లేఖనములు
మోషైయ 8


8వ అధ్యాయము

లింహై జనులకు అమ్మోన్‌ బోధించును—అతడు ఇరువది నాలుగు జెరెడీయుల పలకలను గూర్చి తెలుసుకొనును—ప్రాచీన గ్రంథములు దీర్ఘదర్శుల ద్వారా అనువాదము చేయబడవచ్చును—దీర్ఘదర్శకత్వము కంటే ఏ బహుమానము గొప్పది కాదు. సుమారు క్రీ. పూ. 121 సం.

1 రాజైన లింహై తన జనులతో మాట్లాడుట ముగించిన తరువాత—ఏలయనగా అతడు వారితో అనేక విషయములు మాట్లాడెను, వాటిలో కొద్ది వాటిని మాత్రమే నేను ఈ గ్రంథమందు వ్రాసియున్నాను—అతడు తన జనులకు జరహేమ్ల దేశమందున్న వారి సహోదరులను గూర్చి అన్ని సంగతులు చెప్పెను.

2 సమూహము యెదుట అమ్మోన్‌ నిలువబడునట్లు అతడు చేసెను మరియు జెనిఫ్‌, దేశమును వదలి వచ్చిన సమయము నుండి అమ్మోన్, దేశము నుండి బయటకు వచ్చిన సమయము వరకు వారి సహోదరులకు జరిగినదానంతటిని వారికి చెప్పునట్లు చేసెను.

3 రాజైన బెంజమిన్ వారికి బోధించిన ఆ చివరి మాటలను కూడా అతడు వారికి చెప్పెను మరియు అతడు పలికిన మాటలన్నియు వారు గ్రహించగలుగునట్లు వాటిని రాజైన లింహై యొక్క జనులకు వివరించెను.

4 అతడు ఇదంతయు చేసిన తరువాత రాజైన లింహై సమూహమును పంపివేసెను మరియు ప్రతిఒక్కరు తన స్వంత గృహమునకు వెళ్ళునట్లు చేసెను.

5 వారు జరహేమ్ల దేశమును వదిలి వచ్చిన సమయము నుండి అతని జనుల వృత్తాంతమును కలిగియున్న పలకలను అమ్మోన్‌ చదువగలుగునట్లు అతని యొద్దకు తెప్పించెను.

6 ఇప్పుడు అమ్మోన్‌ ఆ వృత్తాంతమును చదివిన వెంటనే అతడు భాషలకు అర్థము చెప్పగలడేమో తెలుసుకొనుటకు రాజు అతడిని విచారించగా, తాను చెప్పలేనని అమ్మోన్‌ అతనికి చెప్పెను.

7 రాజు అతనితో ఇట్లనెను: నా జనుల శ్రమల నిమిత్తము బాధించబడినవాడనై, జరహేమ్ల దేశమును కనుగొని మమ్ములను దాస్యములో నుండి విడిపించమని మేము మా సహోదరులకు మొరపెట్టుకొనునట్లు నా జనులలో నుండి నలుబది ముగ్గురిని నేను అరణ్యములోనికి పంపితిని.

8 వారు అనేక దినముల పాటు అరణ్యమందు తప్పిపోయిరి, అయినప్పటికీ వారు శ్రద్ధగానుండిరి మరియు జరహేమ్ల దేశమును కనుగొనలేదు, కాని అనేక జలముల మధ్యనున్న ఒక దేశమందు ప్రయాణించియుండి, మనుష్యుల యొక్కయు అడవి జంతువుల యొక్కయు ఎముకలతో మరియు ప్రతి విధమైన భవనముల యొక్క శిథిలములతో కప్పబడియున్న దేశమును కనుగొనియుండి, ఇశ్రాయేలు యొక్క అన్ని గోత్రములంతగా అధిక సంఖ్యాకులైయున్న జనులతో నిండియున్న దేశమును కనుగొని ఈ దేశమునకు తిరిగివచ్చిరి.

9 వారు చెప్పిన విషయములు సత్యమనుటకు సాక్ష్యముగా వారు చెక్కడములతో నిండిన ఇరువది నాలుగు పలకలను తెచ్చిరి, అవి మేలిమి బంగారముతో చేయబడియున్నవి.

10 ఇంకను వారు వక్షస్థల కవచములను తెచ్చిరి, అవి పెద్దగా, పరిపూర్ణముగా ఉండి కంచు మరియు రాగితో చేయబడినవి.

11 మరియు వారు ఖడ్గములను తెచ్చియుండిరి, వాటి పిడులు విరిగిపోయి వాటి అలుగులు తుప్పు చేత తినివేయబడియుండెను; పలకలపై ఉన్న చెక్కడములకు లేదా భాషకు అర్థము చెప్పగలిగిన వాడెవడును దేశమందు లేకుండెను. కావున, నీవు అనువాదము చేయగలవా? అని నేను నిన్నడిగితిని.

12 మరలా నేను నీతో చెప్పుచున్నాను: అనువాదము చేయగలవారెవరినైనను నీవెరుగుదువా? ఏలయనగా ఈ వృత్తాంతములు మా భాషలోనికి అనువాదము చేయబడవలెనని నేను కోరుచున్నాను; బహుశా అవి ఈ గ్రంథములు ఎక్కడినుండి వచ్చినవను జ్ఞానమును మరియు నాశనము చేయబడిన జనుల యొక్క శేషమును గూర్చిన జ్ఞానమును ఇవ్వవచ్చును; లేదా నాశనము చేయబడిన ఈ జనులను గూర్చిన జ్ఞానమును అవి మనకు ఇవ్వవచ్చును; వారి నాశనమునకు గల కారణమును నేను తెలుసుకొనగోరుచున్నాను.

13 అప్పుడు అమ్మోన్‌ అతనితో ఇట్లనెను: ఓ రాజా, గ్రంథములను అనువాదము చేయగలిగిన ఒక మనుష్యుని గూర్చి నేను నీకు నమ్మకముగా చెప్పగలను; ఏలయనగా అతడు అందులోనికి చూచి ప్రాచీన కాలమునకు చెందిన గ్రంథములన్నిటినీ అనువాదము చేయగలునట్లు ఒక సాధనమును కలిగియున్నాడు మరియు అది దేవుని నుండి బహుమానమైయున్నది. అవి అనువాదకారకములని పిలువబడినవి మరియు అతడు ఆజ్ఞాపించబడితే తప్ప ఏ మనుష్యుడూ వాటిలోనికి చూడలేడు, లేని యెడల అతడు చూడకూడని వాటి కొరకు చూచి, నశించును. వాటిలోనికి చూడవలెనని ఆజ్ఞాపించబడు వాడే దీర్ఘదర్శి అని పిలువబడును.

14 జరహేమ్ల దేశమందున్న జనుల యొక్క రాజు ఈ కార్యములు చేయుటకు ఆజ్ఞాపించబడిన మనుష్యుడు, అతడు దేవుని నుండి ఈ ఉన్నతమైన బహుమానమును పొందియున్నాడు.

15 అప్పుడు రాజు, దీర్ఘదర్శి ఒక ప్రవక్త కన్నా గొప్పవాడని చెప్పెను.

16 దీర్ఘదర్శి ఒక బయల్పాటుదారుడు, ప్రవక్త కూడా అయ్యున్నాడని అమ్మోన్‌ చెప్పెను; మరియు దేవుని శక్తిని మించిన గొప్ప బహుమానమేదియు లేదు, దానిని ఏ మనుష్యుడు పొందలేడు; అయినప్పటికీ, దేవుని నుండి ఇవ్వబడిన గొప్పశక్తిని మనుష్యుడు కలిగియుండవచ్చును.

17 కానీ దీర్ఘదర్శి జరిగిపోయిన విషయములను గూర్చి, రాబోవు విషయములను గూర్చి కూడా తెలుసుకొనగలడు, వారి ద్వారా సమస్త విషయములు బయలుపరచబడును లేదా రహస్యమైన విషయములు విశదము చేయబడును, దాచబడిన విషయములు వెలుగులోనికి వచ్చును, తెలియబడని విషయములు వారి ద్వారా తెలియజేయబడును మరియు మరేవిధముగా తెలియజాలని విషయములు కూడా వారి ద్వారా తెలియజేయబడును.

18 ఆ విధముగా మనుష్యుడు విశ్వాసము ద్వారా గొప్ప అద్భుతములను చేయునట్లు దేవుడు ఒక సాధనము దయచేసెను; కావున, అతడు తన తోటివారికి గొప్ప ప్రయోజనకారుడగును.

19 ఇప్పుడు అమ్మోన్‌ ఈ మాటలను చెప్పుట ముగించినప్పుడు రాజు మిక్కిలి సంతోషించి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచూ ఇట్లనెను: నిస్సందేహముగా ఈ పలకల యందు గొప్ప మర్మమున్నది, ఈ అనువాదకారకములు నరుల సంతానమునకు ఆ మర్మములన్నిటిని బయలుపరచు ఉద్దేశ్యము కొరకు సిద్ధము చేయబడియున్నవి.

20 ఆహా, ప్రభువు కార్యములు ఎంత అద్భుతమైనవి! ఆయన తన జనులను దీర్ఘకాలము సహించును; నరుల సంతానము యొక్క అవగాహనలు గృడ్డివి మరియు అస్పష్టమైనవి; ఏలయనగా వారు జ్ఞానమును వెదకరు లేదా ఆమె వారిపై పరిపాలన చేయాలని వారు కోరరు.

21 వారు కాపరి నుండి దూరముగా పరుగెత్తి, చెదిరిపోయి, తరుమబడి, అడవి మృగములచే తినివేయబడు అడవి మంద వలే ఉన్నారు.

ముద్రించు