15వ అధ్యాయము
మోషే ధర్మశాస్త్రము ఆయన యందు నెరవేర్చబడినదని యేసు ప్రకటించును—యెరూషలేములో ఆయన చెప్పిన ఇతర గొఱ్ఱెలే నీఫైయులు—దుర్నీతి వలన యెరూషలేమునందున్న ప్రభువు యొక్క జనులు ఇశ్రాయేలు యొక్క చెదిరిన గొఱ్ఱెలను గూర్చి ఎరుగరు. సుమారు క్రీ. శ. 34 సం.
1 ఇప్పుడు యేసు ఈ మాటలను చెప్పుట ముగించినప్పుడు, ఆయన సమూహము వైపు చూచి వారితో ఇట్లనెను: ఇదిగో, నా తండ్రి యొద్దకు ఆరోహణమగుటకు ముందు నేను బోధించిన విషయములను మీరు వినియున్నారు; కావున నా ఈ మాటలను జ్ఞాపకముంచుకొని, వాటిచొప్పున చేయువానిని అంత్యదినమున నేను లేపుదును.
2 యేసు ఈ మాటలు చెప్పినప్పుడు మోషే ధర్మశాస్త్రమును గూర్చి ఆయన ఏమి చెప్పునోయని ఆశ్చర్యపడుచూ తెలుసుకొనగోరుచున్న కొందరు వారి మధ్య ఉండిరని ఆయన చూచెను; ఏలయనగా, పాత విషయములు గతించిపోయెను మరియు సమస్త విషయములు క్రొత్తవాయెను అను మాటను వారు గ్రహించలేకపోయిరి.
3 మరియు ఆయన వారితో ఇట్లు చెప్పెను: పాత విషయములు గతించిపోయెను మరియు సమస్త విషయములు క్రొత్తవాయెనని నేను మీతో చెప్పితినని ఆశ్చర్యపడకుడి.
4 నేను మీతో చెప్పునదేమనగా, మోషేకు ఇవ్వబడిన ధర్మశాస్త్రము నెరవేరినది.
5 ఇదిగో, ధర్మశాస్త్రమును ఇచ్చిన వాడను నేనే, నా జనులైన ఇశ్రాయేలుతో నిబంధన చేసిన వాడను నేనే; కావున ధర్మశాస్త్రము నా యందు నెరవేరెను, ఏలయనగా నేను ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు వచ్చియున్నాను; కావున, అది ముగించబడెను.
6 ఇదిగో, నేను ప్రవక్తలను నాశనము చేయను, ఏలయనగా నా యందు ఎన్ని నెరవేరలేదో అవన్నియు నెరవేరునని నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను.
7 మరియు పాత విషయములు గతించిపోయెనని నేను మీతో చెప్పితిని, కనుక రాబోవు విషయములను గూర్చి చెప్పబడిన దానిని నేను నాశనము చేయను.
8 ఏలయనగా, నా జనులతో నేను చేసిన నిబంధన అంతయు నెరవేరలేదు; కానీ మోషేకు ఇవ్వబడిన ధర్మశాస్త్రము నా యందు ముగించబడియుండెను.
9 నేనే ధర్మశాస్త్రమును, వెలుగునైయున్నాను. నా వైపు చూచి, అంతము వరకు సహించుడి మరియు మీరు జీవించెదరు; ఏలయనగా అంతము వరకు సహించువానికి నేను నిత్యజీవము నిచ్చెదను.
10 ఇదిగో, నేను మీకు ఆజ్ఞలను ఇచ్చియున్నాను; కావున నా ఆజ్ఞలను గైకొనుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునైయున్నది, ఏలయనగా వారు నిజముగా నన్ను గూర్చి సాక్ష్యమిచ్చిరి.
11 ఇప్పుడు యేసు ఈ మాటలను చెప్పినప్పుడు, తాను ఎన్నుకొనిన ఆ పడ్రెండుగురితో ఆయన ఇట్లు చెప్పెను:
12 మీరు నా శిష్యులైయున్నారు; మరియు యోసేపు వంశము యొక్క శేషమైన ఈ జనులకు మీరు వెలుగైయున్నారు.
13 ఇదిగో, ఇది మీ స్వాస్థ్యమైన దేశము మరియు తండ్రి దానిని మీకు ఇచ్చియున్నాడు.
14 ఏ సమయమందైనను యెరూషలేములోనున్న మీ సహోదరులకు నేను దీనిని చెప్పవలెనని తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చియుండలేదు.
15 లేక ఏ సమయమందైనను దేశము నుండి తండ్రి బయటకు నడిపించి వేసిన ఇశ్రాయేలు వంశము యొక్క ఇతర గోత్రములను గూర్చి నేను వారికి చెప్పవలెనని తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చియుండలేదు.
16 ఇంతమట్టుకు నేను వారితో చెప్పవలెనని తండ్రి నన్ను ఆజ్ఞాపించెను:
17 ఈ దొడ్డివి కాని ఇతర గొఱ్ఱెలను నేను కలిగియున్నాను; వాటిని కూడా నేను తేవలెను మరియు అవి నా స్వరమును వినును; అప్పుడు ఒకే దొడ్డి, ఒకే కాపరి ఉండును.
18 ఇప్పుడు మెడబిరుసుతనము మరియు అవిశ్వాసమును బట్టి వారు నా మాట గ్రహించలేదు; కావున ఈ విషయమును గూర్చి ఇంతకుమించి వారికి చెప్పరాదని నేను తండ్రి ద్వారా ఆజ్ఞాపించబడితిని.
19 కానీ, మీతో చెప్పమని తండ్రి నన్ను ఆజ్ఞాపించియున్నాడని నిశ్చయముగా నేను మీతో చెప్పునదేమనగా—వారి దుర్నీతిని బట్టి మీరు వారి నుండి వేరుచేయబడిరి; కావున, వారి దుర్నీతిని బట్టియే వారు మిమ్ములను ఎరుగరు.
20 ఇతర గోత్రములను తండ్రి వారి నుండి వేరుచేసియున్నాడని తిరిగి నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను; వారి దుర్నీతిని బట్టి వారు వారిని ఎరుగకుండిరి.
21 మరియు ఈ దొడ్డివికాని ఇతర గొఱ్ఱెలను నేను కలిగియున్నాను, వాటిని కూడా నేను తేవలెను మరియు అవి నా స్వరమును వినును, అప్పుడక్కడ ఒకే దొడ్డి ఒకే కాపరి ఉండునని నేను చెప్పిన వారు మీరేనని నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను.
22 వారు నన్ను గ్రహించలేదు, ఏలయనగా అది అన్యజనులైయుండెనని వారు తలంచిరి; ఏలయనగా వారి బోధ ద్వారా అన్యజనులు పరివర్తన పొందవలెనని వారు గ్రహించలేదు.
23 వారు నా స్వరమును విందురని నేను చెప్పినప్పుడు వారు నన్ను గ్రహించలేదు; మరియు అన్యజనులు, ఏ సమయమందైనను నా స్వరమును వినరాదని—పరిశుద్ధాత్మ ద్వారా తప్ప, నన్ను నేను వారికి ప్రత్యక్ష పరచుకొనరాదని వారు గ్రహించలేదు.
24 కానీ మీరు నా మాట వింటిరి, నన్ను చూచితిరి; మీరు నా గొఱ్ఱెలై యున్నారు మరియు తండ్రి నాకు ఇచ్చిన వారి మధ్య మీరు లెక్కింపబడియున్నారు.