లేఖనములు
హీలమన్ 7


హీలమన్‌ కుమారుడైన నీఫై యొక్క ప్రవచనము—వారి దుష్టత్వము నిమిత్తము వారు పశ్చాత్తాపపడని యెడల, వారిని సంపూర్ణముగా నాశనము చేయునట్లు తన కోపముతో వారిని దర్శించెదనని దేవుడు నీఫై జనులను హెచ్చరించును. దేవుడు నీఫై జనులను తెగుళ్ళతో కొట్టును; వారు పశ్చాత్తాపపడి, ఆయన తట్టు తిరుగుదురు. లేమనీయుడైన సమూయేలు నీఫైయులకు ప్రవచించును.

7 నుండి 16 అధ్యాయములు కలిగియున్నవి.

7వ అధ్యాయము

నీఫై ఉత్తర దేశమందు తిరస్కరించబడి, జరహేమ్లకు తిరిగి వచ్చును—అతడు తన తోటయందున్న గోపురముపై ప్రార్థన చేసిన తరువాత, పశ్చాత్తాపపడుటకు లేదా నశించుటకు జనులకు పిలుపునిచ్చును. సుమారు క్రీ. పూ. 23–21 సం.

1 ఇప్పుడు నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క అరువది తొమ్మిదవ సంవత్సరమందు హీలమన్‌ కుమారుడైన నీఫై ఉత్తరము వైపునున్న దేశము నుండి జరహేమ్ల దేశమునకు తిరిగి వచ్చెను.

2 ఏలయనగా అతడు ఉత్తరము వైపునున్న దేశమందున్న జనుల మధ్య ప్రయాణించుచూ వారికి దేవుని వాక్యమును బోధించెను మరియు వారికి అనేక సంగతులు ప్రవచించెను;

3 వారతని మాటలన్నిటిని తిరస్కరించిరి, ఎంతగాననగా అతడు వారి మధ్య నిలిచియుండలేక తన జన్మస్థలమైన దేశమునకు తిరిగి వచ్చెను.

4 జనులు అట్టి భయంకరమైన దుర్మార్గపు స్థితియందు ఉండుటను, ఆ గాడియాంటన్‌ దొంగలు దేశముపై శక్తిని, అధికారమును ఆక్రమించుకొని న్యాయపీఠములను అధిష్టించుచూ దేవుని ఆజ్ఞలను ప్రక్కకు త్రోసివేయుచూ, ఆయన యెదుట ఏ మాత్రము సవ్యముగా లేకుండా, నరుల సంతానమునకు ఏ న్యాయము చేయకుండుటను చూచెను;

5 నీతిమంతులను వారి నీతి నిమిత్తము శిక్షించుచూ, వారి ధనమును బట్టి దోషులు మరియు దుర్మార్గులు శిక్షింపబడకుండా వారిని వదిలివేయుచూ, ఇంకను వారు లాభమును, లోక మహిమను సంపాదించునట్లు మరియు వారు మరింత సులభముగా వ్యభిచరించి, దొంగిలించి, చంపి, వారి స్వంత చిత్తములను బట్టి చేయునట్లు పరిపాలించి, వారి ఇష్టప్రకారము చేయుటకు ప్రభుత్వమందు అధికార స్థానములో ఉండుటను చూచెను—

6 ఇప్పుడు ఈ గొప్ప దోషము కొద్ది సంవత్సరముల సమయములోనే నీఫైయులపై వచ్చెను; నీఫై దానిని చూచినప్పుడు అతని రొమ్ము నందు అతని హృదయము దుఃఖముతో నిండెను మరియు తన ఆత్మ యొక్క వేదన యందు అతడిట్లు పలికెను:

7 అయ్యో! నా పితరుడైన నీఫై యెరూషలేము దేశమునుండి మొదట బయటకు వచ్చినప్పటి దినముల యందు నేను జీవించియున్న మేలు, నేను అతనితో వాగ్దాన దేశమందు ఆనందించియుండేవాడిని; ఆ కాలములో అతని జనులు సులభముగా ఒప్పించబడిరి, దేవుని ఆజ్ఞలు నెరవేర్చుటలో దృఢముగా, దుర్నీతిని చేయుటకై నడిపించబడుటలో ఆలస్యముగానుండిరి మరియు వారు ప్రభువు మాటలను ఆలకించుటకు వేగముగా ఉండిరి—

8 ఆ దినములయందు నేను జీవించియున్న యెడల, అప్పుడు నా ఆత్మ నా సహోదరుల నీతియందు సంతోషించియుండేది.

9 కానీ ఇదిగో, ఇవి నా దినములని, నా ఆత్మ నా సహోదరుల యొక్క ఈ దుష్టత్వమును బట్టి దుఃఖముతో నింపబడవలెనని నాకు నియమించబడియున్నది.

10 ఇప్పుడు అది జరహేమ్ల పట్టణమందున్న ముఖ్యమైన అంగడికి నడిపించు రహదారి ప్రక్కనున్న నీఫై యొక్క తోటయందున్న ఒక గోపురముపై అయ్యుండెను; కావున నీఫై తన తోటయందున్న గోపురముపై మోకరించి ప్రార్థించెను, ఆ గోపురము రహదారి ప్రక్కనున్న తోట ద్వారమునకు దగ్గరగానుండెను.

11 అటు ప్రక్కగా నడిచి వెళ్ళుచున్న కొందరు మనుష్యులు, గోపురముపై దేవునికి తన ఆత్మను క్రుమ్మరించుచున్న నీఫైని చూచిరి; వారు పరుగెత్తుకొని పోయి, వారు చూచిన దానిని జనులకు చెప్పిరి మరియు జనుల దుష్టత్వము నిమిత్తము అంత అధిక దుఃఖమునకు కారణమును వారు తెలుసుకొనునట్లు జనులు సమూహములుగా సమకూడి వచ్చిరి.

12 నీఫై పైకి లేచినప్పుడు, అతడు సమకూడిన జన సమూహములను చూచెను.

13 అతడు నోరు తెరచి వారితో ఇట్లనెను: మీరెందుకు సమకూడియున్నారు? నేను మీ దోషములను గూర్చి మీకు చెప్పవలెననియా?

14 మీ దోషముల నిమిత్తము నా హృదయ వేదనను బట్టి, నేను నా దేవునికి నా ఆత్మను క్రుమ్మరించునట్లు నా గోపురము పైకి ఎక్కియున్నందుకా?

15 నా దుఃఖ విలాపములను బట్టి మీరు సమకూడి, ఆశ్చర్యపడుచున్నారు; మీరు మిక్కిలి ఆశ్చర్యపడవలసిన అవసరమున్నది; అపవాది మీ హృదయములపై అంత గొప్ప పట్టు కలిగియుండునట్లు మిమ్ములను మీరు అప్పగించుకొని యున్నందున, మీరు ఆశ్చర్యపడవలసియున్నది.

16 నిత్య దౌర్భాగ్యము మరియు అంతములేని శ్రమగల ప్రదేశమునకు మీ ఆత్మలను పంపుటకు ప్రయత్నించుచున్న వాని ప్రలోభములకు మీరెట్లు లొంగిపోయిరి?

17 పశ్చాత్తాపపడుడి, మీరు పశ్చాత్తాపపడుడి! మీరెందుకు మరణించెదరు? తిరుగుడి, మీ దేవుడైన ప్రభువు వైపు మీరు తిరుగుడి. ఆయన మిమ్ములను ఎందుకు విడిచియున్నాడు?

18 ఎందుకనగా మీరు మీ హృదయములను కఠినపరచుకొనియున్నారు; మీరు మంచి కాపరి యొక్క స్వరమును ఆలకించరు; మీకు వ్యతిరేకముగా మీరు ఆయనను కోపమునకు పురిగొల్పియున్నారు.

19 మీరు పశ్చాత్తాపపడని యెడల, మిమ్ములను సమకూర్చుటకు బదులుగా మీరు కుక్కలకు, అడవి మృగములకు ఆహారమగునట్లు ఆయన మిమ్ములను చెదరగొట్టును.

20 ఆయన మిమ్ములను విడిపించిన దినమందే మీరెట్లు మీ దేవుడిని మరచిపోతిరి?

21 ఇదిగో, లాభము పొందుటకు, మనుష్యుల చేత పొగడబడుటకు, వెండి బంగారములను సంపాదించుటకు మీరిట్లు చేసియున్నారు. మీరు మీ హృదయములను సంపదలపై, ఈ లోకము యొక్క వ్యర్థమైన వస్తువులపై ఉంచియున్నారు, దాని కొరకు మీరు హత్య చేయుదురు, దోచుకొందురు, దొంగిలించెదరు, మీ పొరుగువానికి వ్యతిరేకముగా అబద్ధసాక్ష్యము పలుకుదురు మరియు సమస్త విధమైన దుర్నీతిని చేయుదురు.

22 ఈ హేతువు నిమిత్తము మీరు పశ్చాత్తాపపడని యెడల, మీకు ఆపద. ఏలయనగా మీరు పశ్చాత్తాపపడని యెడల, ఇదిగో ఈ గొప్ప పట్టణము మరియు మన స్వాధీన దేశమందున్నవి, అలాగే చుట్టూ ఉన్న ఆ గొప్ప పట్టణములన్నియు కూడా వాటియందు మీకిక ఏ మాత్రము స్థలము లేకుండునట్లు తీసివేయబడును; ఏలయనగా ఆయన ఇదివరకు చేసియున్నట్లుగా మీ శత్రువులను ఎదుర్కొనుటకు ప్రభువు మీకు శక్తిని అనుగ్రహించడు.

23 ఏలయనగా ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు: వారి పాపముల విషయమై పశ్చాత్తాపపడి నా మాటలకు చెవియొగ్గిన వారికి తప్ప, ఒకని కంటే ఎక్కువగా ఇంకొక దుష్టునికి నేను నా శక్తిని చూపను. కావున ఇప్పుడు నా సహోదరులారా, మీరు పశ్చాత్తాపపడని యెడల మీ కంటే లేమనీయులకు మేలుగా ఉండునని మీరు గ్రహించవలెనని నేను కోరుచున్నాను.

24 ఏలయనగా వారు మీ కంటే అధిక నీతిమంతులు, మీరు పొందిన ఆ గొప్ప జ్ఞానమునకు వ్యతిరేకముగా వారు పాపము చేసియుండలేదు; కావున ప్రభువు వారి పట్ల కనికరము కలిగియుండును; మీరు పశ్చాత్తాపపడితే తప్ప, మీరు పూర్తిగా నాశనము చేయబడినప్పుడు కూడా ఆయన వారి దినములను పొడిగించును మరియు వారి సంతానమును వృద్ధి చేయును.

25 మీ మధ్య వచ్చిన ఆ గొప్ప హేయక్రియను బట్టి మీకు ఆపద; మీరు దానితో, అనగా గాడియాంటన్‌ చేత స్థాపించబడిన ఆ రహస్య ముఠాతో మిమ్ములను ఐక్యపరచుకొనియున్నారు.

26 మీ హృదయములలోనికి ప్రవేశించుటకు మీరు అనుమతించిన ఆ గర్వమును బట్టి మీకు ఆపద, మీ అమితమైన సంపదలను బట్టి, మంచిదైన దాని నుండి దూరముగా అది మిమ్ములను కొనిపోయినది.

27 మీ దుష్టత్వము మరియు హేయక్రియలను బట్టి మీకు ఆపద!

28 మీరు పశ్చాత్తాపపడని యెడల, మీరు నశించెదరు; మీ దేశములు కూడా మీ నుండి తీసుకొనబడును మరియు మీరు భూముఖము పైనుండి నాశనము చేయబడుదురు.

29 ఇప్పుడు ఈ క్రియలు జరుగునని నాకై నేను చెప్పుట లేదు, ఏలయనగా నాకై నేను ఈ సంగతులను ఎరుగలేదు; కానీ ప్రభువైన దేవుడు వాటిని నాకు తెలియజేసియున్నందున ఈ సంగతులు సత్యమని నేనెరుగుదును, కావున అవి జరుగునని నేను సాక్ష్యమిచ్చుచున్నాను.

ముద్రించు