లేఖనములు
మోషైయ 18


18వ అధ్యాయము

ఆల్మా రహస్యముగా బోధించును—అతడు బాప్తిస్మపు నిబంధనను వివరించును మరియు మోర్మన్‌ జలములలో బాప్తిస్మమిచ్చును—అతడు క్రీస్తు సంఘమును ఏర్పాటు చేసి, యాజకులను నియమించును—వారు తమనుతాము పోషించుకొనుచు జనులకు బోధించెదరు—ఆల్మా, అతని జనులు రాజైన నోవాహ్ యొద్ద నుండి అరణ్యములోనికి పారిపోవుదురు. సుమారు క్రీ. పూ. 147–145 సం.

1 ఇప్పుడు రాజైన నోవాహ్ సేవకుల యొద్ద నుండి పారిపోయిన ఆల్మా తన పాపములు, దోషములను గూర్చి పశ్చాత్తాపపడి, రహస్యముగా జనుల మధ్యకు వెళ్ళుచు అబినడై మాటలను బోధించసాగెను—

2 రాబోవు దానిని గూర్చి, మృతుల పునరుత్థానమును గూర్చి, క్రీస్తు యొక్క శక్తి, శ్రమలు, మరణము, ఆయన పునరుత్థానము మరియు పరలోకములోనికి ఆరోహణము ద్వారా తేబడు విమోచనను గూర్చి కూడా బోధించెను.

3 అతని మాట వినువారందరికి అతడు బోధించెను. రాజుకు తెలియకుండా అతడు వారికి రహస్యముగా బోధించెను. అనేకులు అతని మాటలను విశ్వసించిరి.

4 అతడిని విశ్వసించిన వారందరు మోర్మన్‌ అని పిలువబడిన ఒక స్థలమునకు వెళ్ళిరి, అది దాని పేరును రాజు నుండి పొందినదై, దేశ సరిహద్దులలో ఉన్నందున సంవత్సరములో అనేకమార్లు అడవి మృగములచే దాడి చేయబడుచుండెను.

5 ఇప్పుడు మోర్మన్‌ నందు శుద్ధమైన నీటి ఊటయొకటి ఉండెను, ఆల్మా అక్కడికి వెళ్ళి ఆ నీటి సమీపమునున్న చిన్న చెట్లపొదలో పగటి సమయమందు రాజు యొక్క అన్వేషణల నుండి దాగుకొనెను.

6 అతని యందు విశ్వసించిన వారందరు అతని మాటలు వినుటకు అక్కిడికి వెళ్ళిరి.

7 అనేక దినముల తరువాత, ఆల్మా మాటలు వినుటకు మోర్మన్‌ స్థలమందు పెద్దసంఖ్యలో జనులు సమకూడిరి. అతని మాట యందు విశ్వసించిన వారందరు అతడిని వినుటకు సమకూడిరి. అతడు వారికి బోధించి, పశ్చాత్తాపమును విమోచనను ప్రభువుయందు విశ్వాసమును వారికి ప్రకటించెను.

8 అతడు వారితో ఇట్లు చెప్పెను: ఇదిగో మోర్మన్‌ జలములు (ఏలయనగా అవి ఆ విధముగా పిలువబడినవి), ఇప్పుడు మీరు దేవుని సముదాయములోనికి వచ్చుటకు, ఆయన జనులని పిలువబడుటకు కోరిక కలిగియున్నారు మరియు అవి తేలికగునట్లు ఒకరి భారములు ఒకరు భరించుటకు ఇష్టపడుచున్నారు;

9 దుఃఖించు వారితో దుఃఖపడుటకు, ఆదరణ యొక్క అవసరములో ఉన్నవారిని ఆదరించుటకు మరియు దేవుని ద్వారా విమోచింపబడి, మొదట పునరుత్థానము చెందువారితో లెక్కింపబడి మీరు నిత్యజీవము కలిగియుండునట్లు మరణము వరకు అన్ని సమయములలో, అన్ని విషయములలో, మీరు ఉండు అన్ని స్థలములలో దేవునికి సాక్షులుగా నిలబడుటకు ఇష్టపడుచున్నారు—

10 ఇప్పుడిది మీ హృదయముల యొక్క కోరిక అయిన యెడల, ఆయన మీపై తన ఆత్మను అధిక విస్తారముగా క్రుమ్మరించునట్లు మీరు ఆయనను సేవించుదురనియు ఆయన ఆజ్ఞలను పాటించుదురనియు ఆయనతో ఒక నిబంధనలోనికి ప్రవేశించియున్నారని ఆయన యెదుట ఒక సాక్షిగా ప్రభువు నామమందు మీరు బాప్తిస్మము పొందకపోవుటకు గల కారణమేమి? అని నేను మిమ్ములను అడుగుచున్నాను.

11 ఇప్పుడు జనులు ఈ మాటలను వినినప్పుడు, వారు సంతోషముతో చప్పట్లు కొట్టి—మా హృదయముల యొక్క కోరిక ఇదేనని బిగ్గరగా చెప్పిరి.

12 ఇప్పుడు హీలమ్‌ మొదటి వారిలో ఉండెను గనుక, ఆల్మా అతడిని తీసుకొని వెళ్ళి నీటిలో నిలబడి బిగ్గరగా ఇట్లనెను: ఓ ప్రభువా, హృదయ పరిశుద్ధతతో ఈ కార్యము చేయునట్లు నీ సేవకునిపై నీ ఆత్మను క్రుమ్మరించుము.

13 అతడు ఈ మాటలు చెప్పినప్పుడు ప్రభువు యొక్క ఆత్మ అతనిపై ఉండెను మరియు అతడు ఇట్లు చెప్పెను: హీలమ్, సర్వశక్తిమంతుడైన దేవుని నుండి నేను అధికారము కలిగియుండి, మర్త్య శరీర విషయమై నీవు మరణించు వరకు ఆయనను సేవించుటకు నీవొక నిబంధనలోనికి ప్రవేశించితివనుటకు సాక్ష్యముగా నీకు బాప్తిస్మమిచ్చుచున్నాను; ప్రభువు యొక్క ఆత్మ నీపై క్రుమ్మరింపబడును గాక; లోకము పునాది వేయబడినప్పటి నుండి ఆయన సిద్ధము చేసిన క్రీస్తు యొక్క విమోచన ద్వారా ఆయన నీకు నిత్యజీవమును అనుగ్రహించును గాక.

14 ఆల్మా ఈ మాటలు చెప్పిన తరువాత, ఆల్మా మరియు హీలమ్ ఇద్దరు నీటిలో పూర్తిగా మునిగి, ఆత్మతో నింపబడిన వారై, వారు నీటిలో నుండి లేచి సంతోషించుచూ బయటకు వచ్చిరి.

15 మరలా ఆల్మా మరియొకనిని తీసుకొని రెండవసారి నీటిలోనికి వెళ్ళి మొదటి వాని వలే అతనికి బాప్తిస్మమిచ్చెను, అయితే అతడు మరలా నీటి యందు మునగలేదు.

16 ఈ విధముగా అతడు మోర్మన్‌ స్థలమునకు వెళ్ళిన ప్రతివానికి బాప్తిస్మమిచ్చెను; వారు మొత్తము రెండు వందల నాలుగు ఆత్మలైయుండి, మోర్మన్‌ జలములలో బాప్తిస్మము పొంది, దేవుని కృపతో నింపబడిరి.

17 ఆ సమయము నుండి వారు దేవుని సంఘమని లేదా క్రీస్తు సంఘమని పిలువబడిరి. దేవుని శక్తి మరియు అధికారము ద్వారా బాప్తిస్మము పొందిన వారందరు ఆయన సంఘమందు చేర్చబడిరి.

18 దేవుని యొద్ద నుండి అధికారము గలవాడై ఆల్మా యాజకులను నియమించెను; వారికి ప్రకటించుటకు మరియు దేవుని రాజ్యమునకు సంబంధించిన విషయములను వారికి బోధించుటకు వారిలో ప్రతి ఏబది మందికి ఒక యాజకుడిని అతడు నియమించెను.

19 అతడు బోధించినవి మరియు పరిశుద్ధ ప్రవక్తల నోటి ద్వారా పలుకబడినవి తప్ప మరేమియు వారు బోధించరాదని అతడు వారినాజ్ఞాపించెను.

20 పశ్చాత్తాపము మరియు తన జనులను విమోచించు ఆ ప్రభువుపై విశ్వాసము తప్ప మరేదియు వారు బోధించరాదని కూడా అతడు వారినాజ్ఞాపించెను.

21 ఒకనితో మరొకనికి ఎట్టి వివాదములు ఉండరాదనియు, ఒకే విశ్వాసము, ఒకే బాప్తిస్మము కలిగియుండి ఒకరి యెడల ఒకరు ఐక్యతయందును, ప్రేమయందును తమ హృదయములు ముడివేయబడునట్లు వారు ఏకదృష్టితో ముందుకు చూడవలెననియు అతడు వారిని ఆజ్ఞాపించెను.

22 ఆ విధముగా బోధించమని అతడు వారిని ఆజ్ఞాపించెను. మరియు ఆ విధముగా వారు దేవుని సంతానమయిరి.

23 వారు విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించవలెనని, ప్రతిదినము తమ దేవుడైన ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెనని అతడు వారిని ఆజ్ఞాపించెను.

24 అతడు నియమించిన యాజకులు తమ పోషణ నిమిత్తము స్వహస్తాలతో పని చేయవలెనని కూడా అతడు వారిని ఆజ్ఞాపించెను.

25 జనులకు బోధించుటకు, వారి దేవుడైన ప్రభువును ఆరాధించుటకు వారు కలిసి సమకూడునట్లు ప్రతివారము ఒకదినము ప్రత్యేకపరచబడెను, ఇంకను వారి శక్తిమేరకు వీలయినంత తరచుగా వారు సమకూడవలెను.

26 యాజకులు తమ పోషణ నిమిత్తము జనులపై ఆధారపడకూడదు; కానీ వారు దేవుని నుండి శక్తి మరియు అధికారముతో బోధించునట్లు, దేవుని జ్ఞానము కలిగియుండి, ఆత్మ యందు బలముగా ఎదుగునట్లు వారి శ్రమ నిమిత్తము వారు దేవుని కృపను పొందవలసియున్నారు.

27 సంఘ జనులలో ప్రతిఒక్కరు తాము కలిగియున్నదానిని బట్టి తమ ఆస్థిని పంచవలెనని ఆల్మా ఆజ్ఞాపించెను; ఒకడు విస్తారముగా కలిగియున్న యెడల విస్తారముగా పంచవలెను, కొద్దిగా కలవాని నుండి కొద్దిగా కోరవలెను మరియు లేనివానికి ఇయ్యవలెను.

28 ఆవిధముగా వారు తమ ఆస్థిని తమ స్వచిత్తమును బట్టి, దేవుని యెడల మంచి కోరికలను బట్టి అవసరములోనున్న యాజకులకు, అక్కర కలిగిన దిగంబరియైన ప్రతి ఒక్కరికి పంచవలెను.

29 దేవుని చేత ఆజ్ఞాపించబడిన వాడై అతడు వారితో ఈవిధముగా చెప్పెను; మరియు వారు తమ అక్కరలు, కోరికలను బట్టి ఐహికముగాను, ఆత్మీయముగాను ఒకరితోనొకరు పంచుకొనుచూ దేవుని యెదుట న్యాయముగా నడిచిరి.

30 ఇప్పుడు ఇదంతయు మోర్మన్‌ నందు, అనగా మోర్మన్‌ జలముల యొద్ద, మోర్మన్‌ జలముల దగ్గరనున్న అడవిలో చేయబడెను; మోర్మన్‌ స్థలము, మోర్మన్‌ జలములు, మోర్మన్‌ అడవి అనునవి తమ విమోచకుని గూర్చి తెలుసుకొనిన వారి కన్నులకు ఎంతో సుందరమైనవి; వారెంతో ధన్యులు, ఏలయనగా వారు నిరంతరము ఆయనను స్తుతించెదరు.

31 మరియు ఈ సంగతులు రాజుకు తెలియకుండునట్లు దేశ సరిహద్దుల యందు చేయబడెను.

32 కానీ, జనుల మధ్య ఒక కదలికను కనుగొనిన వాడై వారిని కనిపెట్టుటకు రాజు తన సేవకులను పంపెను. కావున, ప్రభువు వాక్యమును వినుటకు కలిసి సమకూడుచున్న దినమున వారు రాజుచే కనుగొనబడిరి.

33 ఇప్పుడు ఆల్మా తనకు వ్యతిరేకముగా జనులను పురిగొల్పుచున్నాడని చెప్పి, వారిని నాశనము చేయుటకు రాజు తన సైన్యమును పంపెను.

34 రాజు సైన్యము యొక్క రాకను గూర్చి ఆల్మాకు, ప్రభువు యొక్క జనులకు తెలియజేయబడెను; కావున, వారు తమ గుడారములను తమ కుటుంబములను తీసుకొని అరణ్యములోనికి వెడలిపోయిరి.

35 వారు సుమారు నాలుగు వందల యేబది ఆత్మలైయుండిరి.