లేఖనములు
ఈథర్ 15


15వ అధ్యాయము

లక్షలమంది జెరెడీయులు యుద్ధమందు సంహరింపబడిరి—మరణము వరకు పోరాడుటకు షిజ్ మరియు కోరియాంటమర్‌ జనులందరినీ సమావేశపరచుదురు—ప్రభువు యొక్క ఆత్మ వారితో పోరాడుట మానును—జెరెడీయ జాతి పూర్తిగా నాశనము చేయబడును—కేవలము కోరియాంటమర్‌ మిగులును.

1 మరియు కోరియాంటమర్‌ అతని గాయముల నుండి కోలుకొనినప్పుడు, ఈథర్‌ అతనితో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనసాగెను.

2 అప్పటికే అతని జనులలో సుమారు ఇరువది లక్షలమంది ఖడ్గము చేత సంహరింపబడియుండిరని చూచి, తన హృదయమందు అతడు దుఃఖించసాగెను; అవును, ఇరువది లక్షలమంది బలమైన పురుషులు, వారి భార్యాపిల్లలు కూడా సంహరింపబడియుండిరి.

3 తాను చేసిన కీడును గూర్చి అతడు పశ్చాత్తాపపడుట మొదలుపెట్టెను; ప్రవక్తలందరి నోటిద్వారా చెప్పబడిన మాటలను అతడు జ్ఞాపకము చేసుకొనసాగెను మరియు ఇప్పటివరకు వాటిలో ప్రతి అంశము నెరవేరినదని అతడు చూచెను; అతని ఆత్మ దుఃఖించి, ఆదరింపబడుటకు నిరాకరించెను.

4 అతడు జనులను విడిచిపెట్టవలెనని కోరుచూ, జనుల ప్రాణముల నిమిత్తము తాను తన రాజ్యమును ఇచ్చివేయుదునని చెప్పుచూ షిజ్‌కు ఒక లేఖ వ్రాసెను.

5 షిజ్ అతని లేఖను అందుకొనినప్పుడు, అతడిని తన స్వంత ఖడ్గముతో సంహరించగలుగునట్లు అతడు తననుతాను అప్పగించుకొనిన యెడల, జనుల ప్రాణములను విడిచిపెట్టెదనని కోరియాంటమర్‌కు లేఖ వ్రాసెను.

6 మరియు జనులు వారి దోషమును బట్టి పశ్చాత్తాపపడలేదు; కోరియాంటమర్‌ యొక్క జనులు షిజ్ యొక్క జనులకు వ్యతిరేకముగా కోపమునకు పురిగొల్పబడిరి; షిజ్ యొక్క జనులు కోరియాంటమర్‌ యొక్క జనులకు వ్యతిరేకముగా కోపమునకు పురిగొల్పబడిరి; అందువలన షిజ్ యొక్క జనులు కోరియాంటమర్‌ యొక్క జనులతో యుద్ధము చేసిరి.

7 మరియు అతడు ఓడిపోబోవుచున్నాడని కోరియాంటమర్‌ చూచినపుడు, అతడు షిజ్ యొక్క జనుల యెదుట నుండి మరలా పారిపోయెను.

8 అతడు రిప్లియాంకమ్ యొక్క జలముల యొద్దకు వచ్చెను, అర్థమును బట్టి అది పెద్దది లేదా అన్నిటినీ మించినది అయ్యున్నది; అందువలన వారు ఈ జలముల యొద్దకు వచ్చినప్పుడు, వారు తమ గుడారములను వేసుకొనిరి; షిజ్ కూడా అతని గుడారములను వారికి దగ్గరగా వేసుకొనెను; కావున, ఉదయమున వారు యుద్ధమునకు వచ్చిరి.

9 వారు మిక్కిలి తీవ్రముగా యుద్ధము చేసిరి, దానిలో కోరియాంటమర్‌ మరలా గాయపడి, రక్తము కోల్పోయి మూర్ఛపోయెను.

10 కోరియాంటమర్‌ యొక్క సైన్యములు షిజ్ యొక్క సైన్యములపై బలముగా దాడిచేసి వారిని ఓడించి, తమ యెదుట నుండి వారు పారిపోవునట్లు చేసెను; వారు దక్షిణము వైపు పారిపోయి, ఒగాత్‌ అని పిలువబడిన స్థలములో తమ గుడారములను వేసుకొనిరి.

11 కోరియాంటమర్‌ యొక్క సైన్యము వారి గుడారములను రామా కొండవద్ద వేసుకొనిరి; ఆ కొండయందే నా తండ్రి మోర్మన్‌ పవిత్రమైన వృత్తాంతములను ప్రభువు సంరక్షణలో దాచివేసెను.

12 వారు ఈథర్‌ని తప్ప, దేశమంతటిలో సంహరింపబడియుండని జనులందరిని సమకూర్చిరి.

13 మరియు జనుల యొక్క కార్యములన్నిటిని ఈథర్‌ చూచెను; కోరియాంటమర్‌ వైపునున్న జనులు కోరియాంటమర్‌ యొక్క సైన్యమునకు జతగా సమకూర్చబడిరని, షిజ్ వైపునున్న జనులు షిజ్ యొక్క సైన్యమునకు జతగా సమకూర్చబడిరని అతడు చూచెను.

14 కావున, వారు దేశమందున్న వారందరినీ సమీకరించి, వారు పొందగలిగినంత బలమును పొందునట్లు నాలుగు సంవత్సరముల పాటు జనులను సమకూర్చుచుండిరి.

15 వారందరు, ప్రతివాడు తన భార్యాపిల్లలతోపాటు అతడు కోరుకున్న సైన్యమునకు జతగా సమకూర్చబడినప్పుడు—పురుషులు, స్త్రీలు, పిల్లలందరు యుద్ధ ఆయుధములను ధరించినవారై, డాలులు, వక్షస్థల కవచములు, శిరస్త్రాణములు కలిగియుండి, యుద్ధపద్ధతి ప్రకారము ధరించినవారై జతగా సమకూర్చబడినప్పుడు—వారు ఒకనికి వ్యతిరేకముగా మరొకడు యుద్ధమునకు ముందుకు నడిచిరి; వారు దినమంతయు పోరాడిరి, కానీ జయించలేదు.

16 రాత్రి అయినప్పుడు వారు అలసిపోయి, వారి దండులకు తిరిగివెళ్ళిరి; వారు తమ దండులకు తిరిగి వెళ్ళిన తరువాత, వారి జనులలో సంహరింపబడిన వారి నష్టము నిమిత్తము వారు శోకముతో విలపించసాగిరి. వారి అరుపులు, రోదనలు, విలాపములు గాలిని ఛేదించునంత అధికముగా ఉండెను.

17 ఉదయమున వారు తిరిగి యుద్ధమునకు వెళ్ళిరి మరియు ఆ దినము మహా భయంకరమైనదైయుండెను; అయినప్పటికీ, వారు జయించలేదు; మరలా రాత్రి వచ్చినపుడు, వారి జనులలో సంహరింపబడిన వారి నష్టము నిమిత్తము వారి అరుపులు, రోదనలు, విలాపములతో వారు గాలిని ఛేదించిరి.

18 మరియు అతడు యుద్ధమునకు తిరిగి రాకుండునట్లు, అతడు రాజ్యమును తీసుకొని జనుల ప్రాణములను విడిచిపెట్టవలెనని కోరుచూ కోరియాంటమర్‌, షిజ్‌కు మరలా ఒక లేఖ వ్రాసెను.

19 కానీ, ప్రభువు యొక్క ఆత్మ వారితో పోరాడుట మానివేసియుండెను మరియు సాతాను జనుల యొక్క హృదయములపై పూర్తి అధికారము కలిగియుండెను; ఏలయనగా వారు నాశనము చేయబడునట్లు వారు తమ హృదయ కాఠిన్యమునకు, వారి మనస్సుల యొక్క గృడ్డితనమునకు అప్పగించబడిరి; అందువలన వారు తిరిగి యుద్ధమునకు వెళ్ళిరి.

20 వారు ఆ దినమంతయు పోరాడిరి మరియు రాత్రి వచ్చినప్పుడు వారు తమ ఖడ్గములపై నిద్రించిరి.

21 మరుసటి ఉదయమున మరలా వారు రాత్రి వచ్చువరకు పోరాడిరి.

22 రాత్రి వచ్చినప్పుడు, ద్రాక్షారసముతో మత్తులైన వారివలే కోపముతో మత్తులైయుండి, వారు తమ ఖడ్గములపై నిద్రించిరి.

23 ఉదయమున వారు తిరిగి పోరాడిరి; రాత్రి వచ్చినప్పుడు కోరియాంటమర్‌ యొక్క జనులలో ఏబది రెండు మంది, షిజ్ యొక్క జనులలో అరవై తొమ్మిదిమంది తప్ప, మిగిలిన వారందరు ఖడ్గముచేత కూలిరి.

24 ఆ రాత్రి వారు తమ ఖడ్గములపై నిద్రించి, ఉదయమున తిరిగి పోరాడిరి; ఆ దినమంతయు వారు తమ బలమందు తమ ఖడ్గములతో, డాలులతో పోరాడిరి.

25 రాత్రి వచ్చినప్పుడు, షిజ్ యొక్క జనులలో ముప్పది రెండుమంది, కోరియాంటమర్‌ యొక్క జనులలో ఇరువది ఏడుమంది ఉండిరి.

26 వారు తిని, నిద్రించి, ఉదయమున మరణము కొరకు సిద్ధపడిరి. మనుష్యుల యొక్క బలమును బట్టి వారు భారీకాయులు, శక్తిమంతులైయుండిరి.

27 వారు మూడుగంటలపాటు పోరాడి, రక్తము కోల్పోయి మూర్ఛపోయిరి.

28 కోరియాంటమర్‌ యొక్క మనుష్యులు నడువగలుగుటకు తగినంత శక్తిని పొందినప్పుడు, వారు తమ ప్రాణముల నిమిత్తము పారిపోవుటకు సిద్ధమైరి; కానీ, షిజ్ మరియు అతని మనుష్యులు కూడా లేచిరి; మరియు కోరియాంటమర్‌ను సంహరించెదనని లేదా ఖడ్గము చేత నాశనమగుదునని షిజ్ తన కోపమందు ప్రమాణము చేసెను.

29 అందువలన, అతడు వారిని తరుముచూ ఉదయమున వారిని అందుకొనెను; వారు తిరిగి ఖడ్గముతో పోరాడిరి; ఇప్పుడు కోరియాంటమర్‌ మరియు షిజ్ తప్ప, మిగిలిన వారందరు ఖడ్గము చేత కూలినప్పుడు, షిజ్ రక్తము కోల్పోయి మూర్ఛపోయెను.

30 కోరియాంటమర్‌ తన ఖడ్గముపై ఆనుకొని కొంత విశ్రాంతి తీసుకొనిన తరువాత, అతడు షిజ్ తలను నరికివేసెను.

31 అతడు షిజ్ తలను నరికివేసిన తరువాత, షిజ్ తన చేతులపై లేచి పడిపోయెను; మరియు అతడు ఊపిరి కొరకు పెనుగులాడి మరణించెను.

32 కోరియాంటమర్‌ నేలకు ఒరిగి, జీవములేనట్లు ఆయెను.

33 మరియు ప్రభువు ఈథర్‌తో మాట్లాడి, ముందుకు వెళ్ళమని అతనితో చెప్పెను. అతడు ముందుకు వెళ్ళి, ప్రభువు యొక్క మాటలన్నియు నెరవేరినవని చూచి తన వృత్తాంతమును ముగించెను; (అందులో నూరవ భాగమును కూడా నేను వ్రాయలేదు) మరియు లింహై యొక్క జనులు వాటిని కనుగొను విధముగా అతడు వాటిని దాచెను.

34 ఇప్పుడు ఈథర్‌ ద్వారా వ్రాయబడిన చివరి మాటలివి: దేవుని రాజ్యమందు నేను రక్షింపబడిన యెడల, ప్రభువు నేను రూపాంతరము చెందవలెనని కోరుచున్నాడో లేదా శరీరమందు ప్రభువు యొక్క చిత్తమును అనుభవించవలెనని కోరుచున్నాడో అనునది ముఖ్యము కాదు. ఆమేన్‌.