లేఖనములు
ఆల్మా 46


46వ అధ్యాయము

అమలిక్యా రాజుగా ఉండుటకు కుట్ర పన్నును—మొరోనై స్వేచ్ఛాపతాకమును ఎగురవేయును—వారి మతమును కాపాడుకొనుటకు అతడు జనులను సమకూర్చును—నిజమైన విశ్వాసులు క్రైస్తవులని పిలువబడిరి—యోసేపు యొక్క శేషము కాపాడబడును—అమలిక్యా మరియు అసమ్మతీయులు నీఫై దేశమునకు పారిపోవుదురు—స్వాతంత్ర్యపు ఉద్దేశ్యమును సమర్థించని వారు సంహరించబడిరి. సుమారు క్రీ. పూ. 73–72 సం.

1 హీలమన్‌ మరియు అతని సహోదరుల మాటలను ఆలకించని వారందరు వారి సహోదరులకు వ్యతిరేకముగా సమకూడిరి.

2 మరియు వారిని సంహరించుటకు నిర్ణయించుకొనునంతగా వారు మిక్కిలి కోపముతోనుండిరి.

3 వారి సహోదరులకు వ్యతిరేకముగా కోపముగానున్న వారి యొక్క నాయకుడు బలమైన భారీకాయుడు; అతని పేరు అమలిక్యా.

4 అమలిక్యా ఒక రాజుగా ఉండగోరెను; కోపముగానున్న ఆ జనులు కూడా అతడు వారి రాజుగా ఉండవలెనని కోరిరి; వారిలో అధికభాగము దేశము యొక్క నిమ్న న్యాయాధిపతులైయుండి అధికారము కొరకు చూచుచుండిరి.

5 వారు అతనికి సహాయపడి వారి రాజుగా అతడిని నియమించిన యెడల, అతడు వారిని జనులపై పరిపాలకులుగా చేయుననే అమలిక్యా యొక్క ఇచ్చకపు మాటల ద్వారా వారు నడిపించబడిరి.

6 హీలమన్‌ మరియు అతని సహోదరులు సంఘముపై ప్రధాన యాజకులైయున్నందున సంఘముపై మిక్కిలి శ్రద్ధ కలిగియుండి వారికి బోధించుచున్నప్పటికీ, వారు ఆ విధముగా అమలిక్యా ద్వారా విభజనలోనికి నడిపింపబడిరి.

7 సంఘమందు అనేకులు అమలిక్యా యొక్క ఇచ్ఛకపు మాటలయందు విశ్వాసముంచిరి, కావున వారు సంఘము నుండి కూడా వేరుపడిరి; ఆ విధముగా లేమనీయులపై వారు గొప్ప విజయము పొంది, ప్రభువు యొక్క హస్తము ద్వారా వారి విడుదలను బట్టి గొప్ప సంతోషమును పొందినప్పటికీ, నీఫై జనుల యొక్క వ్యవహారములు మిక్కిలి అనిశ్చయముగా, అపాయకరముగా నుండెను.

8 ఆ విధముగా ఎంత వేగముగా నరుల సంతానము వారి ప్రభువైన దేవుడిని మరచిపోవుదురో, అనగా దుర్నీతి జరిగించుటకు, దుష్టుని చేత నడిపించి వేయబడుటకు ఎంత వేగముగానుందురో మనము చూచుచున్నాము.

9 మరియు ఒక్క దుష్టుడు, నరుల సంతానము మధ్య గొప్ప దుష్టత్వమును జరిగించగలడని కూడా మనము చూచుచున్నాము.

10 అమలిక్యా యుక్తిగల మోసగాడు మరియు అనేక ఇచ్ఛకపు మాటలాడు మనుష్యుడైనందున అతడు అనేకుల హృదయములను దుష్టత్వము జరిగించుటకు, దేవుని సంఘమును నాశనము చేయజూచుటకు మరియు దేవుడు వారికి అనుగ్రహించిన స్వేచ్ఛ యొక్క పునాదిని లేదా నీతిమంతుల నిమిత్తము భూముఖముపై దేవుడు పంపియున్న ఆశీర్వాదమును నాశనము చేయుటకు నడిపించెనని మనము చూచుచున్నాము.

11 ఇప్పుడు నీఫైయుల సైన్యములపై ముఖ్య సైన్యాధిపతియైన మొరోనై ఈ వేర్పాటులను గూర్చి వినినప్పుడు, అతడు అమలిక్యాతో కోపముగా ఉండెను.

12 అతడు తన చొక్కాను చింపి, దాని ముక్కనొకదానిని తీసుకొని, దానిపై—మన దేవుడు, మన మతము, స్వాతంత్ర్యము, సమాధానము, మన భార్యాపిల్లల జ్ఞాపకార్థము అని వ్రాసెను—మరియు ఒక కొయ్య చివర దానిని కట్టెను.

13 అతడు తన శిరస్త్రాణముపై, తన వక్షస్థల కవచముపై, తన డాలులపై మరియు తన నడుము చుట్టూ గల కవచముపై దానిని కట్టెను; కొన వద్ద తన చిరిగిన చొక్కా కలిగియున్న కొయ్యను తీసుకొని అతడు నేలకు వంగెను (అతడు దానిని స్వేచ్ఛాపతాకమని పిలిచెను), మరియు దేశమును స్వాధీనపరచుకొనుటకు క్రైస్తవుల సమూహమొకటి అక్కడ ఉన్నంత కాలము తన సహోదరులపై స్వేచ్ఛ యొక్క ఆశీర్వాదము నిలుచునట్లు అతడు తన దేవుడిని బలముగా ప్రార్థించెను.

14 ఏలయనగా దేవుని సంఘమునకు చెందిన క్రీస్తు యొక్క నిజమైన విశ్వాసులందరు సంఘమునకు చెందని వారి చేత ఆ విధముగా పిలువబడిరి.

15 మరియు సంఘమునకు చెందిన వారు విశ్వాసముగానుండిరి; క్రీస్తును నిజముగా విశ్వసించిన వారందరు రాబోవు క్రీస్తునందు వారి విశ్వాసమును బట్టి వారు పిలువబడినట్లుగా క్రీస్తు నామమును లేదా క్రైస్తవులు అను నామమును వారిపై సంతోషముగా తీసుకొనిరి.

16 కావున ఈ సమయమున, క్రైస్తవుల యొక్క ఉద్దేశ్యము మరియు దేశము యొక్క స్వాతంత్ర్యము అనుగ్రహింపబడవలెనని మొరోనై ప్రార్థించెను.

17 అతడు తన ఆత్మను దేవునికి క్రుమ్మరించినప్పుడు నిర్జన దేశమునకు దక్షిణమునున్న దేశమంతటినీ, అంతేకాక క్లుప్తముగా ఉత్తరమున, దక్షిణమున రెండు వైపులనున్న దేశమంతటినీ—ఎన్నుకోబడిన దేశము మరియు స్వేచ్ఛాదేశమును గూర్చి అతడు పలికెను.

18 మరియు అతడిట్లు చెప్పెను: క్రీస్తు యొక్క నామమును మనపై తీసుకొన్నందున ద్వేషింపబడిన మనము మన అతిక్రమముల చేత నాశనమును మనపై తెచ్చుకొంటే తప్ప మనము త్రొక్కివేయబడుటకు, నాశనము చేయబడుటకు నిశ్చయముగా దేవుడు అనుమతించడు.

19 మొరోనై ఈ మాటలను చెప్పినప్పుడు, అతడు చిరిగిన భాగముపైన వ్రాసిన వ్రాతను అందరు చూడగలుగునట్లు తన వస్త్రము యొక్క చిరిగిన భాగమును గాలిలో ఊపుచూ, బిగ్గరగా ఇట్లు కేక వేయుచూ జనుల మధ్యకు వెళ్ళెను:

20 ఇదిగో దేశమందు ఈ ధ్వజమును నిలబెట్టు వారెవరైనను ప్రభువైన దేవుడు వారిని ఆశీర్వదించునట్లు వారి ప్రభువు యొక్క శక్తియందు ముందుకు వచ్చి వారి హక్కులను, వారి మతమును కాపాడెదమని ఒక నిబంధనలోనికి ప్రవేశించుడి.

21 మొరోనై ఈ మాటలను ప్రకటించినప్పుడు, జనులు తమ నడుముల చుట్టూ తమ కవచములను చుట్టుకొని, ప్రభువైన వారి దేవుడిని వారు విడిచిపెట్టరనుటకు గుర్తుగా లేదా ఇతర మాటలలో వారు దేవుని ఆజ్ఞలను అతిక్రమించిన యెడల లేదా అతిక్రమములో పడిన యెడల మరియు క్రీస్తు నామమును వారిపై తీసుకొనుటకు సిగ్గుపడిన యెడల, వారు తమ వస్త్రములను చింపుకొనినట్లే ప్రభువు వారిని చింపవలెనని ఒక నిబంధనగా తమ వస్త్రములను చింపుకొనుచూ కలిసి పరిగెత్తుకు వచ్చిరి.

22 ఇప్పుడు వారు చేసిన నిబంధన ఇదే, మరియు వారు తమ వస్త్రములను మొరోనై పాదముల వద్ద పడవేసి ఇట్లనిరి: మేము అతిక్రమములో పడిన యెడల, ఉత్తర దేశమందలి మా సహోదరుల వలే మేము కూడా నాశనము చేయబడవలెనని మేము మా దేవునితో నిబంధన చేయుచున్నాము; మేము అతిక్రమములో పడిన యెడల, మేము మా వస్త్రములను నీ పాదముల యొద్ద పడవేసినట్లుగా మా శత్రువుల పాదముల క్రింద త్రొక్కివేయబడునట్లు ఆయన మమ్ములను వారి పాదముల యొద్ద పడవేయవచ్చును.

23 మొరోనై వారితో ఇట్లు చెప్పెను: ఇదిగో మనము యాకోబు సంతానము యొక్క శేషమైయున్నాము; అనగా, అతని సహోదరుల చేత ఎవరి అంగీ అనేక ముక్కలుగా చింపబడినదో, ఆ యోసేపు సంతానము యొక్క శేషమైయున్నాము; ఇప్పుడు మనము దేవుని ఆజ్ఞలను పాటించుటను జ్ఞాపకముంచుకొనెదము, లేని యెడల మన సహోదరుల చేత మన వస్త్రములు చింపబడును; మరియు మనము చెరసాలలోనికి వేయబడుదుము లేదా అమ్మివేయబడుదుము లేదా సంహరించబడుదుము.

24 యోసేపు యొక్క శేషముగా మనము మన స్వేచ్ఛను కాపాడుకొందము; అతని మరణమునకు ముందు యాకోబు మాటలను మనము జ్ఞాపకము చేసుకొందము, ఏలయనగా యోసేపు అంగీ యొక్క శేషములో ఒక భాగము కాపాడబడినదని మరియు నశించిపోలేదని అతడు చూచి, ఇట్లు చెప్పెను—నా కుమారుని వస్త్రము యొక్క ఈ శేషము కాపాడబడినట్లే నా కుమారుని సంతానము యొక్క ఒక శేషము దేవుని హస్తము ద్వారా కాపాడబడి ఆయన యొద్దకు తీసుకొనిపోబడగా, యోసేపు సంతానములో మిగిలిన వారు అతని వస్త్రము యొక్క శేషమువలే నశించిపోవుదురు.

25 ఇది నా ఆత్మను దుఃఖపెట్టుచున్నది; అయినప్పటికీ, దేవుని యొద్దకు తీసుకొనిపోబడు అతని సంతానము యొక్క ఆ భాగమును బట్టి నా ఆత్మ నా కుమారునియందు ఆనందము కలిగియున్నది.

26 ఇప్పుడు, ఇది యాకోబు యొక్క భాషయైయుండెను.

27 అతని వస్త్రమువలే నశించిపోవు యోసేపు సంతానము యొక్క శేషము మన నుండి విడిపోయిన వారేమో ఎవరు ఎరుగుదురు? మరియు మనము క్రీస్తు యొక్క విశ్వాసమందు నిలకడగా నిలిచియుండని యెడల మనము కూడా కావచ్చును.

28 మరియు మొరోనై ఈ మాటలు చెప్పినప్పుడు అతడు వెళ్ళి, అభిప్రాయ భేదములున్న దేశము యొక్క ఆ భాగములన్నిటికి సమాచారము పంపెను మరియు తమ స్వేచ్ఛను కాపాడుకొనుటకు కోరిక కలిగియున్న జనులందరినీ, అమలిక్యా మరియు అసమ్మతితో విడిపోయి అమలిక్యాయులు అని పిలువబడిన వారికి వ్యతిరేకముగా నిలుచుటకు సమకూర్చెను.

29 మొరోనై జనులు అమలిక్యాయుల కంటే అధిక సంఖ్యలో ఉన్నారని అమలిక్యా చూచినపుడు—వారు చేపట్టిన ఉద్దేశ్యము యొక్క న్యాయమును గూర్చి అతని జనులు సందేహించుటను కూడా అతడు చూచినప్పుడు—అతడు తన కార్యమును సాధించలేడని భయపడి, జనులలో తనను ఇష్టపడిన వారిని తీసుకొని నీఫై దేశములోనికి వెడలిపోయెను.

30 ఇప్పుడు లేమనీయులు మరింత శక్తి కలిగియుండుట ప్రయోజనము కాదని మొరోనై తలంచెను; కావున అమలిక్యా యొక్క జనులను ఆపవలెనని లేదా వారిని పట్టుకొని వెనుకకు తీసుకురావలెనని మరియు అమలిక్యాను సంహరించవలెనని అతడు తలంచెను; ఏలయనగా అతడు లేమనీయులను తమకు వ్యతిరేకముగా కోపమునకు పురిగొల్పునని, తమకు వ్యతిరేకముగా వారు యుద్ధమునకు వచ్చునట్లు చేయునని అతడు ఎరిగియుండెను; తన ఉద్దేశ్యములను నెరవేర్చుకొనునట్లు అమలిక్యా ఆ విధముగా చేయునని అతడు ఎరిగియుండెను.

31 కావున ఒక్కటిగా సమకూడి, తమ ఆయుధములు ధరించి, సమాధానమును కాపాడుటకు ఒక నిబంధనలోనికి ప్రవేశించిన అతని సైన్యములను అతడు తీసుకొనుట ప్రయోజనకరమని మొరోనై తలంచెను—మరియు అరణ్యమందు అమలిక్యా యొక్క మార్గమును అడ్డగించుటకు అతడు తన సైన్యమును తీసుకొని తన గుడారములతో అరణ్యములోనికి నడిచెను.

32 అతడు తన కోరికల ప్రకారము చేసెను, మరియు అరణ్యములో ముందుకు వెళ్ళి అమలిక్యా సైన్యములను ఎదుర్కొనెను.

33 అమలిక్యా తన మనుష్యులలో కొద్దిమందితో పారిపోయెను మరియు మిగిలినవారు మొరోనై చేతులకు అప్పగించబడి జరహేమ్ల దేశములోనికి వెనుకకు తీసుకొనిపోబడిరి.

34 మొరోనై ముఖ్యన్యాయాధిపతులు మరియు జనుల యొక్క స్వరము చేత నియమింపబడిన వాడైనందున, అతడు నీఫైయుల సైన్యములపట్ల తన చిత్త ప్రకారము చేయుటకు, వారిపై అధికారమును స్థాపించుటకు, అమలుచేయుటకు శక్తి కలిగియుండెను.

35 వారు ఒక స్వతంత్ర ప్రభుత్వమును నిలబెట్టుకొనగలుగునట్లు స్వాతంత్ర్యపు ఉద్దేశ్యమునకు సహాయపడుటకు ఒక నిబంధనలోనికి ప్రవేశించని అమలేకీయులు చంపబడునట్లు అతడు చేసెను; స్వాతంత్ర్యపు నిబంధనను తిరస్కరించిన వారు అక్కడ కొందరు మాత్రమే ఉండిరి.

36 నీఫైయులచేత స్వాధీనపరచుకొనబడిన దేశమంతటా ఉన్న ప్రతి గోపురముపైన స్వేచ్ఛాపతాకము ఎగురవేయబడునట్లు అతడు చేసెను; ఆ విధముగా నీఫైయుల మధ్య మొరోనై స్వేచ్ఛాధ్వజమును నాటెను.

37 వారు మరలా దేశమందు సమాధానము కలిగియుండసాగిరి; ఆ విధముగా వారు దాదాపు న్యాయాధిపతుల పరిపాలన యొక్క పంతొమ్మిదవ సంవత్సరాంతము వరకు దేశమందు సమాధానమును కాపాడిరి.

38 హీలమన్‌ మరియు ప్రధాన యాజకులు కూడా సంఘమందు క్రమమును నిలిపిరి; నాలుగు సంవత్సరముల పాటు వారు సంఘమందు అధిక సమాధానము మరియు సంతోషము కలిగియుండిరి.

39 వారిలో ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వారి ఆత్మలు విమోచింపబడినవని విశ్వసించుచూ మరణించిన వారు అక్కడ అనేకులుండిరి; ఆ విధముగా వారు ఆనందించుచూ లోకము నుండి వెళ్ళిపోయిరి.

40 సంవత్సరము యొక్క కొన్ని ఋతువులలో దేశమందు అతి తరచుగానున్న జ్వరములతో మరణించిన వారు అక్కడ కొందరుండిరి—కానీ వాతావరణము యొక్క స్వభావమును బట్టి మనుష్యులకు కలిగిన వ్యాధులను బాగుచేయుటకు, దేవుడు సిద్ధపరచిన అనేకమైన మొక్కలు మరియు వ్రేళ్ళ యొక్క ప్రశస్థమైన గుణములను బట్టి జ్వరములు అంత ఎక్కువ లేకుండెను—

41 కానీ వృద్ధాప్యముతో చనిపోయిన వారు అక్కడ అనేకులుండిరి మరియు క్రీస్తు యొక్క విశ్వాసమందు చనిపోయిన వారు ఆయనయందు సంతోషముగానుండిరని మనము తలంచవలెను.

ముద్రించు