లేఖనములు
మోషైయ 10


10వ అధ్యాయము

రాజైన లేమన్‌ మరణించును—అతని జనులు క్రూరమైన, భీకరమైన వారు మరియు తప్పుడు ఆచారములందు విశ్వసించుదురు—జెనిఫ్‌ మరియు అతని జనులు వారికి వ్యతిరేకముగా గెలిచెదరు. సుమారు క్రీ. పూ. 187–160 సం.

1 మేము మరలా రాజ్యమును స్థాపించుట మొదలుపెట్టితిమి మరియు సమాధానముతో దేశమును మరలా స్వాధీనపరచుకొనుట ఆరంభించితిమి. లేమనీయులు నా జనులకు వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు తిరిగి వచ్చు సమయమునకు సిద్ధపాటుగా నా జనుల కొరకు నేను ఆయుధములు కలిగియుండునట్లు సకల విధముల యుద్ధ ఆయుధములు తయారు చేయబడునట్లు నేను చేసితిని.

2 లేమనీయులు తిరిగి మా మీదికి రహస్యముగా వచ్చి మమ్ములను నాశనము చేయకుండునట్లు దేశము చుట్టూ నేను కావలి వారిని ఉంచితిని; ఆ విధముగా నేను నా జనులను, నా మందలను కావలి కాచితిని మరియు మా శత్రువుల చేతులలో పడకుండా వారిని కాపాడితిని.

3 మేము మా పితరుల దేశమును అనేక సంవత్సరములపాటు, అనగా ఇరువది రెండు సంవత్సరముల పాటు స్వతంత్రించుకొంటిమి.

4 పురుషులు నేలను సాగుచేసి అన్ని రకముల ధాన్యములను, అన్నిరకముల ఫలములను పండించునట్లు నేను చేసితిని.

5 స్త్రీలు నూలు వడికి, శ్రమపడి, సన్నిని నారతో సమస్త విధములైన పని చేసి, మేము మా దిగంబరత్వమును కప్పుకొనునట్లు అన్నిరకముల వస్త్రములను చేయునట్లు నేను చేసితిని; ఆ విధముగా మేము దేశమందు వర్థిల్లితిమి—ఆ విధముగా మేము ఇరువది రెండు సంవత్సరముల పాటు దేశమందు నిరంతర సమాధానము కలిగియుంటిమి.

6 ఇప్పుడు రాజైన లేమన్‌ మరణించెను, అతని స్థానములో అతని కుమారుడు పరిపాలించుట ప్రారంభించెను. అతడు తన జనులను నా జనులకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేయుటకు పురిగొల్పనారంభించెను; అందువలన వారు యుద్ధము కొరకు, నా జనులకు వ్యతిరేకముగా పోరాడుటకు సిద్ధపడుట మొదలుపెట్టిరి.

7 కానీ నేను వారికి వ్యతిరేకముగా కావలికాయునట్లు, వారు నా జనుల పైకి వచ్చి వారిని నాశనము చేయకుండునట్లు వారి సన్నాహములను కనుగొనుటకు షెమ్లోన్‌ దేశము చుట్టూ నా వేగులను పంపితిని.

8 వారు షైలోమ్ దేశమునకు ఉత్తరము వైపు అసంఖ్యాకమైన సైన్యముతో వచ్చిరి, వారి పురుషులు విల్లులు, బాణములు, ఖడ్గములు, వంపు కత్తులు, రాళ్ళు మరియు వడిసెలతో సాయుధులైయుండిరి; బోడిగా ఉండునట్లు వారి తలలను క్షౌరము చేసుకొని, వారి నడుముల చుట్టూ ఒక తోలు దట్టీ చుట్టుకొనియుండిరి.

9 ఇప్పుడు నా జనులలోని స్త్రీలు, పిల్లలు అరణ్యమందు దాచబడునట్లు నేను చేసితిని; ఆయుధములు ధరించగలిగిన నా వృద్ధులందరు, ఆయుధములు ధరించుటకు శక్తిగల నా యౌవనస్థులందరు కూడా లేమనీయులకు వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు సమకూడుకొనునట్లు నేను చేసితిని; ప్రతివానిని వాని వయస్సు ప్రకారము వారి వరుసలలో నిలిపితిని.

10 మేము లేమనీయులకు వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు వెళ్ళితిమి; నేను కూడా నా వృద్ధాప్యములో లేమనీయులకు వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు వెళ్ళితిని. ప్రభువునుండి బలము పొంది మేము యుద్ధము చేయుటకు వెళ్ళితిమి.

11 ఇప్పుడు లేమనీయులు ప్రభువును లేదా ప్రభువు యొక్క బలమును గూర్చి ఏమియు ఎరుగరు, కావున వారు తమ స్వంత బలముపై ఆధారపడిరి. అయినను మనుష్యుల బలమును బట్టి వారు బలవంతులైయుండిరి.

12 వారు క్రూరమైన, భీకరమైన, రక్తపిపాసులైన జనులైయుండి వారి పితరుల ఆచారములందు విశ్వసించిరి, అవేవనగా—వారి పితరుల దోషముల నిమిత్తము వారు యెరూషలేము దేశము నుండి తరిమి వేయబడిరని, అరణ్యమందు వారి సహోదరులు అన్యాయము చేసిరని, సముద్రమును దాటుచుండగా కూడా వారికి అన్యాయము చేసిరని వారు విశ్వసించిరి;

13 వారు సముద్రమును దాటిన తరువాత వారి ప్రథమ స్వాస్థ్యమైన దేశములోనున్నప్పుడు కూడా అన్యాయము జరిగెనని మరియు ఇదంతయు ప్రభువు ఆజ్ఞలను పాటించుటలో నీఫై అధిక విశ్వాసము కలిగియుండుటను బట్టియేనని, అతడు ప్రభువు చేత అనుగ్రహింపబడెనని, ఏలయనగా ప్రభువు అతని ప్రార్థనలను విని, వాటికి సమాధానమిచ్చెనని, అరణ్యమందు వారి ప్రయాణమును అతడు నడిపించెనని వారు నమ్మిరి.

14 అతని సహోదరులు ప్రభువు యొక్క వ్యవహారములను గ్రహించనందున అతనితో కోపముగా నుండిరి; వారు జలములపై కూడా అతనితో కోపముగా నుండిరి, ఏలయనగా వారు ప్రభువుకు వ్యతిరేకముగా తమ హృదయములను కఠినపరచుకొనిరి.

15 మరలా వారు వాగ్దానదేశములోనికి వచ్చి చేరినప్పుడు కూడా వారు అతనితో కోపముగా నుండిరి, ఏలయనగా జనులపై పరిపాలనాధికారమును వారికి చెందకుండా తీసుకొనియున్నాడని చెప్పి, వారు అతడిని చంపుటకు ప్రయత్నించిరి.

16 ప్రభువు అతనికి ఆజ్ఞాపించినట్లు అతడు అరణ్యములోనికి వెడలిపోవుచు కంచు పలకలపై చెక్కబడియున్న వృత్తాంతములను తనతో తీసుకెళ్ళెనని, వారి నుండి అతడు వాటిని దొంగిలించెనని చెప్పి మరలా వారు అతనితో కోపముగా నుండిరి.

17 ఆ విధముగా వారు, నీఫైయులను ద్వేషించవలెనని, హత్య చేయవలెనని, దోచుకొనవలెనని, కొల్లగొట్టవలెనని, వారిని నాశనము చేయుటకు తాము చేయగలిగినదంతయు చేయవలెనని వారి సంతానమునకు బోధించిరి; కావున వారు నీఫై సంతానము యెడల నిత్య ద్వేషము కలిగియుండిరి.

18 ఈ కారణము చేతనే రాజైన లేమన్‌ అతని వంచన, అబద్దపు యుక్తులు, అందమైన హామీల చేత నన్ను మోసగించెను, అందును బట్టి వారు నా జనులను నాశనము చేయునట్లు నేను వారిని ఈ దేశములోనికి తీసుకొని వచ్చితిని; మరియు మేము ఇన్ని సంవత్సరములు ఈ దేశమందు బాధపడితిమి.

19 ఇప్పుడు జెనిఫ్‌ అను నేను, లేమనీయులను గూర్చి ఈ విషయములన్నియు నా జనులకు చెప్పిన తరువాత, ప్రభువు నందు విశ్వాసముంచి తమ బలముతో యుద్ధమునకు వెళ్ళుటకు వారిని ఉద్రేకపరచితిని; కావున, మేము వారితో ముఖాముఖిగా పోరాడితిమి.

20 మేము మరలా వారిని మా దేశము నుండి తరిమివేసితిమి; మరియు లెక్కించలేనంతమందిని మేము సంహరించితిమి.

21 తరువాత మేము మా స్వంత దేశమునకు తిరిగి వచ్చితిమి, మరలా నా జనులు వారి మందలను కాయుట, వారి భూమిని సాగుచేసుకొనుట మొదలుపెట్టిరి.

22 ఇప్పుడు నేను వృద్ధుడనైనందున నా కుమారులలో ఒకరికి రాజ్యమును అనుగ్రహించితిని; కావున, నేనిక ఏమాత్రము మాట్లాడను. ప్రభువు నా జనులను ఆశీర్వదించుగాక. ఆమేన్‌.

ముద్రించు