లేఖనములు
3 నీఫై 3


3వ అధ్యాయము

లకోనియస్ మరియు నీఫైయులు తమ దేశములతోపాటు లొంగిపోవలెనని గాడియాంటన్‌ నాయకుడు గిదియాన్హి కోరును—లకోనియస్, గిద్‌గిద్దోనిని సైన్యములపై ప్రధాన అధికారిగా నియమించును—నీఫైయులు తమనుతాము రక్షించుకొనుటకు జరహేమ్లయందు, సమృద్ధిస్థలమందు సమకూడుదురు. సుమారు క్రీ. శ. 16–18 సం.

1 ఇప్పుడు క్రీస్తు యొక్క రాకనుండి పదహారవ సంవత్సరమందు దేశము యొక్క పరిపాలకుడైన లకోనియస్, ఈ దొంగల ముఠా యొక్క నాయకుడు మరియు పరిపాలకుని నుండి ఒక లేఖను అందుకొనెను; మరియు దానిలో వ్రాయబడిన మాటలివి:

2 మహా ఘనత వహించిన, దేశము యొక్క ప్రధాన పరిపాలకుడవైన లకోనియస్, నేను ఈ లేఖను నీకు వ్రాయుచున్నాను, మీ హక్కు మరియు స్వాతంత్ర్యము అని మీరు తలంచిన దానిని నిలుపుకొనుట యందు నీ దృఢత్వము మరియు నీ జనుల యొక్క దృఢత్వమును బట్టి నిన్ను మిక్కిలిగా ప్రశంసించుచున్నాను; మీ స్వాతంత్ర్యము, మీ ఆస్తి మరియు మీ దేశము లేదా అట్లు మీరు పిలుచుచున్న దానిని రక్షించుటలో మీరు ఒక దేవుని హస్తము ద్వారా సహాయము పొందుచున్నట్లు బాగుగా నిలిచియున్నారు.

3 మహా ఘనత వహించిన లకోనియస్, ఇప్పుడు ఈ సమయమున తమ ఆయుధములతో నిలిచియుండి—నీఫైయులపై దండెత్తి వారిని నాశనము చేయుడి, అను మాట కొరకు గొప్ప ఆసక్తితో ఎదురు చూచుచున్న నా అధికారము క్రిందనున్న అనేకమంది శూరులైన మనుష్యులను ఎదుర్కొని మీరు నిలువగలరని తలంచుచూ, మీరు అంత మూర్ఖముగా మరియు వ్యర్థముగా ఉన్నందుకు నాకు జాలి కలుగుచున్నది.

4 జయింపబడలేని నా జనుల ఆత్మను నేను ఎరిగియున్నాను; యుద్ధభూమి యందు వారిని ఋజువు చేసియున్నాను; మీరు వారిపట్ల చేసిన అనేక తప్పిదములను బట్టి, మీ యెడల వారి నిత్య ద్వేషమును ఎరిగియున్నాను; కావున వారు మీకు వ్యతిరేకముగా వచ్చిన యెడల, వారు మిమ్ములను పూర్తిగా నాశనము చేసెదరు.

5 అందుచేత సరియైనదని మీరు విశ్వసించు దానియందు మీ దృఢత్వమును, యుద్ధభూమి యందు మీ ఉన్నతమైన ఆత్మను బట్టి మీ క్షేమము కొరకు తలంచుచూ నేను ఈ లేఖను వ్రాసి, స్వయంగా నా చేతితో దానికి ముద్రవేసితిని.

6 కావున, వారు మిమ్ములను ఖడ్గముతో దర్శించి నాశనము చేయుటకు బదులు, మీరు మీ పట్టణములు, మీ దేశములు మరియు మీరు కలిగియున్న వాటన్నిటిని నా జనులకు అప్పగించి వేయవలెనని కోరుచూ నేను నీకు వ్రాయుచున్నాను.

7 లేక ఇతర మాటలలో, మిమ్ములను మాకు అప్పగించుకొనుడి, మాతో ఏకమై, మా రహస్య కార్యములతో పరిచయమొంది, మీరు మా వలే ఉండునట్లు మా సహోదరులగుడి—మా దాసులుగా కాదు, కానీ మా సహోదరులుగా మేము కలిగియున్న దానంతటిలో భాగస్వాములుకండి.

8 ఇదిగో, మీరు ప్రమాణపూర్వకముగా దీనిని చేసిన యెడల, మీరు నాశనము చేయబడరని నేను నీతో ప్రమాణము చేయుచున్నాను; కానీ మీరు దీనిని చేయని యెడల, నేను మీతో ప్రమాణపూర్వకముగా చెప్పుచున్నాను, పైనెలలో నా సైన్యములు మీపై దాడిచేయవలెనని నేను ఆజ్ఞాపించెదను, వారు తమ చేతిని ఆపరు మరియు విడువరు, కానీ మిమ్ములను సంహరించి, మీరు నిర్మూలమగు వరకు కూడా తమ ఖడ్గమును మీపై పడనిత్తురు.

9 ఇదిగో, నేను గిద్దియాన్హిని, నేను గాడియాంటన్‌ యొక్క ఈ రహస్య సంఘ పరిపాలకుడను; ఆ సంఘము మరియు దాని కార్యములు మంచివని నేనెరుగుదును; అవి ప్రాచీన దినములకు చెందియుండి, మాకు అందించబడినవి.

10 మరియు లకోనియస్, నేను ఈ లేఖను నీకు వ్రాయుచున్నాను, వారి ప్రభుత్వ హక్కులను వారి నుండి తీసుకొనుటలో మీ దుర్మార్గమును బట్టి, మీ నుండి అసమ్మతితో వెళ్ళిపోయిన ఈ నా జనులు, తమ హక్కులను మరియు ప్రభుత్వమును తిరిగి సంపాదించుకొనునట్లు రక్తము చిందింపబడకుండా, మీరు మీ దేశములను, మీరు కలిగియున్న వాటిని అప్పగించి వేయుదురని నేను నిరీక్షించుచున్నాను, మీరు దీనిని చేయని యెడల వారి అన్యాయముల కొరకు నేను పగ తీర్చుకొనెదను. నేను గిదియాన్హిని.

11 లకోనియస్ ఈ లేఖను అందుకొనినప్పుడు, నీఫైయుల దేశము యొక్క స్వాధీనమును కోరుట యందు మరియు ఆ దుష్ట, హేయకరమైన దొంగల వద్దకు అసమ్మతితో వెళ్ళిపోవుట ద్వారా తమకుతామే అన్యాయము చేసుకొనుట తప్ప, ఎట్టి అన్యాయము పొందియుండని వారి యొక్క పగ తీర్చుకొనుటయందు, జనులను బెదరించుట యందు కూడా గిదియాన్హి యొక్క ధైర్యమును బట్టి అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను.

12 ఇప్పుడు పరిపాలకుడైన ఈ లకోనియస్, న్యాయవంతుడైయుండి ఒక దొంగ యొక్క దబాయింపులు, బెదరింపుల చేత భయపడలేదు; కావున అతడు దొంగల పరిపాలకుడైన గిదియాన్హి లేఖను ఆలకించలేదు, కానీ దొంగలు తమపై దాడిచేయు సమయమునకు ముందుగా బలము కొరకు తన జనులు ప్రభువుకు మొరపెట్టునట్లు అతడు చేసెను.

13 మరియు వారి దేశము తప్ప, వారి స్త్రీలు, పిల్లలు, వారి మందలు, గుంపులు మరియు వారు కలిగియున్న సమస్తమును వారు ఒక చోటుకు చేర్చవలెనని అతడు జనులందరి మధ్య ఒక ప్రకటన పంపెను.

14 మరియు వారి చుట్టూ కోటలు కట్టబడునట్లు, అవి అత్యంత బలముగా ఉండునట్లు అతడు చేసెను. వారిని కావలికాచి, దొంగల నుండి రాత్రింబవళ్ళు కాపాడుటకు నీఫైయులు మరియు లేమనీయులు ఇరువురి సైన్యములు, లేదా నీఫైయుల మధ్య లెక్కింపబడిన వారందరు చుట్టూ కావలివారిగా ఉంచబడునట్లు అతడు చేసెను.

15 అతడు వారితో ఇట్లనెను: ప్రభువు జీవముతోడు, మీరు మీ దుర్ణీతులన్నిటి విషయమై పశ్చాత్తాపపడి ప్రభువుకు మొరపెడితే తప్ప, మీరు ఏ విధముగానూ ఆ గాడియాంటన్‌ దొంగల చేతులలో నుండి విడిపించబడరు.

16 లకోనియస్ మాటలు మరియు ప్రవచనములు ఎంత గొప్పగా అద్భుతముగా ఉండెననగా, అవి జనులందరు భయపడునట్లు చేసెను; వారు లకోనియస్ మాటల ప్రకారము చేయుటకు తమ బలమంతటినీ వినియోగించిరి.

17 మరియు వారిపై దాడిచేయుటకు అరణ్యము నుండి దొంగలు బయటకు వచ్చు సమయమున వారిని నడిపించుటకు నీఫైయుల సైన్యములన్నిటిపై లకోనియస్ ప్రధాన అధికారులను నియమించెను.

18 ఇప్పుడు ప్రధాన అధికారులందరి మధ్య ప్రముఖుడు మరియు నీఫైయుల సైన్యములన్నిటిపై గొప్ప సేనాధికారి నియమింపబడెను, అతని పేరు గిద్‌గిద్దోని.

19 ఇప్పుడు బయల్పాటు మరియు ప్రవచనము యొక్క ఆత్మ కలిగిన వారిని (వారి దుర్మార్గపు దినములందు తప్ప) తమ ప్రధాన అధికారులుగా నియమించుట నీఫైయులందరి మధ్య ఒక ఆచారమైయుండెను; కావున ఈ గిద్‌గిద్దోని వారి మధ్య ఒక గొప్ప ప్రవక్త మరియు ప్రధాన న్యాయాధిపతి కూడా అయ్యుండెను.

20 ఇప్పుడు జనులు గిద్‌గిద్దోనితో—ప్రభువును ప్రార్థించుము, మనము దొంగలపై దాడిచేసి వారిని వారి స్వదేశములలోనే నాశనము చేయునట్లు, పర్వతములపైకి మరియు అరణ్యములోనికి వెళ్ళుదమని చెప్పిరి.

21 కానీ గిద్‌గిద్దోని వారితో ఇట్లు చెప్పెను: ప్రభువు నిషేధించును గాక; ఏలయనగా మనము వారికి వ్యతిరేకముగా వెళ్ళిన యెడల, ప్రభువు మనలను వారి చేతులలోనికి అప్పగించును; కావున మన దేశముల మధ్యలో మనలను మనము సిద్ధపరచుకొనెదము, మన సైన్యములన్నిటిని సమకూర్చుకొనెదము, మనము వారికి వ్యతిరేకముగా వెళ్ళము, కానీ వారు మనకు వ్యతిరేకముగా వచ్చు వరకు మనము కనిపెట్టియుండెదము; కావున ప్రభువు జీవముతోడు, మనము దీనిని చేసిన యెడల ఆయన వారిని మన చేతులలోనికి అప్పగించును.

22 ఇప్పుడు, పదిహేడవ సంవత్సరము యొక్క అంతమునందు లకోనియస్ యొక్క ప్రకటన దేశమంతటా బయలువెళ్ళెను మరియు వారు తమ గుఱ్ఱములను, రథములను, పశువులను, మందలను, గుంపులన్నిటిని, తమ ధాన్యమును, తాము కలిగియున్న సమస్తమును తీసుకొని తమ శత్రువుల నుండి తమనుతాము కాపాడుకొనుటకు వారు కలిసి సమకూడుకొనవలెనని నియమింపబడిన స్థలమునకు వెళ్ళువరకు వారందరూ వేలు, పదులవేల సంఖ్యలో ముందుకు నడిచిరి.

23 మరియు నియమింపబడిన దేశము జరహేమ్ల దేశమైయుండెను, జరహేమ్ల దేశమునకు సమృద్ధిదేశమునకు మధ్యనున్న దేశము, అనగా సమృద్ధిదేశము మరియు నిర్జన దేశములకు మధ్యనున్న సరిహద్దు రేఖయైయుండెను.

24 నీఫైయులని పిలువబడిన అనేక వేలమంది జనులు ఈ దేశమందు సమకూడుకొనిరి. ఇప్పుడు ఉత్తర దేశము పైనున్న గొప్ప శాపమును బట్టి, వారు దక్షిణ దేశమందు సమకూడుకొనునట్లు లకోనియస్ చేసెను.

25 మరియు వారు తమ శత్రువులనుండి కాపాడుకొనుటకు కోటలు కట్టుకొనిరి; వారు ఒక దేశమందు, ఒక సమూహమందు నివసించిరి మరియు వారు లకోనియస్ చేత పలుకబడిన మాటలకు ఎంతగా భయపడిరనగా, వారి పాపములన్నిటి విషయమై వారు పశ్చాత్తాపపడి, తమ శత్రువులు తమపై యుద్ధము చేయుటకు వచ్చు సమయమందు ఆయన వారిని విడిపించవలెనని ప్రభువైన వారి దేవుడిని ప్రార్థించిరి.

26 వారి శత్రువులను బట్టి వారు మిక్కిలి దుఃఖాక్రాంతులైరి. మరియు అతని ఉపదేశమును బట్టి వారు ప్రతి విధమైన యుద్ధ ఆయుధములను చేయునట్లు, కవచముతోను, డాలులతోను, కేడెములతోను వారు బలముగా ఉండునట్లు గిద్‌గిద్దోని చేసెను.

ముద్రించు