లేఖనములు
ఈథర్ 9


9వ అధ్యాయము

వంశపారంపర్యము, కుట్ర మరియు హత్య ద్వారా రాజ్యము ఒకరి నుండి మరియొకరికి సంక్రమించును—ఎమెర్‌, నీతి కుమారుని చూచును—అనేకమంది ప్రవక్తలు పశ్చాత్తాపమును ప్రకటించుదురు—కరువు మరియు విషసర్పములు జనులను బాధించును.

1 ఇప్పుడు మొరోనై అను నేను, నా వృత్తాంతమును కొనసాగించెదను. ఇదిగో, అకిష్‌ మరియు అతని స్నేహితుల రహస్య కూడికలను బట్టి వారు ఓమెర్‌ యొక్క రాజ్యమును పడద్రోసిరి.

2 అయినప్పటికీ ఓమెర్‌ పట్ల మరియు అతని నాశనమును కోరుకొనని అతని కుమారులు, కుమార్తెల పట్ల కూడా ప్రభువు కనికరము చూపెను.

3 మరియు అతడు దేశము నుండి బయటకు వెడలిపోవలెనని ప్రభువు స్వప్నమందు ఓమెర్‌ను హెచ్చరించెను; అందువలన, ఓమెర్‌ తన కుటుంబముతో దేశము నుండి బయటకు వెడలిపోయెను; అనేక దినములు ప్రయాణము చేసి, షిమ్ యొక్క కొండను దాటి వెళ్ళి, నీఫైయులు నాశనము చేయబడిన స్థలమును దాటి, తూర్పు వైపు నుండి సముద్రము ప్రక్కగా అబ్లోమ్ అని పిలువబడిన స్థలమునకు వచ్చి చేరెను; జెరెడ్‌ మరియు అతని కుటుంబము తప్ప, అక్కడ అతడు, అతని కుమారులు, కుమార్తెలు మరియు అతని కుటుంబమంతయు కూడా గుడారములు వేసుకొనిరి.

4 మరియు దుష్టత్వము చేత జెరెడ్‌ జనుల మీద రాజుగా అభిషేకింపబడెను; అతడు తన కుమార్తెను అకిష్‌నకు భార్యగా ఇచ్చెను.

5 అకిష్‌, తన మామ యొక్క ప్రాణము తీయజూచెను మరియు ప్రాచీనుల యొక్క ప్రమాణమును బట్టి అతడు ప్రమాణము చేయించిన వారిని అతడు సహాయమడిగెను; అతని మామ జనులకు దర్శనమిచ్చుచూ తన సింహాసనము మీద కూర్చొనియుండగా వారతని మామ యొక్క తలను నరికి తెచ్చిరి.

6 ఈ దుర్మార్గము మరియు రహస్య సంఘము యొక్క వ్యాప్తి ఎంత గొప్పదైయుండెననగా, అది జనులందరి హృదయములను చెరిపియుండెను; కావున, జెరెడ్‌ అతని సింహాసనముపై హత్య చేయబడెను మరియు అకిష్‌, అతని స్థానములో పరిపాలించెను.

7 ఇప్పుడు అకిష్‌, అతని కుమారుడిని చూచి అసూయపడసాగెను; కావున అతడు, అతడిని చెరసాలలో బంధించి, అతడు మరణించు వరకు అతడికి కొంచెము ఆహారమిచ్చెను లేదా ఆహారము ఇవ్వకుండెను.

8 ఇప్పుడు మరణించిన వాని సహోదరుడు (అతని పేరు నిమ్రా), తన తండ్రి తన సహోదరుని పట్ల చేసిన దానిని బట్టి అతనితో కోపముగా ఉండెను.

9 మరియు నిమ్రా కొద్ది సంఖ్యలో పురుషులను సమకూర్చి, దేశము నుండి బయటకు పారిపోయి వచ్చి ఓమెర్‌తో నివసించెను.

10 అకిష్‌ ఇతర కుమారులను కనెను మరియు అతడు కోరిన ప్రకారము సమస్త విధమైన దుర్నీతిని జరిగించెదమని వారు అతనికి ప్రమాణము చేసినప్పటికీ, వారు జనుల హృదయములను గెలుచుకొనిరి.

11 అకిష్‌ అధికారము కొరకు కోరిక గలవాడైనట్లు, అకిష్‌ యొక్క జనులు లాభము కొరకు కోరిక కలిగియుంటిరి; కావున, అకిష్‌ యొక్క కుమారులు జనులకు ధనాశ చూపుట ద్వారా వారిలో అధిక భాగమును తమ వైపు ఆకర్షించిరి.

12 ఇప్పుడు అకిష్‌ యొక్క కుమారులకు, అకిష్‌కు మధ్య యుద్ధము మొదలాయెను; అది దాదాపు రాజ్యము యొక్క జనులందరు, అనగా ముప్పది ఆత్మలు మరియు ఓమెర్‌ యొక్క ఇంటివారితో పారిపోయిన వారు తప్ప, మిగిలిన వారందరూ నాశనమగు వరకు అనేక సంవత్సరముల పాటు జరిగెను.

13 అందువలన, ఓమెర్‌ అతని స్వాస్థ్యమైన దేశమునకు తిరిగి పునఃస్థాపించబడెను.

14 ఇప్పుడు, ఓమెర్‌ వృద్ధుడవసాగెను; అయినప్పటికీ, అతని ముసలితనమందు అతడు ఎమెర్‌ను కనెను మరియు తనకు బదులుగా పరిపాలించుటకు ఎమెర్‌ను అభిషేకించెను.

15 అతడు ఎమెర్‌ను రాజుగా అభిషేకించిన తరువాత, దేశమందు రెండు సంవత్సరముల పాటు సమాధానమును చూచెను మరియు దుఃఖముతో నిండిన దినములనేకము చూచియుండి అతడు మరణించెను. ఎమెర్‌ అతనికి బదులుగా పరిపాలించెను మరియు అతని తండ్రి యొక్క అడుగుజాడలలో నడిచెను.

16 ప్రభువు దేశముపై నుండి శాపమును తిరిగి తీసివేయుట ప్రారంభించెను మరియు ఎమెర్‌ యొక్క కుటుంబము ఎమెర్‌ పరిపాలన క్రింద మిక్కిలిగా వర్థిల్లెను; అరవై రెండు సంవత్సరముల కాలములో వారు మిక్కిలి బలవంతులైరి, ఎంతగాననగా వారు మిక్కిలి ధనవంతులైరి—

17 అన్ని విధములైన పండ్లు, ధాన్యము, నూలు, శ్రేష్ఠమైన వస్త్రములు, బంగారము, వెండి మరియు ప్రశస్థ వస్తువులు కలిగియుండిరి.

18 అన్ని విధములైన పశువులు, ఎద్దులు, ఆవులు, గొఱ్ఱెలు, పందులు, మేకలు మరియు మనుష్యుని ఆహారము కొరకు ఉపయోగకరమైన అనేక రకములైన ఇతర జంతువులను కూడా కలిగియుండిరి.

19 వారు గుఱ్ఱములను, గాడిదలను కూడా కలిగియుండిరి; అక్కడ ఏనుగులు, క్యురిలోములు మరియు క్యుమోములుండెను; అవన్నియూ, ముఖ్యముగా ఏనుగులు, క్యురిలోములు మరియు క్యుమోములు మనుష్యునికి ఉపయోగకరముగా ఉండెను.

20 ఆ విధముగా ఇతర దేశములన్నిటికన్నా శ్రేష్ఠమైన ఈ దేశముపై ప్రభువు తన ఆశీర్వాదములను క్రుమ్మరించెను మరియు దేశమును స్వాధీనపరచుకొను వారెవరైనను దానిని ప్రభువు కొరకు స్వాధీన పరచుకొనవలెనని, లేని యెడల వారు దుర్నీతిలో పరిపక్వమైనప్పుడు వారు నాశనము చేయబడవలెనని ఆయన ఆజ్ఞాపించెను; అట్టి వారిపై నేను నా ఉగ్రత యొక్క సంపూర్ణతను క్రుమ్మరించెదనని ప్రభువు చెప్పుచున్నాడు.

21 మరియు ఎమెర్‌, అతని దినములన్నిటా నీతియందు తీర్పుతీర్చెను; అతడు అనేకమంది కుమారులను, కుమార్తెలను కనెను; అతడు కోరియాంటమ్‌ను కనెను మరియు అతనికి బదులుగా పరిపాలించుటకు కోరియాంటమ్‌ను అభిషేకించెను.

22 అతని స్థానములో పరిపాలించుటకు అతడు కోరియాంటమ్‌ను అభిషేకించిన తరువాత, అతడు నాలుగు సంవత్సరములు జీవించెను మరియు దేశమందు సమాధానమును చూచెను; అతడు నీతి కుమారుడి రాకడ సమయమును చూచి అమితానందపడి, సమాధానమందు మరణించెను.

23 కోరియాంటమ్, అతని తండ్రి యొక్క అడుగుజాడలలో నడిచి అనేక బలమైన పట్టణములను నిర్మించెను మరియు అతని దినములన్నిటిలో తన జనులకు అతడు మేలు చేసెను. అతడు మిక్కిలి వృద్ధుడగువరకు అతనికి సంతానము కలుగలేదు.

24 మరియు అతని భార్య నూట రెండు సంవత్సరముల వయస్సులో మరణించెను. కోరియాంటమ్ తన ముసలితనమందు ఒక యౌవన దాసిని భార్యగా చేసుకొని కుమారులను, కుమార్తెలను కనెను; కావున, నూట నలుబది రెండు సంవత్సరముల వయస్సు వరకు అతడు జీవించెను.

25 అతడు కోమ్‌ను కనెను మరియు కోమ్ అతనికి బదులుగా పరిపాలించెను; అతడు నలుబది తొమ్మిది సంవత్సరములు పరిపాలించెను మరియు హేతును కనెను; అతడు ఇతర కుమారులను, కుమార్తెలను కూడా కనెను.

26 మరలా జనులు దేశమంతటా వ్యాపించిరి మరియు దేశమందు అత్యధిక దుష్టత్వము ఉండుట మొదలాయెను; హేతు, తన తండ్రిని నాశనము చేయుటకు ప్రాచీన కాలము యొక్క రహస్య ప్రణాళికలను తిరిగి అవలంబించసాగెను.

27 అతడు తన ఖడ్గముతో తన తండ్రిని సంహరించి, అతడిని గద్దె దించెను; మరియు అతని స్థానములో పరిపాలించెను.

28 వారు ప్రభువు యొక్క మార్గమును సిద్ధపరచవలెనని, లేనియెడల దేశముపై శాపము వచ్చునని, వారు పశ్చాత్తాపపడని యెడల గొప్ప కరువు వచ్చి, దానిలో వారు నాశనము చేయబడుదురని వారికి పశ్చాత్తాపమును ప్రకటించుచూ మరలా దేశములోనికి ప్రవక్తలు వచ్చిరి.

29 కానీ, జనులు ప్రవక్తల మాటలను నమ్మకుండా వారిని బయటకు గెంటివేసిరి; వారిలో కొందరిని వారు గోతులలోనికి పడవేసి, నశించిపోవుటకు వదిలివేసిరి. మరియు వారు ఈ సంగతులన్నిటినీ రాజైన హేత్ యొక్క ఆజ్ఞ ప్రకారము చేసిరి.

30 ఇప్పుడు దేశమందు తీవ్రమైన కరువు ప్రారంభమాయెను మరియు కరువును బట్టి దేశవాసులు మిక్కిలి వేగముగా నాశనము చేయబడసాగిరి, ఏలయనగా భూముఖముపై వర్షము లేకుండెను.

31 దేశమందు విషసర్పములు వచ్చి, అనేకమంది జనులను విషపూరితము చేసెను. వారి మందలు విషసర్పముల యెదుట నుండి నీఫైయుల చేత జరహేమ్ల అని పిలువబడిన దక్షిణ దేశము వైపునకు పారిపోవుట మొదలుపెట్టెను.

32 వాటిలో అనేకము దారిలో నశించిపోయెను; అయినప్పటికీ, కొన్ని దక్షిణము వైపు పారిపోయెను.

33 ఇకపై వారిని తరుముటకు బదులు జనులు వాటిని దాటి వెళ్ళకుండునట్లు, దాటి వెళ్ళుటకు ప్రయత్నము చేయు వారెవరైనను విషసర్పముల చేత కాటువేయబడునట్లు, ఆ సర్పములు మార్గమందు కంచెవలె నిలిచియుండునట్లు ప్రభువు చేసెను.

34 మరియు జనులు జంతువుల యొక్క మార్గమును వెంబడించిరి. వారు, వాటన్నిటిని తినివేయు వరకు మార్గమున పడిన వాటి యొక్క కళేబరములను తినిరి. ఇప్పుడు తాము నశించిపోవుచున్నామని చూచినప్పుడు, జనులు తమ దుర్ణీతుల నిమిత్తము పశ్చాత్తాపపడి ప్రభువుకు మొరపెట్టసాగిరి.

35 వారు ప్రభువు యెదుట తగినంతగా తమనుతాము తగ్గించుకొనినప్పుడు, భూముఖముపై ఆయన వర్షమును పంపెను; జనులు తిరిగి బలము పుంజుకోసాగిరి; ఉత్తర దేశములలో, చుట్టూ ఉన్న దేశములన్నిటిలో ఫలము ఫలించుట ప్రారంభమాయెను. మరియు కరువునుండి వారిని కాపాడుటలో ప్రభువు తన శక్తిని వారికి చూపెను.

ముద్రించు