లేఖనములు
3 నీఫై 19


19వ అధ్యాయము

పండ్రెండుగురు శిష్యులు జనులకు పరిచర్య చేయుదురు మరియు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించుదురు—శిష్యులు బాప్తిస్మము పొంది, పరిశుద్ధాత్మను, దూతల పరిచర్యను పొందుదురు—వ్రాయబడలేని మాటలను ఉపయోగించుచూ యేసు ప్రార్థించును—ఈ నీఫైయుల యొక్క అత్యధిక విశ్వాసమునకు ఆయన సాక్ష్యమిచ్చెను. సుమారు క్రీ. శ. 34 సం.

1 ఇప్పుడు యేసు పరలోకములోనికి ఆరోహణుడైనప్పుడు సమూహము విడిపోయి, ప్రతి మనుష్యుడు తన భార్యాపిల్లలను తీసుకొని తన ఇంటికి తిరిగివెళ్ళెను.

2 మరియు సమూహము యేసును చూచియుండెనని, ఆయన వారికి పరిచర్య చేసియుండెనని, ఆయన మరుసటి ఉదయమున కూడా తనను కనబరచుకొనునని చీకటి అగుటకు ముందే జనుల మధ్య సమాచారము వ్యాపించెను.

3 రాత్రంతయు యేసును గూర్చిన సమాచారము వ్యాపించెను; ఎంతగాననగా, ఉదయమున యేసు సమూహమునకు తనను కనబరచుకొను స్థలమందు వారు ఉండగలుగునట్లు అధిక సంఖ్యాకులు ఆ రాత్రియంతయు ఎంతో ప్రయాసపడి అక్కడకు చేరుకొనిరి.

4 ఉదయమున సమూహము సమకూడినప్పుడు, నీఫై మరియు అతడు మృతులలోనుండి లేపిన అతని సహోదరుడు తిమోతి, అతని కుమారుడు యోనా మరియు మతోని, అతని సహోదరుడు మతోనిహా, కుమెను, కుమెనోన్హి, యిర్మియా, షెమ్నోను, యోనా, సిద్కియా, మరియు యెషయా—ఇప్పుడు ఇవి యేసు ఎన్నుకొనిన శిష్యుల పేర్లు—వారు ముందుకు వెళ్ళి సమూహము మధ్య నిలిచిరి.

5 సమూహము ఎంత పెద్దదనగా, అది పన్నెండు గుంపులుగా వేరుచేయబడునట్లు వారు చేసిరి.

6 మరియు పండ్రెండుగురు సమూహమునకు బోధించిరి; సమూహము నేలపై మోకరించి, యేసు నామమున తండ్రిని ప్రార్థించునట్లు వారు చేసిరి.

7 శిష్యులు కూడా యేసు నామమున తండ్రిని ప్రార్థించిరి. తరువాత వారు లేచి జనులకు పరిచర్య చేసిరి.

8 యేసు చెప్పిన మాటలను ఏమాత్రము మార్చకుండా వారు యేసు పలికిన మాటలనే బోధించినప్పుడు—వారు తిరిగి మోకరించి, యేసు నామమున తండ్రిని ప్రార్థించిరి.

9 వారు అధికముగా కోరిన దాని కొరకు వారు ప్రార్థన చేసిరి మరియు వారికి పరిశుద్ధాత్మ ఇవ్వబడవలెనని వారు కోరిరి.

10 వారు ఆ విధముగా ప్రార్థన చేసినప్పుడు, వారు నది ఒడ్డుకు వెళ్ళిరి మరియు సమూహము వారిని వెంబడించెను.

11 నీఫై నీటి లోనికి వెళ్ళి, బాప్తిస్మము పొందెను.

12 అతడు నీటిలోనుండి బయటకు వచ్చి బాప్తిస్మమిచ్చుట మొదలుపెట్టెను. యేసు ఎన్నుకొనిన వారందరికి అతడు బాప్తిస్మమిచ్చెను.

13 వారందరు బాప్తిస్మము పొంది నీళ్ళలో నుండి బయటకు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ వారిపైకి వచ్చెను మరియు వారు పరిశుద్ధాత్మతో, అగ్నితో నింపబడిరి.

14 అది అగ్ని చేతయైనట్లు వారు చుట్టబడిరి మరియు అది పరలోకము నుండి దిగి రాగా, సమూహము దానిని చూచి సాక్ష్యమిచ్చిరి; దేవదూతలు పరలోకము నుండి దిగివచ్చి, వారికి పరిచర్య చేసిరి.

15 దేవదూతలు శిష్యులకు పరిచర్య చేయుచుండగా, యేసు వచ్చి వారి మధ్యలో నిలిచి వారికి పరిచర్య చేసెను.

16 ఆయన సమూహముతో మాట్లాడి, వారు తిరిగి నేలపై మోకరించవలెనని మరియు ఆయన శిష్యులు కూడా నేలపై మోకరించవలెనని వారిని ఆజ్ఞాపించెను.

17 వారందరు నేలపై మోకరించినప్పుడు, వారు ప్రార్థన చేయవలెనని ఆయన తన శిష్యులను ఆజ్ఞాపించెను.

18 వారు ప్రార్థన చేయుట మొదలుపెట్టి, ఆయనను వారి ప్రభువని, వారి దేవుడని పిలుచుచూ యేసును ప్రార్థించిరి.

19 మరియు యేసు వారి మధ్య నుండి బయటకు వెడలిపోయి, వారి నుండి కొంత దూరము వెళ్ళి నేలపై వంగి ఇట్లు చెప్పెను:

20 తండ్రీ, నేను ఎన్నుకొనిన వీరికి నీవు పరిశుద్ధాత్మను ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను; నాయందున్న వారి విశ్వాసమును బట్టి, నేను వారిని లోకములో నుండి ఎన్నుకొనియున్నాను.

21 తండ్రీ, వారి మాటల యందు విశ్వాసముంచు వారందరికి నీవు పరిశుద్ధాత్మను ఇయ్యవలెనని నేను నిన్ను ప్రార్థించుచున్నాను.

22 తండ్రీ, వారు నా యందు విశ్వసించుచున్నందున నీవు వారికి పరిశుద్ధాత్మను ఇచ్చియున్నావు; నీవు వారిని వినుచున్నందున వారు నా యందు విశ్వసించుచున్నారని నీవు చూచుచున్నావు మరియు వారు నాకు ప్రార్థన చేయుచున్నారు; నేను వారితో ఉన్నందున వారు నాకు ప్రార్థన చేయుచున్నారు.

23 ఇప్పుడు తండ్రీ, వారు నా యందు విశ్వసించునట్లు, నాయందు నీవు ఉన్నలాగున వారి యందు నేను ఉండునట్లు మేము ఏకమైయుండులాగున వారి కొరకు మరియు వారి మాటలపై విశ్వసించు వారందరి కొరకు కూడా నేను నిన్ను ప్రార్థించుచున్నాను.

24 యేసు ఆ విధముగా తండ్రికి ప్రార్థన చేసిన తరువాత ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి చూడగా, వారు ఆపకుండా ఇంకను ఆయనకు ప్రార్థన చేయుట కొనసాగించిరి; వారు అధికమైన మాటలను ఉపయోగించలేదు, ఏలయనగా వారు దేని గురించి ప్రార్థన చేయవలెనో వారికి తెలుపబడెను మరియు వారు కోరికతో నింపబడిరి.

25 వారు ఆయనకు ప్రార్థన చేయగా, యేసు వారిని ఆశీర్వదించెను; ఆయన ముఖము వారిపై మందహాసము చేసెను, ఆయన ముఖము యొక్క కాంతి వారిపై ప్రకాశించెను మరియు వారు యేసు యొక్క ముఖము, వస్త్రములంత తెల్లగా నుండిరి; వారి తెలుపుదనము సమస్త తెలుపుదనమును మించియుండెను, అనగా వారి తెలుపుదనమంత తెల్లగా భూమిపై ఏదియు ఉండజాలదు.

26 ఇప్పుడు ప్రార్థన చేయుచుండమని యేసు వారితో చెప్పెను మరియు వారు ప్రార్థన చేయుట ఆపలేదు.

27 మరలా ఆయన వారి నుండి కొంత దూరము వెళ్ళి నేలపై వంగి, ఇట్లు చెప్పుచూ తిరిగి ఆయన తండ్రిని ప్రార్థించెను:

28 తండ్రీ, వారి విశ్వాసమును బట్టి నేను ఎన్నుకొనిన వారిని నీవు శుద్ధి చేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను మరియు వారు నా యందు శుద్ధిచేయబడినట్లు, వారి మాటలపై విశ్వసించు వారు కూడా నా యందు శుద్ధిచేయబడునట్లు వారి కొరకు మరియు వారి మాటలయందు విశ్వసించు వారి కొరకు కూడా నేను ప్రార్థించుచున్నాను.

29 తండ్రీ, నేను వారియందు మహిమపరచబడునట్లు, నాయందు నీవు ఉన్నలాగున వారి యందు నేను ఉండునట్లు మేము ఏకమైయుండులాగున వారి విశ్వాసమును బట్టి వారు నా యందు శుద్ధిచేయబడునట్లు, లోకము కొరకు కాదు గాని లోకములోనుండి నీవు నాకు ఇచ్చిన వారి కొరకు నేను ప్రార్థించుచున్నాను.

30 మరియు యేసు ఈ మాటలు చెప్పినప్పుడు, ఆయన తిరిగి తన శిష్యుల యొద్దకు వచ్చిచూడగా, వారు ఎడతెగక నిలకడగా ఆయనను ప్రార్థించుచుండిరి; ఆయన వారిపై తిరిగి మందహసము చేసెను మరియు యేసువలే వారు కూడా తెల్లగానుండిరి.

31 మరలా ఆయన కొంత దూరము వెళ్ళి తండ్రికి ప్రార్థన చేసెను;

32 ఆయన ప్రార్థన చేసినప్పుడు ఉచ్ఛరించిన మాటలు ఏ నాలుక పలుకలేదు లేదా అవి ఏ మనుష్యుని చేతనైనను వ్రాయబడలేవు.

33 మరియు సమూహము దానిని విని, సాక్ష్యమిచ్చెను; వారి హృదయములు తెరువబడి, ఆయన ప్రార్థన చేసినప్పుడు ఉచ్ఛరించిన మాటలను వారి హృదయములలో వారు గ్రహించిరి.

34 అయినప్పటికీ, ఆయన ప్రార్థన చేసినప్పుడు ఉచ్ఛరించిన మాటలు ఎంతో గొప్పవి మరియు అద్భుతమైనవైయుండెను, అవి వ్రాయబడలేవు లేదా ఏ మనుష్యుని చేత ఉచ్ఛరింపబడలేవు.

35 ఇప్పుడు యేసు ప్రార్థన చేయుటను ముగించిన తరువాత ఆయన తిరిగి శిష్యుల యొద్దకు వచ్చి, వారితో ఇట్లు చెప్పెను: ఇంత గొప్ప విశ్వాసమును యూదులందరి మధ్య నేనెన్నడూ చూడలేదు; అందువలన వారి అవిశ్వాసమును బట్టి అంత గొప్ప అద్భుతములను వారికి నేను చూపలేకపోతిని.

36 నిశ్చయముగా నేను మీతో చెప్పునదేమనగా—వారిలో ఎవరూ మీరు చూచినంత గొప్ప విషయములను చూచియుండలేదు లేదా మీరు వినినంత గొప్ప విషయములను వినియుండలేదు.

ముద్రించు