6వ అధ్యాయము
జెరెడీయుల పడవలు వాగ్దానదేశమునకు గాలుల ద్వారా కొనిపోబడును—ఆయన మంచితనమును బట్టి జనులు ప్రభువును స్తుతించెదరు—ఓరిహా వారిపై రాజుగా నియమింపబడెను—జెరెడ్ మరియు అతని సహోదరుడు మరణించెదరు.
1 ఇప్పుడు మొరోనై అను నేను, జెరెడ్ మరియు అతని సహోదరుని యొక్క వృత్తాంతమును ఇచ్చుట కొనసాగించెదను.
2 జెరెడ్ యొక్క సహోదరుడు కొండపైకి తీసుకొనిపోయిన రాళ్ళను ప్రభువు సిద్ధము చేసిన తరువాత, జెరెడ్ యొక్క సహోదరుడు కొండ మీద నుండి దిగి వచ్చెను, అతడు ఆ రాళ్ళను సిద్ధము చేయబడిన పడవలలో ప్రతి అంచునందు ఒకటిచొప్పున ఉంచెను మరియు అవి పడవలకు వెలుగునిచ్చెను.
3 ఆ విధముగా వారు ఆ గొప్ప జలములను అంధకారములో దాటకుండునట్లు, పురుషులు, స్త్రీలు మరియు పిల్లలకు వెలుగునిచ్చుటకు ప్రభువు ఆ రాళ్ళను చీకటిలో ప్రకాశించునట్లు చేసెను.
4 వారు నీటిపై బ్రతికి ఉండునట్లు సమస్త విధమైన ఆహారమును, వారి మందలు, గుంపులు మరియు వారు తమతో తీసుకొనిపోవుచున్న మృగము, జంతువు లేదా పక్షి కొరకు కూడా వారు ఆహారమును సిద్ధము చేసుకొనినప్పుడు—వారు ఈ సంగతులన్నియు చేసినప్పుడు, వారు తమ ఓడలు లేదా పడవలను ఎక్కిరి మరియు తమ దేవుడైన ప్రభువుకు తమను అప్పగించుకొనుచూ సముద్రములో ముందుకుసాగిరి.
5 ప్రభువైన దేవుడు జలములపైన వాగ్దానదేశము వైపు ప్రచండమైన గాలి వీచునట్లు చేసెను; ఆ విధముగా వారు గాలి యెదుట, సముద్రపు అలలపై కొట్టుకొనిపోబడిరి.
6 వారిపైన విరచుకుపడిన పర్వతముల వంటి అలల వలన మరియు గాలి యొక్క తీవ్రతను బట్టి కలుగజేయబడిన గొప్ప భయంకరమైన తుఫానుల వలన కూడా వారు అనేకసార్లు సముద్రపు లోతులలో సమాధి చేయబడిరి.
7 వారు అగాధమందు సమాధి చేయబడినప్పుడు, వారికి హానిచేయు జలమేదియు లేకుండెను, వారి ఓడలు ఒక గిన్నెవలే బిగుతుగా ఉండెను, అవి నోవహు యొక్క ఓడ వలే బిగుతుగా ఉండెను; కావున, అనేక జలముల చేత చుట్టుముట్టబడినప్పుడు వారు ప్రభువుకు మొరపెట్టగా, ఆయన వారిని మరలా జలముల ఉపరితలమునకు తెచ్చెను.
8 వారు జలములపై ఉండగా, గాలి వాగ్దానదేశము వైపు వీచుటను ఎన్నడూ మానలేదు; ఆ విధముగా వారు గాలి యెదుట ముందుకు కొట్టుకొనిపోబడిరి.
9 మరియు వారు ప్రభువుకు స్తుతులు పాడిరి; జెరెడ్ యొక్క సహోదరుడు ప్రభువుకు స్తుతులు పాడెను, అతడు దినమంతయు ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను; రాత్రి వచ్చినపుడు కూడా వారు ప్రభువును స్తుతించుట మానలేదు.
10 ఆ విధముగా వారు ముందుకు కొట్టుకొనిపోబడిరి; సముద్రము యొక్క ఏ వికృతాకార జంతువు వారిని ధ్వంసము చేయలేకపోయెను లేదా ఏ తిమింగలము వారికి హాని చేయలేకపోయెను; మరియు నీటి పైననేమి, నీటి క్రిందనేమి వారు నిరంతరము వెలుగును కలిగియుండిరి.
11 ఆ విధముగా వారు మూడు వందల నలుబది నాలుగు దినములు నీటిపై ముందుకు కొనిపోబడిరి.
12 మరియు వారు వాగ్దానదేశము యొక్క ఒడ్డుకు చేరిరి. వారు వాగ్దానదేశము యొక్క ఒడ్డుపైన తమ పాదములు మోపినప్పుడు, వారు నేలపై క్రిందికి వంగి నమస్కరించిరి; ప్రభువు యెదుట తమను తగ్గించుకొని, వారిపై ఆయన మృదు కనికరములనేకమును బట్టి ప్రభువు యెదుట ఆనందభాష్పములు రాల్చిరి.
13 వారు దేశమందు ముందుకుసాగి, భూమిని దున్నుట మొదలుపెట్టిరి.
14 మరియు జెరెడ్ నలుగురు కుమారులను కలిగియుండెను; వారు జాకోమ్,గిల్గా, మాహా మరియు ఓరిహా అని పిలువబడిరి.
15 జెరెడ్ యొక్క సహోదరుడు కూడా కుమారులను, కుమార్తెలను కనెను.
16 జెరెడ్ మరియు అతని సహోదరుని స్నేహితుల సంఖ్య ఇరువది రెండు ఆత్మలైయుండెను; వాగ్దానదేశమునకు వచ్చుటకు ముందు వారు కూడా కుమారులను, కుమార్తెలను కనిరి; కావున వారు అనేకులవసాగిరి.
17 ప్రభువు యెదుట వినయముగా నడుచుకొనుటకు వారు బోధింపబడిరి; వారు పైనుండి కూడా బోధింపబడిరి.
18 వారు భూముఖముపై వ్యాపించి, వృద్ధిపొంది, భూమిని దున్నుట మొదలుపెట్టిరి మరియు వారు దేశమందు బలముగా ఎదిగిరి.
19 మరియు జెరెడ్ యొక్క సహోదరుడు వృద్ధుడగుచుండెను, అతడు త్వరలో సమాధికి దిగిపోవలెనని చూచెను; అందువలన అతడు జెరెడ్‌తో—మనము వారిని లెక్కించునట్లు, మనము మన సమాధులలోనికి దిగిపోవుటకు ముందు వారు మన నుండి ఏమి కోరనున్నారో వారి నుండి తెలుసుకొనునట్లు మన జనులను సమకూర్చుదమని చెప్పెను.
20 మరియు ఆ ప్రకారమే జనులు సమకూర్చబడిరి. ఇప్పుడు జెరెడ్ యొక్క సహోదరుని కుమారులు, కుమార్తెల సంఖ్య ఇరువది రెండు ఆత్మలైయుండెను; అతడు కలిగియున్న నలుగురు కుమారులతో కలిపి జెరెడ్ యొక్క కుమారులు, కుమార్తెల సంఖ్య పన్నెండు.
21 ఇప్పుడు వారు తమ జనులను లెక్కించిరి; వారిని లెక్కించిన తరువాత, వారి సమాధులకు దిగి వెళ్ళుటకు ముందు వారు ఏమి చేయవలెనని జనులు కోరుచున్నారో ఆ సంగతులను వారి నుండి తెలుసుకొనిరి.
22 అయితే, వారిపై రాజుగా ఉండుటకు వారి కుమారులలో ఒకరిని వారు అభిషేకించవలెనని జనులు వారిని కోరిరి.
23 ఇప్పుడు, ఇది వారికి బాధాకరముగా ఉండెను. మరియు నిశ్చయముగా ఈ సంగతి దాస్యములోనికి నడిపించునని జెరెడ్ యొక్క సహోదరుడు వారితో చెప్పెను.
24 కానీ, వారు రాజును కలిగియుండునట్లు వారిని అనుమతించమని జెరెడ్ అతని సహోదరునితో చెప్పెను. కావున, అతడు వారితో—మా కుమారులలో ఎవరు రాజుగా ఉండవలెనని మీరు కోరుదురో వానిని ఎన్నుకొనుడని చెప్పెను.
25 మరియు వారు జెరెడ్ యొక్క సహోదరుని జ్యేష్ఠపుత్రుని ఎన్నుకొనిరి; అతని పేరు పాగగ్. కానీ, అతడు తిరస్కరించెను మరియు వారి రాజుగా ఉండుటకు ఇష్టపడలేదు. అతని తండ్రి, అతడిని బలవంతము చేయవలెనని జనులు కోరిరి, కానీ అతని తండ్రి అట్లు చేయలేదు; తమ రాజుగా ఉండుటకు వారు ఏ మనుష్యుని బలవంతము చేయరాదని అతడు వారిని ఆజ్ఞాపించెను.
26 వారు పాగగ్ యొక్క సహోదరులందరినీ ఎన్నుకొనిరి; కానీ వారు ఇష్టపడలేదు.
27 మరియు ఒక్కడు తప్ప, జెరెడ్ యొక్క కుమారులు అందరూ కూడా ఇష్టపడలేదు; అప్పుడు జనులపై రాజుగా ఉండుటకు ఓరిహా అభిషేకించబడెను.
28 అతని పరిపాలనలో జనులు వర్థిల్లసాగిరి; వారు మిక్కిలి ధనవంతులైరి.
29 ఇప్పుడు జెరెడ్ మరియు అతని సహోదరుడు కూడా మరణించెను.
30 ఓరిహా ప్రభువు యెదుట వినయముగా నడుచుకొని, ప్రభువు అతని తండ్రి కొరకు చేసిన గొప్ప సంగతులను జ్ఞాపకము చేసుకొనెను మరియు ప్రభువు వారి పితరుల కొరకు చేసిన గొప్ప సంగతులను అతని జనులకు బోధించెను.