లేఖనములు
3 నీఫై 26


26వ అధ్యాయము

ఆది నుండి అంతము వరకు అన్నివిషయములను యేసు వివరించును—శిశువులు మరియు చిన్నపిల్లలు వ్రాయబడలేని ఆశ్చర్యకరమైన విషయములను ఉచ్ఛరించుదురు—క్రీస్తు సంఘమందున్న వారు అన్ని వస్తువులను వారి మధ్య ఉమ్మడిగా కలిగియుందురు. సుమారు క్రీ. శ. 34 సం.

1 ఇప్పుడు యేసు ఈ విషయములను చెప్పినప్పుడు, ఆయన వాటిని సమూహమునకు వివరించెను; ఆయన వారికి గొప్పవి మరియు అల్పమైన విషయములన్నిటినీ వివరించెను.

2 మరియు ఆయన ఈలాగు సెలవిచ్చుచున్నాడు: మీరు కలిగియుండని ఈ లేఖనములను నేను మీకు ఇవ్వవలెనని తండ్రి నన్ను ఆజ్ఞాపించియున్నాడు; ఏలయనగా అవి భావి తరములకు ఇవ్వబడవలెను అనునది ఆయన యందు వివేకమైయుండెను.

3 ఆయన అన్ని విషయములను, ఆదినుండి ఆయన తన మహిమలో వచ్చు సమయము వరకు ఉన్నవాటిని—అనగా పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోయి, భూమి ఒక గ్రంథపు చుట్టవలే చుట్టబడి, భూమ్యాకాశములు గతించిపోవు వరకు భూముఖముపై జరుగు సంగతులన్నింటిని;

4 మరియు సమస్త జనులు, జాతులు, జనములు, భాషలు, అవి మంచివేగాని చెడ్డవేగాని, వారి క్రియలను బట్టి తీర్పుతీర్చబడుటకు దేవుని యెదుట నిలబడు ఆ గొప్ప అంత్యదినము వరకు కూడా వివరించెను—

5 ఆ క్రియలు మంచివైన యెడల నిత్యజీవము యొక్క పునరుత్థానమునకు మరియు అవి చెడ్డవైన యెడల శిక్షావిధి యొక్క పునరుత్థానమునకు వారు తేబడుదురు; లోకారంభమునకు ముందు గల క్రీస్తునందున్న కనికరము, న్యాయము మరియు పరిశుద్ధతను బట్టి ఒకటి ఒక వైపున, మరొకటి మరొక వైపున రెండు సమాంతరముగా ఉండును.

6 ఇప్పుడు యేసు నిజముగా జనులకు బోధించిన సంగతుల యొక్క నూరవ భాగము కూడా ఈ గ్రంథమందు వ్రాయబడలేదు;

7 కానీ, ఆయన జనులకు బోధించిన విషయములలో అధిక భాగమును నీఫై పలకలు కలిగియున్నవి.

8 ఆయన జనులకు బోధించిన విషయములలో ఒక చిన్నభాగమైన ఈ విషయములను నేను వ్రాసియున్నాను; యేసు పలికిన మాటలను బట్టి అవి అన్యజనుల నుండి ఈ జనుల యొద్దకు తిరిగి తేబడవలెనను ఉద్దేశ్యము నిమిత్తము నేను వాటిని వ్రాసియుంటిని.

9 వారి విశ్వాసమును పరీక్షించుటకు ముందుగా వారు పొందియుండవలసిన దీనిని పొందినప్పుడు, వారు ఈ విషయములను విశ్వసించిన యెడల, అప్పుడు వారికి మరి గొప్ప విషయములు బయలుపరచబడును.

10 మరియు వారు ఈ విషయములను విశ్వసించని యెడల, అప్పుడు వారి శిక్షావిధి నిమిత్తము మరి గొప్ప విషయములు వారి నుండి నిలిపివేయబడును.

11 ఇదిగో, నీఫై పలకలపై చెక్కబడిన వాటన్నిటినీ నేను వ్రాయబోతిని, కానీ నేను నా జనుల విశ్వాసమును పరీక్షించెదనని చెప్పుచూ ప్రభువు దానిని వ్రాయకుండా నిషేధించెను.

12 కావున, ప్రభువు చేత నాకు ఆజ్ఞాపించబడిన విషయములను మోర్మన్‌ అను నేను వ్రాయుదును. ఇప్పుడు మోర్మన్‌ అను నేను, నా మాటలను ముగించెదను మరియు నాకు ఆజ్ఞాపించబడిన విషయములను వ్రాయుట కొనసాగించెదను.

13 కావున, మూడు దినముల పాటు ప్రభువు నిజముగా జనులకు బోధించెనని మీరు చూడవలెనని నేను కోరుచున్నాను; ఆ తరువాత ఆయన వారికి తరచుగా తనను కనబరచుకొనెను మరియు తరచుగా రొట్టెను విరిచి, దానిని ఆశీర్వదించి వారికిచ్చెను.

14 చెప్పబడిన ఆ సమూహము యొక్క పిల్లలకు ఆయన బోధించి, పరిచర్య చేసెను; ఆయన వారి నాలుకలను వదులు చేయగా, వారు తమ తండ్రులతో ఆయన జనులకు బయలుపరచిన వాటికంటే గొప్పవైన అద్భుత విషయములను పలికిరి మరియు వారు మాట్లాడగలుగునట్లు ఆయన వారి నాలుకలను వదులు చేసెను.

15 ఆయన పరలోకములోనికి ఆరోహణుడైన తరువాత—ఆయన రెండవసారి తనను వారికి కనబరచుకొని, తండ్రి యొద్దకు వెళ్ళెను మరియు వారి రోగులందరినీ, వారిలో కుంటివారిని స్వస్థపరచి, గ్రుడ్డివారి కన్నులను తెరిచి, చెవిటివారి చెవులు వినునట్లు చేసి, అన్నివిధములుగా వారిని స్వస్థపరచి, మృతులలో నుండి ఒక మనుష్యుని లేపి, వారికి తన శక్తిని చూపియుండి, తండ్రి యొద్దకు ఆరోహణుడయ్యెను—

16 మరుసటి ఉదయమున సమూహము సమకూడి వచ్చిరి మరియు వారు ఈ పిల్లలను చూచి, వినిరి; శిశువులు కూడా వారి నోళ్ళను తెరచి అద్భుతమైన విషయములను పలికిరి; వారు పలికిన విషయములను ఏ మనుష్యుడు వ్రాయరాదని నిషేధించబడినది.

17 యేసు ఎన్నుకొనిన శిష్యులు ఆ సమయము నుండి వారి యొద్దకు వచ్చిన వారందరికి బాప్తిస్మమిచ్చుట, బోధించుట మొదలుపెట్టిరి; మరియు యేసు నామమందు బాప్తిస్మము పొందిన వారందరు పరిశుద్ధాత్మతో నింపబడిరి.

18 వారిలో అనేకులు చెప్పశక్యముకాని విషయములను చూచిరి మరియు వినిరి, అవి వ్రాయబడుట న్యాయము కాదు.

19 వారు ఒకరికొకరు బోధించుకొని, పరిచర్య చేసుకొనిరి; మరియు వారు అన్నిటిని వారి మధ్య ఉమ్మడిగా కలిగియుండి, ప్రతి మనుష్యుడు ఒకనితోనొకడు న్యాయముగా వ్యవహరించిరి.

20 యేసు వారిని ఆజ్ఞాపించినట్లుగానే వారు అన్ని విషయములను చేసిరి.

21 మరియు యేసు నామమందు బాప్తిస్మము పొందిన వారు క్రీస్తు సంఘమని పిలువబడిరి.

ముద్రించు