లేఖనములు
మోషైయ 29


29వ అధ్యాయము

రాజు స్థానములో న్యాయాధిపతులు ఎన్నుకొనబడవలెనని మోషైయ సూచించును—అవినీతిపరులైన రాజులు తమ జనులను పాపములోనికి నడిపించుదురు—జనుల యొక్క స్వరము చేత చిన్నవాడగు ఆల్మా ప్రధాన న్యాయాధిపతిగా ఎన్నుకొనబడును—అతడు సంఘముపై ప్రధాన యాజకుడు కూడా—పెద్దవాడైన ఆల్మా మరియు మోషైయ మరణించెదరు. సుమారు క్రీ. పూ. 92–91 సం.

1 ఇప్పడు మోషైయ దీనిని చేసినప్పుడు ఎవరు వారి రాజైయుండవలెనను దానిని గూర్చి వారి చిత్తమును తెలుసుకొనుటకు కోరి, అతడు దేశమంతటా సమస్త జనుల మధ్య సందేశము పంపెను.

2 జనుల యొక్క స్వరము ఇట్లు చెప్పెను: మీ కుమారుడైన అహరోను మాకు రాజుగా, పరిపాలకుడుగా కావలెనని మేము కోరుచున్నాము.

3 అయితే అహరోను నీఫై దేశమునకు వెళ్ళినందున రాజు అతనికి రాజ్యము అనుగ్రహించలేకపోయెను; అహరోను కూడా రాజ్యమును అంగీకరించలేదు; లేదా మోషైయ కుమారులలో ఒక్కరు కూడా రాజ్యభారమును తీసుకొనుటకు ఇష్టపడలేదు.

4 కావున రాజైన మోషైయ మరలా జనుల మధ్య సందేశమును, అనగా వ్రాతపూర్వక సందేశమును పంపెను మరియు అందులో వ్రాయబడిన మాటలు ఇవే:

5 ఓ నా జనులారా లేదా నా సహోదరులారా, ఏలయనగా నేను మిమ్ములను అట్లు యెంచుచున్నాను, మీరు యోచించుటకు పిలువబడిన విషయమును మీరు యోచించవలెనని నేను కోరుచున్నాను—ఏలయనగా మీరు ఒక రాజును కలిగియుండవలెనని కోరుచున్నారు.

6 ఇప్పుడు న్యాయముగా రాజ్యము ఎవనికి చెందునో అతడు తిరస్కరించియున్నాడని, రాజ్యభారమును తీసుకొనడని నేను మీకు ప్రకటించుచున్నాను.

7 అతని స్థానములో మరియొకనిని నియమించిన యెడల, మీ మధ్య వివాదములు తలెత్తునని నేను భయపడుచున్నాను. అంతెందుకు రాజ్యము ఎవనికి చెందియున్నదో ఆ నా కుమారుడే కోపము తెచ్చుకొని జనులలో ఒక భాగమును తన వైపు తిప్పుకొనునేమో, అది మీ మధ్య యుద్ధములకు వివాదములకు కారణమగునేమో, అధిక రక్తపాతమునకు మరియు ప్రభువు యొక్క మార్గమును చెరుపుటకు కారణమగునేమో, అనేకమంది జనుల ఆత్మలను నాశనము చేయునేమో ఎవరెరుగుదురు.

8 ఇప్పుడు నేను మీతో చెప్పుచున్నాను, మనము వివేకముతో ఈ విషయములను యోచించుదము, ఏలయనగా నా కుమారుడిని నాశనము చేయుటకు మనకే హక్కు లేదు, లేదా అతనికి బదులుగా నియమింపబడిన వానిని నాశనము చేయుటకు కూడా మనకు ఏ హక్కు ఉండకూడదు.

9 నా కుమారుడు మరలా తన గర్వము మరియు వ్యర్థమైన విషయముల వైపు తిరిగిన యెడల, తాను చెప్పియున్న సంగతులను అతడు వెనుకకు తీసుకొని, తన హక్కుగా రాజ్యమును కోరుకొనును; అది అతడిని మరియు ఈ జనులను ఎక్కువ పాపము చేయునట్లు చేయును.

10 ఇప్పుడు మనము వివేకముతో ఈ విషయముల కొరకు ఎదురు చూచెదము మరియు ఈ జనుల యొక్క శాంతి కొరకు చేయవలసిన దానిని చేయుదము.

11 కావున నా శేష దినములన్నియు నేను మీ రాజునైయుందును; అయినను మన చట్టమును బట్టి ఈ జనులను తీర్పుతీర్చుటకు మనము న్యాయాధిపతులను నియమించుదము; ఈ జనుల వ్యవహారములను మనము క్రొత్తగా ఏర్పాటు చేయుదము, ఏలయనగా దేవుని ఆజ్ఞల ప్రకారము ఈ జనులకు తీర్పు తీర్చు వివేకవంతులను మనము న్యాయాధిపతులుగా నియమించుదము.

12 ఇప్పుడు మానవుని కంటే ఒకడు దేవుని చేత తీర్పు తీర్చబడుట మేలు, ఏలయనగా దేవుని తీర్పులు ఎల్లప్పుడు న్యాయమైనవి, కానీ మనుష్యుని తీర్పులు ఎల్లప్పుడు న్యాయమైనవి కావు.

13 కావున దేవుని చట్టములను స్థాపించుచు ఆయన ఆజ్ఞలను బట్టి ఈ జనులకు తీర్పుతీర్చు న్యాయమైన మనుష్యులను మీరు రాజులుగా కలిగియుండుట సాధ్యమైన యెడల మరియు నా తండ్రియైన బెంజమిన్ ఈ జనుల కొరకు చేసినట్లుగా చేయు మనుష్యులను మీరు రాజులుగా కలిగియుండగలిగిన యెడల—నేను మీతో చెప్పుచున్నాను, ఇది ఎల్లప్పుడు సాధ్యమైన యెడల, అప్పుడు మీపై పరిపాలన చేయుటకు మీరు ఎల్లప్పుడు రాజులను కలిగియుండుట కోరదగినదైయుండును.

14 నేను కూడా యుద్ధములు, వివాదములు, దొంగతనము, దోపిడి, నరహత్య లేదా ఏ విధమైన దుర్నీతి లేకుండునట్లు నాకు గల సమస్త శక్తి సామర్థ్యములతో దేవుని ఆజ్ఞలను మీకు బోధించుటకు, దేశమంతటా సమాధానమును స్థాపించుటకు శ్రమపడియున్నాను.

15 మన పితరుల ద్వారా మనకు ఇవ్వబడిన చట్టమును బట్టి దోషము చేసిన వానిని అతడు చేసిన నేరము ప్రకారము నేను శిక్షించియున్నాను.

16 ఇప్పుడు నేను మీతో చెప్పుచున్నాను, మనుష్యులందరు న్యాయవంతులు కానందున, మీపై పరిపాలన చేయుటకు మీరు ఒక రాజును లేదా రాజులను కలిగియుండుట కోరదగినది కాదు.

17 ఏలయనగా దుష్టుడైనై రాజు అధిక దుర్నీతిని, వినాశనమును జరిగించగలడు.

18 రాజైన నోవహును, అతని దుష్టత్వము హేయక్రియలను మరియు అతని జనుల దుష్టత్వము హేయక్రియలను కూడా జ్ఞాపకము చేసుకొనుము. వారికి గొప్ప నాశనము కలిగెను మరియు వారి దోషములను బట్టి వారు దాస్యములోనికి తేబడిరి.

19 సర్వజ్ఞుడైన వారి సృష్టికర్త జోక్యం లేకుండా, యథార్థముగా వారు పశ్చాత్తాపపడని యెడల, వారు అనివార్యముగా ఇప్పటి వరకు దాస్యమందు నిలిచియుండేవారు.

20 కానీ, ఆయన ఎదుట వారు తమనుతాము తగ్గించుకొనినందున ఆయన వారిని విడిపించెను; వారు ఆయనకు బలముగా మొరపెట్టినందున ఆయన వారిని దాస్యము నుండి విడిపించెను; ఆ విధముగా ప్రభువు తన యందు నమ్మికయుంచు వారి యెడల కనికరముగల తన బాహువును చాపుచూ నరుల సంతానము మధ్య అన్ని విషయములలో తన శక్తితో పనిచేయును.

21 ఇప్పుడు అధిక వివాదము, అధిక రక్తపాతము ద్వారా తప్ప దుష్టుడైన ఒక రాజును మీరు సింహాసనము నుండి దించలేరని నేను మీతో చెప్పుచున్నాను.

22 ఏలయనగా అతడు దుర్నీతి యందు స్నేహితులను కలిగియుండి, తన భటులను తన చుట్టూ ఉంచుకొనును; అతనికంటే ముందుగా నీతి యందు పరిపాలన చేసియున్న వారి చట్టములను అతడు ధిక్కరించుచు దేవుని ఆజ్ఞలను తన పాదముల క్రింద త్రొక్కివేయును;

23 అతడు చట్టములను అనగా తన దుష్టత్వమును తెలుపు చట్టములను చేసి, వాటిని జనుల మధ్యకు పంపును; అతని చట్టములకు లోబడనివాడు నాశనమగునట్లు చేయును; అతనికి వ్యతిరేకముగా తిరుగబడు వారితో యుద్ధము చేయుటకు తన సైన్యములను పంపి, సాధ్యమయిన యెడల అతడు వారిని నాశనము చేయును; ఆ విధముగా అవినీతిపరుడైన రాజు సమస్త నీతి మార్గములను చెరుపును.

24 అట్టి హేయములు మీపై వచ్చుట సరికాదని నేను మీతో చెప్పుచున్నాను.

25 కావున, ప్రభువు యొక్క హస్తము ద్వారా మన తండ్రులకు, వారి ద్వారా మీకు ఇవ్వబడియున్న సరియైన చట్టముల ద్వారా మీరు తీర్పు తీర్చబడునట్లు ఈ జనుల స్వరము చేత న్యాయాధిపతులను ఎన్నుకొనుడి.

26 ఇప్పుడు సరియైన దానికి విరుద్దముగా దేనినైనా జనులు కోరుట అసాధారణము; కానీ, సరికాని దానిని కోరుట జనులలో అల్ప సంఖ్యాకులకు సర్వసాధారణము; కావున, జనుల స్వరము చేత మీ వ్యవహారములు చేయుటను మీరు పాటించుడి, దానిని మీ చట్టముగా చేయుడి.

27 జనుల స్వరము దుర్నీతిని కోరుకొను సమయము వచ్చిన యెడల, అదియే దేవుని తీర్పులు మీపై వచ్చు సమయము; ఆయన ఇంత వరకు ఈ దేశమును దర్శించియున్నట్లు మిమ్ములను కూడా గొప్ప నాశనముతో దర్శించు సమయమదియే.

28 మీరు న్యాయాధిపతులను కలిగియుండి మీకు ఇవ్వబడియున్న చట్టమును బట్టి వారు తీర్పుతీర్చని యెడల, వారు ఉన్నత న్యాయాధిపతి ద్వారా తీర్పు తీర్చబడునట్లు మీరు చేయవచ్చును.

29 మీ ఉన్నత న్యాయాధిపతులు న్యాయముగా తీర్పు తీర్చని యెడల, మీ నిమ్న న్యాయాధిపతులు ఒక చిన్న సంఖ్యలో సమకూడి జనుల స్వరమును బట్టి మీ ఉన్నత న్యాయాధిపతులను తీర్పు తీర్చునట్లు మీరు చేయవలెను.

30 ప్రభువు యొక్క భయమందు మీరు ఈ కార్యములను చేయవలెనని నేను మిమ్ములను ఆజ్ఞాపించుచున్నాను; ఈ జనులు పాపములను దోషములను జరిగించిన యెడల, వాటికి వారే బాధ్యులగునట్లు ఈ కార్యములను చేయమనియు మీరు ఏ రాజును కలిగియుండరాదనియు నేను మిమ్ములను ఆజ్ఞాపించుచున్నాను.

31 ఏలయనగా, అనేకమంది జనుల పాపములు వారి రాజుల యొక్క దుర్ణీతుల ద్వారా చేయబడియున్నవని నేను మీతో చెప్పుచున్నాను; కావున, వారి దుర్ణీతులకు వారి రాజులే బాధ్యత వహించవలసియుండును.

32 ఇప్పుడు ఈ అసమానత్వము ఇక మీదట ఈ దేశమందు, ప్రత్యేకముగా ఈ నా జనుల మధ్య ఉండరాదని నేను కోరుచున్నాను; కానీ, మనము జీవించి దేశమును స్వతంత్రించుకొనుట మంచిదని ప్రభువు చూచునంతమట్టుకు, భూముఖముపై మన సంతతి ఎవరైనా నిలచియున్నంత మట్టుకు కూడా ఈ దేశము ఒక స్వేచ్ఛా దేశముగా ఉండవలెనని, ప్రతి మనుష్యుడు తన హక్కులు, విశేషాధికారాలను అందరి వలే అనుభవించవలెనని నేను కోరుచున్నాను.

33 ఇంకను రాజైన మోషైయ వారికి అనేక విషయములను వ్రాసెను, ఒక నీతిగల రాజు యొక్క శోధనలు బాధలన్నిటినీ తెలియజేయుచూ, తన జనుల కొరకు ఆత్మ యొక్క ప్రయాసములన్నిటిని మరియు వారి రాజు యెదుట జనుల ఫిర్యాదులన్నిటిని కూడా వారికి వివరించెను.

34 ఈ విషయములు అట్లుండరాదని, ప్రతి మనుష్యుడు తన వంతు భరించునట్లు జనులందరిపై భారముండవలెనని అతడు వారికి చెప్పెను.

35 తమపై పరిపాలించుటకు అవినీతిపరుడైన రాజును కలిగియుండుట వలన వారు భరించవలసిన నష్టములన్నిటినీ కూడా అతడు వారికి తెలియజేసెను;

36 ముఖ్యముగా అతని సమస్త దుర్ణీతులు, హేయక్రియలు, యుద్ధములు, వివాదములను, రక్తపాతము, దొంగతనము, దోపిడీ, జారత్వములు జరిగించుటను, లెక్కింపబడలేనంతగా సమస్త విధములైన దుర్ణీతులను తెలుపుచూ ఈ విషయములు అట్లుండరాదని, అవి దేవుని ఆజ్ఞలకు స్పష్టముగా విరుద్దమైనవని చెప్పెను.

37 ఇప్పుడు రాజైన మోషైయ ఈ విషయములను జనుల మధ్యకు పంపియున్న తరువాత, వారు అతని మాటల సత్యమును గూర్చి ఒప్పించబడిరి.

38 కావున, వారు రాజు కొరకు తమ కోరికలను విడిచిపెట్టి దేశమంతటా ప్రతి మనుష్యుడు సమాన అవకాశము కలిగియుండవలెనని మిక్కిలి ఆతృత గలవారైరి; ప్రతి మనుష్యుడు తన పాపముల కొరకు బాధ్యత వహించెదనని తెలియజేసిరి.

39 కావున వారికి ఇవ్వబడియున్న చట్టమును బట్టి తీర్పు తీర్చుటకు ఎవరు వారికి న్యాయాధిపతులుగా ఉండవలెనను దానిని గూర్చి తమ సమ్మతములను తెలియజేయుటకు దేశమంతటా వారు సమూహములుగా కూడి సమావేశమైరి; వారికి అనుగ్రహింపబడిన స్వాతంత్ర్యమును బట్టి వారు అధికముగా ఆనందించిరి.

40 ఇప్పుడు మోషైయ యెడల వారి ప్రేమ బలముగా ఎదిగెను; వారు అతడిని ఇతర మనుష్యులందరి కన్నను అధికముగా యెంచిరి; ఏలయనగా స్వలాభమును, ముఖ్యముగా ఆత్మను క్షయము చేయు సంపదను కోరుకొను క్రూర పరిపాలకునిగా వారతనిని చూడలేదు; అతడు వారి నుండి ధనము తీసుకొనలేదు లేదా రక్తపాతమందు ఆనందించలేదు, కానీ దేశమందు శాంతిని స్థాపించెను, తన జనులు సకల విధములైన దాస్యము నుండి విడిపింపబడునట్లు అనుగ్రహించెను; కావున వారతనిని అపరిమితముగా గౌరవించిరి.

41 ఇప్పుడు వారిపై పరిపాలన చేయుటకు లేదా చట్టమును బట్టి వారికి తీర్పుతీర్చుటకు వారు న్యాయాధిపతులను నియమించిరి; దీనిని వారు దేశమంతటా చేసిరి.

42 ఆల్మా మొట్ట మొదటి ప్రధాన న్యాయాధిపతిగా నియమింపబడెను; అతడు ప్రధాన యాజకుడు కూడా అయ్యుండెను; అతని తండ్రి ఆ స్థానమును అతనికి అనుగ్రహించి, సంఘ వ్యవహారములన్నిటిపై అతనికి బాధ్యతనిచ్చెను.

43 ఆల్మా ప్రభువు యొక్క మార్గములందు నడుచుచు, ఆయన ఆజ్ఞలను పాటించుచు న్యాయముగా తీర్పు తీర్చెను; మరియు దేశమందు నిరంతరమైన సమాధానముండెను.

44 ఆ విధముగా జరహేమ్ల యొక్క దేశమంతటా, నీఫైయులని పిలువబడిన జనులందరి మధ్య న్యాయాధిపతుల పరిపాలన ప్రారంభమాయెను మరియు ఆల్మా మొదటి ప్రధాన న్యాయాధిపతి ఆయెను.

45 ఇప్పుడు అతని తండ్రి ఎనుబది రెండు సంవత్సరముల వాడై, దేవుని ఆజ్ఞలను నెరవేర్చుటకు జీవించిన వాడై మృతిబొందెను.

46 మోషైయ కూడా అతని పరిపాలన యొక్క ముప్పది మూడవ సంవత్సరమున అరువది మూడు సంవత్సరముల వాడై మృతిబొందెను; లీహై యెరూషలేమును వదిలివచ్చిన సమయము నుండి మొత్తము ఐదు వందల తొమ్మిది సంవత్సరములు ఆయెను.

47 ఆ విధముగా నీఫై జనులపై రాజుల పరిపాలన ముగిసెను; వారి సంఘ స్థాపకుడైన ఆల్మా యొక్క దినములు ఆ విధముగా ముగిసెను.

ముద్రించు