లేఖనములు
ఈథర్ 11


11వ అధ్యాయము

యుద్ధములు, విభేదములు మరియు దుష్టత్వము జెరెడీయుల జీవనమును ప్రభావితము చేయును—వారు పశ్చాత్తాపపడని యెడల, జెరెడీయులు పూర్తిగా నాశనమగుదురని ప్రవక్తలు ముందుగా చెప్పెదరు—జనులు ప్రవక్తల మాటలను తిరస్కరించెదరు.

1 కోమ్ యొక్క దినములలో కూడా అనేకమంది ప్రవక్తలు వచ్చిరి మరియు వారు పశ్చాత్తాపపడి, ప్రభువు తట్టు తిరిగి, వారి హత్యలను, దుష్టత్వమును విడిచిపెట్టని యెడల ఆ గొప్ప జనులు నాశనమగుదురని ప్రవచించిరి.

2 మరియు ప్రవక్తలు జనుల చేత తిరస్కరించబడిరి; జనులు వారిని నాశనము చేయజూచినందున, వారు రక్షణ కొరకు కోమ్ యొద్దకు పారిపోయిరి.

3 వారు కోమ్‌కు అనేక సంగతులు ప్రవచించిరి మరియు అతని శేషదినములన్నిటిలో అతడు ఆశీర్వదించబడెను.

4 అతడు చాలాకాలము జీవించి, షిబ్లోమ్‌ను కనెను మరియు షిబ్లోమ్ అతని స్థానములో పరిపాలించెను. షిబ్లోమ్ యొక్క సహోదరుడు అతనికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేయగా, దేశమంతటా గొప్ప యుద్ధము మొదలాయెను.

5 మరియు షిబ్లోమ్ యొక్క సహోదరుడు, జనుల నాశనమును గూర్చి ప్రవచించిన ప్రవక్తలందరు చంపబడునట్లు చేసెను;

6 ఇప్పుడు దేశమంతటా గొప్ప విపత్తు కలిగెను, ఏలయనగా తమ దుష్టత్వమును గూర్చి వారు పశ్చాత్తాపపడని యెడల, దేశముపైన మరియు జనులపైన కూడా గొప్ప శాపము వచ్చునని, భూముఖముపై ఎన్నడూ ఉండనటువంటి గొప్ప నాశనము వారి మధ్య ఉండునని, వారి ఎముకలు భూముఖముపై మట్టి కుప్పలుగా అగునని వారు సాక్ష్యమిచ్చియుండిరి.

7 మరియు వారి దుర్మార్గపు కూడికలను బట్టి, వారు ప్రభువు యొక్క స్వరమునకు చెవియొగ్గలేదు; అందువలన దేశమంతటా యుద్ధములు, వివాదములు మరియు అనేక కరువు కాటకములుండుట మొదలాయెను, ఎంతగాననగా భూముఖముపై ఎన్నడూ ఎరిగియుండని గొప్ప నాశనము అక్కడుండెను; ఇదంతయూ షిబ్లోమ్ యొక్క దినములందు జరిగెను.

8 అంతట జనులు వారి దోషమును గూర్చి పశ్చాత్తాపపడసాగిరి మరియు వారు ఎంతగా పశ్చాత్తాపపడిరో, అంతగా ప్రభువు వారిపై కనికరము చూపెను.

9 మరియు షిబ్లోమ్ సంహరింపబడెను; సేత్ చెరపట్టబడి, అతని దినములన్నియు దాస్యమందు జీవించెను.

10 అతని కుమారుడు ఆహా రాజ్యమును సంపాదించెను; అతని దినములన్నియు అతడు జనులపై పరిపాలన చేసెను. అతడు తన దినములలో సమస్త విధమైన దుర్నీతిని జరిగించెను, దాని ద్వారా అతడు అధిక రక్తము చిందించబడునట్లు చేసెను; మరియు అతని దినములు కొద్దిగానుండెను.

11 ఇప్పుడు, ఆహా వంశస్థుడైన ఈథెమ్ రాజ్యమును సంపాదించెను; అతడు కూడా తన దినములలో దుర్నీతి జరిగించెను.

12 ఈథెమ్ యొక్క దినములలో అనేకమంది ప్రవక్తలు వచ్చి, మరలా జనులకు ప్రవచించిరి; వారి దోషముల విషయమై వారు పశ్చాత్తాపపడని యెడల, ప్రభువు వారిని భూముఖముపై నుండి పూర్తిగా నాశనము చేయునని వారు ప్రవచించిరి.

13 కానీ జనులు వారి హృదయములను కఠినపరచుకొని, వారి మాటలను ఆలకించకుండిరి; ప్రవక్తలు దుఃఖపడి, జనుల మధ్యనుండి వెళ్ళిపోయిరి.

14 మరియు ఈథెమ్ అతని దినములన్నిటా దుష్టత్వమందు తీర్పుతీర్చెను; అతడు మోరొన్‌ను కనెను. మోరొన్‌, అతని స్థానములో పరిపాలించెను; మోరొన్‌, ప్రభువు యెదుట దుర్మార్గమైన దానిని జరిగించెను.

15 అధికారమును, లాభమును సంపాదించుటకు నిర్మించబడిన ఆ రహస్యకూడికను బట్టి, జనుల మధ్య తిరుగుబాటు సంభవించెను; దోషమందు బలమైన మనుష్యుడొకడు వారి మధ్య నుండి వచ్చి, మోరొన్‌తో యుద్ధము చేసి, రాజ్యములో సగభాగమును పడద్రోసెను; రాజ్యము యొక్క ఆ సగభాగమును అనేక సంవత్సరముల పాటు అతడు నిలుపుకొనెను.

16 మోరొన్‌ అతడిని పడద్రోసి, మరలా రాజ్యమును సంపాదించెను.

17 అక్కడ మరియొక బలమైన మనుష్యుడు పుట్టెను; అతడు జెరెడ్‌ యొక్క సహోదరుని వంశస్థుడైయుండెను.

18 అతడు మోరొన్‌ను పడద్రోసి, రాజ్యమును సంపాదించెను; అందువలన, మోరొన్‌ తన శేషదినములన్నియు దాస్యమందు జీవించెను; మరియు అతడు కోరియాంటర్‌ను కనెను.

19 కోరియాంటర్‌ కూడా తన దినములన్నియు దాస్యమందు జీవించెను.

20 కోరియాంటర్‌ దినములందు కూడా అనేకమంది ప్రవక్తలు వచ్చి, గొప్ప ఆశ్చర్యకరమైన సంగతులను గూర్చి ప్రవచించిరి మరియు జనులకు పశ్చాత్తాపమును ప్రకటించిరి; వారు పశ్చాత్తాపపడని యెడల, ప్రభువైన దేవుడు వారి సంపూర్ణ నాశనమునకై వారికి వ్యతిరేకముగా తీర్పు తీర్చునని చెప్పిరి;

21 మరియు వారి పితరులను తీసుకువచ్చిన మాదిరిగా తన శక్తి ద్వారా దేశమును స్వాధీనపరచుకొనుటకు ప్రభువైన దేవుడు వేరే జనులను పంపునని లేదా తీసుకువచ్చునని చెప్పిరి.

22 కానీ వారి రహస్య సంఘము మరియు దుర్మార్గపు హేయక్రియలను బట్టి, వారు ప్రవక్తల మాటలన్నిటినీ తిరస్కరించిరి.

23 మరియు కోరియాంటర్‌, తన దినములన్నియు దాస్యమందు జీవించినవాడై ఈథర్‌ను కని, మరణించెను.

ముద్రించు