లేఖనములు
మోషైయ 13


13వ అధ్యాయము

అబినడై దైవశక్తి ద్వారా కాపాడబడును—అతడు పది ఆజ్ఞలను బోధించును—రక్షణ కేవలము మోషే ధర్మశాస్త్రము ద్వారానే రాదు—దేవుడు తానే ఒక ప్రాయశ్చిత్తము చేసి, తన జనులను విమోచించును. సుమారు క్రీ. పూ. 148 సం.

1 ఇప్పుడు రాజు ఈ మాటలను వినినప్పుడు, అతడు తన యాజకులతో ఇట్లనెను: ఈ మనుష్యుని తీసుకువెళ్ళి సంహరించుడి; అతనితో మనకే సంబంధము లేదు, ఏలయనగా అతడు పిచ్చివాడు.

2 అంతట వారు లేచి నిలబడి బలాత్కారముగా అతడిని పట్టుకొనుటకు ప్రయత్నించిరి; కానీ, అతడు వారిని ఎదుర్కొని ఇట్లనెను:

3 నన్ను తాకవద్దు, మీరు నన్ను పట్టుకొనిన యెడల దేవుడు మిమ్ములను మొత్తును, ఏలయనగా ప్రభువు నన్ను చెప్పమని పంపిన సందేశమును నేను చెప్పలేదు లేదా నేను చెప్పవలెనని మీరు వేడుకొనిన దానిని నేను మీకు చెప్పలేదు; కావున, ఈ సమయమున నేను నాశనము చేయబడుటను దేవుడు అనుమతించడు.

4 కానీ దేవుడు నన్ను ఆజ్ఞాపించిన ఆజ్ఞలను నేను తప్పక నెరవేర్చవలెను; నేను మీతో సత్యము చెప్పియున్నందున మీరు నాతో కోపముగా ఉన్నారు. నేను దేవుని వాక్యమును పలికియున్నందున నేను పిచ్చివాడనని మీరు నన్ను తీర్పుతీర్చియున్నారు.

5 ఇప్పుడు అబినడై ఈ మాటలు పలికిన తరువాత, రాజైన నోవాహ్ జనులు అతడిని బలాత్కారముగా పట్టుకొనుటకు ధైర్యము చేయలేదు, ఏలయనగా ప్రభువు ఆత్మ అతనిపై ఉండెను; మరియు ప్రభువుతో మాట్లాడుచుండగా సీనాయి పర్వతముపై మోషేకు జరిగినట్లుగా అతని ముఖము కూడా అధిక ప్రకాశముతో ప్రకాశించెను.

6 అతడు దేవుని నుండి శక్తి, అధికారములతో పలికెను; అతడు తన మాటలను కొనసాగించుచు ఇట్లు చెప్పెను:

7 నన్ను సంహరించుటకు మీరు శక్తి కలిగిలేరని మీరు చూచుచున్నారు, కావున నేను నా సందేశమును ముగించెదను. మీ దోషములను గూర్చి నేను మీతో సత్యము చెప్పుచున్నందున అది మీ హృదయములను లోతుగా గాయపరచుచున్నదని నేను చూచుచున్నాను.

8 నా మాటలు మిమ్ములను అద్భుతముతోను, ఆశ్చర్యముతోను, కోపముతోను నింపుచున్నవి.

9 కానీ, నేను నా సందేశమును ముగించెదను; నేను రక్షింపబడిన యెడల, నేనెక్కడికి పోవుదునో అనునది ముఖ్యము కాదు.

10 కానీ ఇంతమట్టుకు మీతో చెప్పుచున్నాను, దీని తర్వాత మీరు నన్ను ఏమి చేయుదురన్నది రాబోవు పరిణామములకు సూచనగా, చిహ్నముగా ఉండును.

11 ఇప్పుడు నేను మీ కొరకు దేవుని ఆజ్ఞల శేషమును చదివెదను. ఏలయనగా అవి మీ హృదయములలో వ్రాయబడిలేవని, మీ జీవితములలో అధిక భాగము మీరు దుర్నీతిని అధ్యయనము చేసి, బోధించియున్నారని నేను చూచుచున్నాను.

12 ఇప్పుడు నేను మీతో చెప్పియున్నానని మీరు జ్ఞాపకముంచుకొనుడి: పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసుకొనకూడదు.

13 మరలా, నీవు వాటికి సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను; నన్ను ద్వేషించు వారి విషయములో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు,

14 నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యితరముల వరకు కరుణించువాడనై యున్నాను.

15 నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపువానిని నిర్దోషిగా ఎంచడు.

16 విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము.

17 ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను.

18 ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెయైనను, నీ దాసుడైనను, నీ దాసియైనను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశియైనను ఏ పనియు చేయకూడదు.

19 ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి యేడవ దినమున విశ్రమించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను.

20 నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.

21 నీవు నరహత్య చేయకూడదు.

22 వ్యభిచరింపకూడదు. దొంగిలకూడదు.

23 నీ పొరుగువాని మీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు.

24 నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు.

25 అబినడై ఈ మాటలు చెప్పుట ముగించిన తరువాత, అతడు వారితో ఇట్లనెను: ఆజ్ఞలను పాటించుటకు వారు ఈ క్రియలన్నియు చేయవలెనని ఈ జనులకు మీరు బోధించియున్నారా?

26 లేదు, అని నేను చెప్పుచున్నాను; ఏలయనగా మీరు బోధించిన యెడల, నేను వచ్చి ఈ జనులను గూర్చి కీడు ప్రవచించునట్లు ప్రభువు నన్ను పంపియుండేవాడు కాదు.

27 రక్షణ మోషే ధర్మశాస్త్రము ద్వారా వచ్చునని మీరు చెప్పియున్నారు. ఇంకను మీరు మోషే ధర్మశాస్త్రమును పాటించుట అవసరమే, కానీ మోషే ధర్మశాస్త్రమును పాటించుట ఇక ఏ మాత్రము అవసరము లేని సమయము వచ్చునని నేను మీతో చెప్పుచున్నాను.

28 అంతేకాక రక్షణ కేవలము ధర్మశాస్త్రము ద్వారానే రాదని నేను మీతో చెప్పుచున్నాను; తన జనుల పాపములు, దోషముల నిమిత్తము దేవుడు తానే చేయబోవు ప్రాయశ్చిత్తము వలన కాని యెడల, మోషే ధర్మశాస్త్రము ఉన్నప్పటికీ వారందరు తప్పక నశించిపోవలెను.

29 ఇప్పుడు ఇశ్రాయేలు సంతానమునకు ఒక ధర్మశాస్త్రము, అనగా ఒక కఠినమైన ధర్మశాస్త్రము ఇవ్వబడుట అవసరమని నేను మీతో చెప్పుచున్నాను; ఏలయనగా వారు దుష్టత్వము చేయుటకు వేగముగానుండి, వారి దేవుడైన ప్రభువును జ్ఞాపకము చేసుకొనుటకు వెనుకాడు మెడబిరుసు జనులైయున్నారు.

30 కావున వారికి ఒక ధర్మశాస్త్రము ఇవ్వబడినది, ముఖ్యముగా ఆచరణలు, విధుల యొక్క ధర్మశాస్త్రము, వారిని దేవుని యొక్కయు ఆయన యెడల వారి కర్తవ్యము యొక్కయు జ్ఞాపకమందుంచుటకు ప్రతిదినము వారు ఖచ్చితముగా పాటించవలసిన ఒక ధర్మశాస్త్రము ఇవ్వబడినది.

31 కానీ, ఈ విషయములన్నియు రాబోవు విషయముల యొక్క సూచనలైయున్నవని నేను మీతో చెప్పుచున్నాను.

32 ఇప్పుడు వారు ధర్మశాస్త్రమును గ్రహించియున్నారా? లేదు, వారందరు ధర్మశాస్త్రమును గ్రహించలేదని, ఇది వారి హృదయ కాఠిన్యమును బట్టియేనని నేను మీతో చెప్పుచున్నాను; ఏలయనగా దేవుని విమోచన ద్వారా తప్ప ఏ మనుష్యుడు రక్షింపబడలేడని వారు గ్రహించలేదు.

33 మెస్సీయ వచ్చునని, దేవుడు తన జనులను విమోచించునని మోషే వారికి ప్రవచించలేదా? లోకారంభము నుండి ప్రవచించిన ప్రవక్తలందరు ఈ విషయములను గూర్చి ఎంతో కొంత పలికియుండలేదా?

34 దేవుడు తానే నరుల సంతానము మధ్యకు దిగి రావలెనని, తనపై మానవరూపము ధరించుకొనవలెనని, భూముఖముపై గొప్పశక్తితో ముందుకు వెళ్ళవలెనని వారు చెప్పియుండలేదా?

35 ఆయన మృతుల పునరుత్థానమును తేవలెనని మరియు ఆయన హింసించబడవలెనని, బాధింపబడవలెనని కూడా వారు చెప్పియుండలేదా?

ముద్రించు