లేఖనములు
హీలమన్ 9


9వ అధ్యాయము

న్యాయపీఠము వద్ద ప్రధాన న్యాయాధిపతి మరణించియుండుటను వార్తాహరులు కనుగొందురు—వారు చెరసాలలో వేయబడి, తరువాత విడుదల చేయబడుదురు—నీఫై ప్రేరేపణ ద్వారా సియాంటమ్‌ను హంతకునిగా గుర్తించును—కొంతమంది చేత నీఫై ఒక ప్రవక్తగా అంగీకరించబడును. సుమారు క్రీ. పూ. 23–21 సం.

1 నీఫై ఈ మాటలను పలికినప్పుడు వారి మధ్యనున్న కొందరు మనుష్యులు న్యాయపీఠము యొద్దకు పరుగెత్తిరి; అక్కడకు వెళ్ళిన వారు ఐదుగురు ఉండిరి మరియు వారు వెళ్ళుచూ తమలోతాము ఇట్లనుకొనిరి:

2 ఇప్పుడు ఈ మనుష్యుడు ఒక ప్రవక్తయో కాదో మరియు మనకు అట్టి ఆశ్చర్యకరమైన సంగతులను ప్రవచించుటకు దేవుడు అతడిని ఆజ్ఞాపించెనో లేదో మనము నిశ్చయముగా ఎరిగెదము. ఇదిగో ఆయన ఆజ్ఞాపించియుండెనని మనము విశ్వసించము; అతడు ఒక ప్రవక్తయని మనము విశ్వసించము; అయినప్పటికీ, ప్రధాన న్యాయాధిపతిని గూర్చి అతడు చెప్పిన ఈ సంగతి సత్యమై అతడు మరణించిన యెడల, అప్పుడు అతడు పలికిన ఇతర మాటలు సత్యమైనవని మనము విశ్వసించెదము.

3 మరియు వారు తమ బలముకొద్దీ పరుగెత్తి న్యాయపీఠము వద్దకు రాగా, ప్రధాన న్యాయాధిపతి నేల మీద రక్తపుమడుగులో పడియుండెను.

4 ఇప్పుడు వారు దీనిని చూచినప్పుడు నేలపై పడిపోవునంతగా మిక్కిలి ఆశ్చర్యపడిరి; ఏలయనగా ప్రధాన న్యాయాధిపతిని గూర్చి నీఫై పలికిన మాటలను వారు విశ్వసించియుండలేదు.

5 కానీ ఇప్పుడు వారు దానిని చూచినప్పుడు, వారు విశ్వసించిరి మరియు నీఫై పలికిన తీర్పులన్నీ జనులపై వచ్చునేమోనను భయము వారికి కలిగెను; కావున వారు వణికి, నేలపై పడిరి.

6 ఇప్పుడు న్యాయాధిపతి అతని సహోదరుని చేత ఒక రహస్యపు ఉడుపు ద్వారా పొడువబడెను మరియు అతడు పారిపోయెను; ఈ హత్య చేయబడినప్పుడు వెంటనే సేవకులు పరుగెత్తి, వారి మధ్య జరిగిన హత్యను గూర్చి కేక వేయుచూ జనులకు చెప్పిరి.

7 మరియు జనులు న్యాయపీఠము యొద్ద సమకూడుకొనిరి—నేలపై పడిన ఆ ఐదుగురు మనుష్యులను చూచి వారు ఆశ్చర్యపడిరి.

8 ఇప్పుడు నీఫై యొక్క తోట వద్ద సమకూడిన సమూహమును గూర్చి ఆ జనులు ఏమియూ ఎరుగరు; కావున వారు తమలోతాము ఇట్లనుకొనిరి: న్యాయాధిపతిని హత్య చేసినవారు ఈ మనుష్యులే, వారు మన నుండి పారిపోకుండునట్లు దేవుడు వారిని కొట్టియున్నాడు.

9 అప్పుడు వారు వారిని పట్టుకొని బంధించి, చెరసాలలో వేసిరి. మరియు న్యాయాధిపతి సంహరింపబడెనని, హంతకులు పట్టుకొనబడి చెరసాలలో వేయబడిరని ఒక ప్రకటన అన్ని వైపులా పంపబడెను.

10 ఉదయమున జనులు సంహరింపబడిన ఘనుడైన ప్రధాన న్యాయాధిపతి యొక్క సమాధివద్ద దుఃఖించుటకు, ఉపవాసము చేయుటకు తమను సమావేశపరచుకొనిరి.

11 అందువలన నీఫై యొక్క తోటవద్ద ఉండి, అతని మాటలు వినిన ఆ న్యాయాధిపతులు కూడా సమాధివద్ద సమకూడిరి.

12 ప్రధాన న్యాయాధిపతి మరణించెనాయని అతని గూర్చి విచారించుటకు పంపబడిన ఐదుగురు ఎక్కడున్నారు? అని వారు జనులను విచారించిరి. దానికి వారు—మీరు పంపియున్నారని చెప్పిన ఆ ఐదుగురిని గూర్చి మేము ఎరుగము; కానీ ఐదుగురు హంతుకులను మేము చెరసాలలో వేసితిమని బదులిచ్చిరి.

13 అంతట వారు తేబడవలెనని న్యాయాధిపతులు కోరగా, వారు తేబడిరి మరియు వారు, పంపబడిన ఆ ఐదుగురైయుండిరి; ఇప్పుడు జరిగిన దానిని గూర్చి తెలుసుకొనుటకు న్యాయాధిపతులు వారిని విచారించగా, ఇట్లనుచూ వారు చేసినదంతయు వారికి చెప్పిరి:

14 మేము పరుగెత్తి న్యాయపీఠము యొద్దకు రాగా, నీఫై సాక్ష్యమిచ్చినట్లుగా జరిగిన అన్నిసంగతులను చూచినప్పుడు మేము ఆశ్చర్యముతో నేలపై పడితిమి; మరియు మేము ఆశ్చర్యము నుండి తేరుకొనినప్పుడు, వారు మమ్ములను చెరసాలలో వేసిరి.

15 ఇప్పుడు ఈ మనుష్యుని హత్య చేసినదెవరో మేము ఎరుగము; మేము కేవలము ఇంతమట్టుకు ఎరుగుదుము, మీరు కోరిన ప్రకారము మేము పరుగెత్తి వచ్చి చూడగా, నీఫై మాటల ప్రకారము అతడు మరణించియుండెను.

16 ఇప్పుడు న్యాయాధిపతులు విషయమును జనులకు వివరించి, నీఫైకి వ్యతిరేకముగా ఇట్లు చెప్పుచూ బిగ్గరగా కేకవేసిరి: ఇదిగో, అతడు మనలను అతని విశ్వాసమునకు మార్చగలుగునట్లు, తనను గొప్పవానిగా, దేవుని చేత ఎన్నుకొనబడిన వానిగా మరియు ఒక ప్రవక్తగా హెచ్చించుకొనునట్లు ఈ నీఫై న్యాయాధిపతిని సంహరించుటకు ఒక మనుష్యునితో ఒప్పందము చేసుకొని, ఆ తరువాత దానిని మనకు ప్రకటించియున్నాడని మనము ఎరుగుదుము.

17 ఇప్పుడు మనము ఈ మనుష్యుడిని పరిశోధించెదము మరియు అతడు తన తప్పును ఒప్పుకొని, ఈ న్యాయాధిపతి యొక్క నిజమైన హంతకుడిని మనకు తెలియజేయును.

18 సమాధి చేయబడిన దినమున ఆ ఐదుగురు విడుదల చేయబడిరి. అయితే నీఫైకి వ్యతిరేకముగా పలికిన మాటల యందు వారు న్యాయాధిపతులను గద్దించిరి మరియు వారిని ఖండించునంతగా వారితో ఒకరి తరువాత ఒకరు వాదించిరి.

19 అయినప్పటికీ నీఫై పట్టుకొనబడి, బంధించబడి, సమూహము ముందుకు తేబడునట్లు వారు చేసిరి మరియు వారు అతడిని అడ్డుకొనునట్లు, మరణదండన వేయునంతగా అతనిపై నేరారోపణ చేయగలుగునట్లు వారతనిని అనేక విధాలుగా ప్రశ్నించుట మొదలుపెట్టి—

20 అతనితో ఇట్లనిరి: నీవు కపటపు వ్యక్తివి; ఈ హత్యను చేసిన మనిషి ఎవరు? ఇప్పుడు మాకు చెప్పి, నీ తప్పు ఒప్పుకొనుము; ఇదిగో ఇక్కడ ధనమున్నది, నీవు మాకు చెప్పిన యెడల మరియు నీవు అతనితో చేసిన ఒప్పందమును ఒప్పుకొనిన యెడల, మేము నీ ప్రాణమును నీకనుగ్రహించెదము.

21 కానీ నీఫై వారితో ఇట్లనెను: ఓ మూర్ఖులారా, హృదయమందు సున్నతి లేనివారలారా, గ్రుడ్డివారైన మీరు మరియు మెడబిరుసు జనులైన మీరు, పాపము యొక్క ఈ మీ మార్గమందు ప్రభువైన మీ దేవుడు మిమ్ములను ఎంత కాలము అనుమతించునో ఎరుగుదురా?

22 మీరు పశ్చాత్తాపపడని యెడల, ఈ సమయమున మీ కొరకు ఎదురు చూచుచున్న గొప్ప నాశనమును బట్టి, మీరు బిగ్గరగా ఏడ్చి దుఃఖించుట మొదలు పెట్టవలసియున్నది.

23 ఇదిగో మన ప్రధాన న్యాయాధిపతి సిజోరమ్‌ను హత్య చేయవలెనని ఒక మనుష్యునితో నేను ఒప్పందము చేసుకున్నానని మీరు చెప్పుచున్నారు. కానీ నేను మీతో చెప్పుచున్నాను, మీ మధ్యనున్న దుష్టత్వము, హేయక్రియలను గూర్చి నేను ఎరిగియున్నానని మీకు ఒక సాక్ష్యముగా ఈ సంగతిని గూర్చి మీరు తెలుసుకొనగలుగునట్లు నేను మీకు చెప్పినందున మీరిట్లు చెప్పుచున్నారు.

24 నేను దీనిని చేసియున్నందున, ఈ పని చేయవలెనని ఒక మనుష్యునితో నేను ఒప్పందము చేసుకున్నానని మీరు చెప్పుచున్నారు; నేను మీకు ఈ సూచనను చూపినందున మీరు నాతో కోపముగానుండి, నన్ను నాశనము చేయుటకు కోరుచున్నారు.

25 ఇప్పుడు నేను మీకు ఇంకొక సూచనను చూపెదను మరియు ఈ విషయమందు నన్ను నాశనము చేయుటకు మీరు ప్రయత్నించెదరేమో చూచెదను.

26 ఇదిగో నేను మీతో చెప్పుచున్నాను, సిజోరమ్ యొక్క సహోదరుడైన సియాంతమ్ ఇంటికి వెళ్ళి అతనితో ఇట్లు చెప్పుడి—

27 ఈ జనులను గూర్చి అంత అధిక కీడును ప్రవచించుచున్న కపటపు ప్రవక్త నీఫై, నీ సహోదరుడైన సిజోరమ్‌ను హత్య చేయుటయందు నీతో ఒప్పందము చేసుకున్నాడా?

28 లేదు, అని అతడు మీతో చెప్పును.

29 అప్పుడు మీరు అతనితో—నీవు నీ సహోదరుడిని హత్య చేసితివా? అనుడి.

30 అప్పుడతడు భయముతో నిలబడి, ఏమి చెప్పవలెనో తెలియకుండును. అతడు మిమ్ములను నిరాకరించును మరియు ఆశ్చర్యపోయినట్లు నటించును; అయినప్పటికీ, తాను నిర్దోషియని అతడు మీకు ప్రకటించును.

31 కానీ మీరు అతడిని పరీక్షించవలెను మరియు అతని అంగీ యొక్క అంచులపై మీరు రక్తమును కనుగొందురు.

32 మీరు దానిని చూచినప్పుడు, ఈ రక్తము ఎక్కడ నుండి వచ్చెను? ఇది నీ సహోదరుని రక్తమని మేమెరుగమా? అని మీరనవలెను.

33 అప్పుడు అతడు వణికి, మరణము అతనిపై వచ్చినట్లు పాలిపోయి కనబడును.

34 అప్పుడు మీరు—నీ ముఖముపై వచ్చిన ఈ భయము మరియు ఈ పాలిపోవుటను బట్టి, నీవు దోషివని మేము ఎరుగుదుమని చెప్పవలెను.

35 అప్పుడు మరి ఎక్కువ భయము అతనికి కలుగును; అతడు మీ ముందు ఒప్పుకొనును మరియు ఈ హత్య అతడు చేసియున్నాడనుటను ఇకపై నిరాకరించకుండును.

36 మరియు దేవుని శక్తి ద్వారా నాకు ఇవ్వబడితే తప్ప, ఆ విషయమును గూర్చి నీఫైయను నేను ఏమియూ ఎరుగనని అతడు మీతో చెప్పును. అప్పుడు నేను నిజాయితీపరుడనని, దేవుని నుండి మీ యొద్దకు పంపబడితినని మీరు తెలుసుకొందురు.

37 అంతట వారు వెళ్ళి, నీఫై వారితో చెప్పినట్లుగా చేసిరి. ఇదిగో, అతడు చెప్పిన మాటలు సత్యము; ఏలయనగా ఆ మాటల ప్రకారమే అతడు కాదనెను మరియు ఆ మాటల ప్రకారమే అతడు ఒప్పుకొనెను.

38 వాస్తవముగా అతడే హంతకుడని ఋజువు చేయబడుటకు అతడు తేబడెను, ఎంతగాననగా ఆ ఐదుగురు మరియు నీఫై కూడా విడిపించబడెను.

39 అక్కడున్న నీఫైయులలో కొందరు నీఫై మాటల యందు విశ్వసించిరి; మరియు ఆ ఐదుగురి సాక్ష్యమును బట్టి విశ్వసించిన వారు కొందరుండిరి, ఏలయనగా వారు చెరసాలలో ఉన్నప్పుడు వారు పరివర్తన చెందియుండిరి.

40 ఇప్పుడు నీఫై ఒక ప్రవక్తయని చెప్పిన వారు జనుల మధ్య కొందరుండిరి.

41 మరియు ఇతరులు కొందరు ఇట్లు చెప్పిరి: ఇదిగో, అతడు దేవుడైయున్నాడు, ఏలయనగా అతడు దేవుడైతే తప్ప, అన్ని సంగతులను అతడు ఎరుగజాలడు. అతడు మన హృదయ తలంపులను మనకు చెప్పియున్నాడు; అన్ని సంగతులను మనకు చెప్పియున్నాడు; మరియు మన ప్రధాన న్యాయాధిపతి యొక్క నిజమైన హంతకుడిని అతడు మనకు తెలియజేసియున్నాడు.

ముద్రించు