లేఖనములు
ఆల్మా 51


51వ అధ్యాయము

రాజు-మనుష్యులు చట్టమును మార్చి ఒక రాజును నియమించుటకు కోరుదురు—పహోరన్‌ మరియు స్వతంత్ర మనుష్యులు జనుల స్వరము చేత సహకరించబడుదురు—మొరోనై రాజు-మనుష్యులను వారి దేశమును కాపాడుకొనుటకు లేదా చంపబడుటకు బలవంతము చేయును—అమలిక్యా మరియు లేమనీయులు బలపరచబడిన పట్టణములనేకము స్వాధీనము చేసుకొందురు—టియాంకమ్ లేమనీయుల దాడిని త్రిప్పికొట్టి, అమలిక్యాను అతని గుడారములో సంహరించును. సుమారు క్రీ. పూ. 67–66 సం.

1 ఇప్పుడు నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క ఇరువది అయిదవ సంవత్సరపు ప్రారంభమందు, లీహై యొక్క జనులు మరియు మోరియాంటన్‌ యొక్క జనుల మధ్య వారి దేశములను గూర్చి సమాధానము స్థాపించిన వారై వారు ఇరువది అయిదవ సంవత్సరమును సమాధానమందు ప్రారంభించిరి.

2 అయినప్పటికీ దీర్ఘకాలము దేశమందు పూర్తి సమాధానమును వారు నిలుపలేకపోయిరి, ఏలయనగా జనుల మధ్య ప్రధాన న్యాయాధిపతి పహోరన్‌ను గూర్చి వివాదము మొదలాయెను; చట్టములో కొన్ని అంశములు మార్చబడవలెనని కోరుచున్న జనులలో ఒక భాగము అక్కడ ఉండెను.

3 కానీ పహోరన్‌ చట్టమును మార్చకుండెను లేదా మార్చబడుటకు అనుమతించకయుండెను; కావున చట్టమును మార్చుటను గూర్చిన విజ్ఞాపనలతో వారి అభిప్రాయములను పంపిన వారిని అతడు ఆలకించకుండెను.

4 అందునుబట్టి చట్టము మార్చబడవలెనని కోరిన వారు అతనితో కోపముగానుండి, అతడు ఇకమీదట దేశముపై ప్రధాన న్యాయాధిపతిగా ఉండరాదని కోరిరి; కావున ఆ విషయమును గూర్చి అక్కడ తీవ్రమైన కలహము లేచెను, అయితే రక్తపాతము జరుగలేదు.

5 పహోరన్‌ న్యాయపీఠము నుండి దింపబడవలెనని కోరిన వారు రాజు-మనుష్యులు అని పిలువబడిరి, ఏలయనగా స్వతంత్ర ప్రభుత్వమును త్రోసివేయుటకు మరియు దేశముపై ఒక రాజును నియమించుటకు వీలుగా చట్టము మార్చబడవలెనని వారు కోరియుండిరి.

6 మరియు పహోరన్‌ దేశముపై ప్రధాన న్యాయాధిపతిగా కొనసాగవలెనని కోరిన వారు తమపై స్వతంత్ర మనుష్యులు అను పేరును తీసుకొనిరి; వారి మధ్య విభజన ఆ విధముగా ఉండెను, ఏలయనగా ఒక స్వతంత్ర ప్రభుత్వము ద్వారా వారి మతము యొక్క హక్కులను, విశేషాధికారములను కాపాడుకొనుటకు స్వతంత్ర మనుష్యులు ఒట్టు పెట్టుకొనిరి లేదా నిబంధన చేసియుండిరి.

7 వారి వివాదము జనుల యొక్క స్వరము ద్వారా పరిష్కరింపబడెను. జనుల యొక్క స్వరము స్వతంత్ర మనుష్యుల పక్షమున వచ్చెను మరియు పహోరన్‌ న్యాయపీఠమును నిలుపుకొనెను, అది పహోరన్‌ యొక్క సహోదరులు మరియు స్వతంత్ర జనులలో అనేకుల మధ్య అధిక సంతోషమును కలుగజేసెను; రాజు-మనుష్యులు వ్యతిరేకించుటకు ధైర్యము చేయక, స్వాతంత్ర్యము యొక్క ఉద్దేశ్యము నిలుపుటకు బాధ్యత కలిగియుండునట్లు వారు వారిని మాట్లాడకుండా చేసిరి.

8 ఇప్పుడు రాజుల పక్షమునున్న వారు గొప్పవంశములకు చెందిన వారైయుండిరి మరియు వారు రాజులగుటకు కోరిరి; వారు జనులపై శక్తి మరియు అధికారము కోరిన వారి చేత సహకరించబడిరి.

9 కానీ నీఫై యొక్క జనుల మధ్య అట్టి వివాదములుండుటకు ఇది ఒక క్లిష్టమైన సమయమైయుండెను; ఏలయనగా అమలిక్యా, నీఫై యొక్క జనులకు వ్యతిరేకముగా లేమనీయుల హృదయములను తిరిగి పురిగొల్పెను మరియు అతడు తన దేశము యొక్క సమస్త భాగముల నుండి సైనికులను సమకూర్చుచు, వారికి ఆయుధములు ధరింపజేయుచు, పూర్తి శ్రద్ధతో యుద్ధమునకు సిద్ధపడుచుండెను; ఏలయనగా అతడు మొరోనై రక్తము త్రాగెదనని ప్రమాణము చేసియుండెను.

10 కానీ అతడు చేసిన వాగ్దానములు తొందరపాటుయని మనము చూచెదము; అయినను అతడు నీఫైయులకు వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు తనను, తన సైన్యములను సిద్ధము చేసెను.

11 ఇప్పుడు నీఫైయుల చేత అనేక వేలమంది సంహరింపబడిన కారణముగా, అతని సైన్యములు ఇంతకు ముందు ఉన్నంత గొప్పగా లేకుండెను; అయితే గొప్ప నష్టమును ఎదుర్కొన్నప్పటికీ, జరహేమ్ల దేశముపై దాడి చేయుటకు అతడు భయపడనంతగా అద్భుతరీతిలో అమలిక్యా ఒక గొప్ప సైన్యమును సమకూర్చియుండెను.

12 అంతేకాక అమలిక్యా తనకుతానుగా లేమనీయులకు నాయకత్వము వహించెను. మరియు అది న్యాయాధిపతుల పరిపాలన యొక్క ఇరువది అయిదవ సంవత్సరమున అయ్యుండెను; అది ప్రధాన న్యాయాధిపతి పహోరన్‌ను గూర్చి వారి వివాదములను పరిష్కరించుకొనుచున్న సమయమైయుండెను.

13 మరియు రాజు-మనుష్యులు అని పిలువబడినవారు, వారికి వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు లేమనీయులు వచ్చుచున్నారని విన్నప్పుడు తమ హృదయములందు ఆనందించిరి; వారు ఆయుధములను తీసుకొనుటకు నిరాకరించిరి; ఏలయనగా వారు ప్రధాన న్యాయాధిపతితో మరియు స్వతంత్ర జనులతో మిక్కిలి కోపముగానుండి, తమ దేశమును రక్షించుకొనుటకు ఆయుధములు తీసుకొనకుండిరి.

14 మొరోనై దీనిని చూచినప్పుడు మరియు లేమనీయులు దేశ సరిహద్దులలోనికి వచ్చుచున్నారని కూడా చూచినప్పుడు, అధిక శ్రద్ధతో అతడు శ్రమపడి కాపాడిన జనుల యొక్క మొండితనమును బట్టి అతడు మిక్కిలి ఆగ్రహముతోనుండెను; అవును, అతడు మిక్కిలి ఆగ్రహముతోనుండెను; అతని ఆత్మ వారికి వ్యతిరేకముగా కోపముతో నిండెను.

15 మరియు అతడు దేశము యొక్క పరిపాలకునికి—అతడు దానిని చదువవలెనని మరియు ఆ అసమ్మతీయులను వారి దేశమును రక్షించుకొనుటకు బలవంతము చేయుటకు లేదా చంపుటకు అతనికి (మొరోనైకి) అధికారము ఇవ్వవలెనని కోరుచూ జనుల యొక్క స్వరముతో ఒక విజ్ఞాపనను పంపెను.

16 ఏలయనగా జనుల మధ్య అట్టి వివాదములు మరియు అభిప్రాయ బేధములకు ముగింపు పలుకుట అతని మొదటి బాధ్యతయైయుండెను; ఏలయనగా ఇంతవరకు వారందరి నాశనమునకు ఇదియే కారణమైయుండెను. మరియు జనుల యొక్క స్వరమును బట్టి అది అనుగ్రహింపబడెను.

17 రాజు-మనుష్యులకు వ్యతిరేకముగా వెళ్ళి వారి గర్వమును, అహంకారమును అణచివేసి నేలమట్టము చేయవలెనని లేదా వారు ఆయుధములు తీసుకొని స్వాతంత్ర్యము యొక్క ఉద్దేశ్యమునకు సహాయపడునట్లు చేయవలెనని మొరోనై తన సైన్యమును ఆజ్ఞాపించెను.

18 మరియు సైన్యములు వారికి వ్యతిరేకముగా వెళ్ళి వారి గర్వమును, అహంకారమును అణచివేసెను, ఎంతగాననగా మొరోనై యొక్క మనుష్యులకు వ్యతిరేకముగా వారు యుద్ధము చేయుటకు తమ యుద్ధ ఆయుధములను తీసుకొనగా వారు నరికి వేయబడి, నేలమట్టము చేయబడిరి.

19 ఆ అసమ్మతీయులలో నాలుగు వేలమంది ఖడ్గము చేత నరికివేయబడిరి; మరియు యుద్ధమందు సంహరింపబడని వారి నాయకులు పట్టుకొనబడి చెరసాలలో వేయబడిరి, ఏలయనగా ఈ సమయమున వారి విచారణలకు సమయము లేకుండెను.

20 ఆ అసమ్మతీయులలో మిగిలిన వారు ఖడ్గము చేత నేలకు కొట్టివేయబడుటకు బదులు స్వేచ్ఛాధ్వజమునకు లోబడి వారి గోపురములపైన, వారి పట్టణములలో స్వేచ్ఛాపతాకము ఎగురవేయుటకు మరియు వారి దేశమును రక్షించుకొనుటకు ఆయుధములను తీసుకొనుటకు బలవంతము చేయబడిరి.

21 ఆవిధముగా మొరోనై, రాజు-మనుష్యులనే పేరుతో తెలియబడిన వారెవరూ అక్కడ లేకుండునట్లు ఆ రాజు-మనుష్యులకు ముగింపు పలికెను; ఆ విధముగా గొప్పవంశీకుల రక్తమును చాటుకొనిన ఆ జనుల యొక్క మొండితనమునకు, గర్వమునకు అతడు ముగింపు పలికెను; అయితే వారి సహోదరులవలే తమనుతాము తగ్గించుకొనుటకు మరియు దాస్యము నుండి స్వాతంత్ర్యము కొరకు ధైర్యముగా పోరాడుటకు వారు బలవంతము చేయబడిరి.

22 ఆ విధముగా మొరోనై తన స్వంత జనుల మధ్య యుద్ధములు, జగడములను నిర్మూలించుచూ వారిని సమాధానము మరియు నాగరికతకు లోబరచుచూ లేమనీయులకు వ్యతిరేకముగా యుద్ధమునకు సిద్ధపరచుటకు నియమములను తయారు చేయుచుండగా, లేమనీయులు సముద్రపు ఒడ్డు దగ్గర సరిహద్దులలో ఉన్న మొరోనై దేశములోనికి వచ్చియుండిరి.

23 మొరోనై యొక్క పట్టణమందు నీఫైయులు తగినంత బలముగా లేనందున అమలిక్యా అనేకులను సంహరించుచూ వారిని తరిమివేసెను. మరియు అమలిక్యా ఆ పట్టణమును, వారి దుర్గములన్నిటినీ స్వాధీనము చేసుకొనెను.

24 మొరోనై పట్టణము నుండి బయటకు పారిపోయిన వారు నెఫిహా పట్టణమునకు వచ్చిరి; లీహై పట్టణము యొక్క జనులు కూడా తమను సమకూడి ఏర్పాట్లు చేసుకొని లేమనీయులను యుద్ధమందు ఎదుర్కొనుటకు సిద్ధముగా ఉండిరి.

25 కానీ నెఫిహా పట్టణమునకు వ్యతిరేకముగా యుద్ధము చేయుటకై వెళ్ళుటకు అమలిక్యా లేమనీయులను అనుమతించలేదు, కానీ వారిని సముద్రము ప్రక్కన ఉంచుచూ ప్రతి పట్టణమును కాపాడుటకు మనుష్యులను కాపలా ఉంచెను.

26 ఆ విధముగా అతడు అనేక పట్టణములను—నెఫిహా పట్టణము, లీహై పట్టణము, మోరియాంటన్‌ పట్టణము, ఓమ్నెర్ పట్టణము, గిడ్‌ పట్టణము మరియు ములెక్ పట్టణములను, సముద్రము ప్రక్కన తూర్పు సరిహద్దులపైనున్న వాటన్నిటినీ స్వాధీనము చేసుకొనుచూ వెళ్ళెను.

27 ఆ విధముగా అమలిక్యా యొక్క వంచన ద్వారా, వారి అసంఖ్యాక సైన్యముల ద్వారా లేమనీయులు అనేక పట్టణములను సంపాదించిరి; అవన్నియు మొరోనై యొక్క దుర్గముల మాదిరిని బట్టి బలమైన దుర్గములుగా నిర్మించబడెను; అవన్నియు లేమనీయుల కొరకు బలమైన దుర్గములను సమకూర్చెను.

28 మరియు వారి యెదుట నీఫైయులను తరిమివేయుచు, అనేకులను సంహరించుచూ సమృద్ధిదేశము యొక్క సరిహద్దులకు వారు నడిచిరి.

29 కానీ మోరియాంటన్‌ను సంహరించి, అతని పలాయనమందు అతని జనులను ఎదుర్కొనిన టియాంకమ్ చేత వారు కలుసుకొనబడిరి.

30 సమృద్ధిదేశము మరియు ఉత్తరమువైపు దేశమును స్వాధీనపరచుకొనగలుగునట్లు తన అసంఖ్యాకమైన సైన్యముతో అమలిక్యా ముందుకు నడచుచుండగా అతడు అతడిని కూడా ఎదుర్కొనెను.

31 కానీ గొప్ప యోధులైన టియాంకమ్ మరియు అతని మనుష్యుల చేత వెనుకకు తరిమి వేయబడుట చేత అమలిక్యా నిరాశ చెందెను; ఏలయనగా టియాంకమ్ మనుష్యులలో ప్రతి ఒక్కరు వారి బలమందు, వారి యుద్ధ నైపుణ్యమందు లేమనీయులను మించియుండిరి, ఎంతగాననగా వారు లేమనీయులపై ఆధిపత్యము సంపాదించిరి.

32 మరియు వారు, వారిని ఎంతగా వేధించిరనగా చీకటియగు వరకు వారిని సంహరించిరి. టియాంకమ్ మరియు అతని మనుష్యులు సమృద్ధిదేశము యొక్క సరిహద్దులయందు వారి గుడారములను వేసుకొనిరి; అమలిక్యా తన గుడారములను సముద్ర తీరముపై సరిహద్దులయందు వేసుకొనెను మరియు ఈ మాదిరి చొప్పున వారు తరుమబడిరి.

33 రాత్రి వచ్చినప్పుడు టియాంకమ్ మరియు అతని సేవకుడు రహస్యముగా బయటకు వెళ్ళి, అమలిక్యా శిబిరములోనికి వెళ్ళిరి; వారి శ్రమలు మరియు పగటి వేడి వలన కలిగిన అధికమైన అలసటను బట్టి వారు నిద్ర చేత జయించబడియుండిరి.

34 టియాంకమ్, రాజు యొక్క గుడారములోనికి రహస్యముగా ప్రవేశించి అతని గుండెలో ఒక ఈటెను గ్రుచ్చెను మరియు రాజు తన సేవకులను మేలుకొల్పకముందే అతడు మరణించునట్లు చేసెను.

35 అతడు తిరిగి రహస్యముగా తన స్వంత శిబిరమునకు వచ్చినప్పుడు అతని మనుష్యులు నిద్రపోవుచుండిరి, అతడు వారిని మేల్కొలిపి తాను చేసిన క్రియలన్నిటినీ వారికి చెప్పెను.

36 మరియు లేమనీయులు మేల్కొని వారిపై దాడి చేయుదురేమోనని అతడు తన సైన్యములను సిద్ధము చేసెను.

37 ఆ విధముగా నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క ఇరువది అయిదవ సంవత్సరము ముగిసెను; మరియు ఆ విధముగా అమలిక్యా యొక్క దినములు ముగిసెను.