57వ అధ్యాయము
అంతిపరా స్వాధీనము మరియు క్యుమెని అప్పగింత, తరువాత దాని సంరక్షణను గూర్చి హీలమన్ వివరించును—అతని అమ్మోనీయ యువకులు ధైర్యముగా యుద్ధము చేయుదురు; అందరు గాయపడుదురు, కానీ ఎవరూ సంహరింపబడరు—లేమనీయ బందీల యొక్క సంహారము మరియు పలాయనమును గిడ్ చెప్పును. సుమారు క్రీ. పూ. 63 సం.
1 ఇప్పుడు మేము తీసుకొనిన ఆ యుద్ధబందీలను నేను అప్పగించిన యెడల, అతడు అంతిపరా పట్టణమును మాకు అప్పగించునని చెప్పుచూ రాజైన అమ్మోరోన్ నుండి నేను ఒక లేఖను అందుకొంటిని.
2 కానీ మా బలము చేత అంతిపరా పట్టణమును స్వాధీనపరచుకొనుటకు మా సైన్యములు చాలునని మేము నిశ్చయముగా ఉంటిమని, పట్టణము కొరకు బందీలను అప్పగించుట ద్వారా మమ్ములను మేము తెలివిలేని వారిగా అనుకొనవలసినదని మరియు మేము మా బందీలను మార్పిడిపైన మాత్రమే అప్పగించెదమని నేను రాజుకు ఒక లేఖ పంపితిని.
3 అమ్మోరోన్ నా లేఖను తిరస్కరించెను, ఏలయనగా అతడు బందీలను మార్పిడి చేయకుండెను; కావున మేము అంతిపరా పట్టణముపై దాడిచేయుటకు ఏర్పాట్లు చేయసాగితిమి.
4 కానీ అంతిపరా జనులు పట్టణమును వదిలివేసి, వారి ఆధీనములోనున్న ఇతర పట్టణములను బలపరచుటకు పారిపోయిరి; ఆ విధముగా అంతిపరా పట్టణము మా స్వాధీనమాయెను.
5 ఆ విధముగా న్యాయాధిపతుల పరిపాలన యొక్క ఇరువది ఎనిమిదవ సంవత్సరము ముగిసెను.
6 ఇరువది తొమ్మిదవ సంవత్సరము యొక్క ప్రారంభమందు జరహేమ్ల దేశము నుండి మరియు చుట్టూ ఉన్న దేశమునుండి ఆహారసామాగ్రి యొక్క సరఫరాను మేము పొందితిమి మరియు రెండువేలమంది గల నా చిన్నపటాలమైన తమ సహోదరులతో చేరుటకు వచ్చిన అరువది మంది అమ్మోనీయ కుమారులకు అదనముగా ఆరు వేలమంది గల మా సైన్యమునకు మరికొంత సైన్యము చేర్చబడినది. మేము బలముగానుంటిమి మరియు మా కొరకు తేబడిన విస్తారమైన సామాగ్రులను కూడా కలిగియుంటిమి.
7 ఇప్పుడు క్యుమెని పట్టణమును రక్షించుటకు ఉంచబడిన సైన్యముతో యుద్ధము చేయుట మా కోరికయైయుండెను.
8 మరియు మేము త్వరలోనే మా కోరికను సఫలము చేసుకొంటిమని నేను నీకు చూపెదను; బలమైన మా సైన్యముతో లేదా బలమైన మా సైన్యము యొక్క ఒక భాగముతో రాత్రియందు వారు ఆహారసామాగ్రి యొక్క సరఫరాను అందుకొనుటకు కొంచెము ముందు క్యుమెని పట్టణమును మేము చుట్టుముట్టితిమి.
9 అనేక రాత్రులు పట్టణము చుట్టూ మేము బస చేసితిమి; కానీ లేమనీయులు రాత్రి యందు మాపై దాడిచేసి, మమ్ములను సంహరించకుండునట్లు మేము మా ఖడ్గములను ప్రక్కనే పెట్టుకొని నిద్రించితిమి మరియు కావలి వారిని ఉంచితిమి, ఏలయనగా వారు పలుమార్లు ఆ విధముగా దాడిచేయుటకు ప్రయత్నించిరి; వారు ప్రయత్నించిన ప్రతీసారి వారి రక్తము చిందించబడెను.
10 కొంతకాలానికి వారు ఆహారసామాగ్రితో రాత్రి సమయములో పట్టణమందు ప్రవేశించబోయిరి. కానీ, మేము లేమనీయులగుటకు బదులు నీఫైయులమైయుంటిమి; కావున మేము వారిని, వారి ఆహారసామాగ్రిని తీసుకొంటిమి.
11 ఈ విధముగా లేమనీయులకు సహాయము అందకుండా చేయబడినప్పటికీ, వారింకను పట్టణమును నిలుపుకొనుటకు నిర్ణయించుకొనిరి; కావున మేము ఆ ఆహారసామాగ్రులను తీసుకొని యూదయకు పంపుట మరియు మా బందీలను జరహేమ్ల దేశమునకు పంపుట అవసరమాయెను.
12 లేమనీయులు సహాయము పొందుటపై అన్ని ఆశలను వదలుకొనుటకు ఎంతోకాలము పట్టలేదు; కావున వారు పట్టణమును మా చేతులకు అప్పగించివేసిరి; ఆ విధముగా క్యుమెని పట్టణమును సంపాదించుట యందు మా ప్రణాళికలను మేము సాధించుకొంటిమి.
13 కానీ మా సైన్యము చాలా పెద్దదైనను మా బందీలు అధిక సంఖ్యాకులైయున్నందున వారిపై కావలికాయుటకు లేదా వారిని చంపుటకు మేము మా సైన్యమునంతటినీ ఉపయోగించవలసి వచ్చెను.
14 ఏలయనగా అధిక సంఖ్యలో పారిపోవుటకు వారు ప్రయత్నించెదరు మరియు రాళ్ళతోను, దుడ్డు కర్రలతోను లేదా వారి చేతులలోనికి వారు తీసుకొనగలిగిన ఏ వస్తువుతోనైనను పోరాడెదరు, ఎంతగాననగా వారు యుద్ధ బందీలుగా తమనుతాము అప్పగించుకొనిన తరువాత, వారిలో రెండువేల కంటే ఎక్కువమందిని మేము సంహరించితిమి.
15 కావున మేము వారి జీవితములను ముగించుట లేదా జరహేమ్ల దేశము వరకు చేతిలో ఖడ్గముతో వారిని కావలికాయుట మాకు అవసరమాయెను మరియు మేము లేమనీయుల నుండి తీసుకొన్నప్పటికీ, మా ఆహారసామాగ్రులు మా జనులకు సరిపోవునంత మాత్రమే ఉన్నవి.
16 అటువంటి క్లిష్ట పరిస్థితులలో ఈ యుద్ధ బందీలను గూర్చి నిర్ణయించుట అత్యంత గంభీరమైన విషయమాయెను; అయినప్పటికీ వారిని జరహేమ్ల దేశమునకు పంపుటకు మేము నిశ్చయించుకొంటిమి; కావున, మా మనుష్యులలో కొద్దిమందిని మేము ఎంపిక చేసి, మా బందీలను జరహేమ్ల దేశమునకు తీసుకువెళ్ళు బాధ్యతను వారికిచ్చితిమి.
17 కానీ, మరుసటి ఉదయమున వారు తిరిగి వచ్చిరి. మేము బందీలను గూర్చి వారిని ప్రశ్నించలేదు; ఏలయనగా లేమనీయులు మాపై దాడి చేసిరి మరియు వారికి స్వాధీనమగుటనుండి మమ్ములను రక్షించుటకు సరైన సమయమందు వారు తిరిగి వచ్చిరి. ఏలయనగా అమ్మోరోన్ వారి సహాయము కొరకు ఆహారసామాగ్రి యొక్క క్రొత్త సరఫరాను, బహు సంఖ్యాకమైన సైన్యమును పంపెను.
18 వారు మమ్ములను ఓడించబోవుచుండగా వారిని ఆపుటకు బందీలతోపాటు మేము పంపిన ఆ మనుష్యులు సరియైన సమయమందు వచ్చిరి.
19 కానీ నా రెండు వేల అరువది మంది యొక్క చిన్న పటాలము మిక్కిలి తెగింపుతో పోరాడెను; వారు లేమనీయుల యెదుట దృఢముగానుండి, వారిని ఎదిరించిన వారందరిని హతమార్చిరి.
20 మరియు మా సైన్యము యొక్క శేషము లేమనీయుల యెదుట వెనుకకు పోబోవుచుండగా, ఆ రెండు వేల అరువది మంది దృఢముగా, భయము లేకయుండిరి.
21 వారు ఆజ్ఞ యొక్క ప్రతి మాటకు ఖచ్చితముగా లోబడి, నెరవేర్చుచుండిరి; వారి విశ్వాసమును బట్టి అది వారికి చేయబడెను మరియు వారి తల్లులు వారికి బోధించిరని వారు నాకు చెప్పిన మాటలను నేను జ్ఞాపకము చేసుకొంటిని.
22 ఇప్పుడు మేము ఈ గొప్ప విజయము నిమిత్తము ఈ నా కుమారులకు మరియు బందీలను తీసుకొనిపోవుటకు ఎంపిక చేయబడిన ఆ మనుష్యులకు ఋణపడియున్నాము; ఏలయనగా వారు లేమనీయులను ఓడించిరి; కావున వారు మాంటై పట్టణము వరకు తరుమబడిరి.
23 మా క్యుమెని పట్టణమును మేము నిలుపుకొంటిమి మరియు ఖడ్గము చేత అందరూ నాశనము చేయబడనప్పటికీ మేము గొప్ప నష్టమును అనుభవించితిమి.
24 మరియు లేమనీయులు పారిపోయిన తరువాత, గాయపడిన నా మనుష్యులు మృతులలో నుండి తీయబడవలెనని నేను వెంటనే ఆజ్ఞలనిచ్చి, వారి గాయములకు కట్టు కట్టబడునట్లు చేసితిని.
25 రక్తము కోల్పోపోవుట వలన నా రెండువేల అరువది మందిలో రెండు వందలమంది స్పృహతప్పిరి; అయినప్పటికీ మేము బహుగా ఆశ్చర్యపడునట్లు, మా సైన్యమంతా సంతోషించునట్లు దేవుని మంచితనమును బట్టి వారిలో ఒక్క ఆత్మ కూడా నశించియుండలేదు; అదేవిధముగా అనేక గాయములు పొందని ఆత్మ ఒక్కటియు లేదు.
26 ఇప్పుడు వారు రక్షింపబడుట, ముఖ్యముగా మా సహోదరులలో వేయిమంది సంహరింపబడియుండగా వారు రక్షింపబడుట మా సైన్యమంతటికీ ఆశ్చర్యకరముగా ఉండెను. మరియు ఒక న్యాయవంతుడైన దేవుడున్నాడని, సందేహించని వారు ఆయన ఆశ్చర్యకరమైన శక్తిచేత రక్షింపబడుదురని విశ్వసించుటకు వారికి బోధించబడిన దానియందు వారి అధిక విశ్వాసము కారణముగా దీనిని దేవుని యొక్క అద్భుతమైన శక్తికి మేము న్యాయముగా ఆపాదింతుము.
27 ఇప్పుడు నేను చెప్పిన వారి యొక్క విశ్వాసమిది; వారు యౌవనులు, వారి మనస్సులు దృఢమైనవి మరియు వారు నిరంతరము దేవునియందు తమ నమ్మకముంచిరి.
28 ఇప్పుడు మేము గాయపడిన మా మనుష్యులపట్ల ఆ విధముగా శ్రద్ధ తీసుకొని, మా మృతులను మరియు లేమనీయుల యొక్క అనేకమంది మృతులను పాతిపెట్టిన తరువాత, జరహేమ్ల దేశమునకు వెళ్ళుటకు బయలుదేరిన ఆ బందీలను గూర్చి మేము గిడ్‌ను విచారించితిమి.
29 ఇప్పుడు ఆ దేశమునకు వారిని తీసుకొని వెళ్ళుటకు నియమింపబడిన పటాలముపై గిడ్ ప్రధాన అధికారి.
30 మరియు గిడ్ నాకు చెప్పిన మాటలివి: ఇదిగో మేము మా బందీలతో జరహేమ్ల దేశమునకు వెళ్ళుటకు బయలుదేరితిమి. లేమనీయుల దండును కనిపెట్టుటకు పంపబడిన మన సైన్యముల యొక్క వేగులను మేము కలుసుకొంటిమి.
31 మరియు వారు మాతో ఇట్లనుచూ కేకవేసిరి—ఇదిగో లేమనీయుల సైన్యములు క్యుమెని పట్టణమువైపు నడుచుచున్నవి; వారిపై దాడిచేసి, వారు మన జనులను నాశనము చేయుదురు.
32 ఆ కేకలను విని, మన బందీలు ధైర్యము తెచ్చుకొనిరి; మరియు వారు మాకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసిరి.
33 వారి తిరుగుబాటును బట్టి మా ఖడ్గములు వారిపై పడునట్లు మేము చేసితిమి. ఒక సమూహముగా వారు మా ఖడ్గములకు ఎదురు రాగా, వారిలో అధిక సంఖ్యాకులు సంహరింపబడిరి; వారిలో మిగిలిన వారు విడిపించుకొని, మా నుండి పారిపోయిరి.
34 వారు పారిపోవుచుండగా మేము వారిని అందుకొన లేకపోయినప్పుడు, మేము వేగముగా క్యుమెని పట్టణమువైపు నడిచితిమి; పట్టణమును కాపాడుటయందు మన సహోదరులకు సహాయము చేయునట్లు మేము సరైన సమయములో వచ్చి చేరితిమి.
35 మరలా మన శత్రువుల చేతులలోనుండి మనము విడిపించబడితిమి. మన దేవుని నామము స్తుతింపబడును గాక; ఏలయనగా మనలను విడిపించినది, మన కొరకు ఈ గొప్ప కార్యమును చేసినది ఆయనే.
36 ఇప్పుడు హీలమన్ అను నేను, గిడ్ యొక్క ఈ మాటలను విన్నప్పుడు, మేమందరము నశించకుండునట్లు మమ్ములను రక్షించుటలో దేవుని యొక్క మంచితనమును బట్టి మిక్కిలి సంతోషముతో నింపబడితిని; మరియు సంహరింపబడిన వారి ఆత్మలు తమ దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించెనని నేను నమ్ముచుంటిని.