22వ అధ్యాయము
లేమనీయుల దాస్యము నుండి జనులు తప్పించుకొనుటకు ప్రణాళికలు వేయబడెను—లేమనీయులు మద్యము త్రాగించబడుదురు—జనులు తప్పించుకొని జరహేమ్లకు తిరిగి వెళ్ళి, రాజైన మోషైయ పరిపాలనలోకి వచ్చెదరు. సుమారు క్రీ. పూ. 121–120 సం.
1 ఇప్పుడు జనులు తమనుతాము దాస్యము నుండి ఎట్లు విడిపించుకొనవలెనని అమ్మోన్ మరియు రాజైన లింహై వారితో కలిసి ఆలోచించసాగిరి; మరియు జనులందరు సమకూడునట్లు వారు చేసిరి; ఆ విషయమును గూర్చి జనుల అభిప్రాయమును పొందునట్లు వారు దీనిని చేసిరి.
2 వారి స్త్రీలు, పిల్లలు, వారి గుంపులు, మందలు మరియు వారి గుడారములు తీసుకొని అరణ్యములోనికి వెడలిపోవుట తప్ప దాస్యములో నుండి తమను విడుదల చేసుకొనుటకు వారు ఏ మార్గమును కనుగొనలేకపోయిరి; ఏలయనగా లేమనీయులు అధిక సంఖ్యాకులైనందున ఖడ్గము చేత దాస్యము నుండి తమను విడిపించుకోవాలనుకొని వారితో పోరాడుట లింహై జనులకు అసాధ్యము.
3 ఇప్పుడు గిడియన్ వెళ్ళి రాజు ముందు నిలిచి, అతనితో ఇట్లనెను: ఓ రాజా, మనము మన సహోదరులైన లేమనీయులతో పోరాడుచుండినప్పుడు అనేకసార్లు మీరు నా మాటలను ఆలకించియున్నారు.
4 ఇప్పుడు ఓ రాజా, నేను అప్రయోజకుడనైన సేవకుడనని మీరు అనుకొనని యెడల లేదా ఇంతవరకు నా మాటలను ఏ మాత్రమైనను మీరు ఆలకించియుండి అవి మీకు ఉపయోగపడిన యెడల, ఈ సమయమున కూడా మీరు నా మాటలు ఆలకించవలెనని నేను కోరుచున్నాను, నేను మీ సేవకుడనై యుందును మరియు ఈ జనులను దాస్యము నుండి విడిపించెదను.
5 అప్పుడతడు మాట్లాడుటకు రాజు అనుగ్రహించెను. మరియు గిడియన్ అతనితో ఇట్లనెను:
6 పట్టణము వెనుక వైపు వెనుక గోడ గుండా ఉన్న మార్గమును చూడుము. లేమనీయులు లేదా లేమనీయుల భటులు రాత్రివేళ మత్తులైయుందురు; కావున వారు రాత్రివేళ అరణ్యములోనికి నడిపించునట్లు తమ మందలను, గుంపులను సమకూర్చుకొనవలెనని ఈ జనులందరి మధ్య మనము ఒక ప్రకటన చేయుదము.
7 మీ ఆజ్ఞ ప్రకారము నేను వెళ్ళి లేమనీయులకు మద్యము యొక్క చివరి కప్పము చెల్లించెదను మరియు వారు మత్తులైయుందురు; వారు మత్తులై నిద్రలో ఉన్నప్పుడు వారి శిబిరమునకు ఎడమ ప్రక్కగానున్న రహస్యమార్గము ద్వారా మనము వెళ్ళుదము.
8 ఆ విధముగా మనము మన స్త్రీలు, పిల్లలు, మన గుంపులు మరియు మందలతో అరణ్యములోనికి వెడలిపోవుదము; మనము షైలోమ్ దేశము చుట్టూ ప్రయాణము చేయుదము.
9 ఇప్పుడు రాజు గిడియన్ మాటలను ఆలకించెను.
10 మరియు రాజైన లింహై, తన జనులు వారి మందలను సమకూర్చునట్లు చేసెను; అతడు లేమనీయులకు మద్యము యొక్క కప్పమును పంపెను; వారికి ఎక్కువ మద్యమును బహుమానముగా కూడా పంపెను; రాజైన లింహై వారికి పంపిన మద్యమును వారు అధికముగా త్రాగిరి.
11 రాజైన లింహై జనులు తమ గుంపులతో మరియు మందలతో రాత్రివేళ అరణ్యములోనికి వెడలిపోయిరి, వారు అరణ్యములో షైలోమ్ దేశము చుట్టూ వెళ్ళి, అమ్మోన్ మరియు అతని సహోదరుల ద్వారా నడిపించబడిన వారై జరహేమ్ల దేశము వైపు తమ మార్గమును మళ్ళించిరి.
12 వారు మోయగలిగినంత బంగారము, వెండి, విలువైన వస్తువులు మరియు వారి ఆహారసామాగ్రిని కూడా వారితోపాటు అరణ్యములోనికి తీసుకొని వెళ్ళిరి; మరియు వారి ప్రయాణమును కొనసాగించిరి.
13 అరణ్యమందు అనేక దినములు ఉన్న తరువాత వారు జరహేమ్ల దేశమందు వచ్చి చేరిరి మరియు మోషైయ యొక్క జనులతో చేరి, అతని జనులైరి.
14 మోషైయ వారిని సంతోషముతో చేర్చుకొనెను; ఇంకను వారి వృత్తాంతములను మరియు లింహై జనుల చేత కనుగొనబడిన వృత్తాంతములను కూడా అతడు అందుకొనెను.
15 ఇప్పుడు లింహై జనులు రాత్రివేళ దేశము నుండి వెడలిపోయిరని లేమనీయులు కనుగొనినప్పుడు, వారిని వెంబడించుటకు వారు అరణ్యములోనికి ఒక సైన్యమును పంపిరి;
16 రెండు రోజులు వారిని వెంబడించిన తరువాత వారిక ఏమాత్రము వారి జాడలను కనుగొనలేకపోయిరి; కావున వారు అరణ్యమందు తప్పిపోయిరి.