లేఖనములు
ఆల్మా 10


10వ అధ్యాయము

లీహై మనష్షే వంశస్థుడు—తాను ఆల్మాపట్ల శ్రద్ధ వహించవలెనను దేవదూత యొక్క ఆజ్ఞను అమ్యులెక్ వివరించును—నీతిమంతుల ప్రార్థనలు జనులను నాశనము కాకుండా కాపాడును—అవినీతిపరులైన న్యాయవాదులు మరియు న్యాయాధిపతులు జనుల నాశనమునకు పునాది వేయుదురు. సుమారు క్రీ. పూ. 82 సం.

1 ఇప్పుడు అమ్మోనైహా దేశమందున్న జనులకు అమ్యులెక్ బోధించిన మాటలివి:

2 నా పేరు అమ్యులెక్; నేను అమినది వంశస్థుడైన ఇష్మాయెలు కుమారుడైన గిద్దొనా యొక్క కుమారుడను; దేవాలయపు గోడపై దేవుని చేతి వ్రేలి ద్వారా వ్రాయబడిన వ్రాతకు అర్థము చెప్పినది ఆ అమినదియే.

3 మరియు అమినది, తన సహోదరుల చేత ఐగుప్తులోనికి అమ్మివేయబడిన యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థుడును యెరూషలేము దేశము నుండి బయటకు వచ్చిన వాడునైన లీహై కుమారుడైన నీఫై యొక్క వంశస్థుడు.

4 నన్ను ఎరిగిన వారందరి మధ్య నేను కూడా తక్కువ ప్రఖ్యాతి గలవాడనేమి కాను; నేను అనేకమంది బంధువులను, స్నేహితులను కలిగియున్నాను మరియు నా శ్రమ ద్వారా నేను ఎన్నో సంపదలను ఆర్జించియున్నాను.

5 ఇవన్నీ ఉన్నప్పటికీ ప్రభువు యొక్క మార్గములు, ఆయన మర్మములు మరియు అద్భుతశక్తిని గూర్చి ఎక్కువగా నేనెన్నడూ ఎరిగియుండలేదు. నేను ఈ విషయములను గూర్చి ఎక్కువగా ఎరిగియుండలేదంటిని; కానీ నేను పొరపాటు చేయుచున్నాను, ఏలయనగా ఈ జనుల జీవితములను కాపాడుటలో ఆయన మర్మములనేకమును, ఆయన అద్భుతశక్తిని నేను చూచియుంటిని.

6 అయినను నేను నా హృదయమును కఠినపరచుకొంటిని, అనేక పర్యాయములు పిలువబడినప్పటికీ నేను వినకుంటిని; కావున నేను ఈ విషయములను గూర్చి ఎరిగియున్నను, నేను ఎరుగనట్లే; అందువలన, న్యాయాధిపతుల పరిపాలన యొక్క పదవ సంవత్సరమందు ఈ ఏడవ నెల యొక్క నాలుగవ దినము వరకు నా హృదయము యొక్క దుష్టత్వమందు దేవునికి వ్యతిరేకముగా నేను తిరుగుబాటు చేయుచుంటిని.

7 నేను చాలా దగ్గర బంధువునొకరిని చూచుటకు వెళ్ళుచుండగా, ప్రభువు యొక్క దేవదూత నాకు కనబడి ఇట్లు చెప్పెను: అమ్యులెక్, నీ ఇంటికి తిరిగి వెళ్ళుము, ఏలయనగా నీవు ప్రభువు యొక్క ప్రవక్తకు ఆహారమియ్యవలెను; అతడు దేవుని చేత ఎన్నుకొనబడిన పరిశుద్ధుడు; ఈ జనుల పాపములను బట్టి అతడు అనేక దినములు ఉపవాసముండి ఆకలిగొనియున్నాడు, నీవు అతడిని నీ ఇంటిలో చేర్చుకొని భోజనము పెట్టవలెను; అతడు నిన్ను, నీ ఇంటివారిని ఆశీర్వదించును మరియు ప్రభువు యొక్క ఆశీర్వాదము నీపై, నీ ఇంటివారిపై నిలుచును.

8 అప్పుడు నేను దేవదూత స్వరమునకు లోబడి నా ఇంటి వైపు తిరిగి వెళ్ళితిని. నేను అక్కడకు వెళ్ళుచుండగా, నీ ఇంటిలో చేర్చుకొందువని దేవదూత నాకు చెప్పిన ఆ మనుష్యుని నేను కనుగొంటిని. ఇదిగో దేవుని విషయములను గూర్చి మీతో మాట్లాడుచున్న ఇతడే ఆ మనుష్యుడు.

9 అతడు పరిశుద్ధుడని దేవదూత నాతో చెప్పెను; అందువలన అతడు పరిశుద్ధుడని నేనెరుగుదును. ఏలయనగా అది దేవుని యొక్క దేవదూత ద్వారా చెప్పబడెను.

10 అతడు సాక్ష్యమిచ్చిన విషయములు సత్యమని నేనెరుగుదును; ఏలయనగా, ప్రభువు జీవముతోడు ఈ విషయములను నాకు విశదపరచుటకు ఆయన తన దేవదూతను పంపియున్నాడు; ఈ ఆల్మా నా ఇంట నివసించినప్పుడు ఆయన దీనిని చేసియున్నాడని నేను మీతో చెప్పుచున్నాను.

11 ఇదిగో, అతడు నా ఇంటివారిని ఆశీర్వదించెను. అతడు నన్ను, నా స్త్రీలను, నా పిల్లలను మరియు నా తండ్రిని, నా బంధువులను ఆశీర్వదించెను; ముఖ్యముగా నా బంధువులందరినీ అతడు ఆశీర్వదించెను మరియు అతడు పలికిన మాటలను బట్టి ప్రభువు యొక్క ఆశీర్వాదము మాపై నిలిచెను.

12 ఇప్పుడు అమ్యులెక్ ఈ మాటలను పలికినప్పుడు, జనులపై మోపబడిన నేరారోపణల గూర్చి మరియు రాబోవు విషయములను గూర్చి వారియందున్న ప్రవచనాత్మను బట్టి సాక్ష్యమిచ్చిన వారు అక్కడ ఒకరికంటే ఎక్కువ ఉండుట చూచినపుడు జనులు ఆశ్చర్యపడసాగిరి.

13 అయినను తమ కపటపు తంత్రములతో వారి మాటలలో తప్పులెంచవలెనని, వారికి వ్యతిరేకముగా సాక్ష్యము కనుగొనవలెనని, చట్టప్రకారము తీర్పుతీర్చబడునట్లు వారిని న్యాయాధిపతులకు అప్పగించవలెనని, వారు నేరము చేసినట్లుగా చూపబడుట లేదా సాక్ష్యమివ్వబడుట ద్వారా వారు సంహరింపబడవలెనని లేదా చెరసాలలో వేయబడవలెనని కోరి, వారిని ప్రశ్నించదలచిన వారు అక్కడ కొందరుండిరి.

14 వారిని నాశనము చేయుటకు కోరిన ఆ మనుష్యులు న్యాయవాదులైయుండిరి. వారు, న్యాయవిచారణ సమయమందు లేదా న్యాయాధిపతుల యెదుట జనుల నేరముల విచారణ సమయమందు న్యాయము జరిగించుటకు జనుల చేత జీతమునకు పెట్టుకొనబడినవారు లేదా నియమించబడిన వారు.

15 ఇప్పుడు ఈ న్యాయవాదులు జనుల నేర్పరితనము, కుయుక్తులను ఎరిగియుండిరి; ఇది, వారి వృత్తి యందు వారు నిపుణులైయుండునట్లు చేయుటకైయుండెను.

16 మరియు అతడు తన మాటలను తానే వ్యతిరేకించునట్లు లేదా అతడు చెప్పబోవుదానితో ఏకీభవించకుండునట్లు చేయుటకు వారు అమ్యులెక్‌ను ప్రశ్నించుట ప్రారంభించిరి.

17 ఇప్పుడు అమ్యులెక్ వారి ఉద్దేశ్యములను తెలుసుకొనగలడని వారు ఎరుగకయుండిరి. కానీ వారు అతడిని ప్రశ్నించుట ప్రారంభించగా, అతడు వారి ఆలోచనలను గ్రహించి వారితో ఇట్లనెను: ఓ, దుష్టులైన మూర్ఖతరము వారలారా, న్యాయవాదులు మరియు వేషధారులైన మీరు, అపవాది కొరకు పునాదులు వేయుచున్నారు; మీరు దేవుని పరిశుద్ధులను పట్టుకొనుటకు ఉచ్చులు, వలలు పన్నుతున్నారు.

18 నీతిమంతుల మార్గములను చెరుపుటకు, ఈ జనులను పూర్తిగా నాశనము చేయునట్లు దేవుని ఉగ్రతను మీపై తెచ్చుకొనుటకు మీరు ప్రణాళికలు వేయుచున్నారు.

19 మన చివరి రాజైన మోషైయ రాజ్యమును అనుగ్రహించుటకు ఎవరూ లేని వాడైయుండి, దానిని అప్పగించుటకు సిద్ధపడి, ఈ జనులు తాము ఎన్నుకొనినవారి చేత పరిపాలించబడునట్లు చేసినప్పుడు బాగుగా చెప్పెను—ఈ జనులు దుర్నీతిని ఎన్నుకొను సమయము వచ్చిన యెడల, అనగా ఈ జనులు అతిక్రమములో పడు సమయము వచ్చిన యెడల వారు నాశనమగుటకు సిద్ధపడుదురని అతడు బాగుగా చెప్పెను.

20 ఇప్పుడు నేను మీతో చెప్పుచున్నాను, ప్రభువు మీ దోషములను బట్టి బాగుగా తీర్పుతీర్చియున్నాడు; మీరు పశ్చాత్తాపపడుడి, పశ్చాత్తాపపడుడి, ఏలయనగా పరలోకరాజ్యము సమీపించియున్నదని తన దేవదూతల స్వరము ద్వారా ఆయన ఈ జనులకు బాగుగా ఎలుగెత్తి చెప్పియున్నాడు.

21 న్యాయము, ధర్మములతో నేను నా జనుల మధ్యకు వచ్చెదనని తన దేవదూతల స్వరము ద్వారా ఆయన బాగుగా ఎలుగెత్తి చెప్పియున్నాడు.

22 మరియు నేను మీతో చెప్పుచున్నాను, దేశమందు ఇప్పుడున్న నీతిమంతులు ప్రార్థించని యెడల మీరిప్పుడు కూడా పూర్తి నాశనముతో దర్శింపబడియుండేవారు; అయినప్పటికీ అది నోవహు దినములందున్న జనులకు జరిగినట్లు జలప్రళయము వలన కాకుండును, కానీ కరువు, తెగుళ్ళు మరియు ఖడ్గము వలన జరుగును.

23 కానీ నీతిమంతుల ప్రార్థనల వలన మీరు కాపాడబడియున్నారు; కావున మీరిప్పుడు నీతిమంతులను మీ మధ్యనుండి బయటకు త్రోసివేసిన యెడల, ప్రభువు శిక్షించక విడువడు; ఆయన తన తీవ్రమైన కోపమందు మీకు వ్యతిరేకముగా వచ్చును. అప్పుడు మీరు కరువు, తెగుళ్ళు మరియు ఖడ్గము చేత మొత్తబడుదురు; మీరు పశ్చాత్తాపపడని యెడల ఆ సమయము త్వరలో సమీపించనున్నది.

24 ఇప్పుడు జనులు అమ్యులెక్ పట్ల మరింత కోపముగా నుండి, ఎలుగెత్తి ఇట్లనిరి: ఈ మనుష్యుడు న్యాయమైన మన చట్టములకు, మనము ఎన్నుకొనిన తెలివైన మన న్యాయవాదులకు వ్యతిరేకముగా దూషించుచున్నాడు.

25 కానీ అమ్యులెక్ తన చేతిని ముందుకు చాపి, బలముగా ఎలుగెత్తి వారితో ఇట్లు చెప్పెను: ఓ, దుష్టులైన మూర్ఖతరము వారలారా, మీ హృదయములపై సాతాను అంత గొప్ప పట్టును ఎందుకు కలిగియున్నాడు? పలుకబడిన మాటలను వాటి సత్యమును బట్టి మీరు గ్రహించకుండా మీ కన్నులకు గ్రుడ్డితనము కలుగజేయుటకు అతడు మీపై అధికారము కలిగియుండునట్లు మీరెందుకు అతనికి మిమ్ములను లోబరచుకొనుచున్నారు?

26 నేను మీ చట్టమునకు వ్యతిరేకముగా సాక్ష్యమిచ్చియుంటినా? మీరు గ్రహించకున్నారు; నేను మీ చట్టమునకు వ్యతిరేకముగా మాట్లాడియున్నానని మీరు చెప్పుచున్నారు; కానీ నేను ఆ విధముగా మాట్లాడియుండలేదు, బదులుగా మీ శిక్షావిధి నిమిత్తము నేను మీ చట్టము యొక్క పక్షమున మాట్లాడియున్నాను.

27 ఇప్పుడు, ఈ జనుల నాశనము యొక్క పునాది మీ న్యాయవాదులు మరియు మీ న్యాయాధిపతుల అవినీతి ద్వారా వేయబడుచున్నదని నేను మీతో చెప్పుచున్నాను.

28 అమ్యులెక్ ఈ మాటలను పలికినప్పుడు, జనులు అతనికి వ్యతిరేకముగా ఎలుగెత్తి ఇట్లనిరి: ఈ మనుష్యుడు అపవాది యొక్క సంతానమని ఇప్పుడు మనమెరుగుదుము, అతడు మనతో అబద్ధమాడియున్నాడు; ఏలయనగా అతడు మన చట్టమునకు వ్యతిరేకముగా మాట్లాడియున్నాడు. ఇప్పుడు దానికి వ్యతిరేకముగా మాట్లాడలేదని చెప్పుచున్నాడు.

29 మరలా అతడు మన న్యాయవాదులకు, న్యాయాధిపతులకు వ్యతిరేకముగా దూషించియున్నాడు.

30 మరియు అతనికి వ్యతిరేకముగా ఈ విషయములను వారు జ్ఞాపకముంచుకొనవలెనని న్యాయవాదులు వారి హృదయములలో ఆలోచన కలిగించిరి.

31 వారి మధ్య జీజ్రొమ్ అను పేరుగల వాడొకడు ఉండెను. అతడు వారి మధ్య గల మిక్కిలి నేర్పరులలో ఒకడైయుండి, జనుల మధ్య అధిక వ్యాపారము కలిగియుండి అమ్యులెక్ మరియు ఆల్మాలపై నేరారోపణ చేయుటకు అందరికన్న ముందుండెను.

32 ఇప్పుడు, లాభము సంపాదించుటయే ఈ న్యాయవాదుల ఉద్దేశ్యమైయున్నది; వారి పనిని బట్టి వారు లాభము పొందిరి.