10వ అధ్యాయము
ప్రభువు నీఫైకి ముద్రవేయు అధికారమునిచ్చును—భూమిపైన మరియు పరలోకమందు బంధించుటకు, విప్పుటకు అతడికి అధికారమివ్వబడెను—జనులను పశ్చాత్తాపపడమని లేదా నశించమని అతడు ఆజ్ఞాపించును—ఆత్మ అతడిని సమూహము నుండి సమూహమునకు కొనిపోవును. సుమారు క్రీ. పూ. 21–20 సం.
1 అప్పుడక్కడి జనుల మధ్య ఒక చీలిక ఏర్పడెను, ఎంతగాననగా వారు ఇటు-అటు చీలిపోయిరి మరియు నీఫై వారి మధ్య నిలిచియుండగా, అతడిని ఒంటరిగా వదిలి వారి దారిన వారు వెళ్ళిరి.
2 ప్రభువు అతనికి చూపిన సంగతులను ధ్యానించుచూ నీఫై తన ఇంటి వైపు వెళ్ళెను.
3 అతడు ఆ విధముగా ధ్యానించుచుండగా—నీఫైయుల దుష్టత్వము, రహస్యమైన వారి అంధకార క్రియలు, వారి హత్యలు, దోపిడీలు మరియు సమస్త విధములైన దుర్ణీతులను బట్టి అధికముగా క్రుంగెను. అతడు ఆ విధముగా అతని హృదయమందు ధ్యానించుచుండగా, ఒక స్వరము అతనికి ఇట్లు వినిపించెను:
4 నీఫై, నీవు చేసిన క్రియల నిమిత్తము నీవు ధన్యుడవు; ఏలయనగా నేను నీకు ఇచ్చిన వాక్యమును ఈ జనులకు నీవు అలసట లేకుండా ఎట్లు ప్రకటించియున్నావో నేను చూచియున్నాను. నీవు వారికి భయపడలేదు మరియు నీ ప్రాణమును కోరలేదు, కానీ నా చిత్తమును, నా ఆజ్ఞలను నెరవేర్చవలెనని కోరితివి.
5 దీనిని నీవు ఎట్టి అలసట లేకుండా చేసియున్నందున, ఇదిగో నేను నిన్ను నిరంతరము ఆశీర్వదించెదను; నేను మాట యందు, చేత యందు, విశ్వాసమందు మరియు క్రియల యందు నిన్ను బలవంతునిగా చేయుదును. నీ మాట ప్రకారము అన్ని సంగతులు నీకు చేయబడును, ఏలయనగా నా చిత్తమునకు వ్యతిరేకమైన దానిని నీవు అడుగవు.
6 ఇదిగో నీవు నీఫైవి మరియు నేను దేవుడను. నీవు ఈ జనులపై అధికారము కలిగియుందువని మరియు ఈ జనుల యొక్క దుష్టత్వమును బట్టి భూమిని కరువుతో, వ్యాధితో, నాశనముతో కొట్టుదువని నా దూతల సముఖమందు నేను నీకు ప్రకటించుచున్నాను.
7 నేను నీకు అధికారమిచ్చుచున్నాను, నీవు భూమిపై దేనిని ముద్రించుదువో, అది పరలోకమందు ముద్రించబడును మరియు నీవు భూమిపై దేనిని విప్పుదువో, అది పరలోకమందు విప్పబడును; ఆ విధముగా నీవు ఈ జనుల మధ్య అధికారము కలిగియుందువు.
8 ఆ విధముగా ఈ దేవాలయము రెండుగా చీలిపోవలెనని నీవు చెప్పిన యెడల, అది చేయబడును.
9 మరియు నీవు క్రిందికి పడుము, నున్నగా అగుమని నీవు ఈ పర్వతమునకు చెప్పిన యెడల, అది చేయబడును.
10 ఇదిగో దేవుడు ఈ జనులను కొట్టునని నీవు చెప్పిన యెడల, అది జరుగును.
11 ఇప్పుడు నీవు వెళ్ళి—మీరు పశ్చాత్తాపపడని యెడల, నాశనమగునంతగా మీరు కొట్టబడుదురని సర్వశక్తిమంతుడును, ప్రభువునైన దేవుడు చెప్పుచున్నాడని ఈ జనులకు ప్రకటించమని నేను నిన్ను ఆజ్ఞాపించుచున్నాను.
12 మరియు ప్రభువు నీఫైతో ఈ మాటలు చెప్పినప్పుడు అతడు ఆగి, అతని ఇంటికి వెళ్ళకుండా దేశమందు చెదిరియున్న సమూహముల యొద్దకు తిరిగి వెళ్ళెను మరియు వారు పశ్చాత్తాపపడని యెడల, వారి నాశనమును గూర్చి అతనికి చెప్పబడిన ప్రభువు యొక్క వాక్యమును వారికి ప్రకటించుట మొదలుపెట్టెను.
13 ఇప్పుడు ప్రధాన న్యాయాధిపతి యొక్క మరణమును గూర్చి వారికి చెప్పుట ద్వారా నీఫై గొప్ప అద్భుతకార్యము చేసినప్పటికీ, వారి హృదయములను వారు కఠినపరచుకొనిరి మరియు ప్రభువు యొక్క వాక్యములను ఆలకించకుండిరి.
14 కావున నీఫై వారికి ఇట్లు చెప్పుచూ ప్రభువు యొక్క వాక్యము ప్రకటించెను: మీరు పశ్చాత్తాపపడని యెడల, మీరు నాశనమగునంతగా కొట్టబడుదురని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
15 మరియు నీఫై వారికి వాక్యము ప్రకటించినప్పుడు, వారింకను తమ హృదయములను కఠినపరచుకొని అతని మాటలను ఆలకించకుండిరి; కావున వారు అతనికి వ్యతిరేకముగా దూషించి, అతడిని చెరసాలలో పడవేయునట్లు అతనిపై వారి చేతులు వేయుటకు ప్రయత్నించిరి.
16 కానీ దేవుని శక్తి అతనితోనుండెను మరియు అతడిని చెరసాలలో వేయుటకు వారతడిని పట్టుకొనలేకపోయిరి, ఏలయనగా అతడు ఆత్మ చేత తీసుకొనబడి, వారి మధ్య నుండి దూరముగా కొనిపోబడెను.
17 మరియు సమూహము నుండి సమూహమునకు దేవుని వాక్యము ప్రకటించుచూ, అతడు వారందరికీ దానిని ప్రకటించినంత వరకు లేదా జనులందరి మధ్య దానిని ముందుకు పంపు వరకు కూడా ఆ విధముగా ఆత్మ యందు ముందుకు సాగెను.
18 జనులు అతని మాటలను ఆలకించలేదు; మరియు వారి మధ్య వివాదములుండుట మొదలాయెను, ఎంతగాననగా వారు తమకు వ్యతిరేకముగా తాము విభజింపబడియుండి, ఒకరినొకరు ఖడ్గముతో సంహరించసాగిరి.
19 ఆ విధముగా నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క డెబ్బది ఒకటవ సంవత్సరము ముగిసెను.