లేఖనములు
మోషైయ 9


జెనిఫ్‌ గ్రంథము—వారు జరహేమ్ల దేశమును వదిలివచ్చిన సమయము నుండి లేమనీయుల చేతులలో నుండి విడిపించబడిన సమయము వరకు గల అతని జనుల వృత్తాంతము.

9 నుండి 22 అధ్యాయముల వరకు కలిగియున్నది.

9వ అధ్యాయము

లీహై-నీఫై దేశమును స్వాధీనపరచుకొనుటకు జెనిఫ్‌ జరహేమ్ల నుండి ఒక సమూహమును నడిపించును—దేశమును స్వాస్థ్యముగా పొందుటకు లేమనీయుల రాజు వారిని అనుమతించును—జెనిఫ్‌ యొక్క జనులు మరియు లేమనీయుల మధ్య యుద్ధముండెను. సుమారు క్రీ. పూ. 200–187 సం.

1 జెనిఫ్‌ అను నేను, నీఫైయుల యొక్క సమస్త భాషలో బోధింపబడి, నీఫై దేశము లేదా మా పితరుల మొదటి స్వాస్థ్యమైన దేశమును గూర్చిన జ్ఞానము కలిగియుండి, మా సైన్యము లేమనీయుల పైకి వెళ్ళి వారిని నాశనము చేయునట్లు వారి సైన్యములను వేగు చూచుటకు లేమనీయుల మధ్యకు నేను వేగులవానిగా పంపబడియుంటిని—కానీ నేను వారి మధ్య మేలైన దానిని చూచినప్పుడు వారు నాశనము చేయబడరాదని కోరితిని.

2 కావున, మా పాలకుడు వారితో సంధి చేసుకొనవలెనని కోరుచూ నేను అరణ్యమందు నా సహోదరులతో వాదించితిని; అయితే అతడు క్రూరమైన రక్తపిపాసియైయుండి నేను సంహరింపబడవలెనని ఆజ్ఞాపించెను; కానీ అధిక రక్తపాతము చేత నేను తప్పించబడితిని; ఏలయనగా మా సైన్యములో అధికసంఖ్యాకులు అరణ్యమందు నాశనము చేయబడువరకు తండ్రికి వ్యతిరేకముగా తండ్రి మరియు సహోదరునికి వ్యతిరేకముగా సహోదరుడు పోరాడెను; జరిగిన దానిని మరణించిన వారి భార్యా పిల్లలకు చెప్పుటకు మేము అనగా మాలో మిగిలిన వారు జరహేమ్ల దేశమునకు తిరిగి వెళ్ళితిమి.

3 ఇంకను మా పితరుల దేశమును స్వాస్థ్యముగా పొందుటకు అత్యాసక్తి గలవాడనై నేను ఆ దేశమును స్వాధీనపరచుకొనుటకు కోరిన వారినందరిని సమకూర్చి, ఆ దేశమునకు వెళ్ళుటకు అరణ్యములోనికి మా ప్రయాణమును తిరిగి ప్రారంభించితిని; కాని మేము కరువు చేత, తీవ్రమైన శ్రమల చేత మొత్తబడితిమి; ఏలయనగా మా దేవుడైన ప్రభువును జ్ఞాపకము చేసుకొనుటకు మేము వెనుకాడితిమి.

4 అయినప్పటికీ అరణ్యమందు అనేక దినములు తిరుగులాడిన తరువాత, మా సహోదరులు సంహరింపబడిన స్థలమందు మేము మా గుడారములను వేసుకొంటిమి, అది మా పితరుల దేశమునకు సమీపముగానుండెను.

5 నేను రాజు యొక్క వైఖరి తెలుసుకొనునట్లు మరియు నా జనులతో వెళ్ళి, సమాధానముతో దేశమును స్వాధీనపరచుకొనవచ్చునేమో తెలుసుకొనునట్లు నా మనుష్యులలో నలుగురిని తీసుకొని పట్టణములోనికి రాజు యొద్దకు తిరిగి వెళ్ళితిని.

6 నేను రాజు యొద్దకు వెళ్ళినప్పుడు లీహై-నీఫై దేశమును, షైలోమ్ దేశమును నేను స్వాధీనపరచుకొనునట్లు అతడు నాతో నిబంధన చేసెను.

7 అంతేకాక తన జనులు దేశము నుండి బయటకు వెడలిపోవలెనని అతడు ఆజ్ఞాపించెను, అప్పుడు నేను, నా జనులు దానిని స్వాధీనపరచుకొనునట్లు దేశములోనికి వెళ్ళితిమి.

8 మేము భవనములు నిర్మించుట, పట్టణ ప్రాకారములు, ముఖ్యముగా లీహై-నీఫై పట్టణము మరియు షైలోమ్ పట్టణము యొక్క ప్రాకారములు మరమ్మత్తు చేయుట మొదలుపెట్టితిమి.

9 మేము భూమిని సాగుచేయుట మొదలుపెట్టితిమి, ముఖ్యముగా అన్నిరకములైన విత్తనములతో అనగా జొన్న, గోధుమ, బార్లీ, నియాసు, షియుముతో, అన్నిరకముల ఫల విత్తనములతో సాగుచేసితిమి; మరియు మేము దేశమందు వృద్ధిపొంది వర్ధిల్లుట మొదలుపెట్టితిమి.

10 ఇప్పుడు వంచనతో నా జనులను దాస్యములోనికి తెచ్చునట్లు మేము ఆ దేశమును స్వాధీనపరచుకొనుటకు రాజైన లేమన్‌ కుయుక్తితో దానిని మాకు అప్పగించెను.

11 కావున మేము దేశమందు పన్నెండు సంవత్సరముల పాటు నివసించిన తరువాత, ఏ కారణము చేతనైనను నా జనులు దేశమందు అధిక బలవంతులు అగుదురేమోనని మరియు వారు మమ్ములను జయించి దాస్యములోనికి తేలేకపోవుదురేమోనని రాజైన లేమన్‌ వ్యాకులపడసాగెను.

12 వారు సోమరులైన, విగ్రహారాధికులైన జనులైయున్నారు; కావున, వారు మా శ్రమను దోచుకొని సుఖభోగాలు అనుభవించునట్లు, మా పొలములలోని మందలతో విందు చేసుకొనునట్లు మమ్ములను దాస్యములోనికి తెచ్చుటకు కోరిరి.

13 అందువలన వారు నా జనులతో పోరాడవలెనని రాజైన లేమన్‌ తన జనులను పురికొల్పుట ప్రారంభించెను; కావున దేశమందు యుద్ధములు, పోరాటములు మొదలాయెను.

14 ఏలయనగా నా పరిపాలన యొక్క పదమూడవ సంవత్సరమందు షైలోమ్ దేశమునకు దక్షణమున దూరముగా నున్న నీఫై దేశమందు నా జనులు వారి మందలకు నీళ్ళు పెట్టుచూ, మేతమేపుచూ వారి భూములను సాగు చేసుకొనుచున్నప్పుడు లేమనీయుల యొక్క గొప్ప సైన్యమొకటి వారిపైకి వచ్చి వారిని సంహరించుచు వారి మందలను, వారి పొలముల ధాన్యమును తీసుకోనారంభించెను.

15 లేమనీయులకు పట్టుబడని వారందరు నీఫై పట్టణములోనికి పారిపోయి రక్షణ కొరకు నన్ను వేడుకొనిరి.

16 నేను వారిని విల్లులు, బాణములు, ఖడ్గములు, వంపు కత్తులు, గదలు, వడిసెలు మరియు మేము కనిపెట్టగలిగిన అన్ని రకములైన ఆయుధములతో సాయుధులను చేసితిని మరియు నేను, నా జనులు లేమనీయులకు వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు వెళ్ళితిమి.

17 ప్రభువునుండి బలము పొంది మేము లేమనీయులకు వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు వెళ్ళితిమి; మా శత్రువుల చేతులలో నుండి మమ్ములను విడిపించవలెనని నేను, నా జనులు ప్రభువుకు బలముగా మొరపెట్టితిమి, ఏలయనగా మా పితురులు విడిపించబడుటను జ్ఞాపకము చేసుకొనుటకు మేము మేల్కొల్పబడితిమి.

18 దేవుడు మా మొరలను విని, మా ప్రార్థనలకు జవాబిచ్చెను; మేము ఆయన బలమందు ముందుకు వెళ్ళితిమి; మేము లేమనీయులకు వ్యతిరేకముగా వెళ్ళి ఒక పగలు, ఒక రాత్రిలోపు మూడు వేల నలుబది ముగ్గురిని సంహరించితిమి; మా దేశము నుండి బయటకు తరిమివేయువరకు వారిని మేము సంహరించితిమి.

19 నేను నా స్వహస్తములతో వారి మృతులను పాతిపెట్టుటకు సహాయపడితిని. మా సహోదరులలో రెండు వందల డెబ్బది తొమ్మిది మంది సంహరింపబడినందున గొప్ప దుఃఖముతో మేము విలపించితిమి.

ముద్రించు