లేఖనములు
ఆల్మా 49


49వ అధ్యాయము

దండెత్తి వచ్చిన లేమనీయులు బలపరచబడిన అమ్మోనైహా మరియు నోవాహ్ పట్టణములను ఆక్రమించలేకపోయిరి—అమలిక్యా దేవుడిని శపించి, మొరోనై రక్తము త్రాగెదనని ఒట్టు పెట్టుకొనును—హీలమన్‌ మరియు అతని సహోదరులు సంఘమును బలపరచుట కొనసాగించెదరు. సుమారు క్రీ. పూ. 72 సం.

1 ఇప్పుడు పంతొమ్మిదవ సంవత్సరము యొక్క పదకొండవ నెల యందు, నెల యొక్క పదవ దినమందు లేమనీయుల సైన్యములు అమ్మోనైహా దేశమును సమీపించుచు కనబడెను.

2 ఆ పట్టణము తిరిగి కట్టబడియుండెను మరియు పట్టణము యొక్క సరిహద్దుల వెంబడి మొరోనై ఒక సైన్యమును నిలిపెను, వారు లేమనీయుల బాణములు మరియు రాళ్ళ నుండి తమను కాపాడుకొనుటకు చుట్టూ మట్టిగట్టులు వేసుకొనియుండిరి; ఏలయనగా వారు బాణములతోను, రాళ్ళతోను పోరాడిరి.

3 ఇదిగో అమ్మోనైహా పట్టణము తిరిగి కట్టబడినదని నేను చెప్పితిని. అవును, దానిలో కొంత భాగము తిరిగి కట్టబడినదని నేను మీతో చెప్పుచున్నాను; జనుల దుర్నీతిని బట్టి లేమనీయులు దానిని ఒకసారి నాశనము చేసియున్నందున, మరలా అది వారికి సులభమైన గురియగునని వారు తలంచిరి.

4 కానీ, వారు మిక్కిలి నిరాశ చెందిరి; ఏలయనగా నీఫైయులు చుట్టూ త్రవ్వి మట్టితో ఎత్తుగా ఒక గట్టును కట్టియుండిరి, ఎంతగాననగా వారికి తగులునట్లుగా లేమనీయులు తమ రాళ్ళను, బాణములను వేయలేకపోయిరి, లేదా వారి ప్రవేశద్వారము గుండా తప్ప వారిపై దాడి చేయుటకు రాలేకపోయిరి.

5 ఇప్పుడు, వారి రక్షణ స్థలములను సిద్ధపరచుకొనుటలో నీఫైయుల తెలివిని బట్టి ఈ సమయమున లేమనీయుల ప్రధాన అధికారులు మిక్కిలి ఆశ్చర్యపడిరి.

6 వారు బహు సంఖ్యాకులైనందున, ఇదివరకు చేసియున్నట్లుగా వారిపై దాడి చేయగలమని లేమనీయుల నాయకులు తలంచిరి; వారు డాలులతో మరియు వక్షస్థల కవచములతో తమనుతాము సిద్ధము చేసుకొనిరి; వారు చర్మపు వస్త్రములతో అనగా వారి దిగంబరత్వమును కప్పుకొనుటకు అత్యంత మందమైన వస్త్రములతో తమనుతాము సిద్ధము చేసుకొనిరి.

7 ఆ విధముగా సిద్ధపడి వారు తమ సహోదరులను సులభముగా జయించి, వారిని దాస్యపు కాడి క్రిందికి తేగలరని లేదా వారి చిత్తానుసారము వారిని సంహరించి, చిత్రవధ చేయగలరని తలంచిరి.

8 కానీ, లీహై సంతానము మధ్య ఎన్నడూ తెలియబడని విధములో నీఫైయులు వారి కొరకు సిద్ధపడియుండుటను చూచి వారు మిక్కిలి ఆశ్చర్యపడిరి. వారు మొరోనై యొక్క ఆజ్ఞల ప్రకారము లేమనీయులతో యుద్ధము చేయుటకు సిద్ధముగానుండిరి.

9 మరియు లేమనీయులు లేదా అమలిక్యాయులు వారి యుద్ధ సన్నాహములు చూచి అత్యంత ఆశ్చర్యపడిరి.

10 ఇప్పుడు నీఫై దేశమునుండి అతని సైన్యమునకు ప్రతినిధిగా రాజైన అమలిక్యా వచ్చియున్న యెడల, బహుశా అమ్మోనైహా పట్టణము వద్ద నీఫైయులపై లేమనీయులు దాడి చేయునట్లు అతడు చేసియుండేవాడు; ఏలయనగా అతడు, తన జనుల ప్రాణములను లక్ష్యపెట్టలేదు.

11 కానీ అమలిక్యా యుద్ధము చేయుటకు రాలేదు. అతని ప్రధాన అధికారులు అమ్మోనైహా పట్టణము వద్ద నీఫైయులపై దాడి చేయుటకు ధైర్యము చేయలేదు, ఏలయనగా నీఫైయుల ఆశ్రయ స్థలములను బట్టి వారు నిరాశ చెంది, వారిపై దాడి చేయలేకపోవునంతగా నీఫైయుల మధ్య వ్యవహారముల నిర్వహణను మొరోనై మార్చివేసెను.

12 కావున, వారు అరణ్యములోనికి పారిపోయిరి మరియు వారి దండును తీసుకొని, నీఫైయులకు వ్యతిరేకముగా దాడిచేయుటకు వారి కొరకు రెండవ శ్రేష్ఠమైన స్థలమైయుండునని తలంచుచు నోవాహ్ దేశము వైపు నడిచిరి.

13 ఏలయనగా, చుట్టూ ఉన్న దేశమంతటా మొరోనై ప్రతి పట్టణమును బలపరిచెనని లేదా రక్షణ దుర్గములను కట్టించెనని వారు ఎరుగకుండిరి; కావున వారు, దృఢనిశ్చయముతో నోవాహ్ దేశము వైపు నడిచిరి; అంతేకాక వారి ప్రధాన అధికారులు ముందుకు వచ్చి, ఆ పట్టణవాసులను నాశనము చేయుదుమని ఒట్టు పెట్టుకొనిరి.

14 కానీ, వారు ఆశ్చర్యపడునట్లు ఇప్పటివరకు బలహీనముగానున్న నోవాహ్ పట్టణము మొరోనై కారణముగా అమ్మోనైహా పట్టణమును మించి బలమైనదాయెను.

15 ఇప్పుడిది మొరోనై చేసిన తెలివైన పనియైయున్నది; ఏలయనగా వారు అమ్మోనైహా పట్టణము వద్ద భయభ్రాంతులగుదురని మరియు నోవాహ్ పట్టణము ఇంతవరకు దేశము యొక్క బలహీనమైన భాగముగా ఉన్నందున, వారు యుద్ధము చేయుటకు అక్కడకు వచ్చెదరని అతడు తలంచెను మరియు అతడు కోరుకున్న ప్రకారమే జరిగెను.

16 మొరోనై ఆ పట్టణవాసులపై లీహైని ప్రధాన అధికారిగా నియమించెను; సీదోను నదికి తూర్పున ఉన్న లోయలో లేమనీయులతో యుద్ధము చేసిన లీహై ఇతడే.

17 ఇప్పుడు లీహై ఆ పట్టణమును పర్యవేక్షించుచున్నాడని లేమనీయులు కనుగొనినప్పుడు, వారు మరలా నిరాశ చెందిరి, ఏలయనగా లీహైని గూర్చి వారు మిక్కిలిగా భయపడిరి; అయినను వారి ప్రధాన అధికారులు పట్టణముపై దాడిచేయుటకు ఒట్టు పెట్టుకొనియున్నందున, వారు తమ సైన్యములను తీసుకొని వచ్చిరి.

18 కట్టబడియున్న ఎత్తైన గట్టు, చుట్టూ త్రవ్వబడియున్న లోతైన కందకములను బట్టి ప్రవేశద్వారము గుండా తప్ప మరేదారిలో వారి రక్షణ దుర్గములలోనికి లేమనీయులు ప్రవేశించలేకపోయిరి.

19 ఆ విధముగా ఇతర మార్గము ద్వారా కోటలో ప్రవేశించుటకు ప్రయత్నించు వారందరిపై రాళ్ళు మరియు బాణములు వేయుట ద్వారా వారిని నాశనము చేయుటకు నీఫైయులు సిద్ధపడియుండిరి.

20 ఆ విధముగా ప్రవేశద్వారము గుండా వారి రక్షణస్థలములోనికి వచ్చుటకు ప్రయత్నించు వారందరినీ కొట్టివేయుటకు వారి బలమైన మనుష్యులలో ఒక భాగము తమ ఖడ్గములతో, వడిసెలతో సిద్ధముగానుండెను; ఆ విధముగా లేమనీయులకు వ్యతిరేకముగా తమను కాపాడుకొనుటకు వారు సిద్ధముగానుండిరి.

21 లేమనీయుల అధికారులు తమ సైన్యములను ప్రవేశద్వారము యెదుటికి తెచ్చి, వారి రక్షణస్థలములోనికి వెళ్ళుటకు నీఫైయులతో పోరాడసాగిరి. కానీ, వారు ఎప్పటికప్పుడు వెనుకకు తరుమబడి, అమితమైన సంహారముతో సంహరింపబడిరి.

22 ఇప్పుడు ద్వారము గుండా నీఫైయులపై అధికారము సంపాదించలేకపోయిరని వారు కనుగొన్నప్పుడు, పోరాడుటకు సమాన అవకాశము కలిగియుండునట్లు, వారి సైన్యముల యొద్దకు వెళ్ళగలుగునట్లు వారు మట్టి గట్టులను త్రవ్వివేయనారంభించిరి; కానీ ఈ ప్రయత్నములలో వారి పైకి విసరబడిన రాళ్ళు మరియు బాణములచేత వారు కొట్టివేయబడిరి; మట్టి గట్టులను క్రిందకు కూల్చుట ద్వారా వారి కందకములను నింపుటకు బదులుగా వారి మృతులు మరియు క్షతగాత్రుల శరీరములతో అవి కొంత వరకు నింపబడెను.

23 ఆ విధముగా నీఫైయులు వారి శత్రువులపై సమస్త అధికారము కలిగియుండిరి; మరియు ఆ విధముగా వారి ప్రధాన అధికారులందరు సంహరింపబడు వరకు లేమనీయులు నీఫైయులను నాశనము చేయుటకు ప్రయత్నించిరి; మరొక ప్రక్క నీఫైయులలో ఒక్క ఆత్మయు సంహరింపబడకపోగా, లేమనీయులలో వేయిమంది కంటే అధికులు సంహరింపబడిరి.

24 ద్వారము గుండా లేమనీయుల యొక్క బాణములకు గురిచేయబడి, గాయపడిన వారు ఏబదిమంది అక్కడ ఉండిరి, వారి కాళ్ళపై తీవ్రమైన గాయములైనప్పటికీ వారు తమ డాలులు, వక్షస్థల కవచములు మరియు శిరస్త్రాణముల చేత కాపాడబడిరి.

25 ఇప్పుడు వారి ప్రధాన అధికారులందరు సంహరింపబడిరని లేమనీయులు చూచినప్పుడు, వారు అరణ్యములోనికి పారిపోయిరి. మరియు జన్మతః నీఫైయుడైన వారి రాజు అమలిక్యాకు వారికి జరిగిన గొప్ప నష్టమును గూర్చి తెలియజేయుటకు వారు నీఫై దేశమునకు తిరిగివెళ్ళిరి.

26 అతడు తన జనులతో మిక్కిలి కోపముగానుండెను, ఏలయనగా నీఫైయులపై అతని కోరికను అతడు సాధించలేకపోయెను; అతడు వారిని దాస్యపు కాడి క్రిందకు తీసుకురాలేకపోయెను.

27 అతడు మిక్కిలి కోపముగానుండి, దేవుడిని శపించి, మొరోనై రక్తము త్రాగెదనని ఒట్టు పెట్టుకొనెను; మరియు ఇది, తన జనుల క్షేమము కొరకు సిద్ధపడుటలో మొరోనై దేవుని ఆజ్ఞలను పాటించుటను బట్టియైయుండెను.

28 మరొక ప్రక్క వారి శత్రువుల చేతులలోనుండి వారిని విడిపించుటలో ఆయన సాటిలేని శక్తిని బట్టి, నీఫై జనులు ప్రభువైన వారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి.

29 ఆ విధముగా నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క పంతొమ్మిదవ సంవత్సరము ముగిసెను.

30 హీలమన్‌, షిబ్లోన్‌, కొరియాంటన్‌, అమ్మోన్ మరియు అతని సహోదరుల చేత, మరియు దేవుని యొక్క పరిశుద్ధ క్రమము ద్వారా నియమింపబడి, పశ్చాత్తాపము నిమిత్తము బాప్తిస్మము పొంది జనుల మధ్య బోధించుటకు పంపబడిన వారందరి చేత వారికి ప్రకటించబడిన దేవుని వాక్యమునకు వారిచ్చిన లక్ష్యము మరియు శ్రద్ధను బట్టి వారి మధ్య నిరంతర సమాధానముండెను మరియు సంఘమందు మిక్కిలి అభివృద్ధి జరిగెను.

ముద్రించు