రాజైన నోవహు యొక్క జనుల ద్వారా అరణ్యములోనికి తరిమి వేయబడిన ఆల్మా మరియు ప్రభువు యొక్క జనుల వృత్తాంతము.
23 మరియు 24 అధ్యాయములు కలిగియున్నది.
23వ అధ్యాయము
రాజుగా ఉండుటకు ఆల్మా తిరస్కరించును—అతడు ప్రధాన యాజకునిగా సేవచేయును—ప్రభువు తన జనులను గద్దించును మరియు లేమనీయులు హీలమ్ దేశమును జయించుదురు—రాజైన నోవహు యొక్క దుష్ట యాజకుల నాయకుడైన అమ్యులోన్ లేమనీయుల రాజుకు లోబడి పరిపాలించును. సుమారు క్రీ. పూ. 145–121 సం.
1 ఇప్పుడు రాజైన నోవహు సైన్యములు వారిపై దాడి చేయునని ప్రభువు చేత హెచ్చరింపబడిన వాడై ఆల్మా దానిని తన జనులకు తెలియజేసెను, కావున వారు తమ మందలను పోగుచేసుకొని వారి ధాన్యమును తీసుకొని రాజైన నోవహు సైన్యములకంటే ముందుగా అరణ్యములోనికి వెడలిపోయిరి.
2 రాజైన నోవహు జనులు వారిని నాశనము చేయుటకు వారిని వెంబడించి పట్టుకొనకుండా ప్రభువు వారిని బలపరిచెను.
3 వారు పారిపోయి ఎనిమిది దినముల పాటు అరణ్యములో ప్రయాణించిరి.
4 ఒక సుందరమైన, సంతోషకరమైన, శుద్ధమైన జలములు గల దేశమునకు వారు వచ్చిరి.
5 తమ గుడారములను వేసుకొని భూమిని సేద్యపరచుట, భవనములు కట్టుట ప్రారంభించిరి; వారు శ్రమజీవులైయుండి, అధికముగా పనిచేసిరి.
6 ఇప్పుడు ఆల్మా వారి రాజుగా ఉండవలెనని జనులు కోరిరి, ఏలయనగా అతడు తన జనులకు అత్యంత ప్రియుడైయుండెను.
7 కానీ అతడు వారితో ఇట్లనెను: ఇదిగో, మనము ఒక రాజును కలిగియుండనవసరము లేదు; ఏలయనగా ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు: మీరు ఒకనికంటే మరియొకని హెచ్చుగా యెంచరాదు లేదా ఒకడు తననుతాను మరియొకని కంటే గొప్పవానిగా తలంచరాదు; కావున మీరు ఒక రాజును కలిగియుండుట సరికాదని నేను మీతో చెప్పుచున్నాను.
8 అయినప్పటికీ ఎల్లప్పుడు న్యాయవంతులైన మనుష్యులు మీ రాజులుగా ఉండుట సాధ్యమయిన యెడల, మీరు ఒక రాజును కలిగియుండుట మీకు మంచిదగును.
9 కానీ రాజైన నోవహు, అతని యాజకుల దుష్టత్వమును జ్ఞాపకము తెచ్చుకొనుము; నాకు నేనే ఉచ్చులో చిక్కుకొనియుండి, ప్రభువు దృష్టిలో హేయకరమైన కార్యములనేకము చేసియున్నాను, అవి నాకు తీవ్రమైన పశ్చాత్తాపమును కలుగజేసెను;
10 అయినను అధిక శ్రమ తరువాత ప్రభువు నా మొరలను విని, నా ప్రార్థనలకు జవాబిచ్చెను మరియు మీలో అనేకులను ఆయన సత్యము యొక్క జ్ఞానమునకు తెచ్చుటకు ఆయన చేతులలో నన్ను ఒక సాధనముగా చేసెను.
11 అయినప్పటికీ దీని యందు నేను అతిశయపడను, ఏలయనగా నన్నుగూర్చి అతిశయపడుటకు నేను అయోగ్యుడను.
12 ఇప్పుడు నేను మీతో చెప్పుచున్నాను, రాజైన నోవహు ద్వారా మీరు వేధించబడి, అతని మరియు అతని యాజకుల దాస్యమందుండి, వారి ద్వారా దుర్నీతిలోనికి తేబడియున్నారు; కావున, మీరు దుర్నీతి యొక్క బంధకములతో బంధించబడియున్నారు.
13 ఇప్పుడు మీరు ఈ బంధకముల నుండి, రాజైన నోవహు మరియు అతని జనుల చేతులలో నుండి, దుర్నీతి యొక్క బంధకముల నుండి కూడా దేవుని శక్తి ద్వారా విడిపించబడియున్నారు; కావున, మీరు స్వతంత్రులుగా చేయబడిన ఆ స్వాతంత్ర్యమందు మీరు నిలకడగా ఉండవలెనని, మీపై ఒక రాజుగా ఉండుటకు ఏ మనుష్యుని నమ్మవద్దని నేను కోరుచున్నాను.
14 ఒకడు దైవజనుడైయుండి దేవుని మార్గములందు నడుచుచు ఆయన ఆజ్ఞలను పాటించితే తప్ప, ఎవనిని మీ ఉపదేశకునిగాను లేదా మీ సేవకునిగాను కూడా నమ్మవద్దని కోరుచున్నాను.
15 ఈ విధముగా ప్రతిమనుష్యుడు తన వలే తన పొరుగువానిని ప్రేమించవలెనని, వారి మధ్య ఏ వివాదము ఉండరాదని ఆల్మా తన జనులకు బోధించెను.
16 ఇప్పుడు ఆల్మా వారి ప్రధాన యాజకుడు, వారి సంఘము యొక్క స్థాపకుడునైయుండెను.
17 ఇంకను అతని ద్వారా తప్ప, ఎవడును బోధించుటకు లేదా ఉపదేశించుటకు దేవుని నుండి అధికారము పొందలేదు. కావున వారి యాజకులందరిని, వారి ఉపదేశకులందరిని అతడు ప్రతిష్ఠించెను; వారు నీతిమంతులైతే తప్ప ఎవరును ప్రతిష్ఠింపబడలేదు.
18 కావున వారు, వారి జనులను కనిపెట్టియుండి నీతి సంబంధమైన విషయములతో వారిని పోషించిరి.
19 వారు దేశమందు మిక్కిలిగా వర్ధిల్లుట మొదలుపెట్టి, ఆ దేశమును హీలమ్ అని పిలిచిరి.
20 వారు హీలమ్ దేశమందు వృద్ధిచెంది, మిక్కిలిగా వర్థిల్లిరి; వారు ఒక పట్టణమును నిర్మించి, దానిని హీలమ్ పట్టణమని పిలిచిరి.
21 అయినప్పటికీ ప్రభువు తన జనులను గద్దించుట సరియని చూచును; ఆయన వారి సహనమును, వారి విశ్వాసమును పరీక్షించును.
22 అయినను—ఆయన యందు నమ్మికయుంచు వారు అంత్యదినమున పైకెత్తబడుదురు. ఈ జనుల యెడల కూడా అలాగే జరిగెను.
23 ఏలయనగా వారు దాస్యములోనికి తేబడిరని, వారి దేవుడైన ప్రభువు అనగా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు తప్ప మరెవరు వారిని విడిపించలేకపోయెనని నేను మీకు చూపెదను.
24 ఆయన వారిని విడిపించి, తన గొప్ప శక్తిని వారికి చూపెను మరియు వారి సంతోషము గొప్పదైయుండెను.
25 అయితే వారు హీలమ్ దేశములోని హీలమ్ పట్టణములో ఉన్నప్పుడు చుట్టూ ఉన్న భూమిని సేద్యపరచుచుండగా, ఇదిగో లేమనీయుల సైన్యమొకటి దేశ సరిహద్దులలో ఉండెను.
26 ఇప్పుడు ఆల్మా యొక్క సహోదరులు తమ పొలముల నుండి పారిపోయి హీలమ్ పట్టణమందు సమకూడిరి; లేమనీయులు అగుపడుటను బట్టి వారు అధికముగా భయపడిరి.
27 కానీ ఆల్మా వెళ్ళి వారి మధ్య నిలిచి, వారు భయపడక తమ దేవుడైన ప్రభువును జ్ఞాపకము చేసుకొనవలెనని, ఆయన వారిని విడిపించునని వారికి ఉద్భోధించెను.
28 కావున వారు తమ భయమును అణచుకొని వారిని, వారి భార్యాపిల్లలను విడిచిపెట్టునట్లు ప్రభువు లేమనీయుల హృదయములను మృదువుగా చేయవలెనని ఆయనకు మొరపెట్టనారంభించిరి.
29 అప్పుడు ప్రభువు లేమనీయుల హృదయములను మృదువుగా చేసెను. ఆల్మా మరియు అతని సహోదరులు వెళ్ళి, తమనుతాము లేమనీయులకు అప్పగించుకొనగా వారు హీలమ్ దేశమును స్వాధీనము చేసుకొనిరి.
30 ఇప్పుడు రాజైన లింహై యొక్క జనులను వెంబడించిన లేమనీయుల సైన్యములు అనేక దినములపాటు అరణ్యమందు తప్పిపోయియుండెను.
31 వారు అమ్యులోన్ అని పిలువబడిన ఒక స్థలములో రాజైన నోవహు యొక్క ఆ యాజకులను కనుగొనిరి; వారు అమ్యులోన్ దేశమును స్వాధీనపరచుకొనుట మొదలుపెట్టి భూమిని సేద్యము చేయనారంభించిరి.
32 ఆ యాజకుల యొక్క నాయకుని పేరు అమ్యులోన్.
33 ఇప్పుడు అమ్యులోన్ లేమనీయులను బ్రతిమాలెను; వారు తమ భర్తలను నాశనము చేయరాదని తమ సహోదరులను బ్రతిమాలుటకు లేమనీయుల కుమార్తెలైన తమ భార్యలను కూడా అతడు పంపెను.
34 లేమనీయులు అమ్యులోన్ మరియు అతని సహోదరులపై జాలిపడి, వారి భార్యలను బట్టి వారిని నాశనము చేయకుండిరి.
35 అమ్యులోన్ మరియు అతని సహోదరులు లేమనీయులతో కలిసిపోయి, నీఫై దేశమును వెదకుచూ అరణ్యమందు ప్రయాణము చేయుచుండగా ఆల్మా మరియు అతని సహోదరుల చేత స్వాధీనపరచుకొనబడిన హీలమ్ దేశమును వారు కనుగొనిరి.
36 నీఫై దేశమునకు నడిపించు మార్గమును వారికి చూపిన యెడల, వారి ప్రాణములను వారి స్వాతంత్ర్యమును వారికి అనుగ్రహించెదమని లేమనీయులు, ఆల్మా మరియు అతని సహోదరులకు వాగ్దానము చేసిరి.
37 కానీ నీఫై దేశమునకు నడిపించు మార్గమును ఆల్మా వారికి చూపిన తర్వాత, లేమనీయులు తమ వాగ్దానమును నిలుపుకొనకుండా ఆల్మా మరియు అతని సహోదరులపై హీలమ్ దేశము చుట్టూ కావలివారిని నియమించిరి.
38 వారిలో మిగిలినవారు నీఫై దేశమునకు వెళ్ళిరి; వారిలో ఒక భాగము హీలమ్ దేశమునకు తిరిగి వచ్చుచూ దేశమందు విడువబడిన కావలివారి భార్యాపిల్లలను వారితోపాటు తీసుకువచ్చిరి.
39 మరియు హీలమ్ దేశమందున్న అతని జనులపై ఒక రాజుగా, పరిపాలకుడుగా ఉండునట్లు లేమనీయుల రాజు అమ్యులోన్‌కు అనుగ్రహించెను; అయినప్పటికీ లేమనీయుల రాజు యొక్క చిత్తమునకు వ్యతిరేకముగా ఏ కార్యమును చేయుటకు అతనికి అధికారము లేకుండెను.