈ మాటలను చెప్పినప్పుడు, అతడిట్లు సమాధానమిచ్చెను: నేను నా కుమారుడిని సంహరించిన యెడల, నేను నిర్దోషి రక్తమును చిందించెదనని నేనెరుగుదును, ఏలయనగా అతడిని నాశనము చేయగోరినది నీవే.
20 మరియు అతడు, అమ్మోన్‌ను సంహరించుటకు తన చేయి చాపెను. కానీ అమ్మోన్ అతని దెబ్బలను కాచుకొని, అతడు తన చేతిని ఉపయోగించలేకపోవునట్లు దానిపై కొట్టెను.
21 అమ్మోన్ అతడిని సంహరించగలడని చూచినపుడు, తన ప్రాణమును విడిచిపెట్టవలెనని రాజు అమ్మోన్‌ను బ్రతిమాలసాగెను.
22 కానీ అమ్మోన్ తన ఖడ్గమును ఎత్తి, అతనితో ఇట్లనెను: ఇదిగో, నా సహోదరులు చెరసాల నుండి విడుదల చేయబడుటకు నీవు అనుగ్రహించని యెడల, నేను నిన్ను సంహరించెదను.
23 ఇప్పుడు తన ప్రాణమును పోగొట్టుకొందునేమోనని భయపడుచూ రాజు ఇట్లనెను: నీవు నన్ను విడిచిపెట్టిన యెడల, నీవు దేనిని అడిగినను, సగము రాజ్యమైనను నేను నీకు అనుగ్రహించెదను.
24 ఇప్పుడు తన కోరికను బట్టి వృద్ధుడైన రాజును తాను ప్రభావితం చేసినట్లు అమ్మోన్ చూచినప్పుడు, అతనితో ఇట్లనెను: నా సహోదరులు చెరసాలలో నుండి విడుదల చేయబడుటకు, లమోనై తన రాజ్యమును నిలుపుకొనుటకు మరియు నీవు అతనితో అయిష్టముగా ఉండకుండా అతడు తలంచిన ఏ కార్యమందైనను అతని ఇష్టప్రకారము అతడు చేయుటకు అనుగ్రహించిన యెడల నేను నిన్ను విడిచిపెట్టెదను; లేని యెడల, నేను నిన్ను నేలకూల్చెదను.
25 ఇప్పుడు అమ్మోన్ ఈ మాటలను చెప్పినప్పుడు, తన ప్రాణము నిమిత్తము రాజు సంతోషించసాగెను.
26 అతడిని నాశనము చేయుటకు అమ్మోన్ ఎట్టి కోరిక కలిగిలేడని, తన కుమారుడైన లమోనై యెడల గొప్ప ప్రేమ కలిగియున్నాడని చూచినప్పుడు, అతడు అధికముగా ఆశ్చర్యపడి ఇట్లనెను: నేను నీ సహోదరులను విడుదల చేయవలెనని, నా కుమారుడు లమోనై తన రాజ్యమును నిలుపుకొనుటకు అనుమతించవలెనని నీవు కోరినందున, ఇదిగో ఈ సమయము నుండి ఎప్పటికీ నా కుమారుడు తన రాజ్యమును నిలుపుకొనవచ్చునని నేను నీకు అనుగ్రహించెదను; ఇక మీదట నేను అతడిని పరిపాలించను—
27 మరియు నీ సహోదరులు చెరసాలలో నుండి విడుదల చేయబడునట్లు కూడా నేను నీకు అనుగ్రహించెదను; నీవు, నీ సహోదరులు నా యొద్దకు నా రాజ్యములోనికి రావచ్చును; నిన్ను చూచుటకు నేను అధికముగా కోరెదను. ఏలయనగా అతడు పలికియున్న మాటలకు మరియు తన కుమారుడైన లమోనై చేత పలుకబడిన మాటలకు అధికముగా ఆశ్చర్యపడి, రాజు వాటిని తెలుసుకొనగోరెను.
28 ఇప్పుడు అమ్మోన్ మరియు లమోనై మిద్దొనై దేశము వైపు తమ ప్రయాణము సాగించిరి. లమోనై ఆ దేశపు రాజు అనుగ్రహమును పొందినందువలన, అమ్మోన్ యొక్క సహోదరులు చెరసాల నుండి విడుదల చేయబడిరి.
29 అమ్మోన్ వారిని కలిసినప్పుడు అతడు మిక్కిలి దుఃఖాక్రాంతుడాయెను, ఏలయనగా వారు దిగంబరులుగానుండి, బలమైన త్రాళ్ళతో కట్టబడుట చేత వారి చర్మములు అధికముగా కమిలియుండెను. వారు ఆకలిదప్పులు, అన్నిరకములైన బాధలను అనుభవించియుండిరి; అయినప్పటికీ, వారి శ్రమలన్నిటిలో వారు సహనముగా నుండిరి.
30 దురదృష్టవశాత్తు వారు అధిక కఠినాత్ములు, అధిక మెడబిరుసు జనుల చేతులలో పడిరి; కావున వారి మాటలను వారు ఆలకించకుండిరి, వారిని బయటకు త్రోసివేసి, కొట్టి, గృహము నుండి గృహమునకు, స్థలము నుండి స్థలమునకు, మిద్దొనై దేశమునకు చేరువరకు వారిని తరిమిరి; అక్కడ వారు పట్టుకొనబడి, చెరసాలలో వేయబడి, బలమైన త్రాళ్ళతో కట్టబడి, అనేక దినముల పాటు చెరసాలలో ఉంచబడిరి; తరువాత లమోనై మరియు అమ్మోన్ చేత విడిపించబడిరి.