లేఖనములు
3 నీఫై 16


16వ అధ్యాయము

ఇశ్రాయేలు యొక్క తప్పిపోయిన గొఱ్ఱెలలోని ఇతరులను యేసు దర్శించును—కడవరి దినములందు సువార్త అన్యజనులకు వెళ్ళిన తరువాత ఇశ్రాయేలు వంశమునకు వెళ్ళును—ఆయన సీయోనును తిరిగి తెచ్చునప్పుడు, ప్రభువు యొక్క జనులు కన్నులార చూచెదరు. సుమారు క్రీ. శ. 34 సం.

1 నిశ్చయముగా నేను మీతో చెప్పునదేమనగా—ఈ దేశమునకు, యెరూషలేము దేశమునకు లేదా నేను పరిచర్య చేయుటకు వెళ్ళియుండిన చుట్టూ ఉన్న దేశము యొక్క ఏ భాగములకు చెందని ఇతర గొఱ్ఱెలను నేను కలిగియున్నాను.

2 నేను చెప్పుచున్న వారు ఇంకను నా స్వరమును వినియుండలేదు; లేదా ఏ సమయమందైనను నన్ను నేను వారికి ప్రత్యక్షపరచుకొనలేదు.

3 కానీ, వారు ఒకే దొడ్డి ఒకే కాపరి కలిగియుండునట్లు, నా స్వరమును విని నా గొఱ్ఱెల మధ్య లెక్కింపబడునట్లు, నేను వారి యొద్దకు వెళ్ళవలెనని తండ్రి నుండి నేను ఒక ఆజ్ఞను పొందియున్నాను; కావున వారికి నన్ను నేను కనబరచుకొనుటకు వెళ్ళుచున్నాను.

4 మరియు నేను వెళ్ళిపోయిన తరువాత ఈ మాటలను మీరు వ్రాయవలెనని నేను మిమ్ములను ఆజ్ఞాపించుచున్నాను, ఒకవేళ యెరూషలేములోనున్న నా జనులు, నన్ను చూచి నా పరిచర్యలో నాతో ఉన్నవారు, మీ గురించి మరియు వారు ఎరుగని ఇతర గోత్రములను గూర్చి కూడా పరిశుద్ధాత్మ ద్వారా జ్ఞానమును పొందవలెనని నా నామమున తండ్రిని అడుగకుండిన యెడల, అప్పుడు మీరు వ్రాయు ఈ మాటలు భద్రము చేయబడి అన్యజనులకు విశదము చేయబడవలెను; వారి అవిశ్వాసమును బట్టి భూముఖముపై చెదిరియుండు వారి సంతానము యొక్క శేషమునకు అన్యజనుల యొక్క సంపూర్ణత ద్వారా అవి తేబడవలెను లేదా వారి విమోచకుడనైన నన్ను గూర్చి వారు తెలుసుకొనునట్లు అవి తేబడవలెను.

5 అప్పుడు నేను భూమి యొక్క నలువైపుల నుండి వారిని సమకూర్చెదను; ఇశ్రాయేలు వంశస్థులందరితో తండ్రి చేసిన నిబంధనను నేను నెరవేర్చెదను.

6 మరియు నన్ను గూర్చి, తండ్రిని గూర్చి వారికి సాక్ష్యమిచ్చు పరిశుద్ధాత్మ ద్వారా నా యందున్న వారి విశ్వాసమును బట్టి అన్యజనులు ధన్యులు.

7 ఇదిగో ఓ ఇశ్రాయేలు వంశమా, నా యందున్న వారి విశ్వాసమును బట్టి మరియు మీ అవిశ్వాసమును బట్టి, ఈ సంగతుల యొక్క సంపూర్ణత వారికి తెలియజేయబడునట్లు కడవరి దినమందు సత్యము అన్యజనులకు వచ్చునని తండ్రి చెప్పుచున్నాడు.

8 కానీ వారు ఈ భూముఖముపై ముందుకువచ్చి ఇశ్రాయేలు వంశము వారైన నా జనులను చెదరగొట్టినప్పటికీ, అన్యజనులలోని అవిశ్వాసులకు ఆపద అని తండ్రి చెప్పుచున్నాడు; ఇశ్రాయేలు వంశము వారైన నా జనులు వారి మధ్య నుండి గెంటివేయబడియున్నారు మరియు వారి పాదముల క్రింద త్రొక్కివేయబడియున్నారు;

9 అన్యజనుల యెడల తండ్రి యొక్క కనికరములను బట్టి మరియు ఇశ్రాయేలు వంశము వారైన నా జనుల యెడల తండ్రి యొక్క తీర్పులను బట్టి కూడా నిశ్చయముగా నేను మీతో చెప్పునదేమనగా—దీనియంతటి తరువాత ఇశ్రాయేలు వంశము వారైన నా జనులు మొత్తబడునట్లు, బాధింపబడునట్లు, సంహరింపబడునట్లు, వారి మధ్య నుండి గెంటివేయబడునట్లు, వారి చేత ద్వేషింపబడునట్లు, వారి మధ్య ఒక హేతువుగాను ఒక సామెతగాను ఉండునట్లు నేను చేసియుంటిని—

10 మరియు నేను మీకు చెప్పవలెనని ఆ విధముగా తండ్రి ఆజ్ఞాపించుచున్నాడు: అన్యజనులు నా సువార్తకు వ్యతిరేకముగా పాపము చేసి, నా సువార్త యొక్క సంపూర్ణతను తిరస్కరించి, సమస్త జనముల కంటే హెచ్చుగా మరియు సమస్త భూ జనులందరి కంటే హెచ్చుగా తమ హృదయ గర్వమందు పైకెత్తబడి, అన్ని రకములైన అబద్ధములు, మోసములు, దుర్మార్గములు, అన్నివిధములైన వేషధారణ, నరహత్యలు, యాజక వంచనలు, జారత్వములు మరియు రహస్యమైన హేయకార్యములతో నిండియుండు ఆ దినమున ఈ సంగతులన్నిటినీ చేసి, నా సువార్త యొక్క సంపూర్ణతను తిరస్కరించిన యెడల, ఇదిగో వారి మధ్యనుండి నా సువార్త యొక్క సంపూర్ణతను నేను తీసివేసెదనని తండ్రి చెప్పుచున్నాడు.

11 అప్పుడు ఓ ఇశ్రాయేలు వంశమా, నేను నా జనులకు చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొందును మరియు వారికి నా సువార్తను తెచ్చెదను.

12 మరియు ఓ ఇశ్రాయేలు వంశమా, అన్యజనులు మీపై శక్తి కలిగియుండరని నేను మీకు చూపెదను; కానీ ఓ ఇశ్రాయేలు వంశమా, మీతో నా నిబంధనను నేను జ్ఞాపకము చేసుకొనెదను మరియు నా సంపూర్ణ సువార్తను మీరు తెలుసుకొందురు.

13 కానీ ఓ ఇశ్రాయేలు వంశమా, అన్యజనులు పశ్చాత్తాపపడి నా యొద్దకు తిరిగి వచ్చిన యెడల, వారు నా జనుల మధ్య లెక్కింపబడెదరు.

14 మరియు ఇశ్రాయేలు వంశము వారైన నా జనులు వారి మధ్య నుండి వెళ్ళి, వారిని త్రొక్కివేయుటకు నేను అనుమతించనని తండ్రి చెప్పుచున్నాడు.

15 కానీ వారు నా వైపు తిరుగని యెడల మరియు నా స్వరమును ఆలకించని యెడల, ఓ ఇశ్రాయేలు వంశమా, నా జనులు వారి మధ్య నుండి వెళ్ళి వారిని త్రొక్కివేయునట్లు నేను అనుమతించెదను మరియు వారు, బయట పారవేయబడి నా జనుల యొక్క పాదముల క్రింద త్రొక్కివేయబడుటకు తప్ప మరిదేనికీ పనికిరాక నిస్సారమైన ఉప్పు వలెనుందురు.

16 నిశ్చయముగా నేను మీతో చెప్పునదేమనగా, ఈ జనులకు ఈ దేశమును వారి స్వాస్థ్యము నిమిత్తము నేను ఇవ్వవలెనని—ఆ విధముగా తండ్రి నన్ను ఆజ్ఞాపించియున్నాడు.

17 అప్పుడు ప్రవక్త యెషయా ఇట్లు చెప్పిన మాటలు నెరవేరును:

18 నీ కావలివారు పలుకుచున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు, యెహోవా సీయోనును మరలా రప్పించగా వారు కన్నులార చూచుచున్నారు.

19 యెరూషలేమునందు పాడైయున్న స్థలములారా, ఉత్సహించి యేకముగా సంగీతగానము చేయుడి. యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను.

20 యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరచియున్నాడు; భూదిగంత నివాసులందరు దేవుని రక్షణను చూచెదరు.

ముద్రించు