20వ అధ్యాయము
లేమనీయుల కుమార్తెలు కొద్దిమంది నోవహు యొక్క యాజకులచేత అపహరించబడుదురు—లేమనీయులు లింహై మరియు అతని జనులతో యుద్ధము చేయుదురు—లేమనీయుల సైన్యములు వెనుకకు తరుమబడి శాంతపరచబడును. సుమారు క్రీ. పూ. 145–123 సం.
1 ఇప్పుడు లేమనీయుల కుమార్తెలు పాడుటకు, నాట్యము చేయుటకు, తమను సంతోషపరచుకొనుటకు సమకూడు ఒక స్థలము షెమ్లోన్ నందు ఉండెను.
2 ఒక దినమున వారిలో కొద్దిమంది పాడుటకు, నాట్యము చేయుటకు సమకూడిరి.
3 ఇప్పుడు రాజైన నోవహు యాజకులు నీఫై పట్టణమునకు తిరిగి వెళ్ళుటకు సిగ్గుపడి, జనులు వారిని సంహరించుదురేమోనని భయపడిరి, కావున వారి భార్యాపిల్లల వద్దకు తిరిగి వెళ్ళుటకు వారు ధైర్యము చేయలేదు.
4 వారు అరణ్యమందు నిలిచియుండి, లేమనీయుల కుమార్తెలను కనుగొనినవారై, రహస్యముగా వారిని గమనించిరి;
5 వారిలో కొద్దిమంది మాత్రమే నాట్యము చేయుటకు సమకూడినప్పుడు వారు తమ రహస్య స్థలముల నుండి బయటకు వచ్చి వారిని పట్టుకొని, అరణ్యములోనికి తీసుకొనిపోయిరి; ముఖ్యముగా లేమనీయుల కుమార్తెలలో ఇరువది నలుగురిని వారు అరణ్యములోనికి తీసుకొనిపోయిరి.
6 తమ కుమార్తెలు కనబడుట లేదని లేమనీయులు కనుగొనినప్పుడు, వారు లింహై జనులపై కోపముగానుండిరి, ఏలయనగా లింహై జనులే దానిని చేసిరని వారు తలంచిరి.
7 కావున, వారు తమ సైన్యములను పంపిరి; అంతేకాక రాజు కూడా తన జనులకు ముందుగా వెళ్ళెను; లింహై జనులను నాశనము చేయుటకు వారు నీఫై దేశమునకు వెళ్ళిరి.
8 ఇప్పుడు లింహై గోపురము పైనుండి వారిని చూచి, యుద్ధము కొరకు వారి సిద్ధపాటులన్నియు కనుగొనెను; కావున, అతడు తన జనులను సమకూర్చి పొలములందు, అడవులందు వారి కొరకు రహస్యముగా వేచియుండెను.
9 లేమనీయులు వారిపైకి వచ్చినప్పుడు లింహై జనులు తాము వేచియున్న స్థలముల నుండి వారిపై దాడిచేసి, వారిని సంహరించసాగిరి.
10 యుద్ధము మిక్కిలి తీవ్రమాయెను, ఏలయనగా వారు తమ ఎర కొరకు కలబడు సింహముల వలె పోరాడిరి.
11 లింహై జనులు లేమనీయులను తమ యెదుట నుండి తరిమివేయసాగిరి; అయినను వారు లేమనీయుల సంఖ్యలో సగము కూడా లేరు. కానీ వారు తమ ప్రాణముల కొరకు, తమ భార్యల కొరకు, తమ పిల్లల కొరకు పోరాడిరి; కావున, వారు తమ శక్తినంతటినీ ఉపయోగించి ఘటసర్పముల వలే పోరాడిరి.
12 వారి మృతుల మధ్య వారు లేమనీయుల రాజును కనుగొనిరి; అతడు గాయపడియుండెను కానీ మరణించలేదు, అతడిని అక్కడే విడిచిపెట్టి అతని జనులు త్వరగా పారిపోయిరి.
13 లింహై జనులు అతడిని తీసుకువెళ్ళి అతని గాయములకు కట్టుకట్టి, లింహై యెదుటికి తెచ్చి ఇట్లనిరి: ఇదిగో లేమనీయుల రాజు; ఇతడు గాయపడి వారి మృతుల మధ్య పడియుండెను, వారు అతడిని వదిలివేయగా మేము నీ యొద్దకు తెచ్చియున్నాము; మనమిప్పుడు అతడిని సంహరించుదము.
14 కానీ లింహై వారితో—మీరతనిని సంహరించరాదు; కానీ నేనతనిని చూచునట్లు ఇక్కడకు తీసుకొనిరమ్మనగా, వారతనిని తెచ్చిరి. మరియు లింహై అతనితో ఇట్లనెను: నా జనులకు వ్యతిరేకముగా యుద్ధము చేయవచ్చుటకు మీకు గల కారణమేమి? నేను మీతో చేసిన ప్రమాణమును నా జనులు మీరలేదు; కావున, మీరు నా జనులతో చేసియున్న ప్రమాణమును ఎందుకు మీరవలసివచ్చెను?
15 అప్పుడు రాజు ఇట్లనెను: నీ జనులు నా జనుల కుమార్తెలను తీసుకొనిపోయిరి, గనుక నేను ప్రమాణమును మీరియున్నాను; అందువలన, కోపముతో నీ జనులకు వ్యతిరేకముగా నా జనులు యుద్ధమునకు వచ్చునట్లు చేసితిని.
16 ఇప్పుడు లింహై ఈ విషయమును గూర్చి ఏమియు వినియుండలేదు, కావున అతడు ఇట్లనెను: నేను నా జనుల మధ్య వెదికెదను మరియు ఈ కార్యమును చేసిన వాడెవడైనను నశించును. కావున, తన జనుల మధ్య అతడు ఒక అన్వేషణ జరిగించెను.
17 ఇప్పుడు గిడియన్ ఈ విషయములను వినినప్పుడు, రాజు యొక్క సేనాధిపతి అయిన అతడు వెళ్ళి రాజుతో ఇట్లనెను: తాళుము, ఈ జనుల మధ్య వెదుకవద్దు మరియు ఈ క్రియను గూర్చి వారిపై నింద మోపవద్దని మిమ్ములను వేడుకొనుచున్నాను.
18 ఏలయనగా ఈ జనులు నాశనము చేయగోరిన మీ తండ్రి యొక్క యాజకులు మీకు జ్ఞాపకము లేరా? వారు అరణ్యమందు లేరా? లేమనీయుల కుమారైలను అపహరించినది వారు కాదా?
19 ఇప్పుడు వారు మన యెడల సమాధానపడునట్లు అతడు తన జనులకు చెప్పునట్లు ఈ విషయములను రాజుకు చెప్పుము; ఏలయనగా మనకు వ్యతిరేకముగా వచ్చుటకు వారు ఇప్పటికే సిద్ధపడుచున్నారు; మనము కొద్దిమందే ఉన్నాము.
20 వారు అసంఖ్యాక సైన్యములతో వచ్చుచున్నారు; మన గురించి రాజు వారిని సమాధానపరచని యెడల మనము నశించెదము.
21 ఏలయనగా మనకు వ్యతిరేకముగా ప్రవచించిన అబినడై మాటలు నెరవేరలేదా? ఇదంతయు మనము ప్రభువు యొక్క మాటలను వినకుండుటచేత, మన దోషముల నుండి తొలగకుండుట చేతనే కాదా?
22 ఇప్పుడు మనము రాజును సమాధానపరచి, అతనితో చేసిన ప్రమాణమును నెరవేర్చుదము; మన ప్రాణములను పోగొట్టుకొనుట కంటే మనము దాస్యములో ఉండుట మంచిది; కావున అధిక రక్తపాతమును అంతము చేయుదము.
23 ఇప్పుడు లింహై అరణ్యములోనికి పారిపోయిన తన తండ్రి మరియు అతని యాజకులను గూర్చి అన్ని విషయములు రాజుతో చెప్పెను మరియు వారి కుమార్తెల అపహరణను వారిపై ఆరోపించెను.
24 అంతట రాజు అతని జనుల యెడల సమాధానపడి, వారితో ఇట్లనెను: ఆయుధములు లేకుండా నా జనులను కలుసుకొనుటకు మనము వెళ్ళుదము; నా జనులు నీ జనులను సంహరించరని నేను ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుచున్నాను.
25 అప్పుడు వారు రాజును వెంబడించి, లేమనీయులను కలుసుకొనుటకు ఆయుధములు లేకుండా వెళ్ళిరి. వారు లేమనీయులను కలిసినప్పుడు లేమనీయుల రాజు వారి యెదుట వంగి, లింహై జనుల పక్షమున వారిని బ్రతిమాలెను.
26 లింహై జనులు ఆయుధములు లేకుండా వచ్చిరని లేమనీయులు చూచినప్పుడు, వారిపై జాలిపడి వారి యెడల సమాధానపడిరి మరియు తమ రాజుతోపాటు శాంతియుతంగా తమ స్వదేశమునకు తిరిగి వెళ్ళిరి.