లేఖనములు
3 నీఫై 20


20వ అధ్యాయము

యేసు రొట్టెను, ద్రాక్షారసమును అద్భుతముగా సమకూర్చును మరియు తిరిగి జనుల కొరకు సంస్కారమును నిర్వహించును—యాకోబు యొక్క శేషము తమ దేవుడైన ప్రభువును తెలుసుకొనును మరియు అమెరికాను స్వాస్థ్యముగా పొందును—యేసు, మోషే వంటి ప్రవక్త మరియు నీఫైయులు ప్రవక్తల యొక్క పిల్లలు—ప్రభువు యొక్క జనులలోని ఇతరులు యెరూషలేమునందు సమకూర్చబడుదురు. సుమారు క్రీ. శ. 34 సం.

1 ఇక వారు ప్రార్థన చేయుట ఆపవలెనని, ఆయన సమూహమును మరియు తన శిష్యులను కూడా ఆజ్ఞాపించెను. వారు తమ హృదయములందు ప్రార్థించుట మానరాదని ఆయన వారిని ఆజ్ఞాపించెను.

2 వారు లేచి వారి కాళ్ళపైన నిలబడవలెనని ఆయన వారిని ఆజ్ఞాపించగా, వారు పైకి లేచి నిలబడిరి.

3 ఆయన మరలా రొట్టెను విరిచి, దానిని ఆశీర్వదించి శిష్యులకు తినమని ఇచ్చెను.

4 వారు తినిన తరువాత, వారు రొట్టెను విరిచి సమూహమునకు ఇవ్వవలెనని ఆయన వారిని ఆజ్ఞాపించెను.

5 వారు సమూహమునకు ఇచ్చిన తరువాత, ఆయన వారికి త్రాగుటకు ద్రాక్షారసమును కూడా ఇచ్చెను మరియు వారు సమూహమునకు ఇవ్వవలెనని వారిని ఆజ్ఞాపించెను.

6 ఇప్పుడు శిష్యుల చేత లేదా సమూహము చేత తేబడిన రొట్టె గానీ లేదా ద్రాక్షారసము గానీ అక్కడ లేకుండెను;

7 కానీ ఆయన నిజముగా వారికి తినుటకు రొట్టెను, త్రాగుటకు ద్రాక్షారసమును కూడా ఇచ్చెను.

8 మరియు ఆయన వారితో ఇట్లనెను: ఈ రొట్టెను తినువాడు, అతని ఆత్మకొరకు నా శరీరమును తినుచున్నాడు మరియు ఈ ద్రాక్షారసమును త్రాగువాడు, అతని ఆత్మకొరకు నా రక్తమును త్రాగుచున్నాడు; అతని ఆత్మ ఎన్నడూ ఆకలిగొనదు లేదా దప్పిగొనదు, కానీ నింపబడును.

9 ఇప్పుడు సమూహమంతయు తిని త్రాగినప్పుడు, వారు ఆత్మతో నింపబడిరి; వారు ఏకస్వరముతో కేక వేసిరి మరియు వారు చూచిన, వినిన యేసును మహిమపరచిరి.

10 వారందరు యేసును మహిమపరచినప్పుడు, ఆయన వారితో ఇట్లు చెప్పెను: ఇదిగో, ఇశ్రాయేలు వంశము యొక్క శేషమైన ఈ జనులను గూర్చి తండ్రి నాకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను ఇప్పుడు నేను ముగించెదను.

11 నేను మీతో మాట్లాడి, యెషయా యొక్క మాటలు ఎప్పుడు నెరవేరునో చెప్పితినని మీకు జ్ఞాపకమున్నదా—ఇదిగో అవి వ్రాయబడినవి, అవి మీ యెదుటనున్నవి, కావున వాటిని వెదకుడి—

12 నిశ్చయముగా నేను మీతో చెప్పునదేమనగా, అవి ఎప్పుడు నెరవేరునో అప్పుడు ఇశ్రాయేలు వంశస్థులైన తన జనులకు తండ్రి చేసిన నిబంధన నెరవేరును.

13 అప్పుడు భూముఖముపై దూరముగా చెదిరిపోయిన శేషములు తూర్పు నుండి, పడమటి నుండి, దక్షిణము నుండి మరియు ఉత్తరము నుండి సమకూర్చబడుదురు; వారిని విమోచించిన వారి దేవుడైన ప్రభువును వారు తెలుసుకొనెదరు.

14 మరియు మీ స్వాస్థ్యము కొరకు ఈ దేశమును మీకు ఇవ్వవలెనని తండ్రి నన్ను ఆజ్ఞాపించియున్నాడు.

15 ఇప్పుడు నేను మీతో చెప్పునదేమనగా, అన్యజనులు నా జనులను చెదరగొట్టిన తరువాత వారు ఆశీర్వాదము పొందిన పిమ్మట పశ్చాత్తాపపడని యెడల—

16 అప్పుడు యాకోబు సంతతిలో శేషించినవారైన మీరు, వారి మధ్యకు వెళ్ళవలెను; మీరు అనేక జనముల మధ్య ఉందురు మరియు అడవిమృగములలో సింహమువలెను, ఎవడును విడిపింపకుండ లోపలికి చొచ్చి గొఱ్ఱెలమందలను త్రొక్కి చీల్చు కొదమసింహమువలెను మీరు వారి మధ్యనుందురు.

17 మీ హస్తము మీ విరోధుల మీద ఎత్తబడియుండును గాక, మీ శత్రువులందరు నశింతురు గాక.

18 మరియు ఒక మనుష్యుడు తన కళ్ళములోనికి పనలు కూర్చునట్లు, నా జనులను నేను సమకూర్చెదను.

19 ఏలయనగా నా తండ్రి నిబంధన చేసిన జనులను నేనిట్లు చేయుదును, అనగా నీ శృంగము ఇనుపదిగాను, నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేసెదను మరియు అనేక జనములను నీవు అణగ ద్రొక్కుదువు, వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును, వారి ఆస్తిని సర్వలోకనాధునికి ప్రతిష్ఠించుదును, ఇదిగో దానిని చేయువాడను నేనే.

20 ఆ దినమున నా న్యాయపు ఖడ్గము వారిపై వ్రేలాడునని తండ్రి చెప్పుచున్నాడు; వారు పశ్చాత్తాపపడని యెడల అది వారిపై మరియు అన్యజనుల యొక్క సమస్త జనములపై కూడా పడునని తండ్రి చెప్పుచున్నాడు.

21 ఓ ఇశ్రాయేలు వంశమా, నేను నా జనులను స్థాపించెదను.

22 ఇదిగో, నేను మీ తండ్రి యాకోబుతో చేసిన నిబంధన యొక్క నెరవేర్పు కొరకు ఈ జనులను ఈ దేశమందు స్థాపించెదను మరియు అది ఒక నూతన యెరూషలేమైయుండును. పరలోకపు శక్తులు ఈ జనుల మధ్య ఉండును, నేను కూడా మీ మధ్య ఉండెదను.

23 ఇదిగో, మోషే ఎవరిని గూర్చి చెప్పెనో ఆయనను నేనే: ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీకొరకు పుట్టించును; ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును అని అతడు చెప్పెను.

24 మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చిరని నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను.

25 ఇదిగో, మీరు ప్రవక్తల యొక్క పిల్లలైయున్నారు; మీరు ఇశ్రాయేలు వంశస్థులైయున్నారు; మరియు దేవుడు అబ్రాహాముతో—నీ సంతానమందు భూలోక వంశములన్నియు ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులైయున్నారు.

26 తండ్రి మొదట నన్ను మీ కొరకు పుట్టించి, మీలో ప్రతివానిని వాని దుష్టత్వమునుండి మళ్ళించుటవలన మిమ్మునాశీర్వదించుటకు నన్ను మొదట మీయొద్దకు పంపెను; ఇది, మీరు నిబంధన యొక్క సంతానమగుటను బట్టియే—

27 మరియు మీరు ఆశీర్వదింపబడిన తరువాత, నీ సంతానమందు భూలోక వంశములన్నియు ఆశీర్వదింపబడునని చెప్పి తాను అబ్రాహాముతో చేసిన నిబంధనను తండ్రి నెరవేర్చును; ఫలితముగా అన్యజనులపై నా ద్వారా పరిశుద్ధాత్మ అనుగ్రహించబడును; ఓ ఇశ్రాయేలు వంశమా, అన్యజనులకివ్వబడిన ఆ ఆశీర్వాదము నా జనులను చెదరగొట్టునంతగా వారిని అందరికన్నా అధిక బలవంతులుగా చేయును.

28 వారు ఈ దేశ జనులకు ఒక శాపముగా ఉండెదరు. అయినప్పటికీ, వారు నా సువార్త యొక్క సంపూర్ణతను పొందిన తరువాత నాకు వ్యతిరేకముగా తమ హృదయములను కఠినపరచుకొనిన యెడల, నేను వారి దుర్ణీతులను వారి శిరస్సులపైకి తిరిగి తెచ్చెదనని తండ్రి సెలవిచ్చుచున్నాడు.

29 నా జనులతో నేను చేసిన నిబంధనను నేను జ్ఞాపకము చేసుకొనెదను మరియు నా యుక్త కాలమందు నేను వారిని సమకూర్చెదనని, వారి పితరుల యొక్క దేశమైన యెరూషలేము దేశమును వారి స్వాస్థ్యముగా తిరిగి ఇచ్చెదనని, అది వారికి నిరంతరము వాగ్దానదేశముగా ఉండునని వారితో నిబంధన చేసియున్నానని తండ్రి సెలవిచ్చుచున్నాడు.

30 మరియు నా సువార్త యొక్క సంపూర్ణత వారికి బోధించబడు సమయము వచ్చును;

31 నేనే యేసు క్రీస్తునని, దేవుని కుమారుడనని వారు నా యందు విశ్వాసముంచవలెను మరియు నా నామమందు తండ్రికి ప్రార్థన చేయవలెను.

32 అప్పుడు వారి కావలివారు పలికెదరు, కూడుకొని బిగ్గరగా పాడెదరు; ఏలయనగా, వారు కన్నులార చూచుచున్నారు;

33 అప్పుడు తండ్రి వారిని తిరిగి సమకూర్చి, యెరూషలేమును వారి స్వాస్థ్యముగా ఇచ్చును.

34 అప్పుడు యెరూషలేమునందు పాడైయున్న స్థలములు ఉత్సహించి ఏకముగా సంగీతగానము చేయును; ఏలయనగా తండ్రి తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను.

35 సమస్త జనముల కన్నుల యెదుట తండ్రి తన పరిశుద్ధ బాహువును బయలుపరచియున్నాడు; భూదిగంత నివాసులందరు తండ్రి రక్షణను చూచెదరు; తండ్రి మరియు నేను ఏకమైయున్నాము.

36 అప్పుడు వ్రాయబడినది జరుగును: సీయోనూ, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము; పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము; ఇకమీదట సున్నతిపొందని వాడొకడైనను, అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు.

37 ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము; చెరపట్టబడిన సీయోను కుమారీ, నీ మెడకట్లు విప్పివేసికొనుము.

38 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు—మీరు ఊరకయే అమ్మబడితిరి గదా, రూకలియ్యకయే మీరు విమోచింపబడెదరు.

39 నిశ్చయముగా నేను మీతో చెప్పునదేమనగా—నా జనులు నా నామమును తెలుసుకొందురు; మాట్లాడువాడను నేనే అని ఆ దినమందు వారు తెలుసుకొందురు.

40 అప్పుడు వారు ఇట్లు చెప్పుదురు: సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైయున్నవి.

41 మరియు అప్పుడు ఒక కేక ముందుకు వెళ్ళును: పోవుడి, పోవుడి, అచ్చట నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి; దాని యొద్దనుండి తొలగిపోవుడి; యెహోవా సేవోపకరణములను మోయువారలారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి.

42 మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవురీతిగా వెళ్ళరు; యెహోవా మీ ముందర నడచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును.

43 ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును; అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాఘనుడుగా ఎంచబడును.

44 నిన్ను చూచి యే మనిషి రూపము కంటె అతని ముఖమును, నరరూపము కంటె అతని రూపమును చాలా వికారమని చాలామంది యేలాగు విస్మయమొందిరో—

45 ఆలాగే అతడు అనేక జనములను చిలకరించును; రాజులు అతని చూచి తమ నోళ్ళు మూసుకొనెదురు, తమకు తెలియజేయబడని సంగతులు వారు చూచెదరు; తాము వినని దానిని గ్రహింతురు.

46 నిశ్చయముగా నేను మీతో చెప్పునదేమనగా—తండ్రి నన్ను ఆజ్ఞాపించినట్లే ఈ సంగతులన్నియు తప్పక జరుగును. అప్పుడు తన జనులతో తండ్రి చేసిన ఈ నిబంధన నెరవేరును; అప్పుడు యెరూషలేములో తిరిగి నా జనులు నివాసముండెదరు మరియు అది వారి స్వాస్థ్యము యొక్క దేశమగును.