లేఖనములు
3 నీఫై 14


14వ అధ్యాయము

తీర్పు తీర్చవద్దు, దేవుని అడుగుడి, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపడుడి, అని యేసు ఆజ్ఞాపించును—తండ్రి చిత్తమును జరిగించు వారికి ఆయన రక్షణను వాగ్దానము చేయును—మత్తయి 7 తో పోల్చుము. సుమారు క్రీ. శ. 34 సం.

1 మరియు యేసు ఈ మాటలు పలికినప్పుడు ఆయన మరలా సమూహము వైపు తిరిగి ఇట్లు చెప్పుచూ వారితో మాట్లాడెను: నిశ్చయముగా నేను మీతో చెప్పునదేమనగా మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు.

2 మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును; మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలువబడును.

3 నీ కంటిలోనున్న దూలమునెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయేల?

4 నీ కంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచి—నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేల?

5 వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసుకొనుము; అప్పుడు నీ సహోదరుని కంటిలో నున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును.

6 పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల యెదుట వేయకుడి; వేసినయెడల అవి యొకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును.

7 అడుగుడి మీకియ్యబడును; వెదకుడి మీకు దొరకును; తట్టుడి మీకు తీయబడును.

8 అడుగు ప్రతివాడును పొందును; వెదకువానికి దొరకును; తట్టువానికి తీయబడును.

9 మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగినయెడల, వానికి రాతినిచ్చునా?

10 చేపను అడిగిన యెడల, పామునిచ్చునా?

11 మీరు చెడ్డవారై యుండియు మీ పిల్లలకు మంచి యీవుల నియ్యనెరిగి యుండగా పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి యీవులనిచ్చును.

12 కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునైయున్నది.

13 ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు;

14 జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునైయున్నది, దాని కనుగొనువారు కొందరే.

15 అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపడుడి, వారు గొఱ్ఱెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు.

16 వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్షపండ్లనైనను, పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా?

17 ఆలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కానిఫలములు ఫలించును.

18 మంచి చెట్టు కానిఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు.

19 మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును.

20 కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు.

21 ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.

22 ఆ దినమందు అనేకులు నన్ను చూచి—ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు.

23 అప్పుడు—నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును.

24 కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును.

25 వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు.

26 మరియు ఈ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును.

27 వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను; దాని పాటు గొప్పదని చెప్పెను.