లేఖనములు
3 నీఫై 10


10వ అధ్యాయము

దేశమందు అనేక గంటలపాటు నిశ్శబ్దముండెను—కోడి తన పిల్లలను రెక్కల క్రిందికేలాగు చేర్చుకొనునో ఆలాగే తన జనులను చేర్చుకొనెదనని క్రీస్తు యొక్క స్వరము వాగ్దానము చేయును—జనులలో అధిక నీతిమంతులైన భాగము కాపాడబడియుండెను. సుమారు క్రీ. శ. 34–35 సం.

1 ఇప్పుడు దేశ జనులందరు ఈ మాటలు విని, వాటిని గూర్చి సాక్ష్యమిచ్చిరి. ఈ మాటల తర్వాత దేశమందు అనేక గంటలపాటు నిశ్శబ్దముండెను;

2 ఏలయనగా జనులు ఎంత అధికముగా ఆశ్చర్యపడిరనగా, సంహరింపబడిన వారి బంధువుల నష్టము నిమిత్తము విలపించుటను, రోదించుటను వారు మానివేసిరి; కావున, దేశమంతటా అనేక గంటలపాటు నిశ్శబ్దముండెను.

3 మరలా ఒక స్వరము జనులకు వినిపించగా, జనులందరు దానిని విని, ఇట్లు చెప్పుచూ సాక్ష్యమిచ్చిరి:

4 ఓ యాకోబు వంశస్థులారా, పతనమైన ఈ గొప్ప పట్టణవాసులారా, ఇశ్రాయేలు వంశస్థులైన వారలారా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకేలాగు చేర్చుకొనునో ఆలాగే నేనును మిమ్ములను ఎన్నోమారులు చేర్చుకొనవలెనని యుంటిని మరియు మిమ్ములను పోషించితిని.

5 మరలా, పతనమైన ఇశ్రాయేలు వంశ జనులారా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకేలాగు చేర్చుకొనునో ఆలాగే నేనును మిమ్ములను ఎన్నోమారులు చేర్చుకొనవలెనని యుంటిని; యెరూషలేమునందు నివసించుచూ పతనమైన ఇశ్రాయేలు వంశ జనులారా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకేలాగు చేర్చుకొనునో ఆలాగే నేనును మిమ్ములను ఎన్నోమారులు చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి.

6 ఓ! నేను విడిచిపెట్టిన ఇశ్రాయేలు వంశస్థులారా, మీరు పశ్చాత్తాపపడి హృదయము యొక్క సంపూర్ణ ఉద్దేశ్యముతో నా యొద్దకు తిరిగి వచ్చిన యెడల, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకేలాగు చేర్చుకొనునో ఆలాగే నేనును మిమ్ములను ఎన్నోమారులు చేర్చుకొనవలెనని యుంటిని.

7 లేని యెడల ఓ ఇశ్రాయేలు వంశమా, మీ పితరులకు చేయబడిన నిబంధన నెరవేరు సమయము వరకు మీ నివాస స్థలములు నిర్జనమగును.

8 ఇప్పుడు జనులు ఈ మాటలు వినినప్పుడు, వారి బంధువులు, స్నేహితులను కోల్పోవుటను బట్టి వారు విలపించుట మరియు రోదించుట మొదలుపెట్టిరి.

9 ఆ విధముగా మూడు దినములు గడిచిపోయెను. అది ఉదయమందైయుండెను, అంధకారము దేశముపై నుండి చెదిరిపోయెను; భూమి కంపించుట మానెను, బండలు చీలుట మానెను, భీతి కలిగించు మూలుగులు ఆగెను; మరియు సమస్త అల్లరి ధ్వనులు గతించిపోయెను.

10 భూమి నిలువబడినట్లు తిరిగి ఒకటిగా కలిసెను మరియు ప్రాణములతో వదిలిపెట్టబడిన జనుల యొక్క సంతాపము, విలాపము, రోదన ఆగెను; వారి సంతాపము సంతోషముగాను, వారి విలాపములు వారి విమోచకుడు, ప్రభువైన యేసు క్రీస్తునకు స్తుతులుగా, కృతజ్ఞతా స్తోత్రములుగా మారెను.

11 మరియు అంతవరకు ప్రవక్తల ద్వారా పలుకబడిన లేఖనములు నెరవేర్చబడెను.

12 ఇప్పుడు రక్షింపబడిన వారు జనులలో అధిక నీతిమంతులు; ప్రవక్తలను చేర్చుకొని, వారిని రాళ్ళతో కొట్టని వారు; మరియు విడిచిపెట్టబడిన పరిశుద్ధుల యొక్క రక్తమును చిందించని వారు—

13 వారు విడిచిపెట్టబడిరి మరియు ముంచి వేయబడలేదు; భూమి యందు పాతిపెట్టబడలేదు; వారు సముద్రము యొక్క లోతుల యందు ముంచబడలేదు; వారు అగ్నిచేత కాల్చబడలేదు లేదా ఏదీ వారి మీద పడి వారు మరణించునట్లు నలుగగొట్టలేదు; వారు సుడిగాలియందు కొనిపోబడలేదు లేదా పొగ మరియు అంధకారపు ఆవిరి చేత వారు జయింపబడలేదు.

14 ఇప్పుడు చదువు వారు గ్రహించుగాక; లేఖనములను కలిగియున్న వాడు వాటిని వెదుకుగాక, అగ్నిద్వారా, పొగద్వారా, తుఫానుద్వారా, సుడిగాలులద్వారా మరియు వారిని చేర్చుకొనుటకు భూమి తెరువబడుటద్వారా ఈ మరణములు, నాశనములు మరియు ఈ సంగతులన్నియు అనేక పరిశుద్ధ ప్రవక్తల ప్రవచనముల యొక్క నెరవేర్పో కాదోయని చూచి, గ్రహించుగాక.

15 ఇదిగో నేను మీతో చెప్పుచున్నాను, క్రీస్తు యొక్క రాకడ సమయమున జరుగు ఈ విషయములను గూర్చి అనేకులు సాక్ష్యమిచ్చిరి మరియు ఈ విషయములను గూర్చి సాక్ష్యమిచ్చినందున, వారు సంహరింపబడిరి.

16 ప్రవక్త జీనోస్ ఈ విషయములను గూర్చి సాక్ష్యమిచ్చెను మరియు జీనోక్ కూడా ఈ విషయములను గూర్చి మాట్లాడెను, ఏలయనగా ప్రత్యేకించి వారి సంతానము యొక్క శేషమైన మనలను గూర్చి వారు సాక్ష్యమిచ్చిరి.

17 ఇదిగో, మన తండ్రియైన యాకోబు కూడా యోసేపు సంతానము యొక్క శేషమును గూర్చి సాక్ష్యమిచ్చెను. మనము యోసేపు సంతానము యొక్క శేషము కాదా? మనలను గూర్చి సాక్ష్యమిచ్చు ఈ సంగతులు, మన తండ్రియైన లీహై యెరూషలేము నుండి బయటకు తీసుకొని వచ్చిన కంచు పలకలపై వ్రాయబడిలేవా?

18 ఇప్పుడు ముప్పది నాలుగవ సంవత్సరాంతమున, విడిచిపెట్టబడిన నీఫై జనులు మరియు విడిచిపెట్టబడి లేమనీయులని పిలువబడిన వారిపై గొప్ప అనుగ్రహములు చూపబడియుండి, వారి శిరస్సులపై గొప్ప ఆశీర్వాదములు క్రుమ్మరింపబడి యుండెనని నేను మీకు చూపెదను, ఎంతగాననగా పరలోకములోనికి క్రీస్తు యొక్క ఆరోహణము తరువాత, త్వరలోనే ఆయన వారికి నిజముగా తననుతాను ప్రత్యక్షపరచుకొనెను—

19 ఆయన శరీరమును వారికి చూపించి, వారికి పరిచర్య చేసెను; ఆయన పరిచర్య యొక్క వృత్తాంతము ఇకమీదట ఇవ్వబడును. కావున, ఈ సమయమున నేను నా మాటలను ముగించెదను.

ముద్రించు