12వ అధ్యాయము
యేసు పడ్రెండుగురు శిష్యులను పిలిచి, నియమించును—కొండ మీది ప్రసంగమును పోలిన ఒక ప్రసంగమును ఆయన నీఫైయులకు ఇచ్చును—ఆయన ధన్యతలను చెప్పును—ఆయన బోధలు శ్రేష్ఠమైనవిగా ఉండి, మోషే ధర్మశాస్త్రముపై ఆధిక్యతను తీసుకొనును—ఆయన మరియు ఆయన తండ్రి పరిపూర్ణులుగా ఉన్నట్లే మనుష్యులు కూడా పరిపూర్ణులుగా ఉండవలెనని ఆజ్ఞాపించబడిరి—మత్తయి 5 తో పోల్చుము. సుమారు క్రీ. శ. 34 సం.
1 యేసు నీఫైకి మరియు పిలువబడిన వారికి ఈ మాటలను చెప్పినప్పుడు (ఇప్పుడు పిలువబడి, బాప్తిస్మము ఇచ్చుటకు శక్తిని, అధికారమును పొందిన వారి యొక్క సంఖ్య పన్నెండైయుండెను), ఆయన తన చేతిని సమూహమువైపు చాపి బిగ్గరగా వారితో ఇట్లు చెప్పెను: మీకు పరిచర్య చేయుటకు మరియు మీ సేవకులుగా ఉండుటకు మీమధ్య నుండి నేను ఎన్నుకొనిన ఈ పడ్రెండుగురి మాటలను మీరు లక్ష్యపెట్టిన యెడల, మీరు ధన్యులు; వారు మీకు నీటితో బాప్తిస్మము ఇచ్చునట్లు వారికి నేను శక్తినిచ్చియున్నాను; మీరు నీటితో బాప్తిస్మము పొందిన తరువాత, నేను అగ్నితో మరియు పరిశుద్ధాత్మతో మీకు బాప్తిస్మమిచ్చెదను; కావున మీరు నన్ను చూచి, నేను ఉన్నానని ఎరిగిన తరువాత మీరు నాయందు విశ్వాసముంచి, బాప్తిస్మము పొందిన యెడల మీరు ధన్యులు.
2 మరలా, మీరు నన్ను చూచితిరని, నేను ఉన్నానని మీరు ఎరుగుదురని మీరు సాక్ష్యమిచ్చినందున, మీ మాటల యందు విశ్వాసముంచు వారు అధిక ధన్యులు. మీ మాటలయందు విశ్వాసముంచి, మిక్కిలి వినయము కలిగియుండి బాప్తిస్మము పొందు వారు ధన్యులు, ఏలయనగా వారు అగ్నితో, పరిశుద్ధాత్మతో దర్శింపబడి వారి పాప క్షమాపణను పొందుదురు.
3 ఆత్మ విషయమై దీనులై నా యొద్దకు వచ్చువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది.
4 మరలా, దుఃఖపడు వారందరు ధన్యులు, వారు ఓదార్చబడుదురు.
5 సాత్వీకులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.
6 నీతి కొరకు ఆకలిదప్పులుగల వారందరు ధన్యులు, వారు పరిశుద్ధాత్మతో నింపబడుదురు.
7 కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు.
8 హృదయ శుద్ధిగల వారందరు ధన్యులు, వారు దేవుని చూచెదరు.
9 సమాధానపరచు వారందరు ధన్యులు, వారు దేవుని పిల్లలు అనబడుదురు.
10 నా నామము నిమిత్తము హింసింపబడు వారందరు ధన్యులు, పరలోక రాజ్యము వారిది.
11 నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు;
12 ఏలయనగా మీరు గొప్ప సంతోషమును, ఆనందమును కలిగియుందురు, పరలోకమందు మీ ఫలము అధికమగును; ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.
13 నిశ్చయముగా నేను మీతో చెప్పునదేమనగా—మీరు లోకమునకు ఉప్పుయి ఉండవలెనని నేను మిమ్ములను ఆజ్ఞాపించుచున్నాను; కానీ ఉప్పు నిస్సారమైన యెడల, భూమి దేనివలన సారము పొందును? అప్పటి నుండి ఉప్పు బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు.
14 నిశ్చయముగా నేను మీతో చెప్పునదేమనగా—మీరు ఈ జనులకు వెలుగైయుండవలెనని నేను మిమ్ములను ఆజ్ఞాపించుచున్నాను. కొండమీదనుండు పట్టణము మరుగైయుండనేరదు.
15 ఇదిగో మనుష్యులు దీపము వెలిగించి, దానిని కుంచము క్రింద పెట్టుదురా? లేదు, కానీ అది ఇంటనుండు వారికందరికి వెలుగిచ్చుటకై దీపస్తంబముమీదనే పెట్టుదురు.
16 కావున, ఈ జనులు మీ సత్‌క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి యెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి.
17 ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు.
18 ఏలయనగా నా యందు ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లయినను ఒక సున్నయైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
19 ఇదిగో, మీరు నా యందు విశ్వాసముంచునట్లు, మీ పాపముల విషయమై పశ్చాత్తాపపడి, విరిగిన హృదయము మరియు నలిగిన ఆత్మతో నా యొద్దకు వచ్చునట్లు మీకు నా తండ్రి యొక్క ధర్మశాస్త్రమును, ఆజ్ఞలను నేను ఇచ్చియున్నాను. ఆజ్ఞలు మీ యెదుటనున్నవి మరియు ధర్మశాస్త్రము నెరవేర్చబడినది.
20 కావున, నా యొద్దకు వచ్చి రక్షణ పొందుడి; ఈ సమయమున నేను మీకు ఆజ్ఞాపించిన నా ఆజ్ఞలను మీరు పాటించని యెడల, మీరు ఏ విధముగాను పరలోక రాజ్యమందు ప్రవేశించలేరని నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను.
21 నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడెవడైనను దేవుని విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడియున్నదని, మీ ముందు వ్రాయబడియున్నదని మీరు వినియున్నారు గదా;
22 నేను మీతో చెప్పునదేమనగా—తన సహోదరునిమీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును; ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును.
23 కావున నీవు నా యొద్దకు వచ్చిన యెడల లేదా నా యొద్దకు వచ్చుటకు కోరిక కలిగియున్న యెడల మరియు నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని నీకు జ్ఞాపకము వచ్చిన యెడల—
24 మొదట నీ సహోదరుని యొద్దకు వెళ్ళి, అతనితో సమాధానపడుము; అటు తరువాత హృదయము యొక్క పూర్ణ ఉద్దేశ్యముతో నా యొద్దకు రమ్ము, నేను నిన్ను చేర్చుకొందును.
25 నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము, లేని యెడల ఏ సమయమందైనను అతడు నిన్ను అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడుదువు.
26 నిశ్చయముగా నేను మీతో చెప్పునదేమనగా—మీరు కడపటి సెనైన్ చెల్లించు వరకు ఏ విధముగానూ అక్కడనుండి బయటకు రాలేరు. మీరు చెరలో ఉండగా ఒక్క సెనైన్ అయినా చెల్లించగలరా? లేదు, అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
27 ఇదిగో, నీవు వ్యభిచరించరాదని పూర్వీకుల చేత వ్రాయబడినది;
28 కానీ, నేను మీతో చెప్పునదేమనగా—ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు, అప్పుడే తన హృదయమందు వ్యభిచారము చేసినవాడగును.
29 ఇదిగో, ఈ విషయములలో దేనిని మీ హృదయములో ప్రవేశించుటకు మీరు అనుమతించరాదని నేను మీకు ఒక ఆజ్ఞ ఇచ్చుచున్నాను.
30 ఏలయనగా ఈ విషయములలో మిమ్ములను మీరు ఉపేక్షించుకొనుట మీకు మేలగును, అట్లు చేయుటవలన మీరు నరకములోనికి వేయబడుటకు బదులు మీ సిలువనెత్తుకొందురు.
31 తన భార్యను విడనాడువాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలెనని వ్రాయబడినది గదా.
32 నిశ్చయముగా నేను మీతో చెప్పునదేమనగా—వ్యభిచార కారణమును బట్టి గాక, తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు; విడనాడబడిన దానిని పెండ్లాడు వాడు వ్యభిచరించుచున్నాడు.
33 మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువుకు చెల్లింపవలెనని వ్రాయబడినది గదా.
34 కానీ, నిశ్చయముగా నేను మీతో చెప్పునదేమనగా—ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు; ఆకాశము తోడన వద్దు, అది దేవుని సింహాసనము;
35 భూమి తోడన వద్దు, అది ఆయన పాదపీఠము;
36 నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు, నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు;
37 కానీ మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను; వీటికి మించునది దుష్టుని నుండి పుట్టునది.
38 కంటికి కన్ను, పంటికి పల్లు అని వ్రాయబడినది గదా;
39 కానీ నేను మీతో చెప్పునదేమనగా—దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడి చెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంప కూడా త్రిప్పుము;
40 ఎవడైన నీ మీద వ్యాజ్యెమువేసి నీ అంగీ తీసుకొనగోరిన యెడల, వానికి నీ పైవస్త్రము కూడా ఇచ్చివేయుము;
41 ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన యెడల, వానితో కూడా రెండు మైళ్ళు వెళ్ళుము.
42 నిన్ను అడుగు వానికిమ్ము, నిన్ను అప్పు అడుగగోరువాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు.
43 నీ పొరుగువాని ప్రేమించి, నీ శత్రువును ద్వేషించుమని వ్రాయబడినది గదా;
44 కానీ నేను మీతో చెప్పునదేమనగా—మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ములను శపించు వారిని దీవించుడి, మిమ్ములను ద్వేషించు వారికి మేలు చేయుడి; మరియు మిమ్ములను దౌర్జన్యముగా ఉపయోగించుకొని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి;
45 ఏలయనగా ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింప జేయుచున్నాడు.
46 కావున, ధర్మశాస్త్రము ప్రకారము పూర్వకాలము చెప్పబడిన విషయములన్నీ నాయందు నెరవేరినవి.
47 పాత విషయములు గతించిపోయెను మరియు సమస్త విషయములు క్రొత్తవాయెను.
48 కావున నేను లేదా పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణులైయున్నట్లు మీరును పరిపూర్ణులు కావలెనని నేను కోరుచున్నాను.