లేఖనములు
మోషైయ 12


12వ అధ్యాయము

జనుల నాశనమును, రాజైన నోవాహ్ మరణమును ప్రవచించినందుకు అబినడై చెరసాలలో వేయబడును—అబద్ధ యాజకులు లేఖనములను ఉదహరించుదురు మరియు మోషే ధర్మశాస్త్రమును పాటించినట్లు నటించెదరు—అబినడై వారికి పది ఆజ్ఞలు బోధించుట ప్రారంభించును. సుమారు క్రీ. పూ. 148 సం.

1 రెండు సంవత్సరముల తరువాత, అతడిని వారు ఎరుగకుండునట్లు అబినడై వారి మధ్యకు మారువేషములో వచ్చి, వారి మధ్య ప్రవచించుట మొదలుపెట్టి ఇట్లు చెప్పెను: ఈ విధముగా చెప్పుచూ ప్రభువు నన్ను ఆజ్ఞాపించెను—అబినడై, వెళ్ళి ఈ నా జనులకు ప్రవచించుము, ఏలయనగా వారు నా మాటలకు వ్యతిరేకముగా తమ హృదయములను కఠినపరచుకొనియున్నారు; వారు తమ దుష్కార్యములను గూర్చి పశ్చాత్తాపపడకయున్నారు; కావున నేను నా ఉగ్రత యందు వారిని దర్శించెదను, భయంకరమైన నా ఉగ్రత యందు వారి దోషములను, హేయక్రియలను వారిపైకి రప్పించెదను.

2 ఈ తరమునకు ఆపద కలుగును గాక! మరియు ప్రభువు నాతో ఇట్లనెను—నీ చేయి చాపి, ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడని ప్రవచించుము: వారి దోషముల నిమిత్తము ఈ తరము దాస్యములోనికి తేబడును, చెంప మీద కొట్టబడును; మనుష్యులచేత తరుమబడి, సంహరించబడును; ఆకాశపు రాబందులు, కుక్కలు మరియు అడవి మృగములు వారి మాంసమును తినివేయును.

3 రాజైన నోవాహ్ ప్రాణము నిప్పుల కొలిమిలోని వస్త్రము వలే పరిగణించబడును; ఏలయనగా నేనే ప్రభువునని అతడు తెలుసుకొనును.

4 ఈ నా జనులను కఠినమైన బాధలతో, కరువుతో, తెగుళ్ళతో నేను మొత్తెదను; వారు దినమంతయు బాధతో అరుచునట్లు చేసెదను.

5 వారి వీపులపై భారములు మోపబడునట్లు నేను చేసెదను; వారు ఒక మూగ గాడిదవలే ముందుకు త్రోలబడుదురు.

6 నేను వారి మధ్యకు వడగళ్ళను పంపెదను, అవి వారిని కొట్టును; వారు తూర్పుగాలితో కూడా కొట్టబడుదురు; పురుగులు వారి భూములను పీడించి, వారి ధాన్యమును తినివేయును.

7 వారు గొప్ప తెగులుతో బాధింపబడుదురు—ఇదంతయు వారి దోషములు, హేయక్రియల నిమిత్తము నేను చేయుదును.

8 వారు పశ్చాత్తాపపడని యెడల, భూముఖముపై నుండి వారిని నేను పూర్తిగా నాశనము చేయుదును; అయినను వారు ఒక గ్రంథమును మిగిల్చెదరు మరియు దేశమును స్వాధీనము చేసుకొను ఇతర జనముల కొరకు నేను దానిని భద్రపరిచెదను; ఈ జనుల హేయక్రియలను ఇతర జనములకు చూపునట్లు దీనిని నేను చేయుదును. మరియు ఈ జనులకు వ్యతిరేకముగా అనేక విషయములను అబినడై ప్రవచించెను.

9 అప్పుడు వారతనిపై కోపముగా నుండి అతడిని పట్టుకొని కట్టివేసి, రాజు యొద్దకు తీసుకొనిపోయి, రాజుతో ఇట్లనిరి: ఇదిగో నీ జనులను గూర్చి చెడుగా ప్రవచించి, దేవుడు వారిని నాశనము చేయునని చెప్పిన ఆ మనుష్యుని మేము నీ ముందుకు తెచ్చియున్నాము.

10 అతడు నీ ప్రాణమును గూర్చి కూడా చెడుగా ప్రవచించుచున్నాడు, నీ ప్రాణము నిప్పుల కొలిమిలోని వస్త్రమువలే ఉండునని చెప్పుచున్నాడు.

11 మరలా నీవు ఒక దంటువలే, అనగా పొలములోని ఎండిన దంటువలే మృగములచే తొక్కివేయబడి, వాటి పాదముల క్రింద అణచివేయబడుదువని అతడు చెప్పుచున్నాడు.

12 మరియు పూర్తిగా పండినప్పుడు గాలి వీచిన యెడల, భూముఖముపై కొట్టుకొనిపోవు ముండ్లచెట్టు యొక్క పువ్వులవలే నీవు ఉందువని అతడు చెప్పుచున్నాడు. అది ప్రభువే చెప్పియున్నాడని అతడు నాటకమాడుచున్నాడు. నీవు పశ్చాత్తాపపడని యెడల ఇదంతయు నీ పైకి వచ్చుననియు, ఇది నీ దోషముల నిమిత్తమేననియు అతడు చెప్పుచున్నాడు.

13 ఇప్పుడు ఓ రాజా, మనము దేవునిచే శిక్షింపబడుటకు లేదా ఈ మనుష్యునిచే తీర్పు తీర్చబడుటకు నీవేమి గొప్ప కీడు చేసియున్నావు లేదా నీ జనులేమి గొప్ప పాపములు చేసియున్నారు?

14 ఓ రాజా, మనము నిర్దోషులము మరియు నీవు ఏ పాపము చేయలేదు; కావున, ఈ మనుష్యుడు నిన్ను గూర్చి అబద్ధమాడియున్నాడు, అతడు వ్యర్థముగా ప్రవచించియున్నాడు.

15 ఇదిగో మనము బలవంతులము, మనము దాస్యములోనికి రాము లేదా మన శత్రువుల ద్వారా చెరపట్టబడము; నీవు ఈ దేశమందు వర్థిల్లియున్నావు మరియు నీవు వర్ధిల్లుతూ ఉందువు.

16 ఇదిగో ఆ మనుష్యుడు ఇక్కడ ఉన్నాడు, మేము అతడిని నీ చేతులకు అప్పగించుచున్నాము; అతనిపట్ల నీకు మంచిదని తోచినదానిని నీవు చేయవచ్చును.

17 అప్పుడు రాజైన నోవాహ్, అబినడై చెరసాలలో వేయబడునట్లు చేసెను; అతడిని ఏమి చేయవలెనో అనుదాని గూర్చి చర్చించుటకు అతడు ఒక సభను ఏర్పాటు చేయునట్లు యాజకులను సమకూడమని ఆజ్ఞాపించెను.

18 అంతట వారు—మేము అతడిని ప్రశ్నించునట్లు అతడిని ఇక్కడకు రప్పించమని రాజుతో చెప్పిరి; అప్పుడతడు వారి యెదుటకు తేబడవలెనని రాజు ఆజ్ఞాపించెను.

19 వారతనిని అడ్డగించునట్లు, తద్వారా అతనిపై నేరారోపణ చేయగలుగునట్లు వారతనిని ప్రశ్నించుట మొదలుపెట్టిరి; కానీ అతడు వారికి ధైర్యముగా సమాధానమిచ్చెను, అంతేకాక వారిని ఆశ్చర్యపరచునట్లు వారి ప్రశ్నలన్నింటికి జవాబిచ్చెను; ఏలయనగా అతడు వారి ప్రశ్నలన్నింటిని ఎదుర్కొని, వారి మాటలన్నింటిలో వారిని కలవరపెట్టెను.

20 వారిలో ఒకడు అతనితో ఈవిధంగా పలికెను: ఇట్లు చెప్పుచూ వ్రాయబడియుండి, మన పితరుల ద్వారా బోధించబడిన మాటలు అనగా—

21 సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువార్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైయున్నవి;

22 నీ కావలివారు పలుకుచున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు; ప్రభువు సీయోనును మరలా రప్పించగా వారు కన్నులార చూచుచున్నారు;

23 యెరూషలేమునందు పాడైయున్న స్థలములారా, ఉత్సహించి ఏకముగా సంగీతగానము చేయుడి, ప్రభువు తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను;

24 సమస్త జనముల కన్నుల యెదుట ప్రభువు తన పరిశుద్ధ బాహువును బయలుపరచియున్నాడు, భూదిగంత నివాసులందరు మన దేవుని రక్షణ చూచెదరు అను మాటలకు అర్థమేమి?

25 ఇప్పుడు అబినడై వారితో ఇట్లనెను:, ఈ జనులకు బోధించుచున్నట్లు ప్రవచనపు ఆత్మను గ్రహించుచున్నట్లు నటించుచున్న మీరు యాజకులా? ఇంకనూ ఈ విషయముల అర్థమును నా నుండి తెలుసుకొనుటకు కోరుచున్నారా?

26 ప్రభువు మార్గములను వక్రీకరించినందుకు మీకు ఆపద! అని నేను చెప్పుచున్నాను. ఏలయనగా మీరు ఈ విషయములను గ్రహించిన యెడల, మీరు వాటిని బోధించలేదు; కావున, మీరు ప్రభువు మార్గములను చెరిపియున్నారు.

27 గ్రహించటకు మీరు మీ హృదయములను ఉపయోగించలేదు; కావున, మీరు వివేకముగా ఉండలేదు. మరి మీరు ఈ జనులకు ఏమి బోధించితిరి?

28 దానికి వారు—మేము మోషే ధర్మశాస్త్రమును బోధించియున్నామని చెప్పిరి.

29 మరలా అతడు వారితో ఇట్లనెను: మీరు మోషే ధర్మశాస్త్రమును బోధించిన యెడల, దానిని మీరెందుకు పాటించరు? మీ హృదయములను సంపదలపై ఎందుకు నిలిపియున్నారు? మీరెందుకు జారత్వములు జరిగించుచున్నారు మరియు మీ బలమును వేశ్యలతో వెచ్చించుచున్నారు? ఈ జనులు పాపము చేయునట్లు, ఈ జనులకు వ్యతిరేకముగా గొప్ప కీడును ప్రవచించుటకై ప్రభువు నన్ను పంపునట్లు ఎందుకు చేయుచున్నారు?

30 నేను సత్యము చెప్పుచున్నానని మీరెరుగరా? అవును, నేను సత్యము పలుకుచున్నానని మీరెరుగుదురు; మరియు మీరు దేవుని యెదుట వణకవలెను.

31 మీరు మోషే ధర్మశాస్త్రమును బోధించుచున్నామని చెప్పియున్నందున మీ దోషముల నిమిత్తము మీరు మొత్తబడుదరు. మోషే ధర్మశాస్త్రమును గూర్చి మీరేమి ఎరుగుదురు? మోషే ధర్మశాస్త్రము ద్వారా రక్షణ కలుగునా? మీరేమందురు?

32 దానికి వారు—మోషే ధర్మశాస్త్రము ద్వారా రక్షణ కలిగెనని చెప్పుచూ సమాధానమిచ్చిరి.

33 కానీ, అబినడై వారితో ఇట్లనెను: మీరు దేవుని ఆజ్ఞలను పాటించిన యెడల, ముఖ్యముగా సీనాయి పర్వతముపై ఇట్లు చెప్పుచూ ప్రభువు మోషేకు అప్పగించిన ఈ ఆజ్ఞలను మీరు పాటించిన యెడల మీరు రక్షింపబడుదురని నేనెరుగుదును:

34 నీ దేవుడనైన ప్రభువును నేనే, నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పించితిని.

35 నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.

36 పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు.

37 ఇప్పుడు అబినడై వారితో ఇట్లనెను, మీరు ఇవన్నియు చేసియున్నారా? లేదు, చేసియుండలేదని నేను మీతో చెప్పుచున్నాను. వారు ఈ కార్యములన్నియు చేయవలెనని మీరు ఈ జనులకు బోధించియున్నారా? లేదు, బోధించలేదని నేను మీతో చెప్పుచున్నాను.

ముద్రించు