21వ అధ్యాయము
మోర్మన్ గ్రంథము వెలుగులోనికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు సమకూర్చబడును—అన్యజనులు స్వతంత్ర జనులుగా అమెరికాలో స్థిరపడెదరు—వారు విశ్వసించి లోబడిన యెడల, వారు రక్షింపబడుదురు; లేని యెడల, వారు కొట్టివేయబడి నాశనము చేయబడుదురు—ఇశ్రాయేలు నూతన యెరూషలేమును నిర్మించును మరియు తప్పిపోయిన గోత్రములు తిరిగి వచ్చును. సుమారు క్రీ. శ. 34 సం.
1 నిశ్చయముగా నేను మీతో చెప్పునదేమనగా—ఓ ఇశ్రాయేలు వంశమా, నేను నా జనులను వారి దీర్ఘకాలపు వేర్పాటు నుండి సమకూర్చి, వారి మధ్య నా సీయోనును తిరిగి ఎప్పుడు స్థాపించెదనో మరియు ఈ క్రియలు ఎప్పుడు సంభవించునో ఆ సమయమును మీరు తెలుసుకొనునట్లు నేను మీకు ఒక సూచన నిచ్చుచున్నాను;
2 ఇదిగో, ఈ విషయమునే నేను మీకు సూచనగా ఇచ్చెదను, ఏలయనగా నిశ్చయముగా నేను మీతో చెప్పునదేమనగా—నేను మీకు ప్రకటించుచున్న ఈ విషయములు, ఇకపై నా గురించి నేను మీకు తెలియజేయునవి మరియు తండ్రిచేత మీకు ఇవ్వబడు పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా తెలియజేయబడునవి అన్యజనులకు తెలియజేయబడును, ఆ విధముగా వారు యాకోబు సంతతిలో శేషించినవారైన ఈ జనులను గూర్చి మరియు వారి చేత చెదరగొట్టబడిన ఈ నా జనులను గూర్చి ఎరిగియుందురు;
3 నిశ్చయముగా నేను మీతో చెప్పునదేమనగా, తండ్రిద్వారా వారికి ఈ విషయములు తెలియజేయబడినప్పుడు మరియు వారి నుండి తండ్రి ద్వారా మీ యొద్దకు వచ్చునప్పుడు—
4 ఏలయనగా ఈ సంగతులు వారి నుండి మీ సంతానము యొక్క శేషమునకు వచ్చునట్లు, తండ్రి తన జనులతో చేసిన నిబంధన నెరవేరునట్లు ఓ ఇశ్రాయేలు వంశమా, వారు ఈ దేశమందు స్థిరపరచబడి, తండ్రి యొక్క శక్తి ద్వారా స్వతంత్ర జనులుగా స్థాపించబడవలెను అనునది తండ్రి యందు వివేకమైయున్నది;
5 కావున, దుష్టత్వమును బట్టి విశ్వాసమందు క్షీణించు మీ సంతానము యొద్దకు ఈ క్రియలు మరియు ఇక మీదట మీ మధ్య చేయబడు క్రియలు అన్యజనుల నుండి వచ్చునప్పుడు—
6 ఏలయనగా ఆయన తన శక్తిని అన్యజనులకు చూపునట్లు అది అన్యజనుల నుండి ముందుకు వచ్చుట తండ్రికి తగినది; ఈ హేతువు నిమిత్తము అన్యజనులు తమ హృదయములను కఠినపరచుకొనని యెడల, వారు పశ్చాత్తాపపడి నా యొద్దకు వచ్చి నా నామమందు బాప్తిస్మము పొంది, నా సిద్ధాంతము యొక్క సత్యమైన అంశములను ఎరుగునట్లు, ఓ ఇశ్రాయేలు వంశమా, వారు నా జనుల మధ్య లెక్కింపబడెదరు;
7 మరియు ఈ సంగతులు జరుగునప్పుడు, నీ సంతానము ఈ విషయములను తెలుసుకొనుట ప్రారంభించినప్పుడు—ఇశ్రాయేలు వంశస్థులతో ఆయన చేసిన నిబంధనను నెరవేర్చుటకు తండ్రి యొక్క పని ఇప్పటికే ప్రారంభమైనదని వారు తెలుసుకొనునట్లు ఇది వారికి ఒక సూచనగా ఉండును.
8 ఆ దినము వచ్చినప్పుడు, రాజులు తమ నోళ్ళు మూసుకొనెదురు; తమకు తెలియజేయబడని సంగతులు వారు చూచెదరు, తాము వినని దానిని గ్రహింతురు.
9 ఏలయనగా ఆ దినమందు నా నిమిత్తము తండ్రి ఒక కార్యము చేయును, అది వారి మధ్య గొప్ప అద్భుత కార్యముగా ఉండును మరియు ఒకడు వారికి వివరించినను దానిని ఎంతమాత్రము నమ్మని వారు వారి మధ్య ఉండెదరు.
10 కానీ, నా సేవకుని ప్రాణము నా చేతిలో ఉండును; కావున అతడు వారి వలన వికారము చేయబడినను, వారు అతనికి హాని చేయలేరు. ఇంకను అతడిని నేను స్వస్థపరిచెదను, ఏలయనగా అపవాది యొక్క కుయుక్తి కంటే నా జ్ఞానము గొప్పదని నేను వారికి చూపెదను.
11 కావున, యేసు క్రీస్తునైన నా మాటల యందు ఎవరు విశ్వసించరో, వారు నిబంధన జనులైన నా జనుల మధ్యనుండి కొట్టివేయబడుదురు, ఆ మాటలను అన్యజనుల ముందుకు అతడు తెచ్చునట్లు తండ్రి చేయును మరియు అన్యజనులకు అతడు వాటిని తెచ్చునట్లు అతనికి శక్తినిచ్చును (మోషే చెప్పినట్లుగా అది జరుగును).
12 అప్పుడు యాకోబు సంతతిలో శేషించినవారైన నా జనులు అన్యజనుల మధ్యను అనేక జనములలోను అడవిమృగములలో సింహమువలెను, ఎవడును విడిపింపకుండ లోపలికి చొచ్చి గొఱ్ఱెలమందలను త్రొక్కి చీల్చు కొదమసింహమువలెను ఉందురు.
13 వారి హస్తము వారి విరోధుల మీద ఎత్తబడియుండును గాక, వారి శత్రువులందరు నశింతురు గాక.
14 వారు పశ్చాత్తాపపడని యెడల అన్యజనులకు ఆపద; ఏలయనగా ఆ దినమున నేను నీలో గుఱ్ఱములుండకుండ వాటిని బొత్తిగా నాశనము చేతును, నీ రథములను మాపివేతునని తండ్రి సెలవిచ్చుచున్నాడు.
15 నీ దేశమందున్న పట్టణములను నాశనము చేతును, నీ కోటలను పడగొట్టుదును;
16 నీలో చిల్లంగివారు లేకుండ నిర్మూలము చేతును, మేఘములను చూచి మంత్రించువారు ఇక నీలో ఉండరు;
17 నీ చేతిపనికి నీవు మ్రొక్కకుండునట్లు చెక్కిన విగ్రహములును, దేవతా స్తంభములును నీ మధ్య ఉండకుండ నాశనము చేతును;
18 నీ మధ్యను దేవతా స్తంభములుండకుండ వాటిని పెల్లగింతును, నీ పట్టణములను పడగొట్టుదును.
19 సమస్త అబద్ధములు, మోసములు, అసూయలు, కలహములు, యాజక వంచనలు, జారత్వములు నిలిపివేయబడును.
20 ఏలయనగా ఓ ఇశ్రాయేలు వంశమా, ఆ దినమున ఎవరైతే పశ్చాత్తాపపడి నా ప్రియ కుమారుని యొద్దకు రారో, వారిని నేను నా జనుల మధ్య నుండి కొట్టివేయుదునని తండ్రి సెలవిచ్చుచున్నాడు;
21 మరియు అన్యజనులపై వలే, మునుపెన్నడూ విననంతగా నేను వారిపై అత్యాగ్రహము తెచ్చుకొని ప్రతీకారము చేతును.
22 కానీ వారు పశ్చాత్తాపపడి నా మాటలను ఆలకించి, వారి హృదయములను కఠినపరచుకొనని యెడల, నేను వారి మధ్య నా సంఘమును స్థాపించెదను; వారు నిబంధనలోనికి వచ్చెదరు మరియు వారి స్వాస్థ్యము నిమిత్తము నేను ఈ దేశమును ఎవరికి ఇచ్చితినో, ఆ యాకోబు సంతతిలో శేషించిన వారి మధ్య లెక్కింపబడుదురు.
23 మరియు నూతన యెరూషలేమని పిలువబడు ఒక పట్టణమును కట్టుటకు యాకోబు సంతతిలో శేషించినవారైన నా జనులకు మరియు ఇశ్రాయేలు వంశస్థులనుండి వచ్చువారందరికి వారు సహాయము చేయుదరు.
24 అప్పుడు దేశమంతటా చెదిరియున్న నా జనులు నూతన యెరూషలేములో సమకూర్చబడునట్లు వారు సహాయము చేయుదురు.
25 అప్పుడు పరలోకము యొక్క శక్తి వారి మధ్యకు దిగివచ్చును మరియు నేను కూడా వారి మధ్య ఉండెదను.
26 ఆ దినమున, ఈ సువార్త ఈ జనుల యొక్క శేషము మధ్య బోధింపబడునప్పుడు తండ్రి యొక్క పని ప్రారంభమగును. నిశ్చయముగా నేను మీతో చెప్పునదేమనగా—ఆ దినమున నా జనులలోనుండి విడిపోయిన వారందరు, తప్పిపోయిన వారు, యెరూషలేము నుండి తండ్రి బయటకు నడిపించి వేసిన గోత్రముల మధ్య కూడా తండ్రి యొక్క పని ప్రారంభమగును.
27 అనగా, వారు నా నామమందు తండ్రికి ప్రార్థన చేయగలుగునట్లు, వారు నా యొద్దకు రాగలుగుటకు మార్గమును తండ్రి సిద్ధము చేయుచుండగా, నా జనులలోనుండి విడిపోయిన వారందరి మధ్య పని ప్రారంభమగును.
28 అప్పుడు ఆయన జనులు వారి స్వాస్థ్యమైన దేశమునకు, ఇంటికి చేర్చబడునట్లు సమస్త జనముల మధ్య తండ్రి మార్గము సిద్ధపరచుచుండగా పని ప్రారంభమగును.
29 వారు సమస్త జనముల నుండి బయటకు వెళ్ళుదురు మరియు వారు త్వరపడి బయలుదేరరు, పారిపోవురీతిగా వెళ్ళరు, ఏలయనగా నేను వారి ముందర నడిచెదను, నేను వారి సైన్యపు వెనుకటి భాగమును కావలికాచెదనని తండ్రి సెలవిచ్చుచున్నాడు.