11వ అధ్యాయము
రాజైన నోవహ దుష్టత్వమందు పరిపాలించును—అతడు తన భార్యలు మరియు ఉపపత్నులతో విలాసాలలో మునిగితేలుచుండును—జనులు దాస్యములోనికి తీసుకొనబడుదురని అబినడై ప్రవచించును—రాజైన నోవాహ్ అతని ప్రాణమును కోరును. సుమారు క్రీ. పూ. 160–150 సం.
1 ఇప్పుడు జెనిఫ్, తన కుమారులలో ఒకడైన నోవాహ్‌కు రాజ్యమును అనుగ్రహించెను; కావున, నోవాహ్ అతని స్థానములో పరిపాలించుట ఆరంభించెను; అతడు తన తండ్రి అడుగుజాడలలో నడువలేదు.
2 ఏలయనగా అతడు దేవుని ఆజ్ఞలను పాటించలేదు, కాని తన హృదయవాంఛలను బట్టి నడుచుకొనెను. అతడు అనేకమంది భార్యలను, ఉపపత్నులను కలిగియుండెను. తన జనులు పాపము చేయునట్లు, ప్రభువు దృష్టిలో హేయకరమైన దానిని చేయునట్లు అతడు చేసెను. వారు జారత్వములను, సమస్త విధములైన దుష్టత్వములను జరిగించిరి.
3 వారికి కలిగినదానంతటిలో ఐదవ భాగమును, అనగా వారి బంగారము, వెండి, జిఫ్, రాగి, కంచు, ఇనుములో ఐదవ భాగము, వారి క్రొవ్విన మందలలో, వారి సమస్త ధాన్యములో ఐదవ భాగమును అతడు పన్నుగా విధించెను.
4 ఇదంతయు అతడు తనను, తన భార్యలను, తన ఉపపత్నులను మరియు తన యాజకులను, వారి భార్యలను, వారి ఉపపత్నులను కూడా పోషించుటకు తీసుకొనెను; ఆ విధముగా అతడు రాజ్యము యొక్క వ్యవహారములను మార్చివేసెను.
5 ఏలయనగా అతడు తన తండ్రి చేత ప్రతిష్ఠించబడిన యాజకులందరినీ తొలగించి, వారి స్థానములో క్రొత్తవారిని, తమ హృదయముల గర్వమందు పైకెత్తబడిన వారిని ప్రతిష్ఠించెను.
6 ఆలాగున వారు రాజైన నోవాహ్ తన జనులపై విధించిన పన్నుల ద్వారా తమ సోమరితనమందు, విగ్రహారాధనయందు, జారత్వములందు పోషింపబడిరి; ఆ విధముగా పాపమును పోషించుటకు జనులు అధికముగా శ్రమపడిరి.
7 రాజు మరియు యాజకుల యొక్క వ్యర్థమైన ఇచ్ఛకపు మాటల ద్వారా మోసపోయినందున జనులు కూడా విగ్రహారాధికులైరి; ఏలయనగా వారు జనులతో ఇచ్ఛకపు మాటలు మాట్లాడిరి.
8 రాజైన నోవాహ్ అనేక సుందరమైన, విశాలమైన భవనములను నిర్మించెను; అతడు వాటిని కలప యొక్క శ్రేష్ఠమైన పనితనముతో, బంగారము, వెండి, ఇనుము, కంచు, జిఫ్, రాగి వంటి సకలవిధముల విలువైన వస్తువులతో అలంకరించెను;
9 అతడు తన కొరకు ఒక విశాలమైన రాజమందిరమును, దాని మధ్యలో ఒక సింహాసనమును కూడా నిర్మించెను, అదంతయు శ్రేష్ఠమైన కలపతో చేయబడి బంగారము, వెండి, విలువైన వస్తువులతో అలంకరించబడెను.
10 అతని పనివారు దేవాలయము లోపలివైపు శ్రేష్ఠమైన కలప, రాగి మరియు కంచుతో సకలవిధముల శ్రేష్ఠమైన పని చేయునట్లు కూడా అతడు చేసెను.
11 మిగిలిన ఆసనములన్నిటి కంటె ఎత్తులోనుండి ప్రధాన యాజకుల కొరకు ప్రత్యేకపరచబడిన ఆసనములను అతడు మేలిమి బంగారముతో అలంకరించెను; వారు అతని జనులతో అబద్ధమైన, వ్యర్థమైన మాటలు చెప్పుచుండగా తమ శరీరములను, తమ చేతులను ఆన్చుకొనుటకు వారి యెదుట రొమ్మెత్తు ప్రాకారము కట్టబడునట్లు అతడు చేసెను.
12 అతడు దేవాలయమునకు సమీపములో ఒక గోపురము నిర్మించెను; ముఖ్యముగా, అతడు దానిపై నిలబడి షైలోమ్ దేశమును, లేమనీయుల చేత స్వాధీనము చేసుకొనబడిన షెమ్లోన్ దేశమును మరియు చుట్టూ ఉన్న దేశమంతటిని కూడా పైనుండి చూడగలుగునంత ఎత్తైన గోపురము నిర్మించెను.
13 అతడు షైలోమ్ దేశమందు అనేక భవనములు నిర్మించబడునట్లు చేసెను; నీఫై సంతానము దేశము నుండి బయటకు పారిపోయిన సమయమున వారి కొరకు ఒక ఆశ్రయ స్థలముగా ఉండిన షైలోమ్ దేశమునకు ఉత్తరమున ఉన్న కొండపైన అతడు ఒక గొప్ప గోపురము నిర్మించబడునట్లు చేసెను; తన జనులపై పన్ను విధించుట ద్వారా సంపాదించిన ధనమును అతడు ఆ విధముగా ఖర్చుచేసెను.
14 అతడు తన హృదయమును తన సంపదలపై నిలిపెను మరియు తన సమయమును తన భార్యలు, ఉపపత్నులతో విలాసాలలో గడిపెను; అతని యాజకులు కూడా అట్లే తమ సమయమును వేశ్యలతో గడిపిరి.
15 అతడు దేశము చుట్టూ ద్రాక్షతోటలను నాటించెను; ద్రాక్ష తొట్లను కట్టించి, విస్తారముగా ద్రాక్షారసమును తయారు చేసెను; అందునుబట్టి అతడు మరియు అతని జనులు కూడా త్రాగుబోతులైరి.
16 ఇప్పుడు లేమనీయులు చిన్న సంఖ్యలో అతని జనులపైకి వచ్చి, వారు పొలములలో తమ మందలను కాచుకొనుచుండగా వారిని సంహరించుట మొదలుపెట్టిరి.
17 వారిని అడ్డుకొనుటకు రాజైన నోవాహ్ దేశము చుట్టూ భటులను పంపెను; కానీ అతడు తగినంతమందిని పంపనందున లేమనీయులు వారిపైకి వచ్చి, వారిని సంహరించి వారి మందలనేకమును దేశము నుండి బయటకు తరిమివేసిరి; ఆ విధముగా లేమనీయులు వారిని నాశనము చేయుచు వారిపై తమ ద్వేషమును ప్రదర్శించుట మొదలుపెట్టిరి.
18 రాజైన నోవాహ్ వారికి వ్యతిరేకముగా తన సైన్యములను పంపగా వారు వెనుకకు తరుమబడిరి లేదా కొన్నిసార్లు లేమనీయులను వెనుకకు తరిమిరి; కావున, వారు సంతోషించుచూ దోపుడుసొమ్ముతో తిరిగి వచ్చిరి.
19 ఇప్పుడు ఈ గొప్ప విజయమును బట్టి వారు తమ హృదయముల గర్వమందు పైకెత్తబడిరి; తమ ఏబదిమంది లేమనీయుల యొక్క వేలమందిని ఎదుర్కొనగలరని చెప్పుచూ వారి స్వంత బలమును గూర్చి వారు గొప్పలు చెప్పుకొనిరి; ఆ విధముగా వారు గొప్పలు చెప్పుకొని రక్తపాతమందు, తమ సహోదరుల రక్తము చిందించుట యందు ఆనందించిరి, ఇది వారి రాజు మరియు యాజకుల యొక్క దుష్టత్వమును బట్టియైయుండెను.
20 ఇప్పుడు వారి మధ్య అబినడై అను పేరుగల మనుష్యుడొకడు ఉండెను; అతడు వారి మధ్యకు వెళ్ళి, ఇట్లు చెప్పుచూ ప్రవచించుట మొదలుపెట్టెను: ఇదిగో ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు వెళ్ళి—ఈ జనులకు ఆపద, ఏలయనగా వారి హేయక్రియలను, దుష్టత్వములను, జారత్వములను నేను చూచియున్నాను; వారు పశ్చాత్తాపపడని యెడల, వారిని నా ఉగ్రతయందు దర్శించెదనని ప్రభువు సెలవిచ్చుచున్నాడని ఈ జనులతో చెప్పమని ఆయన నన్ను ఆజ్ఞాపించియున్నాడు.
21 వారు పశ్చాత్తాపపడి, వారి దేవుడైన ప్రభువు తట్టు తిరగని యెడల, నేను వారిని వారి శత్రువుల చేతులలోనికి అప్పగించెదను; వారు దాస్యములోనికి తేబడుదురు; వారి శత్రువుల చేత వారు బాధింపబడుదురు.
22 అప్పుడు వారు, వారి దేవుడనైన ప్రభువునగు నేను రోషముగల దేవుడనని, నా జనుల దోషములను వారిపైకి రప్పించెదనని తెలుసుకొందురు.
23 ఈ జనులు పశ్చాత్తాపపడి, వారి దేవుడైన ప్రభువు తట్టు తిరగని యెడల, వారు దాస్యములోనికి తేబడుదురు; సర్వశక్తిమంతుడగు దేవుడైన ప్రభువు తప్ప మరి ఎవడును వారిని విడిపించడు.
24 వారు నాకు మొరపెట్టినప్పుడు నేను వారి మొరలు వినుటకు ఆలస్యము చేయుదును; వారి శత్రువుల చేత వారు కొట్టబడుటకు అనుమతించెదను.
25 వారు గోనెను బూడిదెను వేసుకొని పశ్చాత్తాపపడి, వారి దేవుడైన ప్రభువుకు బలముగా మొరపెట్టని యెడల, నేను వారి ప్రార్థనలను వినను లేదా వారి శ్రమల నుండి వారిని విడిపించనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు మరియు ఆ విధముగా ఆయన నన్ను ఆజ్ఞాపించియున్నాడు.
26 ఇప్పుడు అబినడై వారితో ఈ మాటలు పలికినప్పుడు వారు అతనిపై కోపముగానుండి, అతని ప్రాణము తీయుటకు ప్రయత్నించిరి; కానీ ప్రభువు వారి చేతులలో నుండి అతడిని విడిపించెను.
27 అబినడై జనులతో పలికిన మాటలను రాజైన నోవాహ్ వినినప్పుడు అతడు కూడా కోపముగా నుండి ఇట్లనెను: ఎవరీ అబినడై? అతని ద్వారా నేను, నా జనులు ఏల తీర్పుతీర్చబడవలెను? లేదా నా జనులపై అట్టి గొప్ప ఆపదను తీసుకొనివచ్చు ప్రభువు ఎవరు?
28 నేనతనిని సంహరించునట్లు అబినడైని ఇక్కడకు తీసుకురమ్మని నేను మిమ్ములను ఆజ్ఞాపించుచున్నాను, ఏలయనగా నా జనులను ఒకరిపై ఒకరిని కోపమునకు పురికొల్పుటకు మరియు నా జనుల మధ్య వివాదములు రేపుటకు అతడు ఈ విషయములను చెప్పియున్నాడు; కావున, నేనతనిని సంహరించెదను.
29 ఇప్పుడక్కడి జనుల కన్నులు గ్రుడ్డివిగా చేయబడెను; అందువలన వారు అబినడై మాటలకు వ్యతిరేకముగా తమ హృదయములను కఠినపరచుకొనిరి మరియు ఆ సమయము మొదలుకొని వారతనిని పట్టుకొనుటకు ప్రయత్నించిరి. రాజైన నోవాహ్ ప్రభువు వాక్యమునకు వ్యతిరేకముగా తన హృదయమును కఠినపరచుకొని, తన చెడు కార్యముల విషయమై పశ్చాత్తాపపడలేదు.