లేఖనములు
ఈథర్ 8


8వ అధ్యాయము

రాజ్యమును గూర్చి కలహము మరియు వివాదము ఉండెను—రాజును సంహరించుటకు అకిష్‌ ఒక ప్రమాణమునకు కట్టుబడిన రహస్య కూడికను రూపొందించును—రహస్య కూడికలు అపవాదికి సంబంధించినవి మరియు జనముల యొక్క నాశనమును కలుగజేయును—సమస్త భూభాగములు, జనములు మరియు దేశముల యొక్క స్వాతంత్ర్యమును పడగొట్టుటకు చూచు రహస్య కూడికలను గూర్చి ఆధునిక అన్యజనులు హెచ్చరింపబడియున్నారు.

1 అతడు ఓమేర్‌ను కనెను మరియు ఓమేర్‌ అతని స్థానములో పరిపాలించెను. ఓమేర్‌, జెరెడ్‌ను కనెను; జెరెడ్‌ కుమారులను, కుమార్తెలను కనెను.

2 మరియు జెరెడ్‌, అతని తండ్రికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసి, హేత్ దేశమునకు వచ్చి, అక్కడ నివసించెను. అతడు రాజ్యము యొక్క సగభాగమును సంపాదించు వరకు, మోసపూరితమైన తన మాటలచేత అనేకమంది జనులను వంచించెను.

3 అతడు రాజ్యము యొక్క సగభాగమును సంపాదించినప్పుడు, అతడు తన తండ్రితో యుద్ధము చేసి, అతడిని నిర్బంధించి తీసుకొనిపోయి, అతడు చెరలో ఉండి పనిచేయునట్లు చేసెను;

4 ఇప్పుడు, ఓమేర్‌ రాజు తన జీవితకాలములో సగభాగము చెరలో ఉండెను. అతడు కుమారులను, కుమార్తెలను కనెను; వారిలో ఎస్రోమ్ మరియు కోరియాంటమర్‌లు ఉండిరి.

5 తమ సహోదరుడైన జెరెడ్‌ యొక్క పనులను బట్టి వారు మిక్కిలి కోపముగా ఉండిరి, ఎంతగాననగా వారు ఒక సైన్యమును తయారుచేసి జెరెడ్‌తో యుద్ధము చేసిరి. మరియు వారు అతనితో రాత్రి సమయములో యుద్ధము చేసిరి.

6 వారు జెరెడ్‌ యొక్క సైన్యమును సంహరించినప్పుడు, అతడిని కూడా సంహరించబోయిరి; అయితే వారతడిని సంహరించరాదని, అతడు రాజ్యమును అతని తండ్రికి ఇచ్చివేయునని అతడు వారిని బ్రతిమాలుకొనెను. అప్పుడు వారతడిని సంహరించకుండా విడిచిపెట్టిరి.

7 రాజ్యమును కోల్పోవుటను బట్టి జెరెడ్‌ మిక్కిలి దుఃఖాక్రాంతుడాయెను, ఏలయనగా అతడు తన హృదయమును రాజ్యముపై మరియు లోకము యొక్క మహిమపై ఉంచెను.

8 ఇప్పుడు జెరెడ్‌ యొక్క కుమార్తె మిక్కిలి తెలివిగలదైయుండి, తన తండ్రి యొక్క దుఃఖమును చూచి, అతని కొరకు రాజ్యమును విమోచించునట్లు ఒక ప్రణాళికను యోచించెను.

9 జెరెడ్‌ యొక్క కుమార్తె మిక్కిలి సౌందర్యవతి. ఆమె తన తండ్రితో మాట్లాడి, ఇట్లు చెప్పెను: ఎందువలన నా తండ్రి ఇంత విచారపడుచున్నాడు? గొప్ప అగాధము మీదుగా మన తండ్రులు తెచ్చిన వృత్తాంతమును అతడు చదువలేదా? ఇదిగో, తమ రహస్య ప్రణాళికల ద్వారా వారు రాజ్యములను మరియు గొప్ప మహిమను సంపాదించిరని ప్రాచీనకాలపు వారిని గూర్చి ఒక వృత్తాంతము లేదా?

10 కావున, నా తండ్రిని కిమ్నోర్‌ యొక్క కుమారుడైన అకిష్‌ కొరకు ఆహ్వానము పంపనిమ్ము; నేను సౌందర్యవతిని మరియు అతని యెదుట నేను నాట్యము చేయుదును; అతడు నన్ను భార్యగా కోరుకొనునట్లు నేను అతడిని సంతోషపెట్టెదను; అందువలన, నీవు అతనికి భార్యగా నన్ను ఇవ్వవలెనని అతడు నిన్ను కోరిన యెడల, అప్పుడు రాజైన నా తండ్రి యొక్క తలను నీవు నాకు తెచ్చి ఇచ్చిన యెడల, నేను ఆమెను నీకు ఇచ్చెదనని నీవు చెప్పవలెను.

11 ఇప్పుడు ఓమేర్‌, అకిష్‌ యొక్క స్నేహితుడైయుండెను. కావున జెరెడ్‌, అకిష్‌ను ఆహ్వానించినప్పుడు, అతడు ఆమెను భార్యగా కోరునంతగా ఆమె అతడిని సంతోషపెట్టునట్లు జెరెడ్‌ యొక్క కుమార్తె అతని యెదుట నాట్యము చేసెను; అప్పుడు, ఆమెను నాకు భార్యగా ఇవ్వమని అతడు జెరెడ్‌కు చెప్పెను.

12 మరియు జెరెడ్‌ అతనితో—రాజైన నా తండ్రి యొక్క తలను నీవు నాకు తెచ్చి ఇచ్చిన యెడల, నేను ఆమెను నీకు ఇచ్చెదనని చెప్పెను.

13 అంతట అకిష్‌ తన బంధువులందరినీ జెరెడ్‌ ఇంటిలోనికి చేర్చి, నేను మీ నుండి కోరు విషయములో మీరు నాకు నమ్మకముగా ఉండెదరని నాతో ప్రమాణము చేయుదురా? అని వారినడిగెను.

14 అకిష్‌ కోరిన సహాయము నుండి ఎవడైనను విభేధించిన యెడల, అతడు తన తలను పోగొట్టుకొనవలెనని మరియు అకిష్‌ వారికి తెలియజేయు ఏ సంగతినైనను ఎవడైనను బయటపెట్టిన యెడల, అతడు తన ప్రాణమును పోగొట్టుకొనవలెనని వారందరు పరలోక దేవుడిని బట్టి, పరలోకములు, భూమిని బట్టి మరియు వారి తలలను బట్టి కూడా అతనితో ప్రమాణము చేసిరి.

15 ఆ విధముగా వారు అకిష్‌తో ఒప్పందము చేసుకొనిరి. మరియు ఆది నుండి హంతకుడైన కయీను చేత అందించబడి, అధికారమును కోరిన ప్రాచీన కాలపు వారి చేత ఇవ్వబడిన ప్రమాణములను అకిష్‌ వారితో చేయించెను.

16 ఈ ప్రమాణములను జనుల చేత చేయించుటకు, వారిని అంధకారములో ఉంచుటకు, అధికారమును కోరు అట్టివారు అధికారము సంపాదించునట్లు సహాయము చేయుటకు, నరహత్య చేయుటకు, దోచుకొనుటకు, అబద్ధమాడుటకు మరియు అన్ని విధములైన దుష్టత్వములు, జారత్వములు జరిగించుటకు అపవాది యొక్క శక్తి ద్వారా వారు నడిపించబడిరి.

17 ఇప్పుడు ప్రాచీన కాలము యొక్క ఈ సంగతులను వెదకమని అతనికి చెప్పినది జెరెడ్‌ యొక్క కుమార్తెయే; మరియు జెరెడ్‌ వాటిని అకిష్‌ హృదయమందు ఉంచెను; అందువలన అతడు కోరిన దానిని జరిగించుటకు ఆకర్షణీయమైన వాగ్దానముల ద్వారా వారిని నడిపించివేయుచూ అకిష్‌ వాటిని తన బంధువులకు, స్నేహితులకు చెప్పెను.

18 మరియు వారు, ప్రాచీన కాలపు వారి వలే ఒక రహస్య కూడికను రూపొందించిరి; ఆ కూడిక దేవుని దృష్టిలో అన్నిటికంటే మిక్కిలి హేయకరమైనది మరియు దుర్మార్గమైనది;

19 ఏలయనగా, ప్రభువు రహస్య కూడికలలో పనిచేయడు లేదా మనుష్యుడు రక్తము చిందించవలెనని ఆయన కోరడు, కానీ మనుష్యుడు జన్మించినప్పటి నుండి అన్ని సంగతులలో ఆయన దానిని నిషేధించియుండెను.

20 ఇప్పుడు మొరోనై అను నేను, వారి ప్రమాణములు, కూడికల యొక్క విధమును వ్రాయుట లేదు, ఏలయనగా అవి జనులందరి మధ్య ఉండెనని మరియు లేమనీయుల మధ్య ఉండెనని నాకు తెలియజేయబడినది.

21 నేనిప్పుడు ఎవరిని గూర్చి చెప్పుచున్నానో, ఆ జనుల యొక్క నాశనమును మరియు నీఫై జనుల యొక్క నాశనమును కూడా అవి కలుగజేసినవి.

22 అవి జనముపై వ్యాపించువరకు అధికారమును, లాభమును సంపాదించుటకు అట్టి రహస్య కూడికలను సమర్థించు జనము నాశనము చేయబడుదురు; ఏలయనగా, వారి చేత చిందించబడు ఆయన పరిశుద్ధుల యొక్క రక్తము వారిపై పగతీర్చుకొనుట కొరకు నేల నుండి ప్రభువుకు ఎల్లప్పుడు మొరపెట్టుచుండగా, ఆయన వారి నిమిత్తము పగ తీర్చుకొనకుండా ఉండడు.

23 అందువలన, ఓ అన్యజనులారా, వీటి ద్వారా మీ పాపముల విషయమై పశ్చాత్తాపపడునట్లు మరియు అధికారమును, లాభమును సంపాదించుటకు నిర్మించబడిన ఈ హత్యాకూడికలు మిమ్ములను జయించుటకు అనుమతించకుండునట్లు ఈ సంగతులు మీకు చూపబడుట దేవుని యందు వివేకమైయున్నది—మరియు ఈ సంగతులను మీరు అనుమతించిన యెడల ఈ కార్యము, అనగా నాశనము యొక్క కార్యము మీ మీదికి వచ్చును; ముఖ్యముగా, మీ పతనమునకు మరియు నాశనమునకు నిత్య దేవుని న్యాయపు ఖడ్గము మీపైన పడును.

24 అందువలన, ఈ సంగతులు మీ మధ్య వచ్చుటను మీరు చూచినపుడు మీ మధ్య ఉండు ఈ రహస్యకూడికలను బట్టి, మీ భయంకరమైన పరిస్థితిని మీరు గ్రహించవలెనని ప్రభువు మిమ్ములను ఆజ్ఞాపించుచున్నాడు; లేనియెడల, సంహరింపబడిన వారి రక్తమును బట్టి ఆ కూడికకు ఆపద; ఏలయనగా, దానిపై మరియు దానిని రూపొందించిన వారిపై పగ నిమిత్తము వారు ధూళి నుండి మొరపెట్టుదురు.

25 ఏలయనగా దానిని రూపొందించు వాడెవడైనను సమస్త భూభాగములు, జనములు మరియు దేశముల యొక్క స్వాతంత్ర్యమును పడద్రోయుటకు చూచును; అది సమస్త జనుల యొక్క నాశనమును తెచ్చును, ఏలయనగా అది సమస్త అబద్ధములకు తండ్రియైన అపవాది చేత రూపొందించబడెను; మన మొదటి తల్లిదండ్రులను మోసగించినది ఆ అబద్ధికుడే; ఆది నుండి మనుష్యుడు హత్య చేయునట్లు చేసినది ఆ అబద్ధికుడే; ప్రవక్తలను హత్య చేసి, వారిని రాళ్ళతో కొట్టి, ఆది నుండి వారిని గెంటివేయునట్లు మనుష్యుల హృదయములను కఠినపరచినది అతడే.

26 అందువలన, చెడు అంతము చేయబడవలెనని మరియు నరుల సంతానము యొక్క హృదయములపై సాతానుకు ఎట్టి అధికారములేక, వారు సమస్త నీతి యొక్క ఊట యొద్దకు వచ్చి రక్షణ పొందునట్లు వారు నిరంతరము మేలు చేయుటకు ఒప్పింపబడు సమయము రావలెనని మొరోనై అను నేను, ఈ సంగతులను వ్రాయుటకు ఆజ్ఞాపించబడియున్నాను.

ముద్రించు