9వ అధ్యాయము
వారి దుష్టత్వమును బట్టి అనేకమంది జనులు మరియు పట్టణముల నాశనమును అంధకారమందు క్రీస్తు యొక్క స్వరము ప్రకటించును—తన దైవత్వమును కూడా ఆయన ప్రకటించును, మోషే ధర్మశాస్త్రము నెరవేరినదని ప్రకటించును మరియు ఆయన యొద్దకు వచ్చి రక్షింపబడవలెనని మనుష్యులను ఆహ్వానించును. సుమారు క్రీ. శ. 34 సం.
1 మరియు ఈ దేశమంతటిపై భూనివాసులందరి మధ్య ఒక స్వరము ఇట్లు కేక వేయుచూ వినబడెను:
2 ఆపద, ఆపద, ఈ జనులకు ఆపద; వారు పశ్చాత్తాపపడితే తప్ప, భూనివాసులందరికి ఆపద; ఏలయనగా సంహరింపబడిన నా జనుల యొక్క అందమైన కుమారులు, కుమార్తెలను బట్టి అపవాది పరిహసించుచున్నాడు, అతని దూతలు ఆనందించుచున్నారు; వారు పతనమైనది వారి దుష్టత్వము మరియు హేయకార్యములను బట్టియే!
3 ఇదిగో, ఆ గొప్ప పట్టణమైన జరహేమ్లను, దాని నివాసులను నేను అగ్నితో కాల్చివేసియున్నాను.
4 మరియు ఆ గొప్ప పట్టణమైన మొరోనై సముద్రపు లోతులలోనికి ముంచి వేయబడి, దాని నివాసులు ముంచి వేయబడునట్లు నేను చేసియున్నాను.
5 ఇదిగో, ప్రవక్తలు మరియు పరిశుద్ధుల యొక్క రక్తము వారికి వ్యతిరేకముగా ఇకపై నా యొద్దకు రాకుండునట్లు నా యెదుట నుండి వారి దుర్ణీతులు మరియు వారి హేయకార్యములను దాచుటకు, ఆ గొప్ప పట్టణమైన మొరోనైహాను, దాని నివాసులను నేను మట్టితో కప్పియున్నాను.
6 ఇదిగో గిల్గాలు పట్టణము ముంచి వేయబడునట్లు మరియు దాని నివాసులు భూమి యొక్క అగాధ స్థలములలో పాతిపెట్టబడునట్లు నేను చేసియున్నాను;
7 అనగా, ప్రవక్తలు మరియు పరిశుద్ధుల యొక్క రక్తము వారికి వ్యతిరేకముగా ఇకపై నా యొద్దకు రాకుండునట్లు, నా యెదుట నుండి వారి దుష్టత్వమును, హేయకార్యములను దాచుటకు ఒనిహా పట్టణము, దాని నివాసులు, మోకుము పట్టణము, దాని నివాసులు మరియు యెరూషలేము పట్టణము, దాని నివాసులు ముంచి వేయబడునట్లు చేసి, వాటి స్థానములో జలములు వచ్చునట్లు నేను చేసియున్నాను.
8 ఇదిగో, ప్రవక్తలు మరియు పరిశుద్ధుల యొక్క రక్తము వారికి వ్యతిరేకముగా ఇకపై నా యొద్దకు రాకుండునట్లు, నా యెదుట నుండి వారి దుష్టత్వమును, హేయకార్యములను దాచుటకు గదియాంది పట్టణము, గద్యోమ్మా పట్టణము, జేకబ్ పట్టణము, గిమ్గిమ్నో పట్టణము, ఇవన్నియు ముంచబడునట్లు చేసి, వాటి స్థానములో కొండలు, లోయలు వచ్చునట్లు నేను చేసితిని మరియు వాటి నివాసులను నేను భూమి యొక్క అగాధ స్థలములలో పాతిపెట్టితిని.
9 ఇదిగో వారి రహస్య హత్యలు, కూడికలను బట్టి సమస్త భూమి యొక్క దుష్టత్వమును మించిన వారి పాపములు మరియు వారి దుష్టత్వమును బట్టి జేకబ్ రాజు యొక్క జనులు నివాసమున్న ఆ గొప్ప పట్టణమైన జేకబ్గాతును నేను అగ్నితో కాల్చబడునట్లు చేసియున్నాను; ఏలయనగా నా జనుల యొక్క సమాధానమును, దేశము యొక్క ప్రభుత్వమును నాశనము చేసినది వారే; కావున, ప్రవక్తలు మరియు పరిశుద్ధుల యొక్క రక్తము వారికి వ్యతిరేకముగా ఇకపై నా యొద్దకు రాకుండునట్లు నా యెదుట నుండి వారిని నాశనము చేయుటకు వారు కాల్చబడునట్లు నేను చేసితిని.
10 ఇదిగో వారి దుష్టత్వము, హేయకార్యములను గూర్చి వారికి ప్రకటించుటకు నేను పంపిన వారిని రాళ్ళతో కొట్టి, ప్రవక్తలను బయటకు గెంటివేయుట యందు వారి దుర్మార్గమును బట్టి లేమన్ పట్టణము, జాష్ పట్టణము, గాదు పట్టణము, కిష్క్యుమెన్ పట్టణము మరియు వాటి నివాసులు అగ్నిచేత కాల్చబడునట్లు నేను చేసితిని.
11 మరియు వారి మధ్య నీతిమంతులెవరు లేకుండునట్లు వారందరినీ వారు బయటకు గెంటివేసిరి, కావున నేను వారి మధ్యకు పంపిన ప్రవక్తలు మరియు పరిశుద్ధుల యొక్క రక్తము వారికి వ్యతిరేకముగా నేల నుండి నాకు మొరపెట్టకుండునట్లు వారి దుష్టత్వము, హేయకార్యములు నా యెదుట నుండి దాచబడునట్లు నేను అగ్నిని పంపి, వారిని నాశనము చేసితిని.
12 వారి దుష్టత్వములను, హేయకార్యములను బట్టి ఈ దేశముపై మరియు ఈ జనులపై అధికమైన నాశనములు వచ్చునట్లు నేను చేసియున్నాను.
13 వారికంటే అధిక నీతిమంతులైనందున విడిచిపెట్టబడిన మీరందరు, నేను మిమ్ములను స్వస్థపరచునట్లు ఇప్పుడు నా యొద్దకు తిరిగివచ్చి, మీ పాపముల విషయమై పశ్చాత్తాపపడి పరివర్తన నొందరా?
14 మీరు నా యొద్దకు వచ్చిన యెడల, మీరు నిత్యజీవము కలిగియుందురని నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను. ఇదిగో కనికరము గల నా బాహువు మీ వైపు చాపబడినది మరియు వచ్చు వానిని నేను చేర్చుకొందును; నా యొద్దకు వచ్చు వారు ధన్యులు.
15 ఇదిగో, దేవుని కుమారుడైన యేసు క్రీస్తును నేనే. నేను పరలోకములను, భూమిని మరియు వాటియందున్న సమస్తమును సృష్టించియున్నాను. నేను ఆరంభము నుండి తండ్రితో ఉన్నాను; తండ్రియందు నేనును, నా యందు తండ్రియు ఉన్నాము; మరియు నా యందు తండ్రి తన నామమును మహిమపరచియున్నాడు.
16 నా స్వజనుల యొద్దకు వచ్చినది నేనే, నా స్వజనులు నన్ను చేర్చుకొనలేదు. మరియు నా రాకడను గూర్చిన లేఖనములు నెరవేరినవి.
17 నన్ను అంగీకరించు వారందరు, అనగా నా నామమందు విశ్వాసముంచు వారందరు దేవుని పిల్లలగుటకు నేను అనుమతించితిని, ఏలయనగా నా ద్వారా విమోచన వచ్చును మరియు నాయందు మోషే ధర్మశాస్త్రము నెరవేరెను.
18 నేను లోకమునకు జీవమును, వెలుగునైయున్నాను. అల్ఫాయు ఓమెగయు నేనే, అనగా ఆదియు అంతము నేనే.
19 మీరు నా కొరకు ఇకపై రక్తము చిందించరు; మీ బలులు, మీ దహనబలి అర్పణములు నిలిపి వేయబడును, ఏలయనగా మీ బలులను, మీ దహనబలి అర్పణములను వేటిని నేను అంగీకరించను.
20 మీరు విరిగిన హృదయమును, నలిగిన ఆత్మను బలిగా నాకు అర్పించెదరు. మరియు వారి పరివర్తన యొక్క సమయమున, నా యందున్న వారి విశ్వాసమును బట్టి లేమనీయులు అగ్నితోను, పరిశుద్ధాత్మతోను బాప్తిస్మము పొంది దానిని ఎరుగకుండినట్లే, ఎవరు నా యొద్దకు విరిగిన హృదయముతో, నలిగిన ఆత్మతో వచ్చెదరో వారికి నేను అగ్నితోను పరిశుద్ధాత్మతోను బాప్తిస్మమిచ్చెదను.
21 ఇదిగో లోకమునకు విమోచన తెచ్చుటకు, పాపము నుండి లోకమును రక్షించుటకు నేను లోకమునకు వచ్చియున్నాను.
22 కావున పశ్చాత్తాపపడి, చిన్న బిడ్డవలే నా యొద్దకు వచ్చు వానిని నేను చేర్చుకొందును, ఏలయనగా దేవుని రాజ్యము ఈలాంటి వారిదే. అట్టి వారి కొరకు నేను నా ప్రాణమును పెట్టియున్నాను మరియు దానిని తిరిగి పైకి తీసుకొనియున్నాను; కావున భూదిగంతములారా, పశ్చాత్తాపపడుడి మరియు నా యొద్దకు వచ్చి రక్షింపబడుడి.