లేఖనములు
3 నీఫై 6


6వ అధ్యాయము

నీఫైయులు వర్ధిల్లుదురు—గర్వము, ధనము, మరియు వర్గ భేదములు తలెత్తును—సంఘము విభజనలతో చీల్చబడెను—సాతాను బహిరంగ తిరుగుబాటులో జనులను నడిపించును—అనేకమంది ప్రవక్తలు పశ్చాత్తాపమును ప్రకటించెదరు మరియు సంహరించబడుదురు—వారి హంతకులు ప్రభుత్వమును చేజిక్కించుకొనుటకు కుట్ర పన్నుదురు. సుమారు క్రీ. శ. 26–30 సం.

1 ఇప్పుడు ఇరువది ఆరవ సంవత్సరమందు, నీఫైయుల జనులలో ప్రతిఒక్కరు తన కుటుంబము, తన మందలు, గుంపులు, గుఱ్ఱములు, పశువులు మరియు వారికి చెందిన సమస్త వస్తువులతో వారి స్వదేశములకు తిరిగి వచ్చిరి.

2 వారు తమ ఆహార సామగ్రులన్నిటినీ తినియుండలేదు; కావున వారు తినివేయని సమస్తమును, అన్నిరకముల ధాన్యమును, బంగారమును, వెండిని మరియు వారి విలువైన వస్తువులన్నింటిని వారు తమతో తీసుకొని ఉత్తరమున, దక్షిణమున మరియు ఉత్తరము వైపు దేశము, దక్షిణము వైపు దేశము రెండింటనున్న వారి స్వదేశములకు, వారి స్వాధీనములోనున్న వాటి యొద్దకు తిరిగి వచ్చిరి.

3 మరియు దేశమందు సమాధానమును నిలుపుటకు ఒక నిబంధనలోనికి ప్రవేశించి, లేమనీయులుగా ఉండుటకు కోరిన ఆ దొంగలకు, వారు శ్రమించి, బ్రతుకగలుగునట్లు వారి సంఖ్యలను బట్టి వారు భూములనిచ్చిరి; ఆ విధముగా వారు దేశమందంతటా సమాధానమును స్థాపించిరి.

4 వారు తిరిగి వర్థిల్లి, గొప్పగా వృద్ధి చెందసాగిరి; ఇరువది ఆరు మరియు ఏడవ సంవత్సరము గతించిపోయెను, దేశమందు గొప్ప క్రమముండెను మరియు వారు ధర్మమును, న్యాయమును బట్టి తమ చట్టములను రూపొందించుకొనిరి.

5 ఇప్పుడు వారు అతిక్రమములో పడితే తప్ప, నిరంతరము వర్ధిల్లుట నుండి జనులను అడ్డుకొనుటకు దేశమందంతటా ఏమియు లేకుండెను.

6 గిద్‌గిద్దోని, న్యాయాధిపతి లకోనియస్ మరియు నాయకులుగా నియమింపబడిన వారు దేశమందు ఈ గొప్ప సమాధానమును స్థాపించిరి.

7 అనేక పట్టణములు నూతనముగా నిర్మించబడెను మరియు అనేక పాత పట్టణములు బాగు చేయబడెను.

8 పట్టణము నుండి పట్టణమునకు, దేశము నుండి దేశమునకు మరియు స్థలము నుండి స్థలమునకు నడిపించిన అనేక రహదారులు, అనేక ప్రధాన రహదారులు వేయబడెను.

9 ఆ విధముగా ఇరువది ఎనిమిదవ సంవత్సరము గతించెను మరియు జనులు నిరంతర సమాధానము కలిగియుండిరి.

10 కానీ ఇరువది తొమ్మిదవ సంవత్సరమందు జనుల మధ్య కొన్ని తగవులుండుట మొదలాయెను; వారి అత్యధిక సంపదలను బట్టి కొందరు గర్వమందు హెచ్చింపబడి, డంబములు పలుకుచూ ఇతరులను అధికముగా హింసించసాగిరి.

11 ఏలయనగా దేశమందు అనేకమంది వ్యాపారులు, న్యాయవాదులు మరియు అధికారులు ఉండిరి.

12 వారి సంపదలు మరియు జ్ఞానము సంపాదించుటకు వారికున్న అవకాశములను బట్టి జనులు హోదాల ద్వారా ప్రత్యేకింపబడసాగిరి; కొందరు తమ పేదరికమును బట్టి అజ్ఞానులుగా ఉండిరి మరియు ఇతరులు వారి సంపదలను బట్టి గొప్ప జ్ఞానము పొందిరి.

13 కొందరు గర్వమందు హెచ్చింపబడిరి మరియు ఇతరులు మిక్కిలి వినయము కలిగియుండిరి; కొందరు దూషణకు ప్రతిగా దూషించగా, ఇతరులు దూషణ, హింస మరియు సమస్త విధమైన శ్రమలను పొంది, తిరిగి దూషించక, దేవుని యెదుట వినయముతోను పశ్చాత్తాపముతోను ఉండిరి.

14 ఆ విధముగా దేశమంతటా గొప్ప అసమానత్వమున్నందున, సంఘము ముక్కలగుట ప్రారంభమాయెను; ఎంతగాననగా, ముప్పైయవ సంవత్సరమందు నిజమైన విశ్వాసమునకు పరివర్తన చెందిన కొద్దిమంది లేమనీయుల మధ్య తప్ప, దేశమంతటా సంఘము విభజింపబడెను; మరియు వారు దాని నుండి తొలగిపోరు, ఏలయనగా వారు దృఢముగా, నిలకడగా, నిశ్చలముగా ఉండి, పూర్ణ శ్రద్ధతో ప్రభువు యొక్క ఆజ్ఞలను పాటించుటకు ఇష్టపడిరి.

15 ఇప్పుడు జనుల యొక్క ఈ దుర్నీతికి కారణము ఇదియైయుండెను—శక్తి, అధికారము, సంపదలు మరియు లోకము యొక్క వ్యర్థమైన వస్తువుల కొరకు వెదకుటకు వారిని శోధించుచూ, సమస్త విధమైన దుర్నీతిని జరిగించుటకు మరియు గర్వముతో వారిని ఉప్పొంగజేయుటకు జనులను పురిగొల్పుటలో సాతాను గొప్ప శక్తి కలిగియుండెను.

16 ఆ విధముగా సమస్త విధమైన దుర్నీతిని జరిగించుటకు జనుల హృదయములను సాతాను నడిపించి వేసెను; కావున వారు కొద్ది సంవత్సరములు మాత్రమే సమాధానమును అనుభవించిరి.

17 ఆ విధముగా ముప్పైయవ సంవత్సరము యొక్క ప్రారంభమందు—అతడు వారిని ఎక్కడకు కొనిపోవలెనని కోరిన అక్కడకు కొనిపోబడుటకు మరియు వారు దుర్నీతిని చేయవలెనని అతడు కోరిన యెడల దానిని చేయుటకు జనులు అపవాది యొక్క శోధనలచేత కొనిపోబడుటకు దీర్ఘకాలముపాటు అప్పగించబడియుండిరి—ఆ విధముగా ఈ ముప్పైయవ సంవత్సరము యొక్క ప్రారంభమందు వారు ఒక భయంకరమైన దుర్మార్గపు స్థితియందుండిరి.

18 వారిని గూర్చి దేవుని యొక్క చిత్తమును వారెరిగినందున అజ్ఞానముతో వారు పాపము చేయలేదు, ఏలయనగా అది వారికి బోధింపబడియుండెను; కావున వారు దేవునికి వ్యతిరేకముగా ఇష్టపూర్వకముగా తిరుగుబాటు చేసిరి.

19 ఇప్పుడది లకోనియస్ కుమారుడైన లకోనియస్ యొక్క దినములయందై ఉండెను, ఏలయనగా లకోనియస్ తన తండ్రి స్థానములో ఆ సంవత్సరమందు జనులను పాలించెను.

20 మరియు పరలోకము నుండి ప్రేరేపింపబడి, ముందుకు పంపబడిన మనుష్యులు దేశమంతటా జనుల మధ్య నిలబడి జనుల యొక్క పాపములు మరియు దుర్ణీతులను గూర్చి బోధించుచూ, సాక్ష్యమిచ్చుచూ, తన జనుల కొరకు ప్రభువు చేయు విమోచన లేదా ఇతర మాటలలో క్రీస్తు యొక్క పునరుత్థానమును గూర్చి వారికి సాక్ష్యమివ్వసాగిరి; మరియు వారు ఆయన మరణమును గూర్చి, బాధలను గూర్చి ధైర్యముగా సాక్ష్యమిచ్చిరి.

21 ఇప్పుడు ఈ విషయములను గూర్చి సాక్ష్యమిచ్చిన వారిని బట్టి జనులలో అనేకులు మిక్కిలి కోపముతో నుండిరి; కోపముగానున్న వారు ముఖ్యముగా ముఖ్య న్యాయాధిపతులు, ప్రధాన యాజకులు మరియు న్యాయవాదులై యుండిరి; న్యాయవాదులైన వారందరు ఈ విషయములను గూర్చి సాక్ష్యమిచ్చిన వారితో కోపముగానుండిరి.

22 వారి శిక్షావిధి దేశ పరిపాలకుని చేత సంతకము చేయబడితే తప్ప, ఎవరికైనను మరణ శిక్ష విధించుటకు శక్తి కలిగిన న్యాయవాదిగాని, న్యాయాధిపతిగాని, ప్రధానయాజకుడుగాని అక్కడ లేకుండెను.

23 క్రీస్తుకు సంబంధించిన సంగతుల విషయమై ధైర్యముగా సాక్ష్యమిచ్చిన వారిలో అనేకులు న్యాయాధిపతుల ద్వారా తీసుకొనివెళ్ళబడి, రహస్యముగా చంపబడిరి; తద్వారా వారి మరణమును గూర్చిన సమాచారము వారి మరణము తరువాత గానీ దేశ పరిపాలకుని వరకు రాకుండెను.

24 దేశ పరిపాలకుని నుండి వారు అధికారము పొందితే తప్ప, ఏ మనుష్యుడూ చంపబడకూడదన్న దేశ చట్టములకు ఇది విరుద్ధముగానుండెను—

25 కావున చట్ట ప్రకారము కాకుండా ప్రభువు యొక్క ప్రవక్తలకు మరణ శిక్ష విధించిన ఈ న్యాయాధిపతులకు వ్యతిరేకముగా జరహేమ్ల దేశమునకు, దేశ పరిపాలకునికి ఒక ఫిర్యాదు వచ్చెను.

26 ఇప్పుడు జనుల ద్వారా ఇవ్వబడిన చట్టము ప్రకారము వారు చేసిన నేరమును బట్టి తీర్పు తీర్చబడుటకు వారు పట్టుకొనబడి, న్యాయాధిపతి యెదుటకు తేబడిరి.

27 ఆ న్యాయాధిపతులు అనేకమంది స్నేహితులను, బంధువులను కలిగియుండిరి; మిగిలిన వారిలో దాదాపుగా న్యాయవాదులు మరియు ప్రధాన యాజకులందరు కూడా సమకూడుకొని, చట్ట ప్రకారము విచారింపబడబోవుచున్న ఆ న్యాయాధిపతుల బంధువులతో ఏకమైరి.

28 వారు ఒకరితోనొకరు ఒక నిబంధనలోనికి ప్రవేశించిరి, అది ప్రాచీన కాలము వారి చేత ఇవ్వబడిన నిబంధన, ఆ నిబంధన సమస్త నీతికి వ్యతిరేకముగా కూడుకొనుటకు అపవాది చేత ఇవ్వబడి, అమలు చేయబడినది.

29 కావున వారు ప్రభువు యొక్క జనులకు వ్యతిరేకముగా సమకూడి, వారిని నాశనము చేయుటకు మరియు చట్ట ప్రకారము అందించబోవు న్యాయము యొక్క పట్టు నుండి హత్య విషయములో దోషులైన వారిని విడిపించుటకు ఒక నిబంధనలోనికి ప్రవేశించిరి.

30 వారు తమ దేశ చట్టమును, హక్కులను ధిక్కరించి, దేశ పరిపాలకుడిని నాశనము చేయుటకు మరియు దేశము ఇకపై స్వతంత్రముగా ఉండరాదని, రాజులకు లోబడియుండవలెనని దేశముపై ఒక రాజును నియమించుటకు ఒకరితోనొకరు నిబంధన చేసిరి.

ముద్రించు