14వ అధ్యాయము
జనుల దోషము దేశముపై శాపమును తెచ్చును—కోరియాంటమర్ గిలాదుతో, తరువాత లిబ్‌తో, ఆ తరువాత షిజ్‌తో యుద్ధము చేయును—రక్తపాతము మరియు మారణహోమము దేశమును ఆవరించును.
1 ఇప్పుడు, జనుల దోషమును బట్టి దేశమంతటిపై గొప్ప శాపముండుట మొదలాయెను, దానిలో ఒక మనుష్యుడు అతని పనిముట్టును లేదా అతని ఖడ్గమును అతని అరలో లేదా అతడు దానిని ఉంచు స్థలమందు ఉంచిన యెడల, ఉదయమున అతడు దానిని కనుగొనలేకపోయెను; దేశముపైన శాపము అంత గొప్పగా ఉండెను.
2 అందువలన ప్రతి మనుష్యుడు, అతనికి స్వంతమైన దానిని అతని చేతులతో గట్టిగా పట్టుకొనెను మరియు అప్పు తీసుకొనక అప్పు ఇయ్యకయుండెను; ప్రతి మనుష్యుడు అతని ఆస్థి, అతని ప్రాణము మరియు అతని భార్యాపిల్లల రక్షణలో తన ఖడ్గము యొక్క పిడిని తన కుడిచేతితో పట్టుకొనియుండెను.
3 ఇప్పుడు రెండు సంవత్సరముల తరువాత, అనగా షారెద్ మరణించిన తరువాత, షారెద్ యొక్క సహోదరుడు వచ్చి కోరియాంటమర్‌తో యుద్ధము చేసెను, దానియందు కోరియాంటమర్ అతడిని ఓడించి, అకిష్ యొక్క అరణ్యమునకు అతడిని తరిమెను.
4 షారెద్ యొక్క సహోదరుడు అకిష్ యొక్క అరణ్యమందు అతనితో యుద్ధము చేసెను; యుద్ధము మిక్కిలి తీవ్రమాయెను మరియు అనేక వేలమంది ఖడ్గము చేత కూలిరి.
5 కోరియాంటమర్ అరణ్యమును ముట్టడించగా, షారెద్ యొక్క సహోదరుడు రాత్రి సమయములో అరణ్యము నుండి బయటకు నడిచిపోయి, త్రాగిపడియున్న కోరియాంటమర్ సైన్యము యొక్క ఒక భాగమును సంహరించెను.
6 మరియు అతడు మోరొన్ దేశమునకు వచ్చి, కోరియాంటమర్ యొక్క సింహాసనముపై కూర్చుండెను.
7 కోరియాంటమర్ తన సైన్యముతో అరణ్యమందు రెండు సంవత్సరముల పాటు నివసించెను, ఆ సమయములో అతడు తన సైన్యమునకు గొప్ప బలమును పొందెను.
8 ఇప్పుడు గిలాదు అను పేరు గల షారెద్ యొక్క సహోదరుడు కూడా రహస్య కూడికలను బట్టి తన సైన్యమునకు గొప్ప బలమును పొందెను.
9 మరియు అతడు తన సింహాసనముపై కూర్చొనియుండగా, అతని ప్రధాన యాజకుడు అతడిని హత్యచేసెను.
10 రహస్యకూడికలకు సంబంధించిన ఒకడు అతడిని రహస్య మార్గమందు హత్యచేసెను మరియు రాజ్యమును తన కొరకు సంపాదించెను; అతని పేరు లిబ్; లిబ్ జనులందరిలో అత్యంత పొడవైన మనుష్యుడైయుండెను.
11 లిబ్ పరిపాలన యొక్క మొదటి సంవత్సరమందు కోరియాంటమర్, మోరొన్ దేశమునకు వచ్చి లిబ్‌తో యుద్ధము చేసెను.
12 అతడు లిబ్‌తో పోరాడగా, లిబ్ అతని చేతిని గాయపరిచెను; అయినప్పటికీ, కోరియాంటమర్ యొక్క సైన్యము లిబ్ మీదకు రాగా, అతడు సముద్రపు ఒడ్డునున్న సరిహద్దులకు పారిపోయెను.
13 కోరియాంటమర్ అతడిని తరిమెను మరియు సముద్రపు ఒడ్డున లిబ్ అతనితో యుద్ధము చేసెను.
14 వారు అకిష్ యొక్క అరణ్యమునకు తిరిగి పారిపోవునంతగా లిబ్, కోరియాంటమర్ యొక్క సైన్యమును హతముచేసెను.
15 అతడు ఆగోష్ యొక్క మైదానము యొద్దకు వచ్చువరకు లిబ్ అతడిని తరిమెను మరియు అతడు లిబ్ యెదుట పారిపోవుచుండగా, కోరియాంటమర్ అక్కడి జనులందరినీ తనతోపాటు తాను పారిపోయిన దేశమునకు తీసుకువచ్చెను.
16 అతడు ఆగోష్ యొక్క మైదానములకు వచ్చినప్పుడు, అతడు లిబ్‌తో యుద్ధము చేసెను మరియు అతడు మరణించు వరకు అతడిని కొట్టెను; అయినప్పటికీ, అతని స్థానములో లిబ్ యొక్క సహోదరుడు కోరియాంటమర్‌కు వ్యతిరేకముగా వచ్చెను మరియు యుద్ధము మిక్కిలి తీవ్రమాయెను; దానియందు కోరియాంటమర్, లిబ్ యొక్క సహోదరుని సైన్యము యెదుట తిరిగి పారిపోయెను.
17 మరియు లిబ్ యొక్క సహోదరుని పేరు షిజ్. షిజ్, కోరియాంటమర్‌ను తరుముచూ అనేక పట్టణములను జయించెను; అతడు స్త్రీలను, పిల్లలను ఇరువురిని సంహరించి, పట్టణములను కాల్చివేసెను.
18 ఇప్పుడు దేశమంతటా షిజ్ యొక్క భయము వ్యాపించెను; షిజ్ యొక్క సైన్యము యెదుట ఎవరు నిలువగలరు? ఇదిగో, అతడు జనులను ధూళివలె తుడిచివేయును అని దేశమంతటా ఒక కేక వినబడెను.
19 మరియు దేశమంతటా జనులు సైన్యములుగా సమకూడుట మొదలుపెట్టిరి.
20 వారు విభజింపబడిరి; వారిలో ఒక భాగము షిజ్ యొక్క సైన్యము యొద్దకు పారిపోయిరి, మరొక భాగము కోరియాంటమర్ యొక్క సైన్యము యొద్దకు పారిపోయిరి.
21 యుద్ధము తీవ్రమై, అధిక కాలము కొనసాగెను; రక్తపాతము మరియు మారణహోమము యొక్క దృశ్యము ఎంత దీర్ఘకాలము ఉండెననగా, దేశమంతయు మృతకళేబరములతో కప్పబడెను.
22 యుద్ధము ఎంత చురుకుగా మరియు వేగముగా ఉండెననగా, మృతులను పాతిపెట్టుటకు ఎవడూ విడువబడలేదు, కానీ శరీరమును తిను పురుగులకు ఎరగా చేయుచూ పురుషులు, స్త్రీలు మరియు పిల్లలు, అందరి శరీరములను దేశములో వెదజల్లినట్లు వదిలివేయుచూ వారు రక్తము చిందించుటకు ముందుకు సాగిరి.
23 మరియు దాని వాసన దేశమంతటా వ్యాపించెను; కావున, దాని దుర్వాసనను బట్టి జనులు రాత్రి పగలు కలతచెందిరి.
24 అయినప్పటికీ షిజ్, కోరియాంటమర్‌ను తరుముట మానలేదు; ఏలయనగా అతడు, సంహరింపబడిన తన సహోదరుని రక్తము నిమిత్తము కోరియాంటమర్‌పై పగతీర్చుకొందునని ప్రమాణము చేసియుండెను మరియు కోరియాంటమర్ ఖడ్గము చేత కూలరాదని ప్రభువు వాక్కు ఈథర్‌కు వచ్చెను.
25 ఆ విధముగా ప్రభువు వారిని తన ఉగ్రత యొక్క సంపూర్ణతలో దర్శించెనని, వారి దుష్టత్వము మరియు హేయక్రియలు వారి శాశ్వత నాశనమునకు మార్గము సిద్ధపరిచెనని మనము చూచుచున్నాము.
26 మరియు షిజ్, కోరియాంటమర్‌ను తూర్పువైపు సముద్రపు ఒడ్డు ప్రక్కన సరిహద్దులకు తరిమెను, అక్కడ అతడు షిజ్‌తో మూడు దినముల పాటు యుద్ధము చేసెను.
27 షిజ్ యొక్క సైన్యముల మధ్య నాశనము ఎంత భయంకరముగా ఉండెననగా, జనులు భయపడసాగి కోరియాంటమర్ యొక్క సైన్యముల యెదుట నుండి పారిపోవుట మొదలుపెట్టిరి; వారు కొరిహోర్ దేశమునకు పారిపోయి, అక్కడి నివాసులలో వారితో చేరుటకు ఇష్టపడని వారిని తమ యెదుట నుండి తుడిచిపెట్టిరి.
28 మరియు వారు కొరిహోర్ లోయలో తమ గుడారములు వేసుకొనిరి; కోరియాంటమర్ తన గుడారములను షర్ర్ లోయలో వేసుకొనెను. షర్ర్ లోయ కొమ్నోర్ కొండ దగ్గర ఉండెను; అందువలన కోరియాంటమర్ అతని సైన్యములను కొమ్నోర్ కొండపైన సమకూర్చి, యుద్ధమునకై షిజ్ యొక్క సైన్యములను ఆహ్వానించుటకు ఒక బూర ఊదెను.
29 వారు ముందుకు వచ్చిరి, కానీ తిరిగి తరుమబడిరి; వారు రెండవసారి వచ్చిరి మరియు రెండవసారి తిరిగి తరుమబడిరి. వారు మూడవసారి తిరిగి రాగా, యుద్ధము మిక్కిలి తీవ్రమాయెను.
30 షిజ్, కోరియాంటమర్‌పై దాడిచేసి అతడిని తీవ్రముగా గాయపరిచెను; రక్తమును కోల్పోయినవాడై కోరియాంటమర్ మూర్ఛపోయెను మరియు అతడు చచ్చినవానివలే మోసుకొనిపోబడెను.
31 ఇప్పుడు పురుషులు, స్త్రీలు మరియు పిల్లల యొక్క నష్టము రెండు వైపులా అత్యధికముగా ఉన్నందున, వారు కోరియాంటమర్ యొక్క సైన్యములను తరుమరాదని షిజ్ తన జనులను ఆజ్ఞాపించెను; కావున, వారు తమ దండు యొద్దకు తిరిగివచ్చిరి.