లేఖనములు
ఆల్మా 44


44వ అధ్యాయము

శాంతి నిబంధన చేయుమని లేదా నాశనము కమ్మని మొరోనై లేమనీయులను ఆజ్ఞాపించును—జరహేమ్న ఆ ప్రస్తావనను తిరస్కరించును మరియు యుద్ధము కొనసాగును—మొరోనై సైన్యము లేమనీయులను ఓడించును. సుమారు క్రీ. పూ. 74–73 సం.

1 వారు ఆగి, వారి నుండి కొంత దూరము వెనుకకు జరిగిరి; అప్పుడు మొరోనై, జారహెమ్నతో ఇట్లనెను: జరహేమ్న, మేము రక్తపిపాసులు కావలెనని కోరుటలేదు. మీరు మా చేతులలో ఉన్నారని నీవెరుగుదువు, అయినను మిమ్ములను సంహరించాలని మేము కోరుటలేదు.

2 అధికారము నిమిత్తము మీ రక్తము చిందించునట్లు మీకు వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు మేము వచ్చియుండలేదు; లేదా ఎవరినైనను దాస్యపు కాడి క్రిందికి తెచ్చుటకు మేము కోరుటలేదు. కానీ మాకు వ్యతిరేకముగా మీరు వచ్చిన కారణము ఇదియే; మరియు మా మతము నిమిత్తము మీరు మాతో కోపముగానున్నారు.

3 కానీ ప్రభువు మాతో ఉండెనని, ఆయన మిమ్ములను మా చేతులలోనికి అప్పగించెనని మీరు చూచుచున్నారు. ఇప్పుడు మా మతము మరియు క్రీస్తు నందు మా విశ్వాసమును బట్టియే ఇది మాకు చేయబడెనని మీరు గ్రహించవలెనని నేను కోరుచున్నాను. మా ఈ విశ్వాసమును మీరు నాశనము చేయలేరని మీరిప్పుడు చూచుచున్నారు.

4 ఇది దేవుని యొక్క నిజమైన విశ్వాసమని మీరు చూచుచున్నారు; మేము ఆయనకు, మా విశ్వాసమునకు మరియు మా మతమునకు నమ్మకముగా ఉన్నంత వరకు దేవుడు మాకు సహాయము చేసి, నిలిపి, కాపాడునని మీరు చూచుచున్నారు; మేము అతిక్రమములో పడి మా విశ్వాసమును తిరస్కరించితే తప్ప, మేము నాశనమగుటకు ప్రభువు ఎన్నడూ అనుమతించడు.

5 ఇప్పుడు జరహేమ్న, మా విశ్వాసము, మా మతము, ఆరాధన యొక్క మా ఆచరణలు, మా సంఘము, మా భార్యా పిల్లలకు మేము రుణపడియున్న పవిత్రమైన ఆధారము ద్వారా, మమ్ములను మా భూములకు, మా దేశమునకు బద్దులుగా చేయు ఆ స్వేచ్ఛ ద్వారా మరియు మా సమస్త సంతోషమునకు కారణమైయున్న ఆ దేవుని పవిత్ర వాక్యమును మేము సంరక్షించుట ద్వారా, మాకు అతి ప్రియమైన దానియంతటి ద్వారా, మేము మీ మీద అధికారమును సంపాదించునట్లు మా చేతులను బలపరచిన ఆ సర్వశక్తిమంతుడైన దేవుని నామమందు నేను నిన్ను ఆజ్ఞాపించుచున్నాను—

6 అంతయు ఇదియే కాదు; మీరు మీ యుద్ధ ఆయుధములను మాకు అప్పగించి వేయవలెనని, జీవించుటకు మీరు కలిగియున్న సమస్త కోరికలను బట్టి నేను మిమ్ములను ఆజ్ఞాపించుచున్నాను మరియు మేము మీ రక్తము చిందించుటను కోరము, కానీ మీరు మీ దారిన వెళ్ళి, మాకు వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు తిరిగిరాని యెడల మీ ప్రాణములను మేము విడిచిపెట్టెదము.

7 ఇప్పుడు మీరు దీనిని చేయని యెడల, ఇదిగో మీరు మా చేతులలో ఉన్నారు మరియు మీ పైన పడి, మీరు నశించిపోవునట్లు మీ శరీరములయందు మరణపు గాయములు చేయునట్లు నేను నా మనుష్యులను ఆజ్ఞాపించెదను; అప్పుడు, ఈ జనులపై ఎవరు అధికారము కలిగియుండెదరో, ఎవరు దాస్యములోనికి తేబడెదరో మేము చూచెదము.

8 ఇప్పుడు జరహేమ్న ఈ మాటలను వినినప్పుడు, అతడు ముందుకు వచ్చి అతని ఖడ్గమును, వంపు కత్తిని మరియు విల్లును మొరోనై చేతులలోనికి అప్పగించివేసి అతనితో ఇట్లు చెప్పెను: ఇదిగో మా యుద్ధ ఆయుధములు ఇక్కడున్నవి; మేము వాటిని మీకు అప్పగించి వేసెదము, కానీ మీతో ప్రమాణము చేయుటకు మేము సమ్మతించము, దానిని మేము మరియు మా పిల్లలు కూడా మీరెదమని మేమెరుగుదుము; కావున మా యుద్ధ ఆయుధములను తీసుకొని, మేము అరణ్యములోనికి వెడలిపోవునట్లు అనుమతించుము; లేని యెడల, మేము మా ఖడ్గములను ఉంచుకొని నశించెదము లేదా జయించెదము.

9 ఇదిగో మేము మీ విశ్వాసమునకు చెందినవారము కాము; మమ్ములను మీ చేతులకు అప్పగించినది దేవుడేనని మేము విశ్వసించము; కానీ మిమ్ములను మా ఖడ్గముల నుండి కాపాడినది మీ జిత్తులమారితనము అని మేము విశ్వసించుచున్నాము. మిమ్ములను కాపాడినది మీ వక్షస్థల కవచములు మరియు మీ డాలులైయున్నవి.

10 ఇప్పుడు జరహేమ్న ఈ మాటలు పలుకుటను ముగించినప్పుడు, ఇట్లనుచూ మొరోనై తాను అందుకొనిన ఖడ్గమును మరియు యుద్ధ ఆయుధములను జరహేమ్నకు తిరిగి ఇచ్చివేసెను: ఇదిగో, మనము పోరు ముగించెదము.

11 ఇప్పుడు నేను పలికిన మాటలను నేను వెనుకకు తీసుకొనలేను, కావున ప్రభువు జీవము తోడు, మాకు వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు మీరు తిరిగిరారని ప్రమాణము చేయని యెడల మీరు వెడలిపోలేరు. మీరు మా చేతులలో ఉన్నందున మేము ఈ నేలపై మీ రక్తమును చిందించెదము, లేదా నేను ప్రతిపాదించిన షరుతులకు మీరు లోబడవలెను.

12 ఇప్పుడు మొరోనై ఈ మాటలను చెప్పినప్పుడు, జరహేమ్న తన ఖడ్గమును ఉంచుకొనెను. అతడు మొరోనైతో కోపముగానుండి, అతడిని సంహరించునట్లు ముందుకు వచ్చెను; కానీ అతడు తన ఖడ్గమును ఎత్తినంతనే మొరోనై సైనికులలో ఒకడు దానిని నేలకు కొట్టెను మరియు అది పిడివద్ద విరిగెను; అతడు జరహేమ్న తలపై కొట్టగా, చర్మముతో పాటు వెంట్రుకలు నేలపై పడెను. అప్పుడు జరహేమ్న వారి యెదుటనుండి తన సైనికుల మధ్యకు పారిపోయెను.

13 ప్రక్కన నిలబడి జరహేమ్న తల పైభాగమును కొట్టివేసిన ఆ సైనికుడు దానిని జుట్టుతోపాటు పైకెత్తి తన ఖడ్గము యొక్క మొనపై ఉంచి, బిగ్గరగా ఇట్లు చెప్పుచూ దానిని వారి ముందుకు చాచెను:

14 మీ యుద్ధ ఆయుధములను అప్పగించివేసి ఒక శాంతి నిబంధనతో వెడలిపోని యెడల, మీ నాయకుని తలమీది చర్మము నేలపై పడినట్లుగా మీరు కూడా నేల కూలెదరు.

15 ఇప్పుడు ఈ మాటలు విని, ఖడ్గముపై ఉన్న తలమీది చర్మమును చూచినపుడు భయభ్రాంతులైనవారు అక్కడ అనేకులు ఉండిరి; అనేకులు ముందుకు వచ్చి, వారి యుద్ధ ఆయుధములను మొరోనై పాదముల వద్ద పడవేసి శాంతి నిబంధనలోనికి ప్రవేశించిరి. మరియు నిబంధనలోనికి ప్రవేశించిన వారందరు అరణ్యములోనికి వెడలిపోవుటకు వారు అనుమతించిరి.

16 అంతట జరహేమ్న మిక్కిలి కోపముగానుండి అతని సైనికులలో మిగిలిన వారిని నీఫైయులకు వ్యతిరేకముగా అధిక శక్తితో పోరాడునట్లు కోపమునకు పురిగొల్పెను.

17 లేమనీయుల మొండితనమును బట్టి మొరోనై కోపముగానుండెను; కావున వారిపై పడి, వారిని సంహరించవలెనని అతడు తన జనులను ఆజ్ఞాపించగా, వారు వారిని సంహరించసాగిరి మరియు లేమనీయులు వారి ఖడ్గములతో బలముగా పోరాడిరి.

18 కానీ వారి దిగంబర చర్మములు మరియు వారి బోడి తలలు నీఫైయుల యొక్క పదునైన ఖడ్గములకు గురి చేయబడెను; వారు పొడువబడి, కొట్టబడి, నీఫైయుల ఖడ్గముల చేత మిక్కిలి వేగముగా కూలిరి మరియు మొరోనై యొక్క సైనికుడు ప్రవచించినట్లుగా వారు తుడిచిపెట్టబడసాగిరి.

19 ఇప్పుడు వారందరు నాశనము చేయబడబోవుచున్నారని చూచినపుడు, మిగిలిన వారి ప్రాణములను విడిచిపెట్టిన యెడల అతడు మరియు అతని జనులు కూడా వారితో నిబంధన చేయుదురని, వారికి వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు ఎన్నడూ తిరిగిరారని వాగ్దానము చేయుచూ జరహేమ్న మొరోనైని వేడుకొనెను.

20 అప్పుడు జనుల మధ్య మారణకాండ తిరిగి ఆగిపోవునట్లు మొరోనై చేసెను. అతడు లేమనీయులనుండి యుద్ధ ఆయుధములను తీసుకొనెను; వారు అతనితో శాంతి నిబంధనలోనికి ప్రవేశించిన తరువాత, వారు అరణ్యములోనికి వెడలిపోవుటకు అనుమతించబడిరి.

21 ఇప్పుడు వారి మృతులు అధిక సంఖ్యాకులైనందున వారు లెక్కింపబడలేదు; నీఫైయులు మరియు లేమనీయులలో ఇరువైపులా మరణించిన వారి సంఖ్య బహు గొప్పదైయుండెను.

22 వారు తమ మృతులను సీదోను యొక్క జలములలోనికి పడవేయగా, వారు ముందుకు వెళ్ళి సముద్రపు లోతులలో పాతిపెట్టబడిరి.

23 మొరోనై లేదా నీఫైయుల యొక్క సైన్యములు మరలా వారి గృహములకు మరియు వారి స్థలములకు తిరిగి వచ్చిరి.

24 ఆ విధముగా నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క పదునెనిమిదవ సంవత్సరము ముగిసెను. మరియు ఆ విధముగా నీఫై పలకలపై వ్రాయబడిన ఆల్మా యొక్క వృత్తాంతము ముగిసెను.

ముద్రించు