2వ అధ్యాయము
జనుల మధ్య దుష్టత్వము, హేయక్రియలు హెచ్చగును—గాడియాంటన్ దొంగల నుండి తమను కాపాడుకొనుటకు నీఫైయులు, లేమనీయులు ఏకమగుదురు—పరివర్తన చెందిన లేమనీయులు తెల్లగా అగుదురు మరియు నీఫైయులని పిలువబడుదురు. సుమారు క్రీ. శ. 5–16 సం.
1 తొంబది అయిదవ సంవత్సరము కూడా ఆ విధముగా గడిచిపోయెను మరియు జనులు తాము వినిన ఆ సూచకక్రియలను, ఆశ్చర్యకార్యములను మరచిపోవుట మొదలుపెట్టిరి; పరలోకము నుండి ఇవ్వబడిన సూచకక్రియ లేదా అద్భుతము యెడల అతితక్కువగా ఆశ్చర్యపడసాగిరి, ఎంతగాననగా వారు తమ హృదయములయందు కఠినులుగా, తమ మనస్సుల యందు గ్రుడ్డిగా ఉండుట మొదలుపెట్టి, వారు విని మరియు చూచిన సమస్తమును సంశయించసాగిరి—
2 అది, జనుల హృదయములను నడిపించివేసి, మోసగించుటకు మనుష్యుల చేత మరియు అపవాది యొక్క శక్తి చేత చేయబడినదని వారి హృదయముల యందు వారు వ్యర్థముగా ఊహించుకొనిరి; ఆ విధముగా సాతాను జనుల హృదయములపై తిరిగి పట్టు సంపాదించెను, ఎంతగాననగా అతడు వారి కన్నులను గ్రుడ్డిగా చేసి, క్రీస్తు సిద్ధాంతము మూర్ఖమైనదని, వ్యర్థమైనదని విశ్వసించుటకు వారిని నడిపించి వేసెను.
3 మరియు జనులు దుష్టత్వమందు, హేయక్రియలందు బలముగా వృద్ధిచెందసాగిరి; ఇంకను ఎక్కువ సూచకక్రియలు లేదా ఆశ్చర్యకార్యములు ఇవ్వబడవలెనని వారు విశ్వసించలేదు; సాతాను జనుల హృదయములను నడిపించి వేయుచూ, వారిని శోధించుచూ, దేశమందు వారు అధిక దుర్మార్గము జరిగించునట్లు చేయుచూ ముందుకుసాగెను.
4 ఆ విధముగా తొంబది ఆరవ సంవత్సరము గడిచిపోయెను; తొంబది ఏడవ సంవత్సరము, తొంబది ఎనిమిదవ సంవత్సరము మరియు తొంబది తొమ్మిదవ సంవత్సరము కూడా గడిచిపోయెను.
5 నీఫైయుల యొక్క జనులపై రాజైన మోషైయ దినముల నుండి వంద సంవత్సరములు గడిచిపోయెను.
6 లీహై యెరూషలేమును వదిలి వచ్చినప్పటి నుండి ఆరు వందల తొమ్మిది సంవత్సరములు గడిచిపోయెను.
7 మరియు క్రీస్తు లోకము లోనికి రావలెనని ప్రవక్తల ద్వారా పలుకబడిన సూచకక్రియ ఇవ్వబడిన సమయము నుండి తొమ్మిది సంవత్సరములు గడిచిపోయెను.
8 ఇప్పుడు సూచకక్రియ ఇవ్వబడిన ఈ కాలము నుండి, లేదా క్రీస్తు యొక్క రాక నుండి నీఫైయులు తమ కాలమును లెక్కపెట్టుకొనుట మొదలుపెట్టిరి; కావున తొమ్మిది సంవత్సరములు గతించిపోయెను.
9 మరియు గ్రంథముల బాధ్యత కలిగియున్న నీఫై యొక్క తండ్రియైన నీఫై జరహేమ్ల దేశమునకు తిరిగి రాలేదు, దేశమంతటిలో ఎక్కడా కనుగొనబడలేదు.
10 జనుల మధ్యకు అధికమైన బోధ మరియు ప్రవచనము పంపబడినప్పటికీ, వారు ఇంకను దుష్టత్వమందు నిలిచియుండిరి; ఆ విధముగా పదవ సంవత్సరము గడిచిపోయెను; పదకొండవ సంవత్సరము కూడా దుర్నీతియందు గడిచిపోయెను.
11 పదమూడవ సంవత్సరమందు దేశమంతటా యుద్ధములు, వివాదములుండుట మొదలాయెను; ఏలయనగా గాడియాంటన్ దొంగలు అత్యధిక సంఖ్యాకులై, జనులలో అనేకమందిని సంహరించి, అనేక పట్టణములను పాడుచేసి, దేశమంతటా ఎంత అధికమైన మరణము, హత్యాకాండ వ్యాపింపజేసిరనగా, నీఫైయులు మరియు లేమనీయులు ఇరువురి జనులందరు వారికి వ్యతిరేకముగా ఆయుధములను తీసుకొనుట అవసరమాయెను.
12 కావున ప్రభువుకు పరివర్తన చెందిన లేమనీయులందరు వారి సహోదరులైన నీఫైయులతో ఏకమై వారి ప్రాణములు, వారి స్త్రీలు, పిల్లల క్షేమము కొరకు, వారి సంఘము, వారి ఆరాధన యొక్క హక్కులను, విశేషాధికారములను మరియు వారి స్వాతంత్ర్యమును, స్వేచ్ఛను నిలుపుకొనుటకు, ఆ గాడియాంటన్ దొంగలకు వ్యతిరేకముగా ఆయుధములను తీసుకొనుటకు బలవంతము చేయబడిరి.
13 ఈ పదమూడవ సంవత్సరము గతించిపోవుటకు ముందు మిక్కిలి తీవ్రమైన ఈ యుద్ధమును బట్టి, నీఫైయులు పూర్తి నాశనముతో బెదిరించబడిరి.
14 మరియు నీఫైయులతో ఏకమైన ఆ లేమనీయులు నీఫైయుల మధ్య లెక్కించబడిరి.
15 వారి శాపము వారినుండి తీసివేయబడి, వారి చర్మము నీఫైయుల మాదిరిగా తెల్లగా ఆయెను;
16 వారి యువకులు, వారి కుమారైలు అత్యంత అందమైనవారైరి మరియు వారు నీఫైయుల మధ్య లెక్కించబడి, నీఫైయులని పిలువబడిరి. ఆ విధముగా పదమూడవ సంవత్సరము ముగిసెను.
17 పదునాలుగవ సంవత్సరము యొక్క ప్రారంభమందు దొంగలు మరియు నీఫై జనుల మధ్య యుద్ధము కొనసాగి, మిక్కిలి తీవ్రమాయెను; అయినప్పటికీ, నీఫై జనులు దొంగలపై కొంత విజయము పొందిరి, ఎంతగాననగా వారు, వారిని తమ దేశములలోనుండి బయటకు పర్వతములలోనికి, వారి రహస్య స్థలములలోనికి తిరిగి తరిమివేసిరి.
18 ఆ విధముగా పదునాలుగవ సంవత్సరము ముగిసెను. పదునైదవ సంవత్సరమందు వారు నీఫై జనులకు వ్యతిరేకముగా మరలా వచ్చిరి; నీఫై జనుల దుష్టత్వము, వారి వివాదములు మరియు విభజనలనేకమును బట్టి గాడియాంటన్ దొంగలు వారిపై అధిక విజయము పొందిరి.
19 ఆ విధముగా పదునైదవ సంవత్సరము ముగిసెను మరియు ఆ విధముగా జనులు అనేక బాధలయందుండిరి; నాశన ఖడ్గము వారిపై వ్రేలాడెను, ఎంతగాననగా వారు దాని చేత కొట్టివేయబడుటకు సిద్ధముగానుండిరి; మరియు ఇది వారి దుర్నీతిని బట్టియైయుండెను.