అధ్యాయము 22
అంత్యదినములలో సీయోను మరియు ఆమె స్టేకులు స్థాపించబడును; ఇశ్రాయేలు కనికరమందును సుకుమారమందును సమకూర్చబడును—వారు జయింతురు. యెషయా 54 తో పోల్చుము. సుమారు క్రీ. శ. 34 సం.
1 అప్పుడు వ్రాయబడినది జరుగును: గొడ్రాలా, పిల్లలు కననిదానా జయగీతమెత్తుము; ప్రసవవేదన పడనిదానా, జయకీర్తన నెత్తి ఆనందపడుము; సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
2 నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగ సాగనిమ్ము, నీ త్రాళ్ళను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము;
3 కుడి వైపునకు ఎడమ వైపునకు నీవు వ్యాపించెదవు, నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణములను నివాసస్థలములుగా చేయును.
4 భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు; అవమానమును తలంచకుము, నీవు లజ్జపడనక్కరలేదు; నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ బాల్యకాలపు నిందను నీ వైధవ్యపు నిందను ఇకమీదట జ్ఞాపకము చేసుకొనవు.
5 నీ సృష్టికర్త, నీ భర్త, సైన్యముల కధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు; ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు.
6 నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు—విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును, తృణీకరింపబడిన యౌవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు.
7 నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను.
8 మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
9 నోవహు కాలమున జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును, జలములు భూమి మీదికి ఇకను పొర్లుచురావని నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపముగా ఉండనని నేను ఒట్టు పెట్టుకొనియున్నాను.
10 పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధానవిషయమైన నా నిబంధన తొలగిపోదని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
11 ప్రయాసపడి గాలివానచేత కొట్టబడి ఆదరణలేక యున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును.
12 మాణిక్యమణులతో నీ కోటకొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును.
13 నీ పిల్లలు అందరు యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును.
14 నీవు నీతిగలదానవై స్థాపించబడుదువు; నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానేరాదు.
15 నీకు విరోధముగా జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు; నీకు విరోధముగా గుంపుకూడువారు నీ పక్షపు వారగుదురు.
16 ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించువాడను నేనే; నాశనము చేయుటకై పాడుచేయువాని సృజించువాడను నేనే.
17 నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్థిల్లదు; న్యాయవిమర్శలో నీకు దోషారోపణచేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసెదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది; ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు.