6వ అధ్యాయము
రాజైన బెంజమిన్ జనుల పేర్లు నమోదు చేయును మరియు వారికి బోధించుటకు యాజకులను నియమించును—మోషైయ నీతిగల రాజుగా పరిపాలించును. సుమారు క్రీ. పూ. 124–121 సం.
1 ఇప్పుడు రాజైన బెంజమిన్ జనులతో మాట్లాడుట ముగించిన తరువాత, దేవుని ఆజ్ఞలు గైకొనుటకు ఆయనతో ఒక నిబంధనలోనికి ప్రవేశించిన వారందరి పేర్లు నమోదు చేయుట ఆవశ్యకమైనదని అతడు తలంచెను.
2 చిన్నపిల్లలు తప్ప నిబంధనలోనికి ప్రవేశించక, క్రీస్తు నామమును తమపై తీసుకొనని ఆత్మ ఒక్కటి కూడా అక్కడ లేకుండెను.
3 రాజైన బెంజమిన్ ఈ విషయములన్నిటిని చెప్పుట ముగించినప్పుడు, తన కుమారుడైన మోషైయను తన జనులపై అధిపతిగా, రాజుగా ప్రతిష్ఠించి, అతినికి రాజ్యమును గూర్చిన సమస్త అధికారములు ఇచ్చెను మరియు జనులు దేవుని ఆజ్ఞలను విని ఎరుగునట్లు, వారు చేసిన ప్రమాణము యొక్క జ్ఞాపకమునకు వారిని పురికొల్పునట్లు జనులకు బోధించుటకు యాజకులను కూడా నియమించిన తరువాత, అతడు సమూహమును పంపివేసెను మరియు ప్రతివాడు తమ కుటుంబముల ప్రకారము వారి స్వంత గృహములకు తిరిగి వెళ్ళెను.
4 ఇప్పుడు మోషైయ తన తండ్రి స్థానములో పరిపాలించుట ప్రారంభించెను. లీహై యెరూషలేమును వదిలివచ్చిన సమయము నుండి అంతయు కలిపి సుమారు నాలుగువందల డెబ్బది ఆరు సంవత్సరములు పూర్తి చేయుచు తన ముప్పదియవయేట అతడు పరిపాలించుట ప్రారంభించెను.
5 రాజైన బెంజమిన్ మూడు సంవత్సరములు జీవించిన పిమ్మట మరణించెను.
6 రాజైన మోషైయ ప్రభువు యొక్క మార్గములలో నడిచెను మరియు ఆయన న్యాయతీర్పులను ధర్మశాస్త్రములను పాటించి, అతనికి ఆజ్ఞాపించబడిన విషయములన్నిటి యందు ఆయన ఆజ్ఞలను గైకొనెను.
7 రాజైన మోషైయ తన జనులు భూమిని సాగుచేయునట్లు చేసెను. ఆయన కూడా స్వయముగా భూమిని దున్నుతూ తన జనులకు భారము కాకుండునట్లు, అన్ని విషయముల యందు తన తండ్రి చేసినట్లుగా తాను కూడా చేసెను. మూడు సంవత్సరముల వరకు అతని జనులందరి మధ్య ఎట్టి వివాదములు లేకుండెను.