లేఖనములు
ఆల్మా 48


48వ అధ్యాయము

అమలిక్యా లేమనీయులను నీఫైయులకు వ్యతిరేకముగా పురిగొల్పును—క్రైస్తవుల ఉద్దేశ్యమును కాపాడుటకు మొరోనై తన జనులను సిద్ధపరచును—అతడు స్వేచ్ఛ మరియు స్వాతంత్ర్యమందు ఆనందించు దేవుని యొక్క బలమైన మనుష్యుడు. సుమారు క్రీ. పూ. 72 సం.

1 అమలిక్యా రాజ్యమును పొందిన వెంటనే లేమనీయుల హృదయములను నీఫై యొక్క జనులకు వ్యతిరేకముగా ప్రేరేపించుట మొదలుపెట్టెను; వారి గోపురముల నుండి నీఫైయులకు వ్యతిరేకముగా లేమనీయులతో మాట్లాడుటకు అతడు మనుష్యులను నియమించెను.

2 ఆ విధముగా అతడు వారి హృదయములను నీఫైయులకు వ్యతిరేకముగా ప్రేరేపించెను, ఎంతగాననగా న్యాయాధిపతుల పరిపాలన యొక్క పంతొమ్మిదవ సంవత్సరము యొక్క కడపటి భాగమందు తన ప్రణాళికలను అంతవరకు సాధించిన వాడై, లేమనీయులపై రాజుగా చేయబడిన వాడై, అతడు దేశమంతటిపై అనగా దేశమందున్న నీఫైయులు మరియు లేమనీయుల జనులందరిపై పరిపాలన చేయుటకు కోరెను.

3 కావున అతడు తన ప్రణాళికను సాధించెను, ఏలయనగా అతడు లేమనీయుల హృదయములను కఠినపరచి, వారి మనస్సులను గ్రుడ్డిగా చేసి, నీఫైయులకు వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు అసంఖ్యాకమైన సైన్యమును అతడు సమకూర్చునంతగా వారిని కోపమునకు పురిగొల్పెను.

4 అతని జనుల సంఖ్య యొక్క గొప్పతనమును బట్టి నీఫైయులను ఓడించి, వారిని దాస్యములోనికి తెచ్చుటకు అతడు నిర్ణయించుకొనెను.

5 ఆ విధముగా అతడు జోరమీయులను ప్రధాన అధికారులుగా నియమించెను, వారు నీఫైయుల శక్తి, వారి ఆశ్రయస్థలములు మరియు వారి పట్టణముల యొక్క బలహీనమైన భాగములతో అందరికన్నా అధిక పరిచయము కలిగియుండిరి, కావున అతడు వారిని తన సైన్యములపై ప్రధాన అధికారులుగా నియమించెను.

6 వారు తమ దండును తీసుకొని, అరణ్యమందు జరహేమ్ల యొక్క దేశము వైపు ముందుకు సాగిరి.

7 ఇప్పుడు అమలిక్యా ఆ విధముగా మోసము మరియు వంచన ద్వారా అధికారమును సంపాదించుచుండగా, మొరోనై దానికి విరుద్ధముగా ప్రభువైన వారి దేవునిపట్ల విశ్వాసముగా ఉండుటకు జనుల మనస్సులను సిద్ధపరచుచుండెను.

8 అతడు నీఫైయుల సైన్యములను బలపరచుచుండెను మరియు చిన్నకోటలను లేదా ఆశ్రయ స్థలములను నిర్మించుచుండెను; అతని సైన్యములను చుట్టియుండుటకు చుట్టూ మట్టితో గట్టులను కట్టుచూ వారిని చుట్టియుండుటకు వారి పట్టణములు మరియు వారి దేశముల యొక్క సరిహద్దుల చుట్టూ, అంతేకాకకుండా దేశము చుట్టూ అన్నివైపుల రాళ్ళతో గోడలను కూడా కట్టుచుండెను.

9 మరియు మిక్కిలి బలహీనమైన వారి దుర్గములయందు అతడు అధిక సంఖ్యలో మనుష్యులనుంచెను; ఆ విధముగా అతడు నీఫైయుల చేత స్వాధీనపరచుకొనబడిన దేశమునందు దుర్గములు నిర్మించి, బలపరిచెను.

10 ఆ విధముగా వారి స్వేచ్ఛ, వారి భూములు, వారి భార్యాపిల్లలు మరియు వారి శాంతిని కాపాడుటకు, ప్రభువైన వారి దేవుని కొరకు వారు జీవించునట్లు మరియు క్రైస్తవుల ఉద్దేశ్యమని వారి శత్రువుల చేత పిలువబడిన దానిని వారు నిలుపుకొనునట్లు అతడు సిద్ధము చేయుచుండెను.

11 మొరోనై బలవంతుడు మరియు శక్తిశాలి; అతడు పరిపూర్ణమైన గ్రహింపు గలవాడు; రక్తపాతమందు ఆనందించనివాడు; దాస్యము మరియు బానిసత్వము నుండి తన దేశము యొక్క, తన సహోదరుల యొక్క స్వేచ్ఛా స్వాతంత్ర్యములందు ఆనందించు ఆత్మ గలవాడు.

12 ఆయన తన జనులపై ఉంచిన అనేక విశేషాధికారములు మరియు ఆశీర్వాదముల నిమిత్తము అతని దేవుని పట్ల కృతజ్ఞతాస్తుతులతో నిండిన హృదయము గలవాడు; అతని జనుల యొక్క రక్షణ మరియు సంక్షేమము నిమిత్తము మిక్కిలిగా శ్రమపడినవాడు.

13 అతడు క్రీస్తు యొక్క విశ్వాసమందు స్థిరముగానుండెను మరియు అతడు మరణించునంత వరకు అతని జనులను, హక్కులను, దేశమును మరియు మతమును కాపాడుటకు ఒట్టు పెట్టుకొనియుండెను.

14 ఇపుడు అవసరమైతే రక్తము చిందించైనా తమ శత్రువుల నుండి తమనుతాము కాపాడుకొనవలెనని నీఫైయులు బోధింపబడిరి; మరియు ఎన్నడూ ఎవరికీ హాని చేయకూడదని, వారి ప్రాణములు కాపాడుకొనుటకు తప్ప, శత్రువుకు వ్యతిరేకముగా తప్ప, ఎన్నడూ ఖడ్గము ఎత్తరాదని కూడా వారు బోధింపబడిరి.

15 ఆ విధముగా చేయుట ద్వారా దేవుడు వారిని దేశమందు వర్థిల్లజేయునని లేదా ఇతర మాటలలో, వారు దేవుని ఆజ్ఞలను పాటించుట యందు విశ్వాసముగా ఉండిన యెడల ఆయన వారిని దేశమందు వర్థిల్లజేయునని, వారి అపాయమునుబట్టి పారిపోవుటకు లేదా యుద్ధమునకు సిద్ధపడుటకు వారిని హెచ్చరించును అనునది వారి విశ్వాసమైయుండెను.

16 ఇంకను తమ శత్రువులకు వ్యతిరేకముగా తమను కాపాడుకొనుటకు వారు ఎటు వెళ్ళవలెనో దేవుడు వారికి తెలియజేయునని, అట్లు చేయుట ద్వారా ప్రభువు వారిని విడిపించుననునది మొరోనై యొక్క విశ్వాసమైయుండెను మరియు దానియందు అతని హృదయము ఆనందించెను; రక్తపాతమందు కాదు, కానీ మంచి చేయుట యందు, తన జనులను కాపాడుట యందు, దేవుని ఆజ్ఞలను పాటించుట యందు మరియు దుర్నీతిని ఎదుర్కొనుట యందు ఆనందించెను.

17 నిశ్చయముగా మనుష్యులందరు మొరోనైవలే ఉన్న యెడల మరియు ఉండబోయిన యెడల, నరకపు శక్తులు నిరంతరము వణికించబడునని, అపవాది నరుల సంతానము యొక్క హృదయములపై ఎన్నడూ శక్తి కలిగియుండడని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

18 అతడు మోషైయ కుమారుడైన అమ్మోన్ వంటివాడు మరియు మోషైయ యొక్క ఇతర కుమారుల వంటివాడు, ఆల్మా మరియు అతని కుమారుల వంటివాడు, ఏలయనగా వారందరు దైవజనులు.

19 ఇప్పుడు హీలమన్‌ మరియు అతని సహోదరులు కూడా జనులకు మొరోనై కంటే ఏమియు తక్కువ సేవ చేసిన వారు కాదు; ఏలయనగా వారు దేవుని వాక్యమును బోధించిరి, మరియు వారి మాటలను ఆలకించిన మనుష్యులందరికి పశ్చాత్తాపము నిమిత్తము బాప్తిస్మమిచ్చిరి.

20 ఆ విధముగా వారు ముందుకు సాగిరి, మరియు వారి మాటలను బట్టి ప్రభువు చేత అధికముగా అనుగ్రహింపబడునంతగా జనులు తమనుతాము తగ్గించుకొనిరి; ఆ విధముగా వారు నాలుగు సంవత్సరములపాటు వారి మధ్య యుద్ధములు, వివాదములు లేకయుండిరి.

21 కానీ నేను చెప్పినట్లు పంతొమ్మిదవ సంవత్సరము యొక్క కడపటి భాగమందు, వారి మధ్య సమాధానమున్నప్పటికీ వారి సహోదరులైన లేమనీయులతో పోరాడుటకు అయిష్టముగా వారు బలవంతము చేయబడిరి.

22 క్లుప్తముగా, వారు ఎంతమాత్రము ఇష్టపడనప్పటికీ లేమనీయులతో వారి యుద్ధములు అనేక సంవత్సరముల పాటు ఆగకయుండెను.

23 లేమనీయులకు వ్యతిరేకముగా ఆయుధములను పైకెత్తుటకు వారు విచారించిరి, ఏలయనగా వారు రక్తపాతమందు ఆనందించలేదు; మరియు ఇదియే అంతయు కాదు—వారి దేవుడిని కలుసుకొనుటకు సిద్ధపడకుండానే వారి సహోదరులలో అంతమందిని ఈ లోకములోనుండి నిత్యలోకములోనికి పంపుటలో సాధనముగా ఉన్నందుకు వారు విచారించిరి.

24 అయినప్పటికీ ఒకప్పుడు వారి సహోదరులైయుండి, వారి సంఘము నుండి విభేదించి, వారిని విడిచి లేమనీయులను చేరుట ద్వారా వారిని నాశనము చేయుటకు వెళ్ళిన వారి యొక్క అనాగరికపు క్రూరత్వము చేత వారి భార్యాపిల్లలు చిత్రవధ చేయబడునట్లు తమ ప్రాణములను అర్పించుటకు వారు అనుమతించలేకపోయిరి.

25 ఏలయనగా వారు ఆయన ఆజ్ఞలను పాటించిన యెడల, వారు దేశమందు వర్ధిల్లుదురనునది ప్రభువు యొక్క వాగ్దానమైయున్నందున దేవుని ఆజ్ఞలను పాటించు వారెవరైనా అక్కడ ఉన్నంత కాలము నీఫైయుల రక్తమందు వారి సహోదరులు ఆనందించుటను వారు సహించలేకపోయిరి.