లేఖనములు
ఆల్మా 60


60వ అధ్యాయము

సైన్యముల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యమును గూర్చి మొరోనై పహోరన్‌కు ఫిర్యాదు చేయును—నీతిమంతులు సంహరించబడుటను ప్రభువు అనుమతించును—తమ శత్రువుల నుండి తమనుతాము విడిపించుకొనుటకు నీఫైయులు వారి సమస్త శక్తి సామర్థ్యములను వినియోగించవలెను—అతని సైన్యములకు సహాయము అందించని యెడల, ప్రభుత్వమునకు వ్యతిరేకముగా యుద్ధము చేయుదునని మొరోనై బెదిరించును. సుమారు క్రీ. పూ. 62 సం.

1 దేశము యొక్క పరిపాలకుడైన పహోరన్‌కు అతడు మరలా వ్రాసెను మరియు అతడు వ్రాసిన మాటలు ఇవే: ఇదిగో జరహేమ్లలో ఉన్న ప్రధాన న్యాయాధిపతి, దేశముపై పరిపాలకుడైన పహోరన్‌కు మరియు పరిపాలించి, ఈ యుద్ధ వ్యవహారములను నిర్వహించుటకు ఈ జనులచేత ఎన్నుకొనబడిన వారందరికీ కూడా నా లేఖను నేను ఉద్దేశించుచున్నాను.

2 ఇదిగో, వారిని ఖండించు రీతిలో నేను కొంత చెప్పదలిచాను; ఏలయనగా, మనుష్యులను సమకూర్చి ఖడ్గములు, వంపు కత్తులు, సకల విధముల యుద్ధ ఆయుధములను వారికి ధరింపజేయుటకు మరియు లేమనీయులు మన దేశములోనికి వచ్చు ఏ భాగములలోకైనను వారికి వ్యతిరేకముగా జనులను పంపుటకు మీరు నియమింపబడియున్నారని మీకు మీరే ఎరుగుదురు.

3 ఇప్పుడు నేను, నా మనుష్యులు మరియు హీలమన్‌, అతని మనుష్యులు కూడా అత్యధిక శ్రమలను, ముఖ్యముగా ఆకలి, దాహము, అలసట మరియు సకల విధములైన బాధలను అనుభవించియున్నామని నేను మీకు చెప్పుచున్నాను.

4 అయితే, మేము అనుభవించినదంతయు ఇదియే అయిన యెడల, మేము సణుగము లేదా ఫిర్యాదు చేయము.

5 కానీ మన జనుల మధ్య గొప్ప సంహారము జరిగియుండెను; వేలమంది ఖడ్గము చేత కూలిరి, మన సైన్యములకు తగినంత బలమును, సహాయమును మీరు పంపియుండిన యెడల పరిస్థితి భిన్నముగా ఉండెడిది. మా యెడల మీ నిర్లక్ష్యము అధికముగానున్నది.

6 ఇదిగో, ఈ అత్యంత నిర్లక్ష్యమునకు కారణమును తెలుసుకొనుటకు మేము కోరుచున్నాము; మీ అనాలోచిత స్థితికి గల కారణమును మేము తెలుసుకొనగోరుచున్నాము.

7 మీ శత్రువులు మీ చుట్టూ మారణకాండ జరిగించుచుండగా, అనాలోచిత స్తబ్దతయందు మీరు మీ సింహాసనములపై కూర్చొనుటను యోచించగలరా? మీ సహోదరులు—

8 అనగా రక్షణ కొరకు మీపై ఆధారపడిన వారు, వారికి సహాయము చేయగల స్థితిలో మిమ్ములను ఉంచినవారు—వారిలో వేలమందిని శత్రువులు సంహరించుచుండగా, వారిని బలపరిచి, ఖడ్గము చేత కూలకుండా వారిలో వేలమందిని రక్షించుటకు మీరు వారి కొరకు సైన్యములను పంపియుండవచ్చు.

9 కానీ అంతయు ఇదియే కాదు—మీరు వారి నుండి మీ ఆహార సామాగ్రులను ఉపసంహరించియున్నారు, ఎంతగాననగా ఈ జనుల క్షేమము నిమిత్తము వారు కలిగియున్న గొప్ప కోరికలను బట్టి అనేకులు పోరాడిరి మరియు రక్తము చిందించి ప్రాణములర్పించిరి; వారి యెడల మీ అత్యంత నిర్లక్ష్యమును బట్టి వారు ఆకలితో నశించిపోవుటకు సిద్ధముగా ఉన్నప్పుడు వారు దీనిని చేసిరి.

10 ఇప్పుడు నా ప్రియమైన సహోదరులారా—ఏలయనగా మీరు ప్రియులైయుండవలెను. ఈ జనుల క్షేమ స్వాతంత్ర్యముల నిమిత్తము మిమ్ములను మీరు అధిక శ్రద్ధతో పురిగొల్పుకొనవలసియుండెను. కానీ, మీరు వారిని ఎంతగా నిర్లక్ష్యము చేసిరనగా వేలమంది యొక్క రక్తము ప్రతీకారము తీర్చుకొనుటకు మీపైకి వచ్చును; ఏలయనగా వారి మొరలు, వారి బాధలన్నియు దేవునికి తెలియును—

11 ఇదిగో మీరు, మీ సింహాసనములపై కూర్చుండగలరని మరియు దేవుని యొక్క అధికమైన మంచితనమును బట్టి మీరేమి చేయకున్నను ఆయన మిమ్ములను విడిపించునని మీరు తలంచుచున్నారా? మీరట్లు తలంచిన యెడల మీరు వ్యర్థముగా తలంచియున్నారు.

12 మీ సహోదరులలో అంత ఎక్కువమంది చంపబడుట వారి దుర్మార్గమును బట్టియని మీరు తలంచుచున్నారా? నేను మీతో చెప్పుచున్నాను, మీరట్లు తలంచిన యెడల మీరు వ్యర్థముగా తలంచియున్నారు; ఏలయనగా ఖడ్గము చేత కూలిన వారు అనేకులున్నారని నేను మీతో చెప్పుచున్నాను; ఇదిగో ఇది మీ శిక్షావిధికైయున్నది.

13 ఏలయనగా ఆయన న్యాయము మరియు తీర్పు దుష్టులపై వచ్చునట్లు నీతిమంతులు సంహరింపబడుటను ప్రభువు అనుమతించును; కావున వారు సంహరింపబడినందున నీతిమంతులు తప్పిపోయిరని మీరు తలంచనవసరము లేదు; కానీ ఇదిగో, వారు ప్రభువైన వారి దేవుని యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించెదరు.

14 ఇప్పుడు నేను మీతో చెప్పుచున్నాను, మితిమీరిన వారి సోమరితనము వలన, మన ప్రభుత్వము యొక్క సోమరితనము వలన మరియు వారి సహోదరుల యెడల, అనగా సంహరింపబడిన వారి యెడల వారి అత్యంత నిర్లక్ష్యమును బట్టి దేవుని తీర్పులు ఈ జనులపై వచ్చునని నేను మిక్కిలిగా భయపడుచున్నాను.

15 ఏలయనగా మొదట మన నాయకుల వద్ద దుష్టత్వము మొదలుకాని యెడల, వారు మనపై ఏ అధికారము సంపాదించకయుండునట్లు మన శత్రువులను మనము ఎదుర్కొనియుండేవారము.

16 మన మధ్య లేచిన యుద్ధము కొరకైయుండని యెడల; మన మధ్య అంత అధికమైన రక్తపాతమును కలుగజేసిన ఈ రాజు-మనుష్యుల కొరకు కాని యెడల; మనలో మనము పోరాడుచుండిన సమయమున, మనము ఇంతవరకు చేసియున్నట్టుగా మన శక్తిని మనము ఏకము చేసికొనియుండిన యెడల, మన మీద ఆ రాజు-మనుష్యులు కలిగిన శక్తి మరియు అధికారము యొక్క కోరికను బట్టి కాని యెడల, మన మధ్య అంత ఎక్కువ రక్తపాతమునకు కారణమై మనకు వ్యతిరేకముగా వారి ఖడ్గములను పైకి ఎత్తుటకు బదులుగా మన స్వాతంత్ర్యము యొక్క ఉద్దేశ్యమునకు యథార్థముగా ఉండి, మనతో ఏకమై మన శత్రువులకు వ్యతిరేకముగా ముందుకు వెళ్ళిన యెడల, మనము ప్రభువు యొక్క బలమందు వారికి వ్యతిరేకముగా ముందుకు వెళ్ళియుండిన యెడల మన శత్రువులను మనము చెదరగొట్టి యుండేవారము. ఏలయనగా ఆయన వాక్యము యొక్క నెరవేర్పు ప్రకారము అది జరిగియుండెడిది.

17 కానీ ఇప్పుడు లేమనీయులు మనపైకి వచ్చుచున్నారు, మన దేశములను స్వాధీనపరచు కొనుచున్నారు; వారు మన జనులను, అంతేకాకకుండా మన స్త్రీలను, పిల్లలను ఖడ్గము చేత హత్య చేయుచున్నారు; వారిని బందీలుగా మోసుకొనిపోవుచున్నారు, వారు అన్ని విధములైన శ్రమలను అనుభవించునట్లు చేయుచున్నారు; ఇది శక్తి మరియు అధికారమును కోరుచున్న ఆ రాజు-మనుష్యుల యొక్క గొప్ప దుష్టత్వమును బట్టియైయున్నది.

18 కానీ ఈ విషయమును గూర్చి నేనెందుకింతగా చెప్పవలెను? ఏలయనగా, మీరు అధికారమును కోరుచున్నారేమో మేమెరుగము. మీరు దేశద్రోహులేమో కూడా మేమెరుగము.

19 లేక మీరు మమ్ములను నిర్లక్ష్యము చేయుటకు మరియు మాకు ఆహారమును, మా సైన్యములను బలపరచుటకు మనుష్యులను పంపకయుండుటకు కారణము—మీరు దేశము మధ్యలో ఉండి సురక్షితముగా ఉండుటయేనా?

20 ప్రభువైన మీ దేవుని ఆజ్ఞలను మీరు మరచియున్నారా? మన పితరుల దాస్యమును మీరు మరచియున్నారా? మన శత్రువుల చేతులలో నుండి మనము విడిపించబడిన అనేక సమయములను మీరు మరచియున్నారా?

21 లేక మనము మన సింహాసనములపై కూర్చొని, ప్రభువు మనకొరకు అనుగ్రహించిన సాధనములను ఉపయోగించకపోయినను ప్రభువు ఇంకను మనలను విడిపించునని మీరు తలంచుచున్నారా?

22 దేశ సరిహద్దులయందు వేలమంది ఖడ్గము చేత కూలుచు గాయపడి రక్తము చిందించుచుండగా, సోమరితనమందు కూర్చున్న వేలమంది మరియు పదుల వేలమందితో మీరు చుట్టబడియుండి మీరును సోమరితనమందు కూర్చొందురా?

23 మీరు కదలకుండా కూర్చొని ఈ సంగతులను చూచిన యెడల, దేవుడు మిమ్ములను నిర్దోషులుగా చూచునని మీరు తలంచుచున్నారా? కాదు, అని నేను మీతో చెప్పుచున్నాను. పాత్ర లోపల మొదట శుద్ధి చేయబడవలెనని, అప్పుడు పాత్ర వెలుపల కూడా శుద్ధి చేయబడునని దేవుడు చెప్పియున్నాడని మీరిప్పుడు జ్ఞాపకము చేసుకొనవలెనని నేను కోరుదును.

24 ఇప్పుడు మీరు చేసిన దానిని గూర్చి మీరు పశ్చాత్తాపపడి, లేచి ఏదైనా చేయుటకు మొదలుపెట్టి, హీలమన్‌ తిరిగి సంపాదించిన మన దేశము యొక్క ఆ భాగములకు అతడు సహాయపడునట్లు మరియు ఈ భాగములలో మన స్వాధీనముల శేషమును మేము తిరిగి సంపాదించునట్లు కూడా మాకు మరియు హీలమన్‌కు ఆహారమును, మనుష్యులను పంపని యెడల, ఇదిగో మేము మొదట మన లోపలి పాత్రను, ముఖ్యముగా మన ప్రభుత్వాధికారులను శుద్ధి చేయువరకు లేమనీయులతో ఇకపై పోరాడుట ప్రయోజనకరము కాదు.

25 మీరు నా లేఖను అనుగ్రహించి, బయటకు వచ్చి స్వాతంత్ర్యము యొక్క సత్యమైన ఆత్మను నాకు చూపి, మా సైన్యములను బలపరచి, మద్దతిచ్చుటకు ప్రయత్నించి, వారి సహాయము నిమిత్తము వారికి ఆహారమును అనుగ్రహించని యెడల, ఇదిగో మన దేశము యొక్క ఈ భాగమును కాపాడుటకు నా స్వతంత్ర మనుష్యులలో ఒక భాగమును నేను వదిలిపెట్టి, వారిపై ఏ ఇతర శక్తి పనిచేయకుండునట్లు దేవుని బలము మరియు ఆశీర్వాదములను వారికిచ్చెదను—

26 వారి శ్రమల యందు వారి అధికమైన విశ్వాసము మరియు వారి సహనమును బట్టియే దీనిని చేయుదును—

27 మరియు నేను మీ యొద్దకు వచ్చి, స్వాతంత్ర్యము కొరకు కోరిక కలిగిన వాడెవడైనను మీ మధ్య ఉన్న యెడల, అక్కడ స్వాతంత్ర్యము యొక్క ఒక కణమైనను నిలిచియుండిన యెడల, ఇదిగో శక్తి మరియు అధికారమును లాగుకొనుటకు కోరికలు కలిగిన వారు పూర్తిగా నాశనమగువరకు మీ మధ్య తిరుగుబాటులను నేను పురిగొల్పెదను.

28 నేను మీ శక్తికి లేదా మీ అధికారమునకు భయపడను, కానీ నేను భయపడునది నా దేవునికే; నా దేశము యొక్క ఉద్యమమును కాపాడుటకు నేను నా ఖడ్గమును ఎత్తునది కూడా ఆయన ఆజ్ఞలను బట్టియైయున్నది మరియు మేము అంత అధికమైన నష్టమును అనుభవించినది మీ దుర్నీతి నిమిత్తమైయున్నది.

29 ఇదిగో సమయమిదే, మీ దేశము మరియు మీ చిన్నపిల్లల యొక్క రక్షణయందు మిమ్ములను మీరు పురిగొల్పుకొనని యెడల, న్యాయపు ఖడ్గము మీపై వ్రేలాడు సమయము ఆసన్నమైనది; అది మీపై పడి, మిమ్ములను పూర్తిగా నాశనము చేయును.

30 మీ నుండి సహాయము కొరకు నేను వేచియున్నాను; మీరు మాకు సహాయము చేయని యెడల, ఇదిగో నేను జరహేమ్ల దేశములోనికి మీ యొద్దకు వచ్చి, మన స్వాతంత్ర్యము యొక్క ఉద్దేశ్యమందు ఈ జనుల యొక్క అభివృద్ధిని అదుపుచేయుటకు మీకిక ఏ మాత్రము శక్తి లేకుండునట్లు ఖడ్గముతో మిమ్ములను సంహరించెదను.

31 ఏలయనగా, నీతిమంతులైన తన జనులను నాశనము చేయుటకు మీరు జీవించియుండి, మీ దుర్ణీతులయందు బలముగా ఎదుగుటను ప్రభువు అనుమతించడు.

32 ఇదిగో కీర్తి మరియు లోకము యొక్క వ్యర్థమైన వస్తువులపై మీ ప్రేమయే మీ దుర్నీతికి కారణమైయుండగా, వారికి ద్వేషమును కలుగజేసినది వారి పితరుల యొక్క పారంపర్యాచారమైయుండి, మన నుండి అసమ్మతితో విడిపోయిన వారి చేత అది రెండింతలు చేయబడినప్పుడు, ప్రభువు మిమ్ములను విడిచిపెట్టి లేమనీయులకు వ్యతిరేకముగా తీర్పు తీర్చుటకు వచ్చునని మీరు తలంచగలరా?

33 మీరు దేవుని చట్టములను అతిక్రమించిరని మీరెరుగుదురు మరియు వాటిని మీ పాదముల క్రింద త్రొక్కివేసితిరని మీరెరుగుదురు. ఇదిగో, ప్రభువు నాకిట్లు సెలవిచ్చుచున్నాడు: మీరు మీ పరిపాలకులుగా నియమించిన వారు తమ పాపములు మరియు దుర్ణీతుల విషయమై పశ్చాత్తాపపడని యెడల, మీరు వారిపై యుద్ధమునకు వెళ్ళవలెను.

34 ఇప్పుడు ఇదిగో మొరోనై అను నేను, నేను చేసిన నిబంధన ప్రకారము నా దేవుని ఆజ్ఞలు పాటించుటకు బద్దుడనైయున్నాను. కావున మీరు దేవుని వాక్యమునకు లోబడియుండవలెనని, నా యొద్దకు మరియు హీలమన్‌ యొద్దకు మీ ఆహారసామాగ్రులను, మీ మనుష్యులను వెంటనే పంపవలెనని నేను కోరుచున్నాను.

35 మీరు దీనిని చేయని యెడల నేను మీ వద్దకు వేగముగా వచ్చెదను; ఏలయనగా మేము ఆకలితో నశించుటను దేవుడు అనుమతించడు; కావున ఖడ్గము చేతనయినా సరే, ఆయన మీ ఆహారమును మాకిచ్చును. ఇప్పుడు మీరు దేవుని వాక్యమును నెరవేర్చునట్లు చూచుకొనుడి.

36 ఇదిగో నేను మీ ప్రధాన అధికారినైన మొరోనైని. నేను అధికారమును కోరుట లేదు, కాని దానిని కూల్చుటకు కోరుచున్నాను. నేను లోక మర్యాదను కోరుటలేదు, కానీ నా దేవుని మహిమను, నా దేశము యొక్క క్షేమ స్వాతంత్ర్యములను కోరుచున్నాను. ఇంతటితో నేను నా లేఖను ముగించెదను.

ముద్రించు