లేఖనములు
3 నీఫై 8


8వ అధ్యాయము

తుఫానులు, భూకంపములు, మంటలు, సుడిగాలులు మరియు భౌతిక మార్పులు క్రీస్తు సిలువ వేయబడుటను ధృవీకరించును—అనేకమంది జనులు నాశనము చేయబడుదురు—మూడు దినముల పాటు దేశముపై చీకటి కమ్మును—మిగిలిన వారు, వారి దుస్థితిని బట్టి దుఃఖించెదరు. సుమారు క్రీ. శ. 33–34 సం.

1 ఇప్పుడు మా వృత్తాంతమును బట్టి—మా వృత్తాంతము సత్యమని మేమెరుగుదుము, ఏలయనగా వృత్తాంతమును వ్రాసినదొక న్యాయవంతుడు—అతడు నిజముగా యేసు నామమందు అనేక అద్భుతకార్యములు చేసెను; మరియు తన దుర్నీతి నుండి అణువణువు కడుగబడితే తప్ప, యేసు నామమందు అద్భుతకార్యమును చేయగలిగిన మనుష్యుడెవడూ లేడు—

2 ఇప్పుడు మా కాలమును లెక్కించుటలో ఈ మనుష్యుని చేత ఏ పొరపాటు చేయబడని యెడల, ముప్పది మూడవ సంవత్సరము గడిచిపోయెను;

3 లేమనీయుడైన సమూయేలు ప్రవక్త చేత ఇవ్వబడిన సూచన కొరకు, అనగా దేశమంతటిపై మూడు దినముల పాటు అంధకారముండు సమయము కొరకు జనులు గొప్ప ఆతురతతో ఎదురుచూచుట మొదలుపెట్టిరి.

4 మరియు అన్ని అధికమైన సూచనలు ఇవ్వబడినప్పటికీ జనుల మధ్య గొప్ప సందేహములు, వివాదములుండుట మొదలాయెను.

5 ముప్పది నాలుగవ సంవత్సరమందు మొదటి నెల యొక్క నాలుగవ దినమున దేశమందంతటా ఎన్నడూ ఎరిగియుండని ఒక పెద్ద తుఫాను రేగెను.

6 మహా భయంకరమైన గాలివాన మరియు భీకరమైన ఉరుములు కూడా ఉండెను, ఎంతగాననగా అది ముక్కలుగా చీల్చునంతగా భూమియంతటిని కంపింపజేసెను.

7 దేశమంతటా ఎన్నడూ ఎరిగియుండని మిక్కిలి తీక్షణమైన మెరుపులుండెను.

8 జరహేమ్ల పట్టణము మంటలలో కాలిపోసాగెను.

9 మొరోనై పట్టణము సముద్రపు లోతులలో మునిగెను మరియు దాని నివాసులు ముంచబడిరి.

10 మొరోనైహా పట్టణముపై మట్టి కప్పబడెను, ఆ పట్టణము యొక్క స్థానములో గొప్ప పర్వతము పైకిలేచెను.

11 మరియు దక్షిణ దేశమందు మహా భయంకరమైన నాశనముండెను.

12 కానీ, ఉత్తర దేశమందు అత్యంత భయంకరమైన నాశనముండెను; ఏలయనగా తుఫానులు, సుడిగాలులు, ఉరుములు, మెరుపులు మరియు తీవ్ర భూకంపములను బట్టి దేశము యొక్క ముఖమంతయు మార్పు చెందెను.

13 రహదారులు ముక్కలాయెను మరియు సమమట్టముగా ఉన్న దారులు పాడుచేయబడెను, అనేక నున్నని స్థలములు గరుకాయెను.

14 అనేక గొప్ప మరియు ప్రఖ్యాత పట్టణములు ముంచబడెను, అనేకము కాల్చివేయబడెను మరియు అనేకము, వాటి భవనములు నేలకూలి, వాటి నివాసులు సంహరింపబడి, అక్కడి స్థలములు నిర్జనముగా వదిలి వేయబడు వరకు కంపించబడెను.

15 మరియు కొన్ని పట్టణములు నిలిచియుండెను; కానీ వాటి నష్టము మిక్కిలి గొప్పదైయుండి, వాటిలో సంహరింపబడిన వారు అనేకులుండిరి.

16 సుడిగాలిలో కొట్టుకొనిపోబడిన వారు కొందరుండిరి మరియు వారు కొట్టుకొనిపోబడిరని ఎరుగుట తప్ప, వారు ఎక్కడకు వెళ్ళిరో ఏ మనుష్యుడు ఎరుగడు.

17 ఆ విధముగా తుఫానులు, ఉరుములు, మెరుపులు మరియు భూకంపాలను బట్టి భూముఖమంతా వికృతము చేయబడెను.

18 మరియు బండలు రెండుగా చీల్చబడెను; దేశమంతటిపై అవి విరిగిన ముక్కలలో, అతుకులలో, పగుళ్ళలో కనబడునంతగా భూముఖమంతటిపై అవి ముక్కలాయెను.

19 ఉరుములు, మెరుపులు, గాలివాన, తుఫాను మరియు భూకంపములు ఆగినప్పుడు—ఏలయనగా, అవి సుమారు మూడు గంటలపాటు ఉండెను మరియు అంతకంటే ఎక్కువ సమయమని కొందరి చేత చెప్పబడినప్పటికీ, మహా భయంకరమైన ఈ పరిణామములన్నియు సుమారు మూడు గంటలపాటు జరిగెను—అప్పుడు దేశమంతటిపై చీకటికమ్మెను.

20 మరియు భూముఖమంతటా గాఢాంధకారముండెను, ఎంతగాననగా నేలకు కూలని దాని నివాసులు అంధకారపు ఆవిరిని గ్రహించగలిగిరి;

21 మరియు అంధకారమునుబట్టి వెలుగుగాని, క్రొవ్వొత్తులుగాని, కాగడాలుగాని లేకుండెను; బాగా ఎండిన శ్రేష్ఠమైన కలపతో అగ్ని రగులుకొనలేకపోయెను, కావున అక్కడ ఎంతమాత్రము వెలుగు లేకపోయెను.

22 మరియు అక్కడ ఏ వెలుగు, అగ్ని, కిరణము, సూర్యుడు, చంద్రుడు లేదా నక్షత్రములు లేకుండెను, ఏలయనగా దేశమంతటిపైనున్న అంధకారము యొక్క పొగమంచులు అంత గొప్పవైయుండెను.

23 మూడు దినముల పాటు అక్కడ వెలుగు కనబడకుండెను; నిరంతరము జనులందరి మధ్య గొప్ప దుఃఖము, ఆక్రందన మరియు విలాపముండెను; వారి మీదికి వచ్చిన అంధకారము మరియు గొప్ప నాశనమును బట్టి జనులు అధికముగా మూలుగుచుండిరి.

24 మరియు ఒక స్థలమందు వారు ఇట్లు చెప్పుచూ రోదించుట వినబడెను: అయ్యో, ఈ మహా భయంకరమైన దినమునకు ముందే మనము పశ్చాత్తాపపడియున్న ఎంత మేలు! అప్పుడు మన సహోదరులు తప్పించబడియుండేవారు మరియు ఆ గొప్ప జరహేమ్ల పట్టణమందు వారు కాల్చివేయబడకుండా ఉండేవారు.

25 ఇంకొక స్థలమందు వారు ఇట్లు చెప్పుచూ రోదించుట మరియు దుఃఖించుట వినబడెను: అయ్యో, ఈ మహా భయంకరమైన దినమునకు ముందే మనము పశ్చాత్తాపపడి, ప్రవక్తలను చంపకుండా, రాళ్ళతో కొట్టకుండా, బయటకు గెంటివేయకుండిన యెడల ఎంత మేలు! అప్పుడు మన తల్లులు, సుందరమైన మన కుమార్తెలు మరియు మన పిల్లలు తప్పించబడియుండి, ఆ గొప్ప పట్టణమైన మొరోనైహా యందు పాతిపెట్టబడకుండా ఉండేవారు. ఆ విధముగా జనుల యొక్క ఆక్రందనలు మహా భయంకరముగా ఉండెను.

ముద్రించు